అనాథలు కాదు.. ఆటగాళ్లు! | Children Of Saidabad Government Sadan Showing Talent In Archery | Sakshi
Sakshi News home page

అనాథలు కాదు.. ఆటగాళ్లు!

Published Thu, Jul 4 2024 7:25 AM | Last Updated on Thu, Jul 4 2024 7:26 AM

Children Of Saidabad Government Sadan Showing Talent In Archery

ఆర్చరీలో ప్రతిభ చూపిస్తున్న సైదాబాద్‌ ప్రభుత్వ బాలల సదనంలోని చిన్నారులు

అధికారుల రెస్క్యూలో జువెనైల్‌ హోంకు చేరిన పిల్లలు

వారిలోని చురుకుదనాన్ని గుర్తించి జువెనైల్‌ ఆర్చరీ అకాడమీ ఏర్పాటు

అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆధ్వర్యంలో కోచింగ్‌

రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రతిభ చూపుతున్న బాలలు

నవీన్‌ (పేరు, వివరాలు మార్చాం) అనాథ బాలుడు. బంధువులు పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బాల కారి్మకుడిగా మారాడు. కర్మాగారాల్లో, పరిశ్రమల్లో దుర్భర పరిస్థితుల్లో పనిచేశాడు. అధికారులు రెస్క్యూ చేయడంతో.. నాలుగేళ్ల కింద సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలల సదనానికి చేరాడు. ఇప్పుడతను విలు విద్య (ఆర్చరీ)లో జాతీయస్థాయి క్రీడాకారుడు. స్కూల్‌ లెవల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలు దాటి గత నవంబర్‌లో గుజరాత్‌లో నిర్వహించిన జాతీయ బాలల ఆర్చరీ పోటీల్లో పాల్గొన్నాడు. అందులో 800 మంది పోటీపడితే 158వ స్థానం దక్కించుకున్నాడు. ఇప్పుడు సదనంలోని ఆర్చరీ అకాడమీలో కోచ్‌ సాయంతో రాటుదేలుతున్నాడు. భవిష్యత్తులో చాంపియన్‌ అవుతానంటున్నాడు. - సైదాబాద్‌

ఇది ఈ ఒక్క బాలుడి కథనంకాదు, అతడిలా దుర్భర పరిస్థితుల్లో జీవించి, రెస్క్యూ ఆపరేషన్లలో సదనానికి చేరుకున్న మరెందరో చిన్నారులు తమదైన ప్రతిభ చూపుతున్నారు. మరో ముగ్గురు బాలలూ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని, గుర్తింపు తెచ్చుకున్నారు.

రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆర్చరీ అకాడమీ.. 
తల్లిదండ్రులు లేక రహదారులపై భిక్షమెత్తుతూనో, రైళ్లలో సంచరిస్తూ, బాలకారి్మకులుగానో పనిచేస్తున్న పిల్లలను అధికారులు రెస్క్యూ చేసినప్పుడు.. సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలల సదనానికి తరలిస్తారు. అలా వచ్చిన పిల్లలు పెద్దయ్యేదాకా ప్రభుత్వమే చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ బాలల్లోని ప్రతిభను వెలికితీయడంపై అధికారులు దృష్టిపెట్టారు. స్వతహాగా క్రీడాకారుడైన జువెనైల్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మీర్జా అలీ బేగ్‌ పలువురు బాలల్లో చురుకుదనాన్ని పసిగట్టారు.

చక్కటి తరీ్ఫదు ఇస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని గుర్తించారు. తన ఆలోచనను ఉన్నతాధికారులకు చెప్పి ఒప్పించారు. ఎక్కడా జువెనైల్‌ విభాగంలో లేనిరీతిలో.. హైదరాబాద్‌లోని సైదాబాద్‌ జువెనైల్‌ హోంలో 2022 నవంబర్‌లో జువైనల్‌ ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేయించారు. ఇక్కడ ఉదయం బాలికలకు, సాయంత్రం బాలురకు ఆర్చరీలో తరీ్ఫదు ఇస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి కోచ్‌గా..
అకాడమీలో కోచ్‌గా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి, యూత్‌ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన, వరల్డ్‌ 7వ ర్యాంకర్‌ హేమలతా యాదవ్‌ను నియమించారు. ఆమె 15 రోజుల శిక్షణతోనే అకాడమీలోని ఒక బాలుడు జిల్లాస్థాయి పోటీల్లో రాణించి, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం.. ఆ పోటీల్లోనూ ఏడో స్థానంలో నిలవడం విశేషం. తర్వాత ఇక్కడి బాలలు నలుగురు రాష్ట్రస్థాయిలో, ఒకరు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణించారు.

చదువులోనూ రాణిస్తూ..
ఒడిదుడుకుల బాల్యం నుంచి సదనానికి చేరిన తర్వాత బాలలు క్రమశిక్షణతో కూడిన జీవితానికి అలవాటుపడుతున్నారు. అధికారులు, సిబ్బంది సూచనలతో చదువులోనూ రాణిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు రాసి పాసవుతున్నారు. ఇద్దరు విద్యార్థులు సదనం నుంచి బయటికి వచ్చి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటరీ్మడియట్‌ చదువుతున్నారు. ఆ ఇద్దరూ ఆర్చరీ విభాగంలో రాష్ట్రస్థాయిలో చక్కగా రాణిస్తున్న వారే.

చదువు, ఆర్చరీ రెండూ కొనసాగిస్తాం..
కఠినమైన బాల్యాన్ని చూశాం. అప్పటి రోజులు గుర్తుకొస్తే ఇప్పటికీ బాధేస్తుంది. సదనానికి వచ్చిన తర్వాత క్రమపద్ధతిలో జీవిస్తున్నాం. చదువుతూనే ఆర్చరీలో శిక్షణ పొందుతున్నాం. ఉన్నత విద్య పూర్తి చేయాలని, ఆర్చరీ పోటీల్లో చక్కటి గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాం..’’ - ఆర్చరీలో ప్రతిభ చూపుతున్న బాలల మనోగతం

అంతర్జాతీయ ఖ్యాతి సాధించాలన్న..
తెలంగాణ ప్రభుత్వ బాలల సదనంలోని పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి ఖ్యాతి గడించాలన్నదే మా ఆకాంక్ష. అందుకోసమే మరెక్కడా లేనట్టుగా సైదాబాద్‌లోని సదనంలో ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించడంతో అకాడమీ సాధ్యమైంది. ఆకాంక్షలకు అనుగుణంగా బాలలు రాణిస్తున్నారు. చదువులో, క్రీడల్లో వారు ఉన్నతులుగా ఎదిగేందుకు జువెనైల్‌ వెల్ఫేర్‌ అండ్‌ కరక్షనల్‌ సరీ్వసెస్‌ అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారు. - మీర్జా అలీ బేగ్, జువెనైల్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌

నా విద్యార్థులు ఒలింపిక్స్‌లో ఆడాలి.. 
నేర్చుకోవాలనే తపన, గెలవాలనే ఆకాంక్ష ఉన్న నా విద్యార్థులు ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో ఆడుతారు. అకాడమీ ప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులు ఎంతో ఇష్టంగా ఆర్చరీ నేర్చుకుంటున్నారు. ఏకాగ్రత, లక్ష్యంపై వారి గురి అబ్బురపరుస్తోంది. నేర్చుకున్న అనతి కాలంలోనే వారు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడమే దీనికి నిదర్శనం. – హేమలతా యాదవ్, ఆర్చరీ అకాడమీ కోచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement