auctions
-
వేలంలో రూ.9.14 కోట్లకు అమ్ముడైన 'డొనాల్డ్ ట్రంప్' కారు ఇదే..
ఇటీవల బారెట్ జాక్సన్ నిర్వహించిన వేలంలో అమెరికా మాజీ అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఉపయోగించిన 'లంబోర్ఘిని డయాబ్లో వీటీ' కారు ఏకంగా 1.1 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. దీంతో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన డయాబ్లో కారుగా ఇది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 1997లో 'డొనాల్డ్ ట్రంప్' కొనుగోలు చేసిన లంబోర్ఘిని కంపెనీకి చెందిన 'డయాబ్లో వీటీ' ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన, ప్రజాదరణ పొందిన కారు. ఈ కారుని ట్రంప్ తనకోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకున్నారు. బ్లూ లే మాన్స్ అనే ఒక స్పెషల్ కలర్ షేడ్‌లో కనిపించే ఈ కారు అమెరికాలో అమ్ముడైన 132 కార్లలో ఒకటి. ట్రంప్ అభ్యర్థన మేరకు కంపెనీ ఆ కారు డోర్ మీద ట్రంప్ 1997 డయాబ్లో అనే నేమ్ ప్లేట్ కూడా ఫిక్స్ చేసింది. ఇది డ్యూయల్-టోన్ క్రీమ్/బ్లాక్ ఫినిషింగ్ పొంది ఉండటం కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ కారుని ట్రంప్ 2002లో ఈ కారును విక్రయించారు. ఆ తరువాత ఈ కారు 2016లో eBayలో అమ్మకానికి కనిపించింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఎంతమంది చేతులు మారిందనే విషయం స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే తాజాగా ఈ కారు 1.1 మిలియన్ డాలర్లకు (రూ. 9.14 కోట్లు) అమ్ముడైంది. 2016 వరకు ఈ కారు 14655 కిమీ ప్రయాణించినట్లు, ఇప్పుడు వేలానికి వచ్చే సమయానికి ఓడోమీటర్లో 15431 కిమీ ప్రయాణించినట్లు తెలుస్తోంది. అంటే 2016 తరువాత దీని ఎక్కువ ఉపయోగించలేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్చల్ చేశాడు - వీడియో లంబోర్ఘిని డయాబ్లో లంబోర్ఘిని కంపెనీకి చెందిన డయాబ్లో మంచి డిజైన్ కలిగి శక్తివంతమైన 5.7 లీటర్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 492 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి కేవలం 4.1 సెకన్లలో గంటకు 60mph వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 235 కిమీ వరకు ఉంది. Ordered new in a one-off Blu Le Mans color by former President Donald J. #Trump, this #V12 #Lamborghini #Diablo beauty will be selling with No Reserve on #SuperSaturday at WestWorld of #Scottsdale. Learn More: https://t.co/Fok6pALx8M pic.twitter.com/r1OCsXiCbJ — Barrett-Jackson (@Barrett_Jackson) January 26, 2024 -
DERIVAZ AND IVES: జ్ఞాపకాల ‘రే’ఖలు
సత్యజిత్ రే చిత్రాలు కాలాతీతమైనవి. ఆ జ్ఞాపకాలు ఏ కాలానికైనా అపురూపమైనవి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ యాక్షన్ హౌజ్ డెరివాజ్ అండ్ ఐవ్స్ సత్యజిత్ రే సినిమాలకు సంబంధించి రేర్ పోస్టర్లు, ఫోటోగ్రాఫిక్ స్టిల్స్, లాబీ కార్డ్స్, సినాప్సిస్ బుక్‌లెట్స్‌తో పాటు ఆయన రూపొందించిన కళారూపాలను వేలం వేసింది. ఈ వేలంలో పాల్గొనడానికి రే అభిమానులు, సినీ పండితులు, ఆర్ట్ కలెక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కాలం కంటే ముందు ఉన్న ఆలనాటి పోస్టర్ డిజైనింగ్, కాలిగ్రాఫిక్ క్వాలిటీని అర్థం చేసుకోవడానికి... స్థూలంగా చెప్పాలంటే ఐకానిక్ ఫిల్మ్‌మేకర్ అద్భుత ప్రయాణాన్ని అన్వేషించడానికి ఈ వేలం ఒక సాధనం అవుతుంది. -
బొగ్గు గనుల వేలం అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనులను వేలం పాట ద్వారా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను గట్టిగా ఎదుర్కొంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉన్నంత వరకు, అక్కడి గనులు సింగరేణికే దక్కేలా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు భట్టి విక్రమార్క, దివాకరరావు, శ్రీధర్‌బాబు, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే ఇలా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం మొదలైందన్నారు. ఇటీవల ప్రస్తుత ప్రభుత్వం సవరణతో ముందుకొచ్చినా.. బహిరంగ వేలం అంశానికే ప్రాధాన్యమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గనులను స్థానిక ప్రభుత్వానికి అప్పగించే వెసులుబాటు చట్ట సవరణలో ఉన్నా దాన్ని పట్టించుకోవటం లేదన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకురాగా, సింగరేణి కూడా బహిరంగ వేలంలో పాల్గొని దక్కించుకోవచ్చని పేర్కొందన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని, ఎట్టి పరిస్థితుల్లో సింగరేణికి నష్టం జరిగే ఎలాంటి ప్రయత్నాన్ని జరగనీయమని మంత్రి తెలిపారు. ఇంకో 20 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, అప్పటి వరకు సింగరేణికి నష్టం జరగనీయమని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో మూడో స్థానం.. తలసరి ఆదాయం జాబితాలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మన కంటే ముందు సిక్కిం, గోవాలాంటి చిన్న రాష్ట్రాలే ఉన్నందున తెలంగాణ అగ్రభాగంలో ఉన్నట్టుగానే భావించొచ్చన్నారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సబ్సిడీ విస్తీర్ణ పరిమితి పెంచే యోచన.. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, సబ్సిడీ పరిమితిని పన్నెండున్నర ఎకరాల నుంచి మరింత ఎక్కువ పరిధికి పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం అంగీకరించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా దాన్ని అమలు చేసే దిశగా యోచిస్తున్నట్టు శాసనసభ దృష్టికి తెచ్చారు. వాయిదా తీర్మానాల తిరస్కరణ.. సభలో పలువురు సభ్యులు అడిగిన వాయిదా తీర్మానాలను స్పీకర్ పోచారం తిరస్కరించారు. -
సెప్టెంబర్ 8,9 తేదీల్లో ప్రొ కబడ్డీ వేలం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కార్యక్రమం సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో ముంబైలో జరగనుంది. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లను ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీలో ఉన్న వారి కనీస ధర రూ. 30 లక్షలుగా... ‘బి’ కేటగిరీ ప్లేయర్లకు కనీస ధర రూ. 20 లక్షలు... ‘సి’ కేటగిరీ ఆటగాళ్ల కనీస ధర రూ. 13 లక్షలుగా... ‘డి’ కేటగిరీ క్రీడాకారుల కనీస ధర రూ. 9 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో 500కుపైగా క్రీడాకారులు బరిలో ఉన్నారు. తొమ్మిదో సీజన్లో పాల్గొన్న ఆటగాళ్లలో ఆరుగురిని అట్టిపెట్టుకునే సౌలభ్యం ఆయా ఫ్రాంచైజీలకు ఉంది. మొత్తం 12 జట్లు ఈ లీగ్‌లో ఉన్నాయి. -
ఏముంది భయ్యా ఆ జీన్స్ ప్యాంట్లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్!
వస్తువులు పాతవయ్యే కొద్దీ వాటిని పక్కన పెట్టడం సహజం. వాటి విలువ తగ్గడం, ఆ స్థానంలో కొత్తవి రావడం, పాడైపోవడం లాంటి కారణాలతో పక్కన పెట్టేస్తాం. ఇదంతా ఒక వైపే. మరో వైపు చూస్తే.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ దశాబ్దాల కాలం నాటి వస్తువుల కోసం కోట్లు పెడుతుంటాం. ఎందుకంటే కొన్ని వస్తువులు ఎంత పాతవైతే అంత విలువ పెరుగుతుంది. అందుకే కొంతమంది అలాంటి వాటి కోసం వేచి చూస్తుంటారు. వేలంలోకి రాగానే భారీ నగదు చెల్లించి సొంతం చేసుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మెక్సికోలో చోటు చేసుకుంది. అమ్మో.. ఈ ప్యాంటు ధర రూ.60 లక్షలా! అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880ల నాటి లెవీ జీన్స్ జత $76,000కి( భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షల పైమాటే) అమ్ముడైంది. శాన్ డియాగోకు చెందిన 23 ఏళ్ల పాతకాలపు దుస్తుల వ్యాపారి కైల్ హౌపెర్ట్ ఇటీవల జరిగిన వేలంలో ఈ జీన్స్ ప్యాంటును కొనుగోలు చేశాడు. అయితే, హౌపెర్ట్ కొనుగోలుదారుల ప్రీమియంతో కలిపి మొత్తం $87,400 చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై హౌపెర్ట్ మాట్లాడుతూ "నేను ఇప్పటికీ ఒకరకంగా అయోమయంలో ఉన్నాను, ఆ ప్యాంట్‌ను కొనుగోలు చేసినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పారు. అతను పాతకాలపు దుస్తుల కంపెనీ డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్సన్తో కలిసి జీన్స్‌ను కొనుగోలు చేశాడు. వేలంలో పలికిన దీని ధరలో ఇప్పటికే 90 శాతాన్ని హౌపెర్ట్ చెల్లించాడు. View this post on Instagram A post shared by Golden State Vintage (@goldenstatevtg) చదవండి: యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్! -
ఎస్బీఐ రూ.746 కోట్ల ఎన్పీఏల వేలం
న్యూఢిల్లీ: ఎంతకీ వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) ఎస్బీఐ వరుసగా ఈ నెల, వచ్చే నెలలో వేలం వేయనుంది. సింటెక్స్ బీఏపీఎల్ మోసపూరిత రుణ ఖాతాను కూడా విక్రయానికి పెట్టనుంది. తద్వారా రూ.746 కోట్లను వసూలు చేసుకోనుంది. ముందుగా నవంబర్ 4న ఎస్బీఐ పలు ఎన్పీఏ ఖాతాలను వేలం వేయనుంది. సింటెక్స్ బీఏపీఎల్ రూ.198 కోట్లు, సూరత్ హజీరా ఎన్‌హెచ్6 టోల్‌వే ప్రైవేటు లిమిటెడ్ రూ.335 కోట్లు, శ్రీభావ్ పాలీవేవ్స్ రూ.20 కోట్ల ఎన్పీఏలు వేలం జాబితాలో ఉన్నాయి. సింటెక్స్ బీఏపీఎల్ ఖాతాకు కేవలం అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలే (ఏఆర్‌సీలు) అర్హులని ఎస్బీఐ పేర్కొంది. -
రికార్డ్ ధర పలికిన అరుదైన ‘పింక్’ వజ్రం.. ఎంతంటే?
హాంకాంగ్: అరుదుగా లభించే గులాబీ(పింక్) వజ్రాన్ని వేలం వేయగా రికార్డ్ స్థాయిలో ధర పలికింది. గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ వజ్రాన్ని శుక్రవారం హాంకాంగ్‌లో వేలం వేశారు. ఈ వేలంలో 58 మిలియన్ డాలర్లు(రూ.480 కోట్ల) ధర పలికింది. క్యారెట్ పరంగా వేలంలో ఈ స్థాయి అత్యధిక ధర పలకడం ప్రపంచ రికార్డు. 11.15 క్యారెట్లు ఉన్న ఈ విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ అంచనా ధర 21 మిలియన్ డాలర్లు(రూ.173.5 కోట్లు) కాగా, రెట్టింపు ధరను మించి పలికింది. ప్రముఖ సంస్థ ‘సదబీస్’ దీన్ని వేలం వేసింది. రెండు ప్రపంచ ప్రఖ్యాత పింక్ వజ్రాల వరుసలో ఈ వజ్రానికి ‘విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్’ అనే పేరు వచ్చింది. 23.60 క్యారెట్ల మొదటి విలియమ్సన్ డైమండ్‌ను తన వివాహ వేడుకలో (1947) బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కానుకగా అందుకొన్నారు. 59.60 క్యారెట్ల రెండో పింక్ స్టార్ డైమండ్ 2017 వేలంలో రూ.588 కోట్ల (71.2 మిలియన్ డాలర్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఇదీ చదవండి: 15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షలు ఛార్జ్ చేసిన ఉబర్ -
ప్రో కబడ్డీ వేలం: ఐపీఎల్ రేంజ్లో ధర పలికిన ప్లేయర్స్.. రికార్డులు బ్రేక్
Pro Kabaddi.. దేశంలో క్రికెట్‌తో పాటుగా కబడ్డీకి సైతం క్రేజ్ ఉంది. ఇండియాలో ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీకి(Pro Kabbadi)కి కూడా ఎంతో ఆదరణ కనిపించింది. కబడ్డి ఫ్యాన్స్‌ను అలరిస్తూ ప్రో కబడ్డీ ఇప్పటికి 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రో కబడ్డీ 9వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. అయితే, 9వ సీజన్‌కు ముందు ప్రో కబడ్డీకి భారీ వేలం జరిగింది. ముంబై వేదికగా రెండు రోజులపాటు(ఆగస్టు5, 6 తేదీల్లో) జరిగిన మెగా వేలంలో కబడ్డీ స్టార్ ప్లేయర్స్ ఊహించని ధర పలికారు. వేలంలో రికార్డు ధరకు ప్లేయర్స్‌ను ప్రాంచైజీలు దక్కించుకున్నాయి. మొత్తంగా 12 టీమ్స్ 500 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయడానికి పోటీపడ్డాయి. It's the Hi-Flyer's 🌏 and we're just living in it 🤷♂️ Pawan Sehrawat shatters the #vivoPKLPlayerAuction records to emerge as the most expensive buy in the history of #vivoProKabaddi 🤯@tamilthalaivas can now breathe easy like all of us, eh? 👀 pic.twitter.com/Ej2PtKPqFv — ProKabaddi (@ProKabaddi) August 5, 2022 కాగా, ఈ మెగా వేలంలో రికార్డు స్థాయిలో పవన్ షెరావత్‌ను రూ.2.65కోట్లకు తమిళ్ తలైవాస్ దక్కించుకోగా.. వికాస్ ఖండోలాను రూ.1.70కోట్లకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. ఇక, ఫజల్ అట్రాసలిని పూణేరి పల్టన్స్.. రూ. 1. 38కోట్లకు దక్కించుకుంది. గుమాన్ సింగ్‌ను రూ. 1.21కోట్లకు యు ముంబా కొనుగోలు చేసింది. మరోవైపు.. ప్రొ కబడ్డీలో రికార్డు బ్రేకర్‌గా పేరొందిన ప్రదీప్ నర్వాల్‌ను రూ.90 లక్షలకు యూపీ యోధా ఎఫ్‌బీఎంలో దక్కించుకుంది. ప్రొ కబడ్డీ చరిత్రలోనే పవన్ షెరావత్.. భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఇక హర్యానా స్టీలర్ రూ.65.10లక్షలకు అమీర్ హొసైన్‌ను, రవికుమార్‌ను రూ.64.10లక్షలకు(దబాంగ్ ఢిల్లీ), నీరజ్ నర్వాల్‌ను బెంగళూరు బుల్స్ రూ.43లక్షలకు కొనుగోలు చేసుకున్నాయి. ನಮ್ಮ ಗೂಳಿ ಪಡೆ 😍 How's that squad looking, #BullsSene? ⚡#FullChargeMaadi #BengaluruBulls #vivoPKLPlayerAuctions pic.twitter.com/oDyrX89itc — Bengaluru Bulls (@BengaluruBulls) August 6, 2022 Ala re ala! We welcome the Sultan to Pune! 🦁 . .#PuneriPaltan #Bhaaripaltan #Gheuntak #vivoPKLPlayersAuction #BhaariAuction pic.twitter.com/CqgL2limse — Puneri Paltan (@PuneriPaltan) August 5, 2022 ఇక, తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే.. రజనీష్, అంకిత్ బెనివల్ను రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా అభిషేక్ సింగ్, మోను గోయల్,పర్వేష్ భైంస్వాల్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, సిద్దార్ధ్ దేశాయ్‌ను కొనుగోలు చేశారు. కాగా, రాహుల్ చౌదరిని కనీస ధర రూ.10లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. దబాంగ్ ఢిల్లీ నవీన్ కుమార్, విజయ్ను రీటైన్ చేసుకుంది. Our first buy of the day Parvesh Bhainswal will be the part of #Titansquad#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/uYFjkcC4jo — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Abhishek Singh is set to expand the strength of the #Titansquad in season-9. How excited are you ?#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/gvJRfJaIkD — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Pesh hai aapke #PKL2022 #GujaratGiants squad! 💪#Giant family, how do you feel about the team? 🤩#GarjegaGujarat #Adani #vivoProKabaddi #vivoPKLPlayerAuction pic.twitter.com/UCyjmZSGdX — Gujarat Giants (@GujaratGiants) August 6, 2022 ఇది కూడా చదవండి: సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. -
వేలం వెర్రిగా ఎలక్ట్రిక్ వాహనాలు
పుణె: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అంశం వేలం వెర్రిగా మారిందని, ఈవీ వ్యాపారంతో సంబంధం లేని వాళ్లంతా కూడా పరిశ్రమలోకి వస్తున్నారని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఆక్షేపించారు. అందుకే అగ్నిప్రమాదాల్లాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. పుణెలోని అకుర్దిలో బజాజ్ ఆటో అనుబంధ సంస్థ చేతక్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రత్యేక ప్లాంటును ఆవిష్కరించిన సందర్భంగా బజాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇది కేవలం అగ్నిప్రమాదాల గురించి మాత్రమే కాదు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ల వాహనాల్లోనూ ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈవీల విషయంలో సమస్యంతా తయారీ ప్రక్రియతోనే ఉంటోంది. ఈవీల వ్యవహారం వేలం వెర్రిగా మారడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈవీలతో సంబంధం లేని వాళ్లకు ఈ వ్యాపారంతో ఏ పని ఉంది? ఈ విధానాన్ని సరిచేయాలి. బహుశా, ప్రభుత్వంలోని సంబంధిత అధికార వర్గాలు ఈవీల నిబంధనలను సడలించారేమో. అందుకే ఈవీలు మార్కెట్‌ను వరదలా ముంచెత్తుతున్నాయి‘ అని బజాజ్ పేర్కొన్నారు. ‘తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాల పేరుతో దేన్నైనా రోడ్డు మీదకు తీసుకొస్తున్నారు. మరి స్కూటర్లకు అగ్నిప్రమాదాలు జరగకుండా మరేమవుతుంది?‘ అని ఆయన ప్రశ్నించారు. ప్లాంటుపై రూ. 750 కోట్ల పెట్టుబడులు కొత్తగా ఏర్పాటు చేసిన ఈవీల తయారీ ప్లాంటుపై చేతక్ టెక్నాలజీ (సీటీఎల్), దాని వెండార్ భాగస్వాములు రూ. 750 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నారు. సుమారు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఉంటుంది. వార్షికంగా దీని తయారీ సామర్థ్యం 5 లక్షల ద్విచక్ర వాహనాలుగా ఉంటుంది. 2019 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన చేతక్ ఈ–స్కూటర్లను ఇప్పటివరకూ 14,000 పైచిలుకు విక్రయించామని, 16,000 పైగా బుకింగ్స్ ఉన్నాయని బజాజ్ తెలిపారు. ‘చేతక్ అనేది సిసలైన మేక్ ఇన్ ఇండియా సూపర్‌స్టార్. అది ఎంతో మంది వాహనప్రియుల అభిమానం చూరగొంది. దేశీయంగానే డిజైన్ చేసి, ఇక్కడే నిర్మించిన ఎలక్ట్రిక్ చేతక్ .. మా పటిష్టమైన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలకు, తయారీలో దశాబ్దాల అనుభవానికి, వినియోగదారులు .. ఉత్పత్తులపై మాకున్న లోతైన అవగాహనకు నిదర్శనం‘ అని బజాజ్ తెలిపారు. -
మార్చి 27 నుంచి ఐపీఎల్ 2022 సీజన్.. ప్రేక్షకులు లేకుండానే!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం సందడి మొదలైంది. 2022 లీగ్ కోసం భారత ఆటగాళ్ల మొదలు అసోసియేట్ టీమ్‌ల క్రికెటర్ల వరకు అందరూ వేలంలో తామూ భాగం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేలంలో అవకాశం దక్కించుకునే క్రమంలో తొలి అడుగుగా ఏకంగా 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీయులు. ఇందులో గరిష్టంగా ఆస్ట్రేలియానుంచి 59 మంది క్రికెటర్లు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా రెండు టీమ్‌లతో మొత్తం జట్ల సంఖ్య పదికి చేరింది. కొత్త సీజన్‌కు ముందు నిబంధనల ప్రకారం గరిష్టంగా నలుగురు ఆటగాళ్లనే టీమ్‌ను కొనసాగించే అవకాశం ఉండటంతో భారత జట్టులో రెగ్యులర్ సభ్యుల్లో కూడా దాదాపు అందరూ వేలంలోకి రానున్నారు. వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన 896 మంది భారత క్రికెటర్లలో 61 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినవారు ఉన్నారు. ఈ లిస్ట్‌ను బీసీసీఐ ఫ్రాంచైజీలకు పంపిస్తుంది. వేలంలో తాము కోరుకుంటున్న ఆటగాళ్లతో వివిధ టీమ్‌లు ఇచ్చే పేర్లను బట్టి తుది జాబితా సిద్ధమవుతుంది. అందులో ఉన్న ఆటగాళ్లకే వేలంలో అవకాశం లభిస్తుంది. ఎనిమిది టీమ్‌లు కలిసి 27 మంది ఆటగాళ్లను, రెండు కొత్త టీమ్‌ను ఎంచుకున్న ఆరుగురు ఆటగాళ్లు కలిపితే జట్ల వద్ద 33 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఒక్కో టీమ్‌కు గరిష్టంగా 25 మందికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేలంలో 217 మంది క్రికెటర్లే చివరకు ఎంపికవుతారు. బరిలో వార్నర్, మిచెల్ మార్ష... రూ. 2 కోట్ల కనీస విలువతో మొత్తం 49 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆపై వేలంలో వీరికి ఎంత మొత్తం లభిస్తుందనేది ఆసక్తికరం. ఐపీఎల్ ఆల్‌టైమ్ స్టార్లలో ఒకడు, ఇటీవల టి20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన డేవిడ్ వార్నర్‌పైనే అందరి దృష్టి నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మిచెల్ మార్‡్ష కూడా లీగ్‌లో తన అవకాశం కోసం చూస్తున్నాడు. రూ. 2 కోట్ల లిస్ట్‌లో ఉన్న భారత క్రికెటర్లలో శ్రేయస్, ధావన్, ఇషాన్ కిషన్, రాయుడులకు మంచి విలువ పలికే అవకాశం ఉంది. విదేశీ క్రికెటర్లలో కమిన్స్, జోర్డాన్, బౌల్ట్, డి కాక్, డుప్లెసిస్, రబడలకు భారీ డిమాండ్ ఖాయం. రూ.1.5 కోట్ల జాబితాలో సుందర్, బెయిర్‌స్టో, మోర్గాన్, హోల్డర్...రూ.1 కోటి జాబితాలో నటరాజన్, మనీశ్ పాండే, రహానే, షమ్సీలకు ఫ్రాంచైజీలకు ఆకర్షించవచ్చు. ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధం పూర్తి చేసుకున్న పేసర్ శ్రీశాంత్ కూడా రూ. 50 లక్షల కనీస విలువతో తన పేరు నమోదు చేసుకోవడం విశేషం. తొలి ఐపీఎల్ మినహా 2009నుంచి లీగ్‌పై తనదైన ముద్ర వేసి దాదాపు అన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న క్రిస్ లీగ్ ఈ సారి లీగ్‌నుంచి తప్పుకోవడంతో తన పేరును నమోదు చేసుకోలేదు. ముంబై, పుణేలలో... ఐపీఎల్–2022ను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై శనివారం బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ఫ్రాంచైజీలన్నీ భారత్‌లో జరిపితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ప్రేక్షకులను అనుమతించకుండా ముంబై, పుణేలలోనే అన్ని మ్యాచ్‌లు జరపాలనేది ప్రాథమికంగా బీసీసీఐ ఆలోచన. ముంబైలో మూడు పెద్ద మైదానాలు ఉండగా, సమీపంలోనే పుణేలో మరో స్టేడియం ఉండటంతో బయోబబుల్ తదితర ఏర్పాట్ల విషయంలో ఎలాంటి సమస్య రాదని వారు చెబుతున్నారు. అయితే భారత్‌లో కరోనా కాస్త తగ్గుముఖం పడితేనే ఇది సాధ్యమవుతుందని... లేదంటే ప్రత్యామ్నాయంగా మళ్లీ యూఏఈనే ఉంచాలని బోర్డు భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే మార్చి 27న ఐపీఎల్ మొదలవుతుంది. చదవండి: KL Rahul: కెప్టెన్సీతో పాటు భారీ మొత్తం ఆఫర్ చేసిన లక్నో ఫ్రాంచైజీ -
బుల్లి బాయ్ కేసు: నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్
ముంబై: దేశంలో బుల్లి బాయ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన శ్వేత సింగ్(18), మయాంక్ రావత్(20)లకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తు బాంద్రా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని జనవరి 28 వరకు పోలీసులు విచారించనున్నారు. కాగా, దీనిపై నిందితుల తరపు న్యాయవాది ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై జనవరి (17) సోమవారం విచారణ జరగనుంది. బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడైన నీరజ్ బిష్ణోయ్‌తో పాటు శ్వేత, మయాంక్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, నిందితుల తరపు న్యాయవాది, తమ క్లయింట్ల ట్విటర్ ఖాతాను హ్యక్ చేశారని కావాలని ఇరికించారని తెలిపారు. ఇప్పటికే శ్వేత, మయాంక్‌లను ఉత్తరాఖండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు విశాల్ కుమార్‌ను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. విశాల్‌కు కోవిడ్ పాజిటివ్ తేలడంతో అతడిని ముంబైలోని కలీనా క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న నీరజ్‌ను భోపాల్‌లోని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇతడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పదిహేను సంవత్సరాల వయసులోనే హ్యకింగ్ నేర్చుకున్నట్లు తెలిపాడు. ఈ బుల్లి బాయ్ యాప్‌తో మహిళలను మార్ఫింగ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘కోటి రూపాయలు ఇవ్వకపోతే ఏసీబీతో దాడి చేయిస్తా’ -
వేలానికి 8 ఆయిల్, గ్యాస్ బ్లాకులు
న్యూఢిల్లీ: ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద నిర్వహించే ఏడో విడత వేలంలో 8 చమురు, గ్యాస్ బ్లాకులను విక్రయానికి ఉంచుతున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) వెల్లడించింది. బిడ్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన ప్రకటనలో ఈ విషయం తెలిపింది. వేలం వేస్తున్న బ్లాకులు.. మొత్తం అయిదు రాష్ట్రాల్లో విస్తరించి ఉండగా, సింహభాగం బ్లాకులు అస్సాంలో ఉండనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నాటికి బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 6తో ముగిసిన ఆరో విడత వేలంలో 21 బ్లాకులు విక్రయానికి ఉంచగా మూడు కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాతో పాటు ప్రైవేట్ రంగ సన్ పెట్రోకెమికల్స్ వేలంలో పాల్గొన్నాయి. 21 బ్లాకుల్లో 18 బ్లాకులకు ఒక్కొక్కటి చొప్పున, 3 బ్లాకులకు రెండు బిడ్లు చొప్పున వచ్చాయి. దేశీయంగా మరింత విస్తీర్ణంలో చమురు, గ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా చమురు దిగుమతుల బిల్లుల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత విధానాలకు భిన్నంగా .. ఆసక్తి గల సంస్థలే చమురు, గ్యాస్ వెలికితీతతకు అనువైన నిర్దిష్ట ఏరియాలను గుర్తించే స్వేచ్ఛ కల్పిస్తూ 2016 నుంచి ఓపెన్ ఎక్రేజ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అటువంటి ప్రాంతాలను ఒక దగ్గర చేర్చి ఏటా రెండు సార్లు వేలం నిర్వహిస్తోంది. సదరు ఏరియాను గుర్తించిన సంస్థకు బిడ్డింగ్‌లో అదనంగా 5 పాయింట్లు కేటాయిస్తోంది. అలాగే రాయల్టీ రేట్ల తగ్గింపు, మార్కెటింగ్.. ధరలపరమైన స్వేచ్ఛనివ్వడం మొదలైన వెసులుబాటు కల్పిస్తోంది. ఈ విధానంలో నిర్వహించిన తొలి విడత వేలంలో మినహా మిగతా రౌండ్లలో ప్రైవేట్ కంపెనీలు అంతగా పాల్గొనలేదు. -
గ్రామ ప్రజల పాట.. 44 లక్షలకు సర్పంచ్ పదవి!
భోపాల్: గ్రామంలో సర్పంచ్ పదవి చేపట్టాలంటే ఎన్నికలు జరిపి ఓటర్లు ఎన్నుకోవాలన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఎక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగిన ఇదే తంతు నడుస్తుతుంది. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం ఇందుకు భిన్నంగా తమ సర్పంచ్‌ని ఎన్నుకున్న పద్ధతిని వింటే షాక్ అవుతారు. వాళ్లు ఓట్లతో కాదు నోట్లతో తమ సర్పంచ్‌ని ఎన్నుకున్నారు. ఎలా అంటారా? వివరాల్లోకి వెళ్తే.. అశోక్ నగర్ జిల్లా భతౌలి గ్రామ పంచాయతీ ప్రజలు డిసెంబరు 14న, రాధా-కృష్ణ దేవాలయంలో సమావేశాన్ని నిర్వహించారు, అక్కడ కొత్తగా గ్రామ సర్పంచ్‌ని ఎంపిక చేసేందుకు వేలం పాటను నిర్వహించారు. వినడానికి వెరైటీగా ఉన్నా ఇది నిజమేనండి. కాగా ఈ వేలం పాటలో మొత్తం ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారు. చివరకు సౌభాగ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి వేలం పాటలో గెలిచి పదవిని చేజెక్కించుకున్నాడు. వేలం పాటు రూ.21 లక్షలతో వేలం ప్రారంభం కాగా చివరకు రూ.44 లక్షల వరకు చేరింది. నిబంధనలు ప్రకారం ఎన్నికల సమయానికి సౌభాగ్ సింగ్ అంత మొత్తాన్ని జమచేయాల్సి ఉంటుంది. కారణం ఏదైనా అతను డబ్బును సమకూర్చలేకుంటే.. అతని తర్వాత వేలం పాటలో ఎక్కువ పాడిన వ్యక్తిని గ్రామ సర్పంచ్ గా ఎన్నుకుంటారు. గ్రామస్తులు ఇలా చేస్తుంటే అక్కడి ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎన్నికైనా వాళ్లకే తాము సర్పంచ్‌గా గుర్తిస్తామని చెప్పారు. చదవండి: Victory Hug: నాన్నా.. నీ రాక మాకెంతో సంతోషం -
ఒలంపిక్స్, పారాలింపిక్స్ క్రీడాకారుల వస్తువుల వేలం
-
40 ఎకరాలు అమ్మితే రూ.2వేల కోట్లు వచ్చాయి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో 40 ఎకరాలు అమ్మితే రూ.2వేల కోట్లు వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కబ్జాలకు గురయ్యే అవకాశమున్నచోటే భూములు విక్రయిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూములు అమ్మిన డబ్బులు పేదల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. కొందరు సన్నాసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత బీమా పథకం రెండు, మూడు నెలల్లో అమలు చేస్తామన్నారు. ధరణి ఒక విప్లవం... రైతుల బాధలు తొలగిపోయాయని పేర్కొన్నారు. ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నీటివాటాపై లోక్‌సభ, రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని చెప్పారు. -
ముగిసిన స్పెక్ట్రం వేలం.. టాప్‌లో జియో
సాక్షి, ఢిల్లీ: రెండు రోజుల పాటు సాగిన టెలికం స్పెక్ట్రం వేలం మంగళవారం ముగిసింది. టెలికం సంస్థలు.. వివిధ బ్యాండ్లలో 855.60 మెగాహెట్జ్ పరిమాణం స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. దీని విలువ సుమారు రూ. 77,815 కోట్లని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 57,123 కోట్ల విలువ చేసే స్పెక్ట్రం, భారతీ ఎయిర్టెల్ రూ. 18,699 కోట్ల స్పెక్ట్రం కొనుగోలు చేశాయి. వొడాఫోన్ ఐడియా అయిదు సర్కిళ్లలో స్పెక్ట్రం దక్కించుకుంది. దీని విలువ రూ. 1,993.40 కోట్లని అన్షు ప్రకాష్ తెలిపారు. వేలానికి ఉంచిన స్పెక్ట్రంలో దాదాపు 60 శాతం అమ్ముడైందని, చాలా మటుకు బిడ్లు కనీస రేటుకే దాఖలయ్యాయని పేర్కొన్నారు. ఇక గత వేలంలో అమ్ముడు కాని 700 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంపై టెల్కోలు ఈసారి కూడా ఆసక్తి చూపలేదు. బేస్ రేటు భారీగా ఉందనే అభిప్రాయమే ఇందుకు కారణం. 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం కూడా అమ్ముడు కాలేదు. (భారీగా పెరిగిన అదానీ, అంబానీల సంపద) మెరుగైన కవరేజీకి ఉపయోగకరం.. 5జీ సర్వీసులకు కూడా ఉపయోగపడేలా తాము 488.35 మెగాహెట్జ్ స్పెక్ట్రం తీసుకున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. దేశీయంగా డిజిటల్ సేవలను మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడగలదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, వివిధ బ్యాండ్లలో 355.45 మెగాహెట్జ్ పరిమాణంలో స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కవరేజీని మెరుగుపర్చుకునేందుకు, భవిష్యత్‌లో 5జీ సేవలు అందించేందుకు కూడా ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. ‘3.5 గిగాహెట్జ్ బ్యాండ్‌తో పాటు 700 మెగాహెట్జ్ బ్యాండ్ కూడా కలిస్తే టాప్ డిజిటల్ దేశాల్లో ఒకటిగా భారత్ కూడా ఎదగవచ్చు. కాబట్టి ఈ బ్యాండ్ల రిజర్వ్ ధర సముచితంగా ఉండేలా చూడటంపై సత్వరం దృష్టి సారించాలి‘ అని తెలిపింది. మరోవైపు, తమ కంపెనీల విలీనానంతరం కొన్ని సర్కిళ్లలో సర్వీసులను మెరుగుపర్చుకోవడానికి అవసరమైన స్పెక్ట్రంను సమకూర్చుకునేందుకు ఈసారి వేలాన్ని ఉపయోగించుకున్నట్లు వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తెలిపింది. టెలికం రంగం 5జీ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో దానికి అవసరమయ్యే స్పెక్ట్రం .. సముచిత రేటుకే అం దుబాటులోకి రాగలదని ఆశిస్తున్నట్లు పేర్కొంది. (పెట్రో భారం : త్వరలోనే శుభవార్త?!) -
ఈ గొర్రె రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు
ఈడిన్‌బర్గ్ : ఈ గొర్రె రేటు ఎంతో తెలిస్తే మనం నిజంగా నోరెళ్ల బెడతాము. ఓ గొర్రె ఇంత ఖరీదా? అని కచ్చితంగా అనుకుంటాం. గురువారం స్కాట్లాండ్, లనార్క్‌లో జరిగిన స్కాటిష్ లైవ్‌స్టాక్ వేలంలో డబుల్ డైమండ్ అనే గొర్రె ఏకంగా 3.5 కోట్ల రూపాయల ధర (£3,65,000) పలికింది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెగా పేరు సంపాదించింది. అంతకు ముందు 2,31,000 స్టెర్లింగ్ పౌండ్లపై ఉన్న రికార్డును డైమండ్ బ్రేక్ చేసింది. డైమండ్ తర్వాతి స్థానంలో 68 వేల స్టెర్లింగ్ పౌండ్లతో హెక్సెల్ డ్జాంగో అనే గొర్రె నిలిచింది. ( ఆ ఏనుగులకు గంజాయి.. ఎందుకంటే?..) చెషైర్, స్టాక్‌పోర్టుకు చెందిన ప్రముఖ బ్రీడర్ చార్లీ బోడెన్‌కు చెందిన గొర్రెలలో డైమండ్ ఒకటి. టెక్సెల్ జాతికి చెందిన ఈ గొర్రెలు నెదర్లాండ్‌లోని టెక్సెల్ ప్రాంతానికి చెందినవి. యూకేలో వీటిని మాంసం కోసం ఎక్కువగా బ్రీడింగ్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఈ గొర్రెలు 100 స్టెర్లింగ్ పౌండుల ధర పలుకుతుంటాయి. అధిక నాణ్యత కలిగిన గొర్రెలను మాత్రమే బీడింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. -
వేలానికి కింగ్ జార్జి III వాచ్
లండన్: రాజులు వాడిన వస్తువులను, అప్పుడు వాడుకలో ఉన్న అలంకార వస్తువులను, రాజుల చరిత్రను తెలిపే మాన్యుస్క్రిప్ట్‌లను కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. వీటిని కోట్లు కుమ్మరించి కొనుక్కుంటూ ఉంటారు. త్వరలో ప్రముఖ ఆక్షన్ కంపెనీ సోథెబే.. కింగ్ జార్జి III కోసం తయారుచేసిన అత్యంత విలువైన గడియారాన్ని, హొరాషియో నెల్సన్, ఎమ్మా హామిల్టన్ కు రాసిన ప్రేమలేఖలు, మొదటి ప్రపంచ యుద్దం నాటి ఆల్బమ్ వీటన్నింటిని వేలం వేయనుంది. వీటి విలువ 5 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా కింగ్ జార్జి III, నెపోలియన్ కాలం నాటివి ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకే వ్యక్తి దగ్గర ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన బంగారు గడియారాన్ని ప్రముఖ వాచ్‌మేకర్ అబ్రహం-లూయిస్ బ్రెగ్యూట్ 1808లో జార్జ్ III కోసం తయారు చేశారు. ఇది దాదాపు మిలియన్ డాలర్లు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. (సహాయం కోసం వేలం) జి అండ్ ఆర్ అనే అక్షరాలతో చెక్కబడిన ఒక ప్లేట్ ఉంది. ఇది బ్రుగెట్ సృష్టించిన వాటిలో ప్రత్యేకమైనది. దానిని అప్పట్లో 4,800 ఫ్రెంచ్ ఫ్రాంక్‌లకు అమ్మారు. ఆ సమయంలో భారీ మొత్తాన్ని చెల్లించడంలో రాజు విఫలమయ్యాడు. ఈ వేలంలో లభించనున్న మరో ముఖ్యమైన వస్తువులలో ఒకటి కింగ్ నెల్సన్ తన ప్రేయసి హామిల్టన్‌కు రాసిన 100కు పైగా ప్రేమ లేఖలు ఉన్నాయి. వీటిలోని ఒక లేఖలో తన బాధను వ్యక్తపరుస్తూ.. ‘నేను ఆనందంగా లేను, మనం దూరంగా ఉండటం నాకు బాధను మాత్రమే మిగులుస్తుంది’ అని రాసివుంది. దీనికి 12000 పౌండ్ల వరకు పలికే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు మొదటి ప్రపంచానికి సంబంధించిన అనేక సందేశాలు, డ్రాయింగ్లు, కవితలు ఉన్న బ్రిటీష్ ఆల్బమ్ ఒకటి ఉంది. వీటితో పాటు మరెన్నో విలువైన వస్తువులు ఈ వేలంలో లభించనున్నాయి. జూలై 8-15 వరకు ఈ వేలం నిర్వహించనున్నారు. (వేలానికి రాహుల్ ప్రపంచకప్ బ్యాట్) -
సహాయం కోసం వేలం
కరోనా వల్ల ప్రపంచం ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రభావం అందరి మీదా పడింది. ఈ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎవరికి తోచిన స్థాయిలో వారు సహాయం చేస్తున్నారు. సినిమా స్టార్స్ కుడా విరాళాలు ఇస్తూ, ఫ్యాన్స్‌ని సహాయం చేయమని పిలుపునిస్తూ ఉన్నారు. తాజాగా నిత్యా మీనన్ కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాలకు సహాయం చేయదలచుకున్నారు. అందుకోసం ఓ భిన్నమైన దారిని ఎంచుకున్నారు. గతంలో ఓ ఫ్యాషన్ షో కోసం తాను వేసుకున్న డిజైనర్ డ్రెస్‌ని వేలం వేస్తున్నారు నిత్య. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ఓ ఫౌండేషన్ ద్వారా పలు గ్రామాలకు సహాయం చేయాలనుకుంటున్నారు. (ఓ రైటర్ కథ) -
వేలానికి రాహుల్ ప్రపంచకప్ బ్యాట్
న్యూఢిల్లీ: భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ‘నేను నా క్రికెట్ వస్తువులను టీమిండియా మద్దతు బృందం ‘భారత్ ఆర్మీ’కి విరాళంగా ఇస్తాను. ఇందులో ప్రపంచకప్‌లో వాడిన బ్యాట్‌తో పాటు టెస్టు, వన్డే, టి20 జెర్సీలు, గ్లౌజులు, ప్యాడ్లు, హెల్మెట్లు ఉన్నాయి. వారు వీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. వేలంలో సమకూరిన సొమ్మును వెనుకబడిన చిన్నారులను ఆదరిస్తోన్న ‘అవేర్’ ఫౌండేషన్‌కు అందజేస్తారు. సోమవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. అందరూ ఇందులో పాల్గొని చిన్నారులకు సహాయపడండి’ అని రాహుల్ పేర్కొన్నాడు. -
వేలం పేరుతో వసూళ్ల దందా!
ఎమ్మినూరు పట్టణ నడిబొడ్డున సోమప్ప సర్కిల్లో మున్సిపల్ క్యాంటీన్‌ను లీజుకు తీసుకొన్న ఓ టీడీపీ నేత మున్సిపాలిటీకి జీఎస్టీతో కలిపి రూ.27వేలు అద్దె చెల్లిస్తున్నాడు. దానిని పార్టులుగా విభజించి రెండు బట్టల దుకాణాలు, ఓ హోటల్, రెండు డబ్బా అంగళ్లు, స్ట్రీట్ వ్యాపారాలకు సబ్‌లీజుకిచ్చి నెలనెల రూ.1.5 లక్షలకుపైగా అదనపు ఆదాయం పొందుతున్నాడు. సుమారు రూ.20 లక్షలకుపైగా అడ్వాన్సు రూపంలో పొందాడు. కూరగాయల మార్కెట్‌గేటు దగ్గర ఓ బడావ్యక్తి మున్సిపల్ షాపును లీజుకు తీసుకొని మున్సిపాలిటీకి నెలకు రూ.4,300 అద్దె చెల్లిస్తున్నాడు. అదే షాపును రెండు పార్టులుగా విభజించి సబ్లీజుకివ్వటంతో ఆ వ్యక్తికి నెలకు రూ.65 వేలకుపైగా ఆదాయం అందుతోంది. ఇలా బినామిలతో మున్సిపల్ షాపులను తమ గుప్పెట్లో ఉంచుకున్నవారు 40 శాతంపైగానే ఉన్నట్లు మున్సిపల్ అధికారుల పరిశీలనలో తేలింది. మున్సిపల్ షాపుల్లో బినామిలదే అగ్రతాంబూలం. కర్నూలు, ఎమ్మిగనూరు: లీజు గడువు ముగిసిన షాపుల వేలాలు వేసేందుకు ఎమ్మిగనూరు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు శుక్రవారం వేలాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజకీయ, వ్యాపార దళారులకు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకొనేందుకు పావులు కదిపినట్లు సమాచారం. గతంలో తక్కువ అద్దెకు లీజు దక్కించుకొని సబ్ లీజులకిచ్చి మున్సిపల్ ఆదాయానికి గండికొట్టిన వ్యక్తులకే మళ్లీ షాపులు దక్కేలా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అందుకు నజరానాగా రూ.1.2 కోట్లకుపైగా దళారులు వసూలు చేసినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ఇందులో మున్సిపల్, రెవెన్యూ అధికారులకు కూడా వాటా ఉందనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షకు తగ్గిన గుడ్‌విల్.. ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని ఏ,బీ,సీ బ్లాక్‌లలోని 49 షాపులకు, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్లలోని 19 షాపులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. 25 ఏళ్ల లీజుగడువు పూర్తయిన ఏ, బీ, సీ బ్లాక్‌లోని షాపులకు మళ్లీ వేలాలు నిర్వహించాలని 2007లోనే మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఆ నోటీసులను సవాల్ చేస్తూ షాపుల లీజుదారులు హైకోర్టులో కేసు నడిపారు. ఇటీవల మున్సిపల్ అధికారులను కలసి తాము కేసు విత్‌డ్రా చేసుకుంటున్నట్లు వారు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వటంతో అధికారులు షాపులకు వేలాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే రాజకీయ, వ్యాపార దళారులు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకొనేందుకు పావులు కదిపారు. మొదట్లో రూ.2 లక్షలను గుడ్‌విల్ పాటగా చూపుతూ వేలాలు నిర్వహించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. దీనివల్ల మున్సిపల్ ఆదాయం భారీగా పెరుగుతోందని అందరూ భావించారు. కానీ రాజకీయ దళారులు పైరవీలు చేయటంతో రూ.2 లక్షల గుడ్‌విల్ రూ. లక్షకు తగ్గిపోయింది. సుమారు రూ.68 లక్షలు మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ప్రవేటు వ్యుక్తుల షాపుల లీజు, మున్సిపల్ షాపుల సబ్లీజులే రూ.30 వేలకు పైగానే ఉన్నా అధికారులు మాత్రం పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వేలాల్లో మున్సిపల్ షాపులకు మాత్రం రూ.2,000 నుంచి రూ.13,200 వరకు అద్దె నిర్ణయించారు. వేలంపాట దక్కాలంటేఅదనంగా రూ.2 లక్షలు! ‘మున్సిపాలిటికీ చెల్లించాల్సిన గుడ్‌విల్‌ను రూ.లక్ష తగ్గించామని, షాపుల లీజులను కూడా నామినల్ రేట్లకే మార్చామని’ చెబుతూ దళారులు వసూళ్ల పర్వానికీ తెరలేపినట్లు తెలుస్తోంది. ‘వేలంపాట రోజు ఎవరిషాపు వారికే దక్కేలా ఏర్పాట్లు జరిగాయని, ఎవరైనా పోటీపడితే మున్సిపల్ అధికారులు వేలాలు వాయిదావేస్తూ పోతారని, ఎవరూ రాని సందర్భం చూసి మీకే షాపులు వచ్చేలా ఏర్పాట్లు జరిగాయంటూ ’ పేర్కొంటుండటం పట్టణంలో హాట్‌టాపిక్ అయ్యింది. ఇందుకుగాను రూ.2 లక్షలు అదనంగా ఇవ్వాలని, అన్నీ తామే చూసుకొంటామని వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. కాగా ఇంటెలిజెన్సు, ఎస్బీ, ఏసీబీ అధికారులు సైతం అక్రమ వసూళ్ల పర్వాన్ని ఆరాతీసి ఉన్న తాధికారులకు సమాచారం అందించడంతో మున్సిపల్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. నేడు మున్సిపల్షాపులకు వేలాలు ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 68 షాపులకు శుక్రవారం వేలంపాట నిర్వహిస్తున్నారు. వేలం పాటలో పాల్గొనే వారు రూ.లక్ష గుడ్‌విల్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆయా షాపుల లీజు అద్దెను మున్సిపల్ అధికారులు ముందుగానే నిర్ణయించారు. అక్రమ వసూళ్లతో సంబంధం లేదు మున్సిపల్ షాపులకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నాం. ఆశావాహులు ఎవరైనా వేలంపాటలో పాల్గొనవచ్చు. రాజకీయ దళారులు బయటచేపట్టే అక్రమ వసూళ్లతో తమకు సంబంధంలేదు. – జి.రఘునాథ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
‘నల్లబంగారం’ ఇక జిగేల్!
న్యూఢిల్లీ: దేశంలో అపారంగా బొగ్గు నిక్షేపాలు ఉండి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కోల్ ఇండియా ఒక్కటీ దేశ అవసరాల్లో అధిక శాతం తీరుస్తోంది. అయినా, అవసరానికంటే ఉత్పత్తి తక్కువగానే ఉంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా దిగుమతుల భారానికి కళ్లెం వేసేందుకు ప్రైవేటు రంగాన్ని ఇందులోకి అనుమతించాలని కేంద్ర సర్కారు లోగడే నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్ల కాలంలో 200 బొగ్గు గనులను (బ్లాకులు) వాణిజ్య ప్రాతిపదికన తవ్వితీసేందుకు వేలం వేయనుంది. గరిష్టంగా 400 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా 2024 నాటికి విద్యుత్ సంస్థలు బొగ్గు దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నది అంచనా. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. త్వరలోనే వేలం..: పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు గాను మొదటి విడతగా 40 బొగ్గు బ్లాకులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం వేలానికి తీసుకురానుంది. వీటి గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1–50 మిలియన్ టన్నుల మధ్య ఉండనుంది. వాణిజ్య బొగ్గు గనుల వేలానికి సంబంధించి బిడ్డింగ్ నిబంధనలను ఈ నెలాఖరుకు విడుదల చేసి, వచ్చే నెలలో భాగస్వాముల అభిప్రాయాలను స్వీకరించనున్నట్టు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వేలానికి వచ్చే బ్లాకుల్లో కొన్నింటి గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం 30–50 మిలియన్ టన్నుల మధ్య ఉంటుందని తెలిపారు. కొన్ని బ్లాకుల్లో నిల్వల సమాచారం కచ్చితంగా గుర్తించగా, మరికొన్నింటిలో పాక్షికంగానే అది జరిగిందన్నారు. వీటి వల్ల దేశీయంగా బొగ్గు ఉత్పత్తి లోటు కొంత వరకు తీరుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో 235 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతులు జరిగాయి. వీటిల్లో 125 మిలియన్ టన్నుల మేర థర్మల్ బొగ్గు (54 శాతం) దిగుమతులే కావడం గమనార్హం. ఐరన్, స్టీల్ తయారీకి కోకింగ్ కోల్ అవసరం అవుతుంది. మన దేశంలో కోకింగ్ కోల్ లభ్యత లేనందున ఐరన్, స్టీల్ కంపెనీలకు దిగుమతే మార్గం. కానీ, విద్యుత్ తయారీకి వినియోగించే థర్మల్ బొగ్గును దిగుమతి చేసుకోకుండా దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆదాయంలో వాటా..: వేలానికి పరిగణిస్తున్న వాటిల్లో చెండిపడ–1, 2, మదన్‌పూర్ నార్త్, ఫతేపూర్, ఫతేపూర్ ఈస్ట్, మహానంది, మచ్చకట బ్లాకులు ఉన్నట్టు ఆ అధికారి వెల్లడించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి నిర్దేశిత వాటాను లీజుదారులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఈ బొగ్గు బ్లాకుల ఉత్పత్తిని త్వరగా ఆరంభించేందుకు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వనుంది. నాలుగు, ఐదో దశ వేలంలో పరిశ్రమల నుంచి స్పందన ఆశించిన మేర లేదు. దీంతో మాజీ సీవీసీ ప్రత్యూష్ సిన్హా సిఫారసుల మేరకు ఆదాయంలో వాటా ప్రాతిపదికన బొగ్గు బ్లాకులను వేలం వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వేలంలో బొగ్గు గనులు దక్కించుకున్న సంస్థలు, నిర్దేశిత కాల వ్యవధి కంటే ఏడాదిముందే ఉత్పత్తి ప్రారంభిస్తే దానికి ప్రోత్సాహకంగా ఆదాయంలో వాటాను 10% ప్రభుత్వం తగ్గించుకోనుంది. 125 టన్నులకు కోల్ ఇండియా ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా గత ఏడాది కాలంలో 16 బొగ్గు బ్లాకులను సొంతం చేసుకోగా, వీటి సాయంతో సంస్థ ఉత్పత్తి 125 మిలియన్ టన్నులకు చేరనుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ బ్లాకుల్లో ఉత్పత్తి మూడు నుంచి ఆరేళ్లలో ప్రారంభమవుతుందని చెప్పారు. ‘‘2023–24 నాటికి ఒక బిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్య లక్ష్యాన్ని చేరుకునేందుకు కంపెనీకి సాయపడుతుంది. ఇటీవలి కేటాయించిన వాటిల్లో కొన్నింటిలో 2–3 ఏళ్లు, ఇతర బ్లాకుల్లో ఉత్పత్తికి మరింత సమయం తీసుకుంటుంది’’ అని కోల్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఈ బ్లాకుల్లో వెలికితీత కార్యకలాపాలను కోల్ ఇండియా త్వరగా ప్రారంభించాలని కేంద్రం కోరుకుంటోంది. -
మోదీ కానుకల వేలం
న్యూఢిల్లీ: ‘నమామి గంగే’ ప్రాజెక్టు కోసం నిధుల సేకరణలో భాగంగా గత సంవత్సరం ప్రధాని నరేంద్రమోదీ అందుకున్న కానుకల వేలం ప్రక్రియ మొదలైంది. బహుమతుల ప్రదర్శన, వేలం పాటను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ శనివారం ప్రారంభించారు. శాలువాలు, తలపాగాలు, జాకెట్లు సహా 2,700కుపైగా వస్తువులు ప్రదర్శనలో ఉంటాయని, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో ఈ వస్తువులు శనివారం నుంచి అక్టోబర్ 3 వరకు www.pmmementos.gov.in లో వేలం కొనసాగుతుందని తెలిపారు. ఎన్జీఎంఏలో ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వేలం జరుగుతుందని, ప్రస్తుతం స్మృతి చిహ్నాలు పేరుతో 500 వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయని పటేల్ తెలిపారు. ‘ప్రతి వారం ప్రదర్శించబడే మెమెంటోలు మార్చుతాం. పెయింటింగ్స్, మెమెంటోలు, శిల్పాలు, శాలువాలు, తలపాగాలు, సంప్రదాయ వాయిద్యాలతో సహా అనేక వస్తువులను ప్రదర్శిస్తాం’ అని చెప్పారు. మెమెంటోల అత్యల్ప ధర రూ. 200 కాగా, అత్యధిక ధర రూ. 2.5 లక్షలు అని పటేల్ తెలిపారు. ‘నేను అందుకున్న బహుమతులను వేలంలో పెడతా. ప్రజలు ఈ వేలం పాటలో పాల్గొనాలని కోరుతున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. -
గోల్కొండ వజ్రానికి రూ.45 కోట్లు
న్యూయార్క్: భారత్‌ను పాలించిన మహారాజులు, మొఘలులు వినియోగించిన వజ్రాభరణాలు న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ వేలంపాటలో కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రఖ్యాత క్రిస్టీస్ వేలంసంస్థ ఈ వేలం నిర్వహించింది. గోల్కొండలో దొరికిన మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం, నిజాం ధరించిన గొలుసు, ఆర్కాట్ నవాబుకు చెందిన వజ్రం, స్వర్ణాభరణాలు, కత్తులు, రత్నాలుసహా దాదాపు 400 పురాతన వస్తువులను వేలం వేశారు. ‘మహారాజులు, మొఘలుల వైభవం’ పేరిట నిర్వహించిన ఈ వేలంలో క్రిస్టీస్ సంస్థకు రూ.756 కోట్లు వచ్చాయి. భారతీయ నగలు, కళాఖండాలు గతంలో ఎన్నడూ ఇంతటి భారీ ధరకు అమ్ముడుపోలేదని క్రిస్టీస్ పేర్కొంది. 2011లో ఎలిజబెత్ రాణి సేకరించిన వస్తువులు రూ.14.4 కోట్ల ధర పలికాయి. గోల్కొండలో దొరికిన 52.58 క్యారెట్ల బరువైన మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం రూ.45 కోట్లు పలికింది. ఆర్కాట్ నవాబుకు చెందిన 17 క్యారెట్ల గోల్కొండ వజ్రం(ఆర్కాట్–2) రూ.23.5 కోట్లకు అమ్ముడుపోయింది. హైదరాబాద్ నిజాం ధరించిన 33 వజ్రాలు పొదిగిన హారం రూ. 17 కోట్లు పలికింది. ఇండోర్ మహారాజు యశ్వంత్ రావ్ హాల్కర్ 2 ధరించిన రత్నాలతో కూడిన గొలుసు రూ. 1.44 కోట్లు, జైపూర్ రాజమాత గాయత్రీ దేవి ధరించిన వజ్రపుటుంగరం రూ. 4.45 కోట్లు, 1680–1720 కాలానికి చెందిన వజ్రాలు పొదిగిన హుక్కా సెట్ రూ.5.3కోట్లు, సీతారామాంజనేయుల ప్రతిమలున్న మరో హారం రూ. 5.12 కోట్లు పలికాయి. 5 వరసల ముత్యాల గొలుసు రూ.11.8 కోట్లకు, వజ్రాలహారం రూ. 1.5 కోట్లకు అమ్ముడుపోయాయి. ఖతార్‌కు చెందిన రాజకుటుంబం సేకరించిన ఈ ఆభరణాలను క్రిస్టీస్ వేలం వేసింది. మొఘల్ మహారాజు షాజహాన్ వాడిన బాకు రూ.23.4 కోట్లు పలికింది. హైదరాబాద్ నిజాం నవాబు వాడిన కత్తి రూ. 13.4 కోట్లు పలికింది. భారత్‌కు చెందిన ఒక కత్తి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. భారత్ సహా 45 దేశాలకు చెందిన ఔత్సాహికులు ఈ వేలంలో పాల్గొన్నారు. జైపూర్, ఇండోర్, బరోడా రాజవంశీకులకు చెందిన ఆభరణాలు, వస్తువులనూ ఈ వేలంలో పెట్టారు. షాజహాన్ కత్తి మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం -
అమెరికాలో వేలానికి షాజహాన్ కత్తి
న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన వజ్రాలు పొదిగిన కత్తి, కపుర్తలా రాజు జగత్జిత్ సింగ్‌కు చెందిన ఖడ్గం సహా 400 పురాతన వస్తువులను జూన్ 19న వేలం వేయనున్నట్లు క్రీస్టీ సంస్థ తెలిపింది. సింహం తలలాంటి పిడితో వజ్రాలు పొదిగిన జగత్జిత్ సింగ్ ఖడ్గం ప్రారంభధర రూ.69 లక్షలుగా ఉంటుందని వెల్లడించింది. అలాగే మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన కత్తికి ఈ వేలంలో రూ.17.36 కోట్లు దక్కవచ్చని భావిస్తున్నారు. జైపూర్‌రాజు సవాయ్ మాన్సింగ్–2 భార్య రాణి గాయత్రీదేవికి చెందిన వజ్రాలు, ముత్యాలు పొదిగిన హారానికి రూ.10.42 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. పట్టాభిషేకం సందర్భంగా నిజాం రాజులు వాడిన వజ్రాలు, రత్నాలు, కెంపులు పొదిగిన ఖడ్గం 6.94 కోట్ల నుంచి రూ.10.42 కోట్ల వరకూ దక్కవచ్చని క్రీస్టీ సంస్థ పేర్కొంది. వీటితో పాటు టిప్పు సుల్తాన్ లాకెట్‌తో పాటు పలు ఆభరణాలు, వజ్రాలు, అలంకరణ వస్తువులను జూన్ 14–18 మధ్య న్యూయార్క్‌లో ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పింది.