
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా తన రెండు ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. షూటింగ్ విభాగంలో పరిశీలక హోదా బాధ్యతలకు, టార్గెట్ ఒలింపిక్ పోడియం(టీవోపీ) పథకం ఐడెంటిఫికేషన్ కమిటీ ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. కొన్ని ప్రైవేట్ స్పోర్ట్స్ ప్రాజెక్టులతో తాను సంబంధాలు పెంపొందించుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్‌కు ఓ లేఖ రాశారు.
తనపై విశ్వాసం ఉంచి ఇన్నాళ్లు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలన్నారు. తన సొంత ప్రాజెక్టులైన అభినవ్ బింద్రా టార్గెటింగ్ పర్ఫామెన్స్(ఏబీటీపీ) సెంటర్లు దేశ వ్యాప్తంగా ఏర్పాటుచేసేందుకు సిద్ధమయ్యే క్రమంలో పలు ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేస్తున్నానని, మరింత సమర్ధంగా పనిచేసేందుకోసమే తాను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడం తప్పవుతోంది.