అవధ్‌ వారియర్స్‌ విజయం | Awadhe Warriors beat Pune7Aces 4-3 | Sakshi
Sakshi News home page

అవధ్‌ వారియర్స్‌ విజయం

Published Tue, Dec 25 2018 1:17 AM | Last Updated on Tue, Dec 25 2018 1:17 AM

Awadhe Warriors beat Pune7Aces 4-3 - Sakshi

ముంబై: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) నాలుగో సీజన్‌లో రసవత్తర పోరుకు పుణే సెవెన్‌ ఏసెస్, అవధ్‌ వారియర్స్‌ జట్లు తెరతీశాయి. విజేతగా నిలిచేందుకు ఇరు జట్లు ఆఖరి మ్యాచ్‌ దాకా పోరాడాల్సి వచ్చింది. చివరకు మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌తో అవధ్‌ వారియర్స్‌ 4–3తో పుణేపై గెలిచింది. అవధ్‌ వారియర్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌ అయిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సన్‌ వాన్‌ హో 15–14, 15–7తో లెవెర్‌డెజ్‌ (పుణే)పై గెలుపొందాడు. దీంతో 2–0తో అవధ్‌ ఆధిక్యంలోకి రాగా, పురుషుల డబుల్స్‌లోనూ అవధ్‌ ద్వయం క్రిస్టియన్సెన్‌–లీ యంగ్‌ 15–12, 15–14తో మథియస్‌ బో–ఇవనోవ్‌ (పుణే) జంటను ఓడించింది. దీంతో 3–0తో వారియర్స్‌ 

విజయానికి దగ్గరైందనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు ఆట మొదలైంది. రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ బరిలోకి దించిన పుణే... మహిళల సింగిల్స్‌ను ‘ట్రంప్‌’ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ 15–13, 15–9తో బీవెన్‌ జాంగ్‌ (అవధ్‌)పై అలవోక విజయం సాధించింది. అవధ్‌ ఆధిక్యం 3–2కు తగ్గింది. రెండో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ (పుణే) 15–11, 15–8తో లీ డాంగ్‌ క్యున్‌ (అవధ్‌)కు షాకిచ్చాడు. దీంతో ఇరుజట్లు 3–3తో సమ ఉజ్జీగా నిలిచాయి. నిర్ణాయక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్టియన్సెన్‌–అశ్విని పొన్నప్ప 15–8, 11–15, 15–12తో ఇవనోవ్‌–జాయెర్స్‌ఫెల్డ్‌ (పుణే) జంటపై గెలవడంతో అవ«ద్‌ వారియర్స్‌ బోణీ కొట్టింది. 

నేటి నుంచి హైదరాబాద్‌లో... 
హైదరాబాద్‌లో నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు పీబీఎల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మంగళ, బుధ, గురువారాల్లో రోజుకో మ్యాచ్‌ (రాత్రి 7 గంటల నుంచి), శుక్రవారం రెండు మ్యాచ్‌లు (సాయంత్రం 4 నుంచి; రాత్రి 7 నుంచి) జరుగుతాయి. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌ ఆడుతుంది. స్టార్‌ ప్లేయర్‌ సింధు ఇపుడు సొంత ప్రేక్షకుల మధ్య హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగడంతో ప్రేక్షకుల జేజేలతో స్టేడియం హోరెత్తనుంది. ఆసక్తిగలవారు గచ్చిబౌలి స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌లో లేదా ఆన్‌లైన్‌లో (https:// insider.in/badminton&in&hyderabad) టికెట్లు లభిస్తాయి.  

డిసెంబర్‌ 25:    హైదరాబాద్‌(vs) చెన్నై 
డిసెంబర్‌ 26:    ఢిల్లీ(vs)అహ్మదాబాద్‌ 
డిసెంబర్‌ 27:    నార్త్‌ ఈస్టర్న్‌(vs)ముంబై 
డిసెంబర్‌ 28:    అహ్మదాబాద్‌(vs)బెంగళూరు 
హైదరాబాద్‌(vs) అవధ్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement