న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం నిఖత్ జరీన్ భుజానికి గాయమైంది. శస్త్ర చికిత్స కూడా చేయాల్సి రాగా, ఏడాది పాటు ఆమె ఆటకు దూరమైంది. కోలుకున్న తర్వాత కూడా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో 2018 ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొనలేకపోయింది. దాంతో ఒక్కసారిగా ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడేలా కనిపించింది. అయితే పట్టుదలతో మళ్లీ బరిలోకి దిగిన నిఖత్ అత్యుత్తమ ప్రదర్శనతో మళ్లీ రింగ్‌లోకి దూసుకొచ్చింది.
‘ఆ సమయంలో కూడా నాపై నాకు నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించరాదని, చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాను. దాని ఫలితంగానే ఈ రోజు ప్రపంచ చాంపియన్‌గా నిలవగలిగాను. 2019లో పునరాగమనం చేసిన తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆడిన ప్రతీ టోర్నీలోనూ నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాను’ అని నిఖత్ వ్యాఖ్యానించింది. గత రెండేళ్లలో తన ఆటలో లోపాలు సరిదిద్దుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టానని ఆమె చెప్పింది. ‘2019 నుంచి పూర్తిగా నా ఆటను మెరుగుపర్చుకోవడానికే ప్రయత్నించా. బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకుంటూ సాధన చేశా.
అందుకోసం కఠినంగా శ్రమించా. నా జీవితంలో ఎదుర్కొన్న అవాంతరాలు నన్ను దృఢంగా మార్చాయి. మున్ముందు ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల ని మానసికంగా సన్నద్ధమయ్యా’ అని జరీన్ పేర్కొంది. రాబోయే కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించడం తన ప్రస్తుత లక్ష్యమన్న ఈ తెలంగాణ బాక్సర్... 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్ కోసం ఏ కేటగిరీలో బరిలోకి దిగాలో నిర్ణయిం చుకోలేదని వెల్లడించింది. ‘ఒలింపిక్స్‌లాగే కామన్వెల్త్ క్రీడల్లోనూ 52 కేజీల కేటగిరీ లేదు. 50 కేజీలు లేదా 54 కేజీల్లో ఏదో ఒకటి తేల్చుకోవాలి. ప్రస్తుతానికి నేనైతే 50 కేజీల కేటగిరీలో పతకం కోసం ప్రయత్నిస్తా. నాకు సంబంధించి ఎక్కువ బరువును ఎంచుకోవడం కంటే తక్కువకు రావడం కొంత సులువు. కాబట్టి దానిపైనే దృష్టి పెడతా’ అని జరీన్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment