న్యూఢిల్లీ: కరోనాతో వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం పూర్తి స్థాయి శిక్షణను మొదలు పెట్టాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) భావిస్తోంది. ఇందు కోసం హైదరాబాద్‌ను వేదికగా నిర్ణయించింది. అన్నీ అనుకూలిస్తే ట్రైనింగ్ క్యాంప్‌ను జులై 1 నుంచి నిర్వహించాలనేది ప్రతిపాదన. అయితే ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతిపైనే ఆధారపడి ఉంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ విషయంలో సడలింపులు ఇచ్చినా... క్రీడా కార్యకలాపాలు ప్రారంభించేందుకు మాత్రం ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. పైగా ఇప్పుడు హైదరాబాద్‌లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో శిబిరం నిర్వహించడం సాధ్యమా అనేది సందేహమే. కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దాదాపు నెల రోజులుగా బెంగళూరులో పలువురు షట్లర్లు తమ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.
నగరానికి చెందిన టాప్ ప్లేయర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ తదితరులు మాత్రం శిక్షణకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ‘కోవిడ్–19 కారణంగా శిక్షణ నిలిచిపోయింది. మేం ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నాం. జులై 1 నుంచి హైదరాబాద్‌లో క్యాంప్ నిర్వహించాలనేది మా ఆలోచన. అయితే ప్రభుత్వ అనుమతి రావడమే అన్నింటికంటే ముఖ్యం. దేశవాళీ టోర్నీలు నిర్వహించే విషయంలో రాష్ట్ర సంఘాలతో చర్చించాం. అందరి సూచనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత సెప్టెంబరు వరకు ఎలాంటి టోర్నీలు జరపరాదని నిర్ణయించాం’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి అజయ్ సింఘానియా వెల్లడించారు. బీడబ్ల్యూఎఫ్ షెడ్యూల్ ప్రకారం భారత్‌లో ఈ ఏడాది నాలుగు బ్యాడ్మింటన్ టోర్నీలు జరగాల్సి ఉండగా, హైదరాబాద్ ఓపెన్ సూపర్–100, జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌ప్రి టోర్నీలు ఇప్పటికే రద్దయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment