Central sports department
-
తెలంగాణాలో ‘ఖేలో ఇండియా’ కేంద్రం
న్యూఢిల్లీ: భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్లను తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్ధమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కింది. తొలి దశలో తెలంగాణతోపాటు ఒడిశా, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకుగానూ రూ. 95.15 కోట్ల బడ్జెట్‌ను క్రీడాశాఖ వెచ్చించనుంది. ఎంపిక చేసిన రాష్ట్రాల క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతుల కల్పన, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ల ఏర్పాటు, నిపుణులైన కోచ్‌ల నియామకం, ఆటగాళ్ల కోసం ఫిజియోథెరపిస్టులతో పాటు స్ట్రెంథెనింగ్ కండిషనింగ్ నిపుణులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రాల సహకారంతో ఈ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను నిర్వహిస్తామని కేంద్ర క్రీడా శాఖ పేర్కొంది. ‘ప్రతీ ఎక్స్‌లెన్స్ కేంద్రం 14 ఒలింపిక్స్ క్రీడాంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఇందులో మూడు క్రీడాంశాలకు ఆయా రాష్ట్రాలు మద్దతుగా నిలుస్తాయి. ఈ అత్యాధునిక కేంద్రాలు ఒక నిర్దిష్ట క్రీడలో నైపుణ్యం ఉన్న అథ్లెట్లకు అత్యున్నత స్థాయి శిక్షణ అందిస్తాయి. 2028 నాటికి పతకాల జాబితాలో టాప్–10లో భారత్ నిలిచేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయి’ అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. -
ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు!
ధోని... ధోని... ధోని... అనే అరుపులుండవ్! కోహ్లి... కోహ్లి... కోహ్లి... అనే వారే కనిపించరు! హిట్... రోహిత్... రోహిత్... అనే జోష్ కూడా ఉండదు! ‘యూ ఆర్ ద కింగ్స్... బట్ వుయ్ ఆర్ ద సూపర్ కింగ్స్’ అనే ప్లకార్డులు ఇకపై ఉండవు మెక్సికన్ వేవ్స్‌కు ఛాన్సే లేదు అభిమాన ఫ్రాంచైజీల టీ షర్ట్స్ కూడా ప్రేక్షకుల గ్యాలరీలో కనువిందు చేయవు శివమణి డ్రమ్స్ వాయించడు చీర్ లీడర్స్ సందడీ ఉండదు చప్పట్లు... చడీచప్పుడు లేకుండానే గప్‌చుప్‌గా ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. లేదంటే లేదు. అంతే మరి! మీకర్థమవుతోందా! ఇదంతా కరోనా వైరస్ కాటేనని! న్యూఢిల్లీ: ‘కరోనా’ ఎంత పని చేసింది. 2019 ఏడాది ముగింపులో వచ్చిన ఈ వైరస్... వచ్చిరాగానే మనుషుల్ని మింగేస్తోంది. అంతటితో ఆగకుండా ఒక్కో రంగాన్ని ముంచేస్తూ వచ్చింది. ‘కోవిడ్19’ దెబ్బకు పర్యాటక, వర్తక, వాణిజ్య, ఆర్థిక రంగాలే కాదు... క్రీడల రంగం కూడా కునారిల్లుతోంది. ఇప్పుడు ఈ వైరస్ సెగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు తగిలింది. ఇన్నేళ్లుగా ప్రతీ వేసవిని ధనాధన్ మెరుపులతో అలరించిన ఈ లీగ్ ఇప్పుడైతే అటు స్పాన్సర్లని, ఫ్రాంచైజీలనే కాదు... ఇటు పాలకమండలినీ దడదడలాడిస్తోంది. మొత్తం మీద ఆట సాగినా... మునుపటిలా జరగనే జరుగదు. కళ తప్పిన ‘షో’గా ఇంకా చెప్పాలంటే గేట్లన్నీ మూసేసి గుట్టుగా... గప్‌చుప్‌గా జరుగుతుంది. ఆటకు మాత్రమే అనుమతి: క్రీడాశాఖ ప్రాణాంతక వైరస్ ‘కోవిడ్19’ చూస్తుండగానే ‘గ్లోబ్’ను చుట్టేసింది. చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకింది. వేల మందిని చంపేసింది. లక్ష మందికిపైగా సోకింది. కొన్ని దేశాలైతే ప్రజల్ని బయటికే రాకుండా గృహనిర్భంధంలో ఉంచుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. కొన్నయితే ఈ ఏడాదికి రద్దయిపోయాయి కూడా! విదేశీ రాకపోకలతో ఈ మధ్యే భారత్‌కు వచ్చింది. దీని ప్రభావం తెలిసిన భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుకే ఐపీఎల్‌పై నాన్చకుండానే తేల్చేసింది. ఆటను ఆపం... కానీ ప్రేక్షక సమూహాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. ‘జన సమూహం మధ్య ఎలాంటి క్రీడల ఈవెంట్లకు అనుమతి లేదు. అయితే ఏ క్రీడను, లీగ్‌ను అడ్డుకోం. ప్రేక్షకుల్లేకుండా పోటీలను నిర్వహించుకోవచ్చు’ అని కేంద్ర క్రీడాశాఖ వెల్లడించింది. ఈ శాఖ కార్యదర్శి రాధేశ్యామ్ మాట్లాడుతూ ‘జాతీయ ఆరోగ్య మిషన్, ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సహా జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లన్నింటికీ స్పష్టంగా తెలియజేశాం. ప్రేక్షకుల మధ్య లీగ్, పోటీల నిర్వహణ కుదరదని చెప్పాం’ అని అన్నారు. జోష్ ఉండదు బాసూ... క్రీడాశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్ జన సమూహం మధ్య జరిగే అవకాశం కనిపించడం లేదు. అభిమాన ఫ్రాంచైజీ కలర్లను తమ చెక్కిళ్లపై అందంగా వేయించుకుని స్టేడియంలోకి ప్రవేశించే మార్గం ఇప్పుడు మూతపడింది. అభిమాన క్రికెటర్లను దగ్గర నుంచి చూసే భాగ్యం ఇప్పుడు దూరమవుతుంది. బ్యాటింగ్‌లో మెరుపులు కనిపించినా... అరుపులు వినిపించవు. వరుస బౌండరీలు బాదినా చప్పట్లు కరవు! చుక్కల్ని తాకేలా సిక్సర్లు వెళ్లినా స్టేడియం దద్దరిల్లదు. ఇలా ఏం చేసినా... ఏం చూసినా బుల్లితెరపైనో లేదంటే స్మార్ట్‌ఫోన్‌లోనే చూడాలి. ఒళ్లంతా కళ్లు చేసుకునే అవసరమే ఉండదు. ఆసక్తిగొలిపే ‘ప్రత్యక్ష వీక్షణ’ అనుభూతే అసలు ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆ జోషే ఉండదు. ఏదో సరిపెట్టుకోవడం తప్పా! పాలకమండలి చేసేదేమీ లేదు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోకపోయినా... ఇంతకుమించి చేసేదేమీ లేదు కూడా! ఈ నెల 14న జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినప్పటికీ... బిజీ షెడ్యూలు వల్ల అటు వాయిదా వేయలేదు. ఇటు వేరే దేశంలో నిర్వహించనూ లేరు. ఎన్నికల సందర్భంగా 2009, 2014లలో విదేశాల్లో నిర్వహించింది. కానీ ఇప్పుడున్న ‘కరోనా మహమ్మారి’ దృష్ట్యా ఏ దేశం నిర్వహణకు సిద్ధంగా లేదు. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ప్రేక్షకుల్లేకుండానే ఈ సీజన్ ధనాధన్ కాస్తా చప్పగా సాగే అవకాశముంది. కరోనా బాధితుడు మ్యాచ్ చూశాడు మహిళా దినోత్సవం రోజు భారత్, ఆస్ట్రేలియా అమ్మాయిల జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ టి20 ఫైనల్ మ్యాచ్‌ను ఓ కరోనా బాధితుడు చూసినట్లు తేలడంతో కలకలం రేగింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన మ్యాచ్‌లో నార్తర్న్ స్టాండ్‌లోని లెవెల్–2లో నుంచి మ్యాచ్‌ను తిలకించిన వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని స్టేడియం వర్గాలు తెలిపాయి. దీనిపై ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ (డీహెచ్హెచ్ఎస్) సమీక్షిస్తోంది. వాళ్లు ఆడాలంటే... ఆగాల్సిందే! ఐపీఎల్ 13వ సీజన్ ఈ నెల 29న ప్రారంభమవుతుంది. అయితే రెండు వారాలపాటు జరిగే మ్యాచ్‌లు పూర్తిగా భారత ఆటగాళ్లతోనే జరుగనున్నాయి. ఎందుకంటే కరోనా భయాందోళనల వల్ల విదేశీయులకు మంజూరు చేసే వీసాలపై ఆంక్షలు విధించారు. కరోనా లేదని సర్టిఫికేట్ జతచేస్తేనే వీసాలిచ్చే అంశాల్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. దీంతో ఏప్రిల్ 15 తర్వాతే విదేశీ ఆటగాళ్లు భారత్‌లో అడుగుపెట్టే అవకాశముంది. -
నెలకు 50 వేల పాకెట్‌మనీ!
⇒152 మంది ‘టాప్’ అథ్లెట్లకు అందించనున్న కేంద్ర క్రీడాశాఖ ⇒జాబితాలో లేని లియాండర్ పేస్, సాకేత్ మైనేని! న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడల వంటి ప్రధాన ఈవెంట్లకు సిద్ధమవుతున్న భారత క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కేంద్ర క్రీడా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో భాగంగా ఉన్న 152 మందికి తమ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి నెలకు రూ. 50 వేల చొప్పున అందించనుంది. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అభినవ్ బింద్రా నేతృత్వంలోని ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ ఈ 152 మంది పేర్లను ప్రతిపాదించింది. ఆటగాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, సెప్టెంబర్ 1 నుంచి ‘పాకెట్‌మనీ’ పథకం అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ 152 మందిని ఎంపిక చేయడంలో ఎలాంటి విధి విధానాలు పాటించారో, ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో అనేదానిపై స్పష్టత లేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టెన్నిస్ ఆటగాళ్ల జాబితాలో వెటరన్ లియాండర్ పేస్, యువ ఆటగాడు సాకేత్ మైనేనిలకు చోటు లభించలేదు. మహిళల విభాగంలో సింగిల్స్ భారత టాప్ (260వ వరల్డ్ ర్యాంక్) ర్యాంకర్ అంకితా రైనాను ఎంపిక చేయకపోగా... 801వ ర్యాంక్‌లో ఉన్న ప్రార్థనా తోంబరేని జాబితాలో చేర్చారు. జాబితా రూపకల్పనలో టెన్నిస్‌కు సంబంధించిన పరిశీలకుడిగా సోమ్‌దేవ్ దేవ్ వర్మన్ ఉన్నాడు. అయితే ఇది తుది జాబితా కాదని, మున్ముందు ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి ఇందులో మార్పు చేర్పులు, సవరణలతో నిరంతర ప్రక్రియలా కొనసాగుతుం దని క్రీడా శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు.