హైదరాబాద్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో తొలిసారి సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతోంది. వేలంతో పాటు లాటరీలో అదృష్టం కూడా కలిసొచ్చి హంటర్స్ జట్టు ఆమెను సొంతం చేసుకుం ది. మరో టాప్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఈ సారి బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు. అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను అనూహ్యంగా ప్రారంభ వేలంలో ఎవరూ పట్టించుకోకపోయినా... చివరకు ఆమె నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టుతో చేరింది. వేలంలో మొత్తం 145 మంది షట్లర్లు అందుబాటులో ఉండగా, తొమ్మిది జట్లు కలిపి 90 మందిని తీసుకున్నాయి. 9 మంది ఐకాన్ ప్లేయర్లలో ఎనిమిది మందికి గరిష్ట విలువ రూ. 80 లక్షల చొప్పున దక్కగా... తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్‌కు రూ. 52 లక్షలు లభించడం వేలంలో అతి పెద్ద సంచలనం.
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్ వేలం ఆసక్తికరంగా సాగింది. సోమవారం ఇక్కడ జరిగిన వేలంలో ఎనిమిది మంది టాప్ ప్లేయర్లను గరిష్టంగా అనుమతించిన రూ. 80 లక్షల మొత్తానికి వివిధ జట్లు సొంతం చేసుకున్నాయి. మొత్తం తొమ్మిది జట్లు లీగ్‌లో పాల్గొంటుండగా 9 మందిని ఐకాన్ ఆటగాళ్లుగా గుర్తించారు. భారత్ తరఫున పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్‌లకు తలా రూ. 80 లక్షలు దక్కాయి. విదేశీ ఆటగాళ్లలో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), కరోలినా మారిన్ (స్పెయిన్), సుంగ్ జి హ్యూన్ (కొరియా), లీ యోంగ్ డే (కొరియా)లకు కూడా వేలంలో రూ. 80 లక్షలు దక్కాయి. అయితే పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్న సోన్ వాన్ హో (కొరియా)కు మాత్రం వేలంలో గరిష్టంగా రూ.70 లక్షలు మాత్రమే లభించాయి. డిసెంబర్ 22నుంచి జనవరి 13 వరకు పీబీఎల్ జరుగుతుంది.
కొత్త నిబంధనలతో...
పీబీఎల్ మూడు సీజన్ల తర్వాత ఈ సారి ఆటగాళ్లను అట్టి పెట్టుకునే, మ్యాచ్ టు కార్డ్ పద్ధతికి నిర్వాహకులు స్వస్తి చెప్పారు. దాంతో ఆటగాళ్లందరూ వేలంలోకి వచ్చారు. అయితే గతంలోలాగా అపరిమిత మొత్తానికి వేలం సాగకుండా నిబంధన విధించారు. ఐకాన్ క్రీడాకారులకు బేస్ ప్రైస్‌ను రూ. 70 లక్షలుగా ఉంచి గరిష్టంగా ఒక్కో ఆటగాడికి రూ. 80 లక్షలు మాత్రమే చెల్లించాలని చేర్చారు. దాంతో చివరకు వచ్చే సరికి ఒక్కో షట్లర్ కోసం ఒకటికంటే ఎక్కువ జట్లు పోటీ పడాల్సి వచ్చింది. ఫలితంగా ‘డ్రా’ ద్వారా ఆ ప్లేయర్ ఏ జట్టుకు చెందాలో నిర్ణయించారు. సింధును కూడా ‘డ్రా’లో హైదరాబాద్ హంటర్స్ సొంతం చేసుకుంది. వేలంలో మొదటి సారి సైనా నెహ్వాల్ పేరు వచ్చినప్పుడు ఏ జట్టు కూడా ఆమె కోసం ముందుకు రాకపోవడం విశేషం! ఆమె స్థాయి ప్లేయర్ కోసం ఫ్రాంచైజీలు వెనకడుగు వేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. తర్వాత రెండో సారి ఆమె కోసం వేలం జరగ్గా ఫ్రాంచైజీల మధ్య పోటీ సాగింది. ఆఖరికి నార్త్ ఈస్టర్న్ వారియర్స్ సైనాను ఎంచుకుంది. మారిన్‌ను ‘డ్రా’ ద్వారానే కొత్త ఫ్రాంచైజీ పుణే ఏసెస్ గెలుచుకుంది.
సాయిరాజ్ జాక్‌పాట్...
గత ఏడాది పీబీఎల్‌లో విశేషంగా రాణించి హంటర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగబ్బాయి, డబుల్స్ స్పెషలిస్ట్ సాత్విక్ సాయిరాజ్‌పై ఈ సారి కనకవర్షం కురిసింది. రూ. 15 లక్షల కనీస ధరతో వేలంలో వచ్చిన అతనికి ఏకంగా రూ. 52 లక్షలు (అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్) దక్కాయి. దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో లేని ఆటగాళ్లలో సాత్విక్‌కు దక్కింది రెండో గరిష్ట మొత్తం కాగా వరల్డ్ నంబర్ 11 టామీ సుగియార్తో (ఇండోనేసియా) అగ్రస్థానంలో నిలిచాడు. అతడిని ఢిల్లీ డాషర్స్ రూ. 70 లక్షలకు సొంతం చేసుకుంది.
సిక్కిరెడ్డికి రూ. 29 లక్షలు...
సింగిల్స్ ఆటగాడు సమీర్ వర్మ (రూ. 42 లక్షలు – ముంబై)కు పెద్ద మొత్తం లభించగా, ఇటీవలే ‘అర్జున’ అవార్డు గెలుచుకున్న డబుల్స్ స్టార్ ఎన్.సిక్కిరెడ్డిని అహ్మదాబాద్ రూ. 29 లక్షలకు తీసుకుంది. మరో డబుల్స్ స్పెషలిస్ట్ అశ్విని పొన్నప్పకు రూ. 32 లక్షలు (అవధ్) దక్కగా, సాయిప్రణీత్ (రూ.32 లక్షలు – బెంగళూరు)కు మంచి విలువ లభించింది. ప్రముఖ భార్యాభర్తల జోడి క్రిస్ అడ్‌కాక్ (రూ. 56 లక్షలు) – గాబ్రియెల్ అడ్‌కాక్ (రూ. 36 లక్షలు)లను భారీ మొత్తానికి చెన్నై తీసుకుంది. పారుపల్లి కశ్యప్‌కు రూ. 5 లక్షలు (చెన్నై) మాత్రమే లభించగా... హీరోయిన్ తాప్సికి చిరకాల స్నేహితుడిగా ప్రచారంలో ఉన్న డెన్మార్క్ ఆటగాడు మథియాస్ బోను పుణే రూ. 50 లక్షలకు తీసుకోవడం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment