నెలకు 50 వేల పాకెట్‌మనీ!
⇒152 మంది ‘టాప్’ అథ్లెట్లకు అందించనున్న కేంద్ర క్రీడాశాఖ
⇒జాబితాలో లేని లియాండర్ పేస్, సాకేత్ మైనేని!
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడల వంటి ప్రధాన ఈవెంట్లకు సిద్ధమవుతున్న భారత క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కేంద్ర క్రీడా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో భాగంగా ఉన్న 152 మందికి తమ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి నెలకు రూ. 50 వేల చొప్పున అందించనుంది. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అభినవ్ బింద్రా నేతృత్వంలోని ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ ఈ 152 మంది పేర్లను ప్రతిపాదించింది. ఆటగాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, సెప్టెంబర్ 1 నుంచి ‘పాకెట్‌మనీ’ పథకం అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు.
అయితే ఈ 152 మందిని ఎంపిక చేయడంలో ఎలాంటి విధి విధానాలు పాటించారో, ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో అనేదానిపై స్పష్టత లేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టెన్నిస్ ఆటగాళ్ల జాబితాలో వెటరన్ లియాండర్ పేస్, యువ ఆటగాడు సాకేత్ మైనేనిలకు చోటు లభించలేదు. మహిళల విభాగంలో సింగిల్స్ భారత టాప్ (260వ వరల్డ్ ర్యాంక్) ర్యాంకర్ అంకితా రైనాను ఎంపిక చేయకపోగా... 801వ ర్యాంక్‌లో ఉన్న ప్రార్థనా తోంబరేని జాబితాలో చేర్చారు. జాబితా రూపకల్పనలో టెన్నిస్‌కు సంబంధించిన పరిశీలకుడిగా సోమ్‌దేవ్ దేవ్ వర్మన్ ఉన్నాడు. అయితే ఇది తుది జాబితా కాదని, మున్ముందు ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి ఇందులో మార్పు చేర్పులు, సవరణలతో నిరంతర ప్రక్రియలా కొనసాగుతుం దని క్రీడా శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు.