షట్లర్లకు ‘బాయ్’ రూ.1.6 కోట్ల నజరానా
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఈవెంట్లలో అద్భుతంగా రాణిస్తున్న ప్రముఖ షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) భారీ నజరానాలను అందించింది. ఇందులో గతేడాది ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ గెలవడంతో పాటు తొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన సైనా నెహ్వాల్‌కు రూ.25 లక్షల చెక్‌ను ‘బాయ్’ నూతన అధ్యక్షుడు హిమంత బిస్వా శర్మ అందించారు. 2015లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయురాలిగా కూడా సైనా రికార్డులకెక్కింది. ఇక మలేసియా మాస్టర్స్ (2016), మకావు ఓపెన్ (2015), కామన్వెల్త్ గేమ్స్ (2014)లో కాంస్యం సాధించిన పీవీ సింధుకు రూ.20 లక్షలు ఇచ్చారు.
అయితే 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో పాటు 2015 సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి టైటిల్ సాధించిన కశ్యప్... తనకు రావాల్సిన ప్రైజ్‌మనీ అందలేదని శర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అతడికి కూడా రూ.30 లక్షల చెక్‌ను అందించారు. ఇదే తరహాలో గురుసాయిదత్‌కు రూ.5 లక్షలు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు రూ.10 లక్షలు అందించడం జరిగింది. ఇప్పటి నుంచి ఆటగాళ్లకు వెంటవెంటనే ప్రైజ్‌మనీని అందిస్తామని శర్మ స్పష్టం చేశారు.