సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరా భివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్లాట్ల వేలానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అభివృద్ధి చేసిన లే ఔట్లలో 120 ప్లాట్లను ఈ–వేలం వేయనున్నారు. సంక్రాంతి తర్వాత ఈ–వేలం ద్వారా ప్లాట్లు వేలం వేయాలని కమిషనర్ టి.చిరంజీవులు నిర్ణయించారు. వీటి ద్వారా దాదాపు రూ.200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆయా లేఔట్లలో ఉన్న 160 స్థలాలను మార్కింగ్ చేసిన అధికారులు వాటిని జీపీఎస్ పద్ధతిన జియో ట్యాగింగ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జీపీఎస్ లొకేటర్ ద్వారా ప్లాట్ల ఆకృతులను తెలుసుకోవాలని భావిస్తున్నారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఈ పనులు రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు. రియల్ బూమ్ ఉన్నప్పుడు 24 లేఅవుట్లను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసింది. వీటిలో ఆరు లేఔట్లలో అన్ని ప్లాట్లు అమ్ముడవగా, మిగిలిన 18 లే ఔట్లలో స్ట్రే బీట్‌లు, కర్వ్, ఓపెన్, గిఫ్ట్ ల్యాండ్ ప్లాట్లు ఉన్నాయి. వీటి విక్రయానికి ప్రభుత్వ అనుమతి వచ్చింది. మియాపూర్, చందానగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, మాదాపూర్, తెల్లపూర్, నల్లగండ్ల తదితర ప్రాంతాల్లోని ఈ లేఔట్లలో ఉన్న ప్లాట్లను గుర్తించి వేలం వేసేం దుకు అధికారుల కమిటీ కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రభుత్వ బేసిక్ విలువ కంటే 1.5 రేట్లు ఎక్కువగా కనీస ధరను పెట్టాలని ప్రతిపాదించారు. కొనుగోలుదారుడు డబ్బులు చెల్లించిన 30 రోజుల్లోపు హెచ్‌ఎండీఏ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కొనుగోలుదారుడు భరించాల్సి ఉంటుందని మెంబర్ ఎస్టేట్ అధికారులు తెలిపారు. ఎప్పుడైనా ఈ వేలం ప్రక్రియను రద్దుచేసే అధికారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు ఉంటుంది.
ఉప్పల్ భగాయత్‌తో కనకవర్షమే
18 లే ఔట్లలో ప్లాట్లు వేలం వేసిన తర్వాత ఉప్పల్ భగాయత్ ప్లాట్ల విక్రయాలపై హెచ్‌ఎండీఏ అధికారులు దృష్టి సారించనున్నారు. 2005లో ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్ కన్జర్వేషన్ అండ్ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఉప్పల్ భగాయత్ రైతుల నుంచి 733 ఎకరాలను సేకరించింది. ఇందులో మెట్రో రైలు డిపో, జలమండలి మురుగు శుద్ధి నీటి కేంద్రం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత కేటాయించింది. మిగిలిన 413.32 ఎకరాల్లో 20,00,468 చదరపు గజాల్లో ఉప్పల్ భగాయత్ పేరు మీద లేఔట్‌ను అభివృద్ధి చేసింది. రాష్ట్ర విభజన, కోర్టు కేసులు, యూఎల్‌సీ వల్ల భూములు కోల్పోయిన రైతుల్లో 1,520 మందికి గత ఏడాది మార్చిలో లాటరీ రూపంలో ప్లాట్లు కేటాయించారు. మిగిలిన 1,25,963 చదరపు అడుగుల్లో ఉన్న ప్లాట్లను ఇప్పుడు విక్రయించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. గజానికి ధరను రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు నిర్ణయించారు. దాదాపు 350 నుంచి రూ.500 కోట్ల వరకు హెచ్‌ఎండీఏకు ఆదాయం రానుంది.
హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలానికి వేళాయె!
Published Fri, Jan 12 2018 1:52 AM | Last Updated on Fri, Jan 12 2018 1:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment