సెలక్షన్స్‌పై ‘వీడియో’ కన్ను | Video surveillance of all selection trials to be implemented from now on | Sakshi
Sakshi News home page

సెలక్షన్స్‌పై ‘వీడియో’ కన్ను

Published Sat, Feb 22 2025 3:53 AM | Last Updated on Sat, Feb 22 2025 3:53 AM

Video surveillance of all selection trials to be implemented from now on

పారదర్శక ఎంపికే లక్ష్యమన్న కేంద్ర క్రీడా శాఖ  

న్యూఢిల్లీ: క్రీడాకారులు, జట్ల సెలక్షన్‌ ట్రయల్స్‌పై పదేపదే వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్ధమైంది. దీనికి శాశ్వత పరిష్కారంగా ఇక మీదట జరిగే ఎంపిక ప్రక్రియనంతా వీడియో రూపంలో తీయనుంది. తద్వారా అర్హులైన ప్రతిభావంతులకే బెర్త్‌లు లభించేలా చూడనుంది. ప్రతి ఒక్కరి సెలక్షన్‌ ప్రదర్శన వీడియోలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి విమర్శలకు తావుండదు. ‘ఇకపై అన్ని సెలక్షన్‌ ట్రయల్స్‌పై వీడియో నిఘా పెడతాం.

పారదర్శకత, న్యాయబద్ధమైన ఎంపికలకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. దీనివల్ల క్రీడాకారులకు మేలు జరుగుతుంది. ప్రదర్శనే ఎంపికకు గీటురాయి అవుతుంది. మెరిట్‌ కనబరిచిన వారే భారత జట్లకు ఎంపికవుతారు. ఇందులో క్రీడా సమాఖ్యలు ఇష్టారీతిన వ్యహరించేందుకు వీలుండదు. క్రీడా శాఖ అధికారులు, భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) అధికారులు పర్యవేక్షకులుగా హాజరవుతారు. 

ఇకపై ప్రతీ క్రీడాంశంలో దీన్ని అమలు చేస్తాం’ అని క్రీడా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.  షూటింగ్, రెజ్లింగ్‌లలో జరిగే సెలక్షన్‌ ట్రయల్స్‌ ప్రతీసారి విమర్శలపాలవుతోంది. రెజ్లింగ్‌ సమాఖ్య అయితే పతకాల కంటే కూడా ఈ తరహా వివాదాలు, విమర్శలతోనే వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే! భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) వ్యవహారాల వల్ల అర్హత ఉండి, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. 

ఈ సీజన్‌లో తొలి రెండు  ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లకు భారత రెజ్లర్లు దూరమయ్యారు. దీనిపై క్రీడాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే ఈ శాఖ గుర్తింపు ఉన్న జాతీయ సమాఖ్యలకు ఢిల్లీలోని స్టేడియాల్లో ఆఫీస్‌ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. దీనివల్ల ఢిల్లీకి వచ్చిన లేదంటే ఢిల్లీ నుంచి అంతర్జాతీయ టోర్నీలకు బయలుదేరే ఆటగాళ్లకు ఆయా సమాఖ్యలు సమన్వయంతో సేవలందించేందుకు వీలవుతుంది. 

గతంలో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో క్రీడా సమాఖ్యల కార్యాలయాలు ఉండేవి. కానీ 2010 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్యం కోసం ఆ స్టేడియాన్ని నవీకరించడంతో సమాఖ్యల ఆఫీసుల్ని అక్కడి నుంచి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement