Mohammad hussamuddin
-
Boxing World Championships: దీపక్ సంచలనం.. క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో సావిన్ ఎడువార్డ్ (రష్యా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన దీపక్ (51 కేజీలు) సంచలన విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో దీపక్ 5–2తో 2021 ప్రపంచ చాంపియన్ బిబోసినోవ్ (కజకిస్తాన్)ను బోల్తా కొట్టించాడు. 75 కేజీల విభాగం రెండో రౌండ్లో సుమిత్ కుందు 1–3తో సోసులిన్ పావెల్ (రష్యా) చేతిలో... ప్లస్ 92 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో నరేందర్ 0–5తో అర్జోలా అలెజాంద్రో (క్యూబా) చేతిలో ఓడిపోయారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్, నవీన్
తాష్కెంట్: ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) వరుసగా రెండో విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన నవీన్ కుమార్ (92 కేజీలు) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ఆశిష్ చౌధరీ (80 కేజీలు) రెండో రౌండ్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ బౌట్లలో హుసాముద్దీన్ 5–0తో లియు పింగ్ (చైనా)పై, నవీన్ 5–0తో జియోంగ్ జెమిన్ (దక్షిణ కొరియా)పై ఏకపక్ష విజయాలు సాధించారు. ఆశిష్ 2–5తో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ అర్లెన్ లోపెజ్ (క్యూబా) చేతిలో ఓడిపోయాడు. -
World Boxing Championship: హుసాముద్దీన్ శుభారంభం
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) శుభారంభం చేయగా... వరిందర్ సింగ్ (60 కేజీలు) మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో అలెన్ రుస్తెమోవ్స్కీ (మెసెడోనియా)పై గెలుపొందగా... వరిందర్ 0–5తో తుర్సునోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి 13 మంది బాక్సర్లు బరిలో ఉన్నారు. మురళీ శ్రీశంకర్‌కు స్వర్ణం Murali Shankar Won Gold At MVA High Performance: ఎంవీఏ హై పెర్ఫార్మన్స్ అథ్లెటిక్స్ మీట్లో భారత ప్లేయర్ మురళీ శ్రీశంకర్ లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ మీట్లో 24 ఏళ్ల శ్రీశంకర్ 8.29 మీటర్ల దూరం గెంతి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ మీట్లో శ్రీశంకర్ వచ్చే ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అర్హత ప్రమాణాన్ని (8.25 మీటర్లు) అధిగమించాడు. అయితే మైదానంలో గాలివేగం నిర్ణీత ప్రమాణంకంటే ఎక్కువ ఉండటంతో శ్రీశంకర్ ప్రదర్శనకు ప్రపంచ చాంపియన్‌షిప్ బెర్త్ లభించలేదు. -
ఫైనల్లో శివ థాపా, తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్
హిస్సార్: జాతీయ సీనియర్ బాక్సింగ్ (ఎలైట్) చాంపియన్‌షిప్‌లో స్టార్ ఆటగాడు శివ థాపా ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అస్సాంకు ప్రాతినిధ్యం వహిస్తున్న థాపా (63.5 కేజీల విభాగం) సెమీ ఫైనల్లో 5–0తో మనీశ్ కౌశిక్ (సర్వీసెస్)ను చిత్తు చేశాడు. ఫైనల్లో అంకిత్ నర్వాల్ (రైల్వేస్)తో థాపా తలపడతాడు. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ కూడా 57 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరాడు. సర్వీసెస్ తరఫున బరిలోకి దిగిన హుసాముద్దీన్ సెమీస్‌లో 5–0తో ఆశిష్ కుమార్ (హిమాచల్ ప్రదేశ్)పై ఘన విజయం సాధించాడు. ఇతర కేటగిరీల్లో సంజీత్, నరేందర్, సాగర్ కూడా తుది పోరుకు అర్హత సాధించారు. -
కామన్వెల్త్కు హుసాముద్దీన్
పటియాలా: తెలంగాణకు చెందిన బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ 2022 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందంలోకి ఎంపికయ్యాడు. సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించిన భారత బాక్సింగ్ సమాఖ్య వేర్వేరు విభాగాలకు చెందిన ఎనిమిది మంది బాక్సర్లను ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేసింది. 57 కేజీల విభాగం ట్రయల్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ 4–1 తేడాతో 2019 ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత కవీందర్ సింగ్‌పై విజయం సాధించడంతో అతనికి అవకాశం దక్కింది. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్ క్రీడల్లోనూ పాల్గొన్న హుసాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. భారత జట్టు వివరాలు: అమిత్ పంఘాల్ (51 కేజీలు), హుసాముద్దీన్ (57), శివ థాపా (63), రోహిత్ టోకస్ (67), సుమిత్ (75), ఆశిష్ కుమార్ (80), సంజీత్ (92), సాగర్ (92 ప్లస్). -
Boxer Shiva Thapa: వరుసగా ఐదో పతకం
దుబాయ్: భారత బాక్సర్ శివ థాపా వరుసగా ఐదోసారి ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పతకం సాధించాడు. దుబాయ్‌లో జరుగుతున్న ఈ టోర్నీ లో శివ థాపా 64 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అస్సాంకు చెందిన శివ 5–0తో నాదిర్ (కువైట్)పై గెలిచాడు. కాగా ఆసియా చాంపియన్‌షిప్ పోటీల్లో శివ థాపా 2013లో స్వర్ణం, 2015లో కాంస్యం, 2017లో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. మరోవైపు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో 1–4తో ప్రస్తుత ప్రపంచ, ఆసియా చాంపియన్ మిరాజిజ్‌బెక్ మిర్జాహలిలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: Telangana Boxer: హుసాముద్దీన్ శుభారంభం -
Telangana Boxer: క్వార్టర్ ఫైనల్లో హసాముద్దీన్
దుబాయ్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ శుభారంభం చేశాడు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో 56 కేజీల విభాగంలో హుసాముద్దీన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో రెండుసార్లు ఆసియా యూత్ చాంపియన్‌గా నిలిచిన మక్మూద్ సబీర్‌ఖాన్ (కజకిస్తాన్)పై విజయం సాధించాడు. 64 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన శివ థాపా గెలిచాడు. తొలి రౌండ్లో శివ థాపా 5–0తో దిమిత్రి పుచిన్ (కజకిస్తాన్)పై నెగ్గాడు. నిజామాబాద్ బిడ్డ.. బాక్సింగ్ బాదుషా! బాక్సర్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం సాధన చేసే హుసాముద్దీన్.. చిన్ననాటి నుంచి తండ్రి శంషామొద్దీన్ శిక్షణలో రాటుదేలాడు. తనదైన శైలిలో పంచులు విసురుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న అతడు.. 2010 నుంచి ఇప్పటివరకు ఏటా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తూ ఇందూరు కీర్తిని ఇనుమడింపజేస్తున్నాడు. ఓ వైపు ఆర్మీలో పని చేస్తూ దేశానికి సేవలందిస్తున్న అతడు.. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. డిగ్రీ వరకు నిజామాబాద్‌లోనే చదివిన హుసాముద్దీన్.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆర్మీకి ఎంపికయ్యాడు. ఎన్నెన్నో పతకాలు.. 2015లో కోరియాలో జరిగిన పోటీల్లో కాంస్య పతకం, 2016 గౌహతిలో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించాడు. 2017లో బల్గేరియాలో జరిగిన పోటీల్లో రజత పతకం, మంగోళియాలో కాంస్య పతకం గెలుపొందాడు. 2018లో వరుసగా ఆస్ట్రేలియా, బల్గేరియా, ఢిల్లీలలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. 2019లో బెంగళూరు, ఖజకిస్తాన్లలో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించిన అతడు.. చైనాలో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: Asian Boxing Championship: రింగ్‌లోకి దిగకముందే 7 పతకాలు! French Open: సుమిత్ తొలి రౌండ్ ప్రత్యర్థి మార్కోరా -
హుసాముద్దీన్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. జర్మనీలోని కొలోన్‌లో శనివారం జరిగిన పురుషుల 57 కేజీల సెమీస్‌లో నిజామాబాద్ జిల్లా బాక్సర్ హుసాముద్దీన్ జర్మనీకి చెందిన హమ్‌సత్ షడలోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మరోవైపు 52 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్ పసిడి పతకం నెగ్గాడు. ఫైనల్లో అతని ప్రత్యర్థి అర్గిష్టి టెట్రెర్యాన్ (జర్మనీ) వాకోవర్ ఇవ్వడంతో అమిత్ రింగ్‌లోకి అడుగు పెట్టకుండానే స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్ 91 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ రజతంతో సంతృప్తి చెందాడు. గాయం కారణంగా సతీశ్ ఫైనల్లో పోటీపడలేదు. మహిళల 57 కేజీల విభాగంలో సాక్షి, మనీషా ఫైనల్లో అడుగుపెట్టారు. సెమీస్‌లో సాక్షి 4–1తో రమోనా గ్రాఫ్ (జర్మనీ)పై, మనీషా 5–0తో సోనియా (భారత్)పై నెగ్గారు. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత పూజా రాణి, గౌరవ్ సోలంకీ సెమీస్‌లో ఓటమి పాలై కాంస్యాలను గెలుచుకున్నారు. -
ఆసియా క్రీడలకు హుసాముద్దీన్
న్యూఢిల్లీ: రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోన్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్‌కు తగిన గుర్తింపు లభించింది. వచ్చే ఆగస్టు–సెప్టెంబర్‌లో ఇండోనేసియా వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టులో హుసాముద్దీన్‌కు (56 కేజీలు) స్థానం దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల హుసాముద్దీన్ ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించాడు. గతవారం జర్మనీలో జరిగిన కెమిస్ట్రీ కప్ అంతర్జాతీయ టోర్నీలో హుసాముద్దీన్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఫలితంగా ఎలాంటి ట్రయల్స్ లేకుండానే అతనికి జట్టులో బెర్త్ ఖాయమైంది. భారత పురుషుల బాక్సింగ్ జట్టు: అమిత్ పంగల్ (49 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ధీరజ్ (64 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు). మహిళల జట్టు: సర్జూబాలా దేవి (51 కేజీలు), సోనియా లాథెర్ (57 కేజీలు), పవిత్ర (60 కేజీలు). -
‘టాప్’లో హుసాముద్దీన్
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్‌ను ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) పథకంలో ఎంపిక చేశారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశాలున్న క్రీడాకారులను ఎంపిక చేసి, వారి సాధనకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించే విధంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. గత రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో 56 కేజీల విభాగంలో హుసాముద్దీన్ నిలకడగా రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్‌లోనే స్వర్ణం నెగ్గిన మరో బాక్సర్ గౌరవ్ సోలంకి (బాక్సింగ్)తోపాటు షూటర్లు మను భాకర్, మెహులీ ఘోష్, అనీశ్ భన్వాలా, ఓంప్రకాశ్, షాజర్ రిజ్వీ, భారత మహిళల టెన్నిస్ నంబర్‌వన్ అంకిత రైనాలను కూడా ‘టాప్స్’లో ఎంపిక చేశారు. అంకిత ఇటీవలే టాప్–200లోకి ప్రవేశించింది. డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె అత్యుత్తమంగా 197వ ర్యాంక్‌లో నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో సానియా మీర్జా, నిరుపమా వైద్యనాథన్ మాత్రమే టాప్–200లో చోటు సంపాదించారు. -
‘పంచ్’ పవర్...
నాన్న బాక్సింగ్ గ్లవ్స్‌ను చూశాడు. ఆటపై ఆసక్తిని పెంచుకున్నాడు. అన్నయ్యలు విసిరిన పంచ్‌లను చూశాడు. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆట నేర్చుకునేందుకు కనీస స్థాయి సౌకర్యాలు లేకపోయినా... సరైన రీతిలో రింగ్ కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉన్నా... అతని పట్టుదల ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి. తన ఆటపై నమ్మకంతో కఠోరంగా శ్రమించిన ఆ యువ బాక్సర్ ఇప్పుడు భారత జట్టులో భాగంగా మారాడు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌కు చెందిన మొహమ్మద్ హుసాముద్దీన్ విజయగాథ ఇది. ఇప్పుడు అతని లక్ష్యం ఒకటే... నాన్న, అన్నల కోరిక నెరవేర్చడం... ఒక మెగా ఈవెంట్లో భారత్ తరఫున పతకం సాధించి గర్వంగా నిలవడం. ప్రస్తుతం అదే లక్ష్యంతో అతను ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పతకంపై దృష్టి పెట్టాడు. సాక్షి, హైదరాబాద్ : గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో మొహమ్మద్ హుసాముద్దీన్ నిలకడగా సాధించిన విజయాలు ఇప్పుడు భారత జట్టులో అవకాశం దక్కేలా చేశాయి. 2017లో బల్గేరియా టోర్నీలో రజతం, మంగోలియా ఉలన్‌బాటర్ కప్‌లో కాంస్యంతో పాటు 2018లో ప్రతిష్టాత్మక స్టాన్జా కప్‌లో కాంస్యం సాధించి హుసామ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కామన్వెల్త్ క్రీడల కోసం నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో కూడా సత్తా చాటిన అతను తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. కామన్వెల్త్లో పాల్గొంటున్న ఎనిమిది మంది భారత బాక్సర్లలో 24 ఏళ్ల హుసామ్ ఒకడు. 56 కేజీల విభాగంలో అతను పోటీ పడనున్నాడు. ఐదేళ్లుగా భారత క్యాంప్‌లో... హుసామ్ కెరీర్లో 2012 కీలక మలుపు. సీనియర్ నేషనల్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత అతను జాతీయ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. అంతకు ముందు ఏడాది 2011లో క్యూబాలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నా ఫలితం రాలేదు. 2012లో ఆర్మేనియాలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కూడా ఓటమి ఎదురైంది. ఆర్మీలో ప్రస్తుతం నాయక్ సుబేదార్ హోదాలో ఉన్న హుసామ్ 2015లో జరిగిన ప్రపంచ మిలిటరీ క్రీడల్లో కూడా పాల్గొన్నాడు. అయితే తన తప్పులు సరిదిద్దుకొని హుసామ్ మరింతగా శ్రమించాడు. ముఖ్యంగా పాటియాలాలోని ఎన్ఐఎస్లో ప్రత్యేక శిక్షణతో ఆట రాటుదేలింది. భారత కోచ్‌లు హుసామ్ను తీర్చిదిద్దారు. 2016లో గువాహటిలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో స్వర్ణం సాధించడంతో అతనిపై అంచనాలు పెరిగాయి. దానికి తగినట్లుగా వేర్వేరు అంతర్జాతీయ పోటీల్లో కూడా విజయాలు సాధించి అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ‘ఇప్పటి వరకు నేను సాధించిన విజయాలు ఒక ఎత్తు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడలు మరొక ఎత్తు. ఇలాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో గెలిస్తేనే ఇన్నేళ్ల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పతకం కోసం చాలా కష్టపడుతున్నా. గెలుస్తాననే నమ్మకం ఉంది’ అని హుసాముద్దీన్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. నాకు బాక్సింగ్‌పై ఉన్న అమితాభిమానమే నా నలుగురు కొడుకులను అదే ఆట వైపు మళ్లించింది. ఇద్దరు పెద్ద కొడుకుల ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నా... దేశం తరఫున పెద్ద ఈవెంట్లో పతకం సాధించలేకపోయారనే వెలితి ఉంది. దానిని హుసాముద్దీన్ తీరుస్తాడని నమ్ముతున్నా. అతడిది కష్టపడే స్వభావం. చాలా పట్టుదలగా ప్రాక్టీస్ చేస్తాడు. అందుకే మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాం. హుసామ్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది నా కోరిక. ఇప్పుడే పతకం గురించి చెప్పను గానీ నిజంగా అతను అక్కడ గెలవగలిగితే తండ్రిగా అంతకు మించి గర్వకారణం ఏముంటుంది. 73 ఏళ్ల వయసులో కూడా కోచింగ్ ఇస్తున్నా. సౌకర్యాల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. సౌకర్యాలకంటే బాక్సర్ల కఠోర శ్రమనే వారిని ముందుకు తీసుకువెళుతుందనేది నా నమ్మకం. ఉన్నవాటితోనే సర్దుకొని శిక్షణ ఇచ్చాను. సాధారణ స్థాయి రింగ్ ఏర్పాటు చేసుకునేందుకు కూడా సొంతడబ్బు చాలా వెచ్చించాల్సి వచ్చింది. ఆరంభంలో ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా గానీ ఇప్పుడు దాని గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు. సాయం కావాలంటూ ఎప్పుడూ ప్రభుత్వంతో సహా ఎవరినీ కోరలేదు. జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగే వరకు నిజామాబాద్‌లో శిక్షణ ఇవ్వగలను. ఆ తర్వాత వారి సత్తానే వారిని ముందుకు తీసుకెళుతుంది. – షమ్షముద్దీన్, హుసాముద్దీన్ తండ్రి, కోచ్ బాక్సింగ్ ఫ్యామిలీ... హుసామ్ తండ్రి షమ్షముద్దీన్ ఒకప్పుడు జాతీయ స్థాయి బాక్సర్. ఆ తర్వాత కోచ్‌గా మారిన ఆయన స్వస్థలం నిజామాబాద్‌లోనే కొద్ది మందికి శిక్షణ ఇస్తూ వచ్చారు. చెప్పుకోదగ్గ వసతులు లేకపోయినా పరిమిత వనరులతోనే ఆయన బాక్సర్లను తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. అనేక మందితో పాటు ఆయన కుమారులు కూడా అక్కడే శిక్షణ పొందారు. హుసామ్ పెద్ద సోదరులు ఇద్దరు ఎహ్తెషామ్, ఎహ్తెసామ్ కూడా అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నారు. వీరిద్దరు స్పోర్ట్స్ కోటాలోనే రైల్వే, ఆర్మీలో ఉద్యోగాలు పొందడం విశేషం. హుసామ్ తమ్ముడు ఖయాముద్దీన్ కూడా బాక్సర్‌గా మారి ప్రస్తుతం జాతీయ స్థాయికి ఎదిగాడు. ఈ నేపథ్యం నుంచి వచ్చిన హుసామ్‌కు ఆటలో ఓనమాలు నేర్చుకోవడం కష్టం కాలేదు. మరింత పట్టుదలతో తన పంచ్ పవర్‌ను పెంచుకున్న అతను వేగంగా దూసుకుపోయాడు. 2007 స్కూల్ నేషనల్స్‌లో తొలిసారి పోటీ పడిన తర్వాత హుసామ్ ఆగలేదు. ‘నాకు ఆ సమయంలో తెలిసిందల్లా నాన్న ఏం చెబితే అది చేయడం. రింగ్ గురించి కానీ, ఇతర సౌకర్యాల గురించి గానీ ఎప్పుడూ ఆలోచించలేదు. నాన్నే అన్నీ చూసుకున్నారు. ఖర్చులు, డైట్లాంటివి కనీసం నాకు తెలియనివ్వలేదు కూడా. బాక్సింగ్ మొదలు పెట్టినప్పుడు లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టి నాన్న, అన్నయ్యలు సాధించలేని విజయాలు అందుకోవాలని మరింత పట్టుదలతో సాధన చేశాను’ అని హుసామ్ చెప్పాడు. -
శ్యామ్, హుస్సాముద్దీన్‌లకు కాంస్యాలు
న్యూఢిల్లీ: ఉలాన్బాటర్ కప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్, తెలంగాణకు చెందిన మొహమ్మద్ హుస్సాముద్దీన్ కాంస్య పతకాలను సాధించారు. మంగోలియాలో జరుగుతోన్న ఈ టోర్నీ సెమీస్‌లో వీరిద్దరూ ఓడిపోవడంతో కాంస్యాలతో వెనుదిరగాల్సి వచ్చింది. సెమీఫైనల్ బౌట్లో శ్యామ్ కుమార్ (49 కేజీలు) రోజెన్ లాడోన్ చేతిలో...హుస్సాముద్దీన్ (56 కేజీలు) మంగోలియాకు చెందిన తుముర్ఖుయాగ్ చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన దేవేంద్రో సింగ్ (52 కేజీలు), అంకుశ్ దహియా (60 కేజీలు) ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్‌లో గండులమ్ మంగన్ ఎర్డెన్ (మంగోలియా)పై దేవేంద్రో, సిబికోవ్ (రష్యా)పై అంకుశ్ గెలిచారు. మహిళల విభాగంలో ప్రియాంక (60 కేజీలు) సెమీస్‌లో హి సంగ్ చో (కొరియా) చేతిలో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకుంది. -
సెమీస్‌లో శ్యామ్‌కుమార్, హుస్సాముద్దీన్
► కనీసం కాంస్యాలు ఖాయం ► క్వార్టర్స్‌లో మేరీకోమ్ ఓటమి న్యూఢిల్లీ: ఉలాన్బాటర్ కప్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్... తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్‌లు పతకాలను ఖాయం చేసుకున్నారు. మంగోలియాలో జరుగుతోన్న ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడంతో వీరికి కనీసం కాంస్య పతకం దక్కనుంది. క్వార్టర్స్‌లో శ్యామ్ కుమార్ (49 కేజీలు) మంగోలియాకు చెందిన ఎన్‌కాందాఖ్ కర్కూపై గెలుపొందగా... హుస్సాముద్దీన్ (56 కేజీలు) చైనా బాక్సర్ మా జిన్ మింగ్‌ను ఓడించాడు. వీరితో పాటు క్వార్టర్స్‌లో భారత్‌కు చెందిన అంకుశ్ దహియా (60 కేజీలు) డుల్గన్ (మంగోలియా)పై, ప్రియాంక చౌదరి (60 కేజీ) అలెక్సాండ్రా ఓర్డినా (రష్యా)పై నెగ్గి సెమీస్‌లో అడుగు పెట్టారు. మరోవైపు ఏడాది తర్వాత రింగ్‌లో అడుగుపెట్టిన ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ (51 కేజీలు)కొరియాకు చెందిన చోల్ మి బంగ్ చేతిలో ఓటమి పాలై క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. -
థాయ్‌లాండ్ బాక్సింగ్ టోర్నీకి శ్యామ్, హుస్సాముద్దీన్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో థాయ్‌లాండ్‌లో జరిగే అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్ కుమార్, తెలంగాణకు చెందిన మొహమ్మద్ హుస్సాముద్దీన్‌లకు చోటు లభించింది. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఈ టోర్నీలో ఏడు వెయిట్ కేటగిరీలలో బౌట్లు ఉంటాయి. ఒలింపియన్ బాక్సర్లు దేవేంద్రో సింగ్, శివ థాపా, మనోజ్ కుమార్, వికాస్ కృషన్‌లు కూడా ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. గతంలో ‘కింగ్స్ కప్’గా వ్యవహరించిన ఈ టోర్నీలో 2015లో శ్యామ్ కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఇటీవలే బల్గేరియాలో ముగిసిన స్ట్రాండ్జా కప్‌లో హుస్సాముద్దీన్ రజత పతకాన్ని గెలిచాడు. వీసాలు రాకపోవడంతో... మరోవైపు ఈనెల 13 నుంచి 18 వరకు జర్మనీలో జరిగే కెమిస్ట్రీ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీకి భారత బాక్సర్లు వెళ్లడం లేదు. నిర్ణీత సమయానికి వీసాలు రాకపోవడంతో ఈ టోర్నీకి భారత బాక్సర్లు దూరమయ్యారు. భారత బాక్సింగ్ జట్టు: కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు), దేవేంద్రో సింగ్ (52 కేజీలు), మొహమ్మద్ హుస్సాముద్దీన్ (56 కేజీలు), శివ థాపా (60 కేజీలు), రోహిత్ టొకాస్ (64 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు). -
హుస్సాముద్దీన్‌కు రజత పతకం
న్యూఢిల్లీ: స్ట్రాన్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ రజత పతకంతో మెరిశాడు. బల్గేరియాలోని సోఫియా లో ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో అతను 56 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఉక్రెయిన్‌కు చెం దిన మికోలా బుత్సెంకోతో జరిగిన టైటిల్ బౌట్లో హుస్సాముద్దీన్ 2–3 పాయింట్ల తేడాతో ఓడిపో యాడు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... మరో ఇద్దరు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల 49 కేజీ లైట్ ఫ్లయ్ వెయిట్ కేటగిరీలో అమిత్ ఫంగల్, మహిళల 54 కేజీ కేటగిరీలో మీనా కుమారి మైస్నమ్ సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో తృప్తిపడ్డారు. ఈ చాంపియన్‌షిప్‌లో ఐదుగురు మహిళలు సహా 15 మందితో కూడిన భారత బృందం పోటీపడగా మూడు పతకాలు లభించాయి. 31 దేశాల నుంచి 200 మందికి పైగా బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు.