న్యూఢిల్లీ: ఐదవ తరం 5జీ నెట్‌వర్క్ ను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న దేశాలలో ఇండియా కూడా ఒకటి. ఇప్పటికే యుఎస్, దక్షిణ కొరియా, యూరప్, చైనా వంటి దేశాలలో 5జీ వాణిజ్య పరంగా కూడా అందుబాటులో ఉంది. మన దేశంలో కూడా జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు 5జీని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో అన్నిటికంటే రిలయన్స్ జీయో ముందు వరుసలో ఉంది. అయితే 5జీ సాంకేతికపై టెలికాం సంస్థలు వివిధ అభిప్రాయాలను తెలిపాయి.(చదవండి: ఇండియన్ పబ్‌జీ(ఫౌజీ) విడుదల రేపే!)
ఈ ఏడాది చివరలో జియో భారతదేశంలో 5జీని విడుదల చేయనున్నామని ప్రకటించినప్పటికీ దేశీయ టెలికాం మార్కెట్ 5జీ సేవలకు మారడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల కాలం పట్టనుందని ఎయిర్‌టెల్ అభిప్రాయపడింది. అదనంగా, భారతదేశంలో 5జీ స్పెక్ట్రం అమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం 5జీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు భారతదేశంలో అందుబాటులో లేవు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా 2021లో 700 మెగా హెర్ట్జ్ నుంచి 2,500 మెగాహెర్ట్జ్ వేలం పాటను నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇంత తక్కువ స్పెక్ట్రమ్ తీసుకొస్తే 5జీపై ప్రతికూల ప్రభావం పడనుందని టెలికం ఆపరేటర్లు తెలిపారు. కంపెనీలు 3,300-3,600మెగా హెర్ట్జ్ మధ్య స్పెక్ట్రం అమ్మకాన్ని తీసుకురావాలని కోరుతున్నాయి.
5జీ ఎప్పుడు రానుంది?
దేశంలో ఐదో తరం (5జీ) సేవలను ప్రారంభించేందుకు టెలికం సంస్థలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. 2021 ద్వితీయార్ధం నుంచి జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. టెల్కో యొక్క కన్వర్జ్డ్ నెట్‌వర్క్ కారణంగా 4జీ నుంచి 5జీ నెట్‌వర్క్‌కు సులభంగా అప్‌గ్రేడ్ చేస్తామని జియో పేర్కొంది. దేశంలో 5జీని తీసుకురావడంపై ఎయిర్‌టెల్ ఇంకా ఎటువంటి ప్రణాళికలను వెల్లడించలేదు. తరువాతి తరం మొబైల్ టెక్నాలజీని దేశవ్యాప్తంగా తీసుకురావడానికి ఎక్కువ సమయం అవసరమని కంపెనీ అభిప్రాయపడింది. వేలం ద్వారా స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే భారతదేశంలో 5జీని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు వోడాఫోన్ ఐడియా ప్రకటించింది.(చదవండి: లాగౌట్ సమస్యపై స్పందించిన ఫేస్‌బుక్)
5జీ డౌన్‌లోడ్ వేగం 690.47ఎంబిపిఎస్
ఈ ఏడాది దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్లు తొమ్మిది రెట్లు పెరిగి.. 38 మిలియన్లకు చేరుతాయని రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ అంచనా వేసింది. వన్‌ప్లస్, యాపిల్ వంటి బ్రాండ్ ఫోన్లు బలమైన పోర్ట్‌ఫోలియోను నమోదు చేస్తుండటమే ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. ఈ టెక్నాలజీ కేవలం స్మార్ట్‌ఫోన్‌కే పరిమితం కాకుండా అన్ని రంగాలలో విప్లవాన్ని సృష్టించనున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. కిందటి తరం మొబైల్ నెట్‌వర్క్‌లతో పోలిస్తే అధిక మల్టీ-జిబిపిఎస్ వేగం, తక్కువ సమయం, ఎక్కువ విశ్వసనీయత 5జీ యొక్క ప్రధాన ప్రయోజనాలు. ఈ 5జీ నెట్‌వర్క్ AR/VR, AI వంటి టెక్నాలజీని మన ఇంటి ముందుకు తీసుకురానుంది. దక్షిణ కొరియాలో 5జీ హై-స్పీడ్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ వేగం 690.47 ఎంబిపిఎస్ గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment