న్యూఢిల్లీ: ఈసారి టెలికం స్పెక్ట్రం వేలం ప్రక్రియ రెండు రోజుల్లోనే ముగిసింది. మొత్తం రూ. 96,238 కోట్ల బేస్ ధరతో 800 మెగాహెట్జ్ నుంచి 26 గిగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో 10 గిగాహెట్జ్ స్పెక్ట్రంను వేలానికి ఉంచగా.. ఏడు రౌండ్లలో 141.4 మెగాహెట్జ్ మాత్రమే అమ్ముడైంది. టెల్కోలు సుమారు రూ. 11,340.78 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలు చేశాయి.
ప్రధానంగా గడువు తీరిపోతున్న స్పెక్ట్రంను రెన్యువల్ చేసుకోవడం, కవరేజీని పెంచుకునేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల్లోనే కొనుగోలు చేసేందుకు టెల్కోలు ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణం. భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా స్పెక్ట్రం కొనుగోలు చేసింది. తొలిరోజైన జూన్ 25న (మంగళవారం) అయిదు రౌండ్లు జరగ్గా, రెండో రోజున పెద్దగా స్పందన లేకపోవడంతో వేలం ముగిసినట్లు బుధవారం అధికారులు ప్రకటించారు.
టెల్కోలు తమ సర్వీసులను కొనసాగించడంతో పాటు కార్యకలాపాలను విస్తరించేందుకు కూడా స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈసారి విక్రయానికి ఉంచిన స్పెక్ట్రంలో 12 శాతానికి మాత్రమే బిడ్లు వచ్చాయి. గత వేలంలోనే టెల్కోలు గణనీయంగా స్పెక్ట్రం తీసుకోవడంతో నిర్దిష్ట బ్యాండ్లకు ఈసారి పెద్దగా డిమాండ్ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
900, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లపై ఎక్కువగా ఆసక్తి నెలకొంది. 2022లో జరిగిన స్పెక్ట్రం వేలం బ్లాక్‌బస్టర్‌గా నిల్చింది. అప్పట్లో ఏడు రోజులు సాగిన వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను టెల్కోలు కొనుగోలు చేశాయి. జియో అత్యధికంగా రూ. 88,078 కోట్లతో దాదాపు సగం స్పెక్ట్రంను దక్కించుకుంది.
ఎయిర్‌టెల్ రూ. 6,857 కోట్ల బిడ్..
భారతీఎయిర్‌టెల్ అత్యధికంగా రూ.6,856.76 కోట్లు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రూ. 3,510 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 973.6 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఎయిర్‌టెల్ 97 మెగాహెట్జ్, వీఐఎల్ 30 మెగాహెట్జ్, జియో ఇన్ఫోకామ్ 14.4 మెగాహెట్జ్ దక్కించుకున్నాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఎప్పటికప్పుడు అవసరమైనంత స్పెక్ట్రంను సమకూర్చుకుంటామని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు.
బిహార్, పశ్చిమ బెంగాల్ సర్కిళ్లలో 1,800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేయడం ద్వారా తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు. నిర్దిష్ట మార్కెట్లలో స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు వీఐఎల్ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment