సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేగవంతమైన 5జీ సేవలు అందించే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. త్వరలోనే 5జీ స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. టెలికాం శాఖ మంగళవారం విడుదల చేసిన జాబితా ప్రకారం జూలై 26న 5జీ స్పెక్ట్రమ్ వేలంప్రారంభం కానుంది. ఈ మేరకు దరఖాస్తులను కంపెనీలనుంచి ఇప్పటికే స్వీకరించామని డాట్ వెల్లడించింది.
దరఖాస్తుల ఉపసంహరణకు జూలై 19 వరకు సమయం ఉంది. దీంతో ఇండస్ట్రీ దిగ్గజాలు నువ్వా నేనా అన్నట్టుగా రంగంలోకి దిగిపోయాయి. బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ డేటా నెట్‌వర్క్స్ తోపాటు, టెలికాం దిగ్గజాలు భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా తమ దరఖాస్తులను సమర్పించాయి. ఈ మేరకు టెలికాం డిపార్ట్‌మెంట్ జాబితాను విడుదల చేసింది.
ముఖ్యంగా అదానీ డేటా నెట్‌వర్క్స్, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు 5 జీ వేలాన్ని దక్కించుకుని టెలికాం ఇండస్ట్రీలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోనున్నాయి. 600 ఎంహెచ్‌జెడ్, 700 ఎంహెచ్‌జెడ్, 800 ఎంహెచ్‌జెడ్, 900 ఎంహెచ్‌జెడ్, 1800 ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్, 2300 ఎంహెచ్‌జెడ్, 2500 ఎంహెచ్‌జెడ్, 3300 ఎంహెచ్‌జెడ్, 26 గిగాహెడ్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ను వాడుకునే హక్కును పొందేందుకు 5జీ వేలాన్ని డాట్ నిర్వహిస్తోంది.
రూ. 4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్ వేలం జూలై 26 ప్రారంభం కానుంది. ఈ వేలం పూర్తయితే శరవేగంగా, ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్ స్పీడ్‌తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ స్పీడ్‌తో 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment