ఉన్నతి హుడాకు చోటు | Selection trials to pick the Indian teams for the upcoming Thomas and Uber Cup, | Sakshi

ఉన్నతి హుడాకు చోటు

Apr 22 2022 6:02 AM | Updated on Apr 22 2022 6:02 AM

Selection trials to pick the Indian teams for the upcoming Thomas and Uber Cup, - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక టీమ్‌ ఈవెంట్లలో పాల్గొనే భారత బ్యాడ్మింటన్‌ జట్లను ‘బాయ్‌’ ప్రకటించింది. ఏప్రిల్‌ 15నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు జరిగిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో షట్లర్ల ప్రదర్శనను బట్టి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ట్రయల్స్‌కు ముందే నేరుగా అర్హత సాధించిన ప్లేయర్లతో పాటు ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన ఆటగాళ్లతో కూడిన జాబితాను సెలక్టర్లు వెల్లడించారు.

ఈ ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు థామస్, ఉబెర్‌ కప్‌లలో వీరు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్‌లో టీనేజ్‌ సంచలనం ఉన్నతి హుడాకు తొలి సారి చోటు లభించింది.  హరియాణాలోని రోహ్‌టక్‌కు చెందిన 14 ఏళ్ల ఉన్నతి సెలక్షన్‌ ట్రయల్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల జట్టులో స్థానం దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఉన్నతి నిలిచింది. ట్రయల్స్‌ ద్వారా పారదర్శకంగా ఆటగాళ్ల ఎంపిక జరిగిందని, ప్రతిభ గలవారే అవకాశం దక్కించుకున్నారని ‘బాయ్‌’ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ మిశ్రా అన్నారు. మూడు మెగా ఈవెంట్ల కోసం కాకుండా ఓవరాల్‌గా 40 మందిని సీనియర్‌ కోచింగ్‌ క్యాంప్‌ కోసం కూడా ఎంపిక చేశారు.  

ఎంపికైన ఆటగాళ్ల జాబితా:  
కామన్వెల్త్‌ క్రీడలు:  
పురుషుల విభాగం – లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, సుమీత్‌ రెడ్డి  
మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, అశ్విని పొన్నప్ప

ఆసియా క్రీడలు, థామస్‌–ఉబెర్‌ కప్‌
పురుషుల విభాగం – లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, ప్రియాన్షు రజావత్, చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్, ధ్రువ్‌ కపిల, ఎంఆర్‌ అర్జున్, విష్ణువర్ధన్‌ గౌడ్, జి.కృష్ణప్రసాద్‌
మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, అస్మిత చాలిహా, ఉన్నతి హుడా, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ఎన్‌.సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, శ్రుతి మిశ్రా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement