ధోని... ధోని... ధోని... అనే అరుపులుండవ్! కోహ్లి... కోహ్లి... కోహ్లి... అనే వారే కనిపించరు! హిట్... రోహిత్... రోహిత్... అనే జోష్ కూడా ఉండదు! ‘యూ ఆర్ ద కింగ్స్... బట్ వుయ్ ఆర్ ద సూపర్ కింగ్స్’ అనే ప్లకార్డులు ఇకపై ఉండవు మెక్సికన్ వేవ్స్‌కు ఛాన్సే లేదు అభిమాన ఫ్రాంచైజీల టీ షర్ట్స్ కూడా ప్రేక్షకుల గ్యాలరీలో కనువిందు చేయవు శివమణి డ్రమ్స్ వాయించడు చీర్ లీడర్స్ సందడీ ఉండదు చప్పట్లు... చడీచప్పుడు లేకుండానే గప్‌చుప్‌గా ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. లేదంటే లేదు. అంతే మరి! మీకర్థమవుతోందా! ఇదంతా కరోనా వైరస్ కాటేనని!
న్యూఢిల్లీ: ‘కరోనా’ ఎంత పని చేసింది. 2019 ఏడాది ముగింపులో వచ్చిన ఈ వైరస్... వచ్చిరాగానే మనుషుల్ని మింగేస్తోంది. అంతటితో ఆగకుండా ఒక్కో రంగాన్ని ముంచేస్తూ వచ్చింది. ‘కోవిడ్19’ దెబ్బకు పర్యాటక, వర్తక, వాణిజ్య, ఆర్థిక రంగాలే కాదు... క్రీడల రంగం కూడా కునారిల్లుతోంది. ఇప్పుడు ఈ వైరస్ సెగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు తగిలింది. ఇన్నేళ్లుగా ప్రతీ వేసవిని ధనాధన్ మెరుపులతో అలరించిన ఈ లీగ్ ఇప్పుడైతే అటు స్పాన్సర్లని, ఫ్రాంచైజీలనే కాదు... ఇటు పాలకమండలినీ దడదడలాడిస్తోంది. మొత్తం మీద ఆట సాగినా... మునుపటిలా జరగనే జరుగదు. కళ తప్పిన ‘షో’గా ఇంకా చెప్పాలంటే గేట్లన్నీ మూసేసి గుట్టుగా... గప్‌చుప్‌గా జరుగుతుంది.
ఆటకు మాత్రమే అనుమతి: క్రీడాశాఖ
ప్రాణాంతక వైరస్ ‘కోవిడ్19’ చూస్తుండగానే ‘గ్లోబ్’ను చుట్టేసింది. చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకింది. వేల మందిని చంపేసింది. లక్ష మందికిపైగా సోకింది. కొన్ని దేశాలైతే ప్రజల్ని బయటికే రాకుండా గృహనిర్భంధంలో ఉంచుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. కొన్నయితే ఈ ఏడాదికి రద్దయిపోయాయి కూడా! విదేశీ రాకపోకలతో ఈ మధ్యే భారత్‌కు వచ్చింది. దీని ప్రభావం తెలిసిన భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుకే ఐపీఎల్‌పై నాన్చకుండానే తేల్చేసింది.
ఆటను ఆపం... కానీ ప్రేక్షక సమూహాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. ‘జన సమూహం మధ్య ఎలాంటి క్రీడల ఈవెంట్లకు అనుమతి లేదు. అయితే ఏ క్రీడను, లీగ్‌ను అడ్డుకోం. ప్రేక్షకుల్లేకుండా పోటీలను నిర్వహించుకోవచ్చు’ అని కేంద్ర క్రీడాశాఖ వెల్లడించింది. ఈ శాఖ కార్యదర్శి రాధేశ్యామ్ మాట్లాడుతూ ‘జాతీయ ఆరోగ్య మిషన్, ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సహా జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లన్నింటికీ స్పష్టంగా తెలియజేశాం. ప్రేక్షకుల మధ్య లీగ్, పోటీల నిర్వహణ కుదరదని చెప్పాం’ అని అన్నారు.
జోష్ ఉండదు బాసూ...
క్రీడాశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్ జన సమూహం మధ్య జరిగే అవకాశం కనిపించడం లేదు. అభిమాన ఫ్రాంచైజీ కలర్లను తమ చెక్కిళ్లపై అందంగా వేయించుకుని స్టేడియంలోకి ప్రవేశించే మార్గం ఇప్పుడు మూతపడింది. అభిమాన క్రికెటర్లను దగ్గర నుంచి చూసే భాగ్యం ఇప్పుడు దూరమవుతుంది. బ్యాటింగ్‌లో మెరుపులు కనిపించినా... అరుపులు వినిపించవు. వరుస బౌండరీలు బాదినా చప్పట్లు కరవు! చుక్కల్ని తాకేలా సిక్సర్లు వెళ్లినా స్టేడియం దద్దరిల్లదు. ఇలా ఏం చేసినా... ఏం చూసినా బుల్లితెరపైనో లేదంటే స్మార్ట్‌ఫోన్‌లోనే చూడాలి. ఒళ్లంతా కళ్లు చేసుకునే అవసరమే ఉండదు. ఆసక్తిగొలిపే ‘ప్రత్యక్ష వీక్షణ’ అనుభూతే అసలు ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆ జోషే ఉండదు. ఏదో సరిపెట్టుకోవడం తప్పా!
పాలకమండలి చేసేదేమీ లేదు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోకపోయినా... ఇంతకుమించి చేసేదేమీ లేదు కూడా! ఈ నెల 14న జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినప్పటికీ... బిజీ షెడ్యూలు వల్ల అటు వాయిదా వేయలేదు. ఇటు వేరే దేశంలో నిర్వహించనూ లేరు. ఎన్నికల సందర్భంగా 2009, 2014లలో విదేశాల్లో నిర్వహించింది. కానీ ఇప్పుడున్న ‘కరోనా మహమ్మారి’ దృష్ట్యా ఏ దేశం నిర్వహణకు సిద్ధంగా లేదు. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ప్రేక్షకుల్లేకుండానే ఈ సీజన్ ధనాధన్ కాస్తా చప్పగా సాగే అవకాశముంది.
కరోనా బాధితుడు మ్యాచ్ చూశాడు
మహిళా దినోత్సవం రోజు భారత్, ఆస్ట్రేలియా అమ్మాయిల జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ టి20 ఫైనల్ మ్యాచ్‌ను ఓ కరోనా బాధితుడు చూసినట్లు తేలడంతో కలకలం రేగింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన మ్యాచ్‌లో నార్తర్న్ స్టాండ్‌లోని లెవెల్–2లో నుంచి మ్యాచ్‌ను తిలకించిన వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని స్టేడియం వర్గాలు తెలిపాయి. దీనిపై ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ (డీహెచ్‌హెచ్‌ఎస్) సమీక్షిస్తోంది.
వాళ్లు ఆడాలంటే... ఆగాల్సిందే!
ఐపీఎల్ 13వ సీజన్ ఈ నెల 29న ప్రారంభమవుతుంది. అయితే రెండు వారాలపాటు జరిగే మ్యాచ్‌లు పూర్తిగా భారత ఆటగాళ్లతోనే జరుగనున్నాయి. ఎందుకంటే కరోనా భయాందోళనల వల్ల విదేశీయులకు మంజూరు చేసే వీసాలపై ఆంక్షలు విధించారు. కరోనా లేదని సర్టిఫికేట్ జతచేస్తేనే వీసాలిచ్చే అంశాల్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. దీంతో ఏప్రిల్ 15 తర్వాతే విదేశీ ఆటగాళ్లు భారత్‌లో అడుగుపెట్టే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment