సాక్షి, ఢిల్లీ: రెండు రోజుల పాటు సాగిన టెలికం స్పెక్ట్రం వేలం మంగళవారం ముగిసింది. టెలికం సంస్థలు.. వివిధ బ్యాండ్లలో 855.60 మెగాహెట్జ్ పరిమాణం స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. దీని విలువ సుమారు రూ. 77,815 కోట్లని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 57,123 కోట్ల విలువ చేసే స్పెక్ట్రం, భారతీ ఎయిర్‌టెల్ రూ. 18,699 కోట్ల స్పెక్ట్రం కొనుగోలు చేశాయి. వొడాఫోన్ ఐడియా అయిదు సర్కిళ్లలో స్పెక్ట్రం దక్కించుకుంది. దీని విలువ రూ. 1,993.40 కోట్లని అన్షు ప్రకాష్ తెలిపారు. వేలానికి ఉంచిన స్పెక్ట్రంలో దాదాపు 60 శాతం అమ్ముడైందని, చాలా మటుకు బిడ్లు కనీస రేటుకే దాఖలయ్యాయని పేర్కొన్నారు. ఇక గత వేలంలో అమ్ముడు కాని 700 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంపై టెల్కోలు ఈసారి కూడా ఆసక్తి చూపలేదు. బేస్ రేటు భారీగా ఉందనే అభిప్రాయమే ఇందుకు కారణం. 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం కూడా అమ్ముడు కాలేదు. (భారీగా పెరిగిన అదానీ, అంబానీల సంపద)
మెరుగైన కవరేజీకి ఉపయోగకరం..
5జీ సర్వీసులకు కూడా ఉపయోగపడేలా తాము 488.35 మెగాహెట్జ్ స్పెక్ట్రం తీసుకున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. దేశీయంగా డిజిటల్ సేవలను మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడగలదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, వివిధ బ్యాండ్లలో 355.45 మెగాహెట్జ్ పరిమాణంలో స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కవరేజీని మెరుగుపర్చుకునేందుకు, భవిష్యత్‌లో 5జీ సేవలు అందించేందుకు కూడా ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. ‘3.5 గిగాహెట్జ్ బ్యాండ్‌తో పాటు 700 మెగాహెట్జ్ బ్యాండ్ కూడా కలిస్తే టాప్ డిజిటల్ దేశాల్లో ఒకటిగా భారత్ కూడా ఎదగవచ్చు. కాబట్టి ఈ బ్యాండ్ల రిజర్వ్ ధర సముచితంగా ఉండేలా చూడటంపై సత్వరం దృష్టి సారించాలి‘ అని తెలిపింది. మరోవైపు, తమ కంపెనీల విలీనానంతరం కొన్ని సర్కిళ్లలో సర్వీసులను మెరుగుపర్చుకోవడానికి అవసరమైన స్పెక్ట్రంను సమకూర్చుకునేందుకు ఈసారి వేలాన్ని ఉపయోగించుకున్నట్లు వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తెలిపింది. టెలికం రంగం 5జీ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో దానికి అవసరమయ్యే స్పెక్ట్రం .. సముచిత రేటుకే అం దుబాటులోకి రాగలదని ఆశిస్తున్నట్లు పేర్కొంది. (పెట్రో భారం : త్వరలోనే శుభవార్త?!)
Comments
Please login to add a commentAdd a comment