న్యూఢిల్లీ: పోలీసు నిర్బంధం నుంచి ఆదివారం రాత్రి విడుదలైన భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ‘మా తదుపరి కార్యాచరణ ఏంటనేది త్వరలోనే వెల్లడవుతుంది. మేమంతా ఇంకా కలుసుకోలేదు. మమ్మల్ని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. నన్ను అర్ధరాత్రి దాటాక విడిచి పెట్టారు.
మిగతా రెజ్లర్లను రాత్రి 11 గంటలకు విడుదల చేశారు. అందువల్లే అందరం కలువలేకపోయాం. అంతా కలిసి చర్చించుకున్నాకే తదుపరి పోరాటానికి దిగుతాం’ అని బజరంగ్ తెలిపాడు. మరోవైపు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు రెజ్లర్లు మళ్లీ నిరసన చేసేందుకు అనుమతి కోరితే ఇస్తామని, అయితే జంతర్‌మంతర్ వద్ద మాత్రం శిబిరానికి అనుమతి లేదని, ఢిల్లీలో ఇంకెక్కడైనా దీక్ష చేపట్టవచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
వాళ్లనలా చూశాక నిద్రే రాలేదు: బింద్రా
దేశానికి ఒలింపిక్, ఆసియా క్రీడల్లో పతకాలు తెచ్చిపెట్టిన రెజ్లర్లతో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని బీజింగ్ ఒలింపిక్స్ (2008) చాంపియన్ షూటర్ అభినవ్ బింద్రా అన్నాడు. మహిళా రెజ్లర్లపై దాష్టీకానికి పాల్పడిన దృశ్యాలు తనను కలచివేశాయని రాత్రంత నిద్రేలేకుండా చేసిందని ట్వీట్ చేశాడు.
స్టార్ రెజ్లర్లతో ఖాకీల కాఠిన్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కానే కాదని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి అన్నాడు. రెజ్లర్లను పోలీసులు ఈడ్చుకెళ్లిన చిత్రాలు తనను బాధించాయని, సాధ్యమైనంత త్వరలో వారి సమస్య పరిష్కరించాలని మాజీ క్రికెట్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్‌లో కోరారు.
చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు
Comments
Please login to add a commentAdd a comment