
పటియాలా: తెలంగాణకు చెందిన బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ 2022 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందంలోకి ఎంపికయ్యాడు. సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించిన భారత బాక్సింగ్ సమాఖ్య వేర్వేరు విభాగాలకు చెందిన ఎనిమిది మంది బాక్సర్లను ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేసింది. 57 కేజీల విభాగం ట్రయల్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ 4–1 తేడాతో 2019 ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత కవీందర్ సింగ్‌పై విజయం సాధించడంతో అతనికి అవకాశం దక్కింది. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్ క్రీడల్లోనూ పాల్గొన్న హుసాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి.
భారత జట్టు వివరాలు: అమిత్ పంఘాల్ (51 కేజీలు), హుసాముద్దీన్ (57), శివ థాపా (63), రోహిత్ టోకస్ (67), సుమిత్ (75), ఆశిష్ కుమార్ (80), సంజీత్ (92), సాగర్ (92 ప్లస్).