Plot
-
గావస్కర్ ఉపయోగించని ప్లాటు రహానేకు
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌కు గతంలో కేటాయించిన స్థలాన్ని వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేకు బదలాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలోని ఖరీదైన బాంద్రా ప్రాంతంలో 2000 చదరపు మీటర్ల (2391 గజాలు) స్థలాన్ని రహానేకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రీడాభివృద్ధి కోసం ఈ స్థలాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ స్థలాన్ని 1988లో గావస్కర్‌కు కేటాయించారు. ఇండోర్ క్రికెట్ ట్రెయినింగ్ అకాడమీ కోసం లీజుకు ఇచ్చారు. కానీ 30 ఏళ్లకుపైగా గావస్కర్ ఈ స్థలాన్ని సది్వనియోగం చేయలేదు.క్రికెట్ అవసరాలకోసం అభివృద్ధి చేయలేదు. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కేటాయించిన భూమి నిరుపయోగంగా మారడంపై 2021లోనే ఆ రాష్ట్ర మాజీ గృహనిర్మాణ మంత్రి జితేంద్ర అవ్హద్ విమర్శించారు. దీంతో గావాస్కర్ మరుసటి ఏడాదే (2022) ప్రభుత్వానికి అప్పగించారు. తాజాగా ఈ స్థలానే ఇప్పుడు రహానేకు కేటాయించారు. -
ఎన్ఆర్ఐ ప్లాటు కబ్జా
మణికొండ: హైదరాబాద్ నగర శివారులో భూముల ధరలు పెరిగిపోతుండటంతో వాటిపై వివాదాలు సృష్టించి రూ.కోట్లు దండుకునేందుకు కొన్ని ముఠాలు యత్నిస్తున్నాయి. ఇటీవల నార్సింగి రెవెన్యూ పరిధిలోని బృందావన్ కాలనీలో ఓ ప్లాట్ వివాదం ఏకంగాఎమ్మార్పీఎస్ నాయకుడి కిడ్నాప్ సంఘటన మరువకముందే మరో ఉదంతం వెలుగులోకి వచి్చంది. ఓ ప్లాటు ప్రహరీ కూల్చి దానిని కబ్జా చేయటంతో పాటు అది ఖాళీ చేయాలంటే రూ.1.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ముఠాను నార్సింగి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిరేవులలో ఎన్. మాధవీలత 2003లో 1200గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. 2017లో దాని చుట్టూ ప్రహరీ నిర్మించి తను అమెరికాలో ఉండటంతో తన తల్లి అరుణకు జీపీఏ ఇచ్చింది. ఈనెల 1న పెంజర్ల సుమన్, ఉప్పరి ముత్యాలు అనే వ్యక్తులు ప్రహరీని కూల్చి సదరు స్థలంలో కంటైనర్ ఏర్పాటు చేసి కబ్జాకు పాల్పడ్డారు. కంటైనర్ తొలగించి తాము తప్పుకోవాలంటే రూ.1.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఎన్. అరుణ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు ప్లాట్ వద్ద ఉన్న పెంజర్ల సుమన్, ఆదిరాల గౌతమ్, మేడిపల్లి గణేష్, జంగం ప్రశాంత్, ఈడిగ శివకుమార్, పెంజర్ల జయప్రకాశ్, జంగం శంకర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. -
రూ. 60 లక్షల ప్లాట్‌కు రూ.30 కోట్ల బిడ్!
ఉత్తర ప్రదేశ్‌లోని మధుర నగరంలో ప్లాట్ల వేలంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మధుర బృందావన్ డెవలప్మెంట్ అథారిటీ (MVDA) నిర్వహించిన రెసిడెన్షియల్ ప్లాట్ల ఆన్లైన్ వేలంలో బేస్ ధరలను మించి భారీ మొత్తానికి బిడ్ రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.గురువారం ప్రారంభమైన వేలంలో మొత్తం ఎనిమిది ప్లాట్లు బిడ్డింగ్‌కు వచ్చాయి. వాటిలో బృందావన్‌లోని రుక్మణి విహార్‌లో ఉన్న 300 చదరపు గజాల స్థలం అసలు ధర రూ. 60 లక్షలు. అయితే, ఈ-వేలంలో బిడ్లు అనూహ్యంగా పెరిగాయి. ఆశ్చర్యపరిచే విధంగా ఈ ప్లాటు రూ.30 కోట్లు పలికింది.వేలం ముగింపును పరిశీలించగా రూ. 60 లక్షల విలువైన ప్లాట్‌కు రూ. 30 కోట్లతో పాటు, మరో 288 చదరపు మీటర్ల ప్లాట్ రూ. 19.11 కోట్లు పలికింది. ఈ అసారణ బిడ్లు ఎంవీడీఏ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ బిడ్డింగ్‌లు ఎవరు వేశారు.. ఎంత పెద్ద మొత్తంలో బిడ్ వేయడానికి కారణాలేంటి అనే వివరాలను ఆరా తీస్తున్నారు అధికారులు. సహేతుకమైన స్థాయిలకు మించి ధరలను పెంచడం ద్వారా నిజమైన కొనుగోలుదారులను ప్లాట్లను కొనుగోలు చేయకుండా వేలం ప్రక్రియకు అంతరాయం కలిగించడానికి ఈ అధిక బిడ్లను వేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. -
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..! సీక్రెట్ సర్వీసెస్‌కు ముందే తెలుసా..?
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలని కొందరు కుట్ర పన్నిన విషయం అమెరికా సీక్రెట్ సర్వీసెస్‌కు ముందే తెలుసా..? సీక్రెట్ సర్వీసెస్ ఈ విషయాన్ని ట్రంప్ టీమ్‌కు చెప్పిందా..? ట్రంప్ టీమ్‌కు కూడా ఈ విషయం ముందే తెలుసా..? అంటే అవుననే అంటోంది ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ. ఈ మేరకు ఒక కథనం కూడా ప్రచురించింది.ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ దేశం కుట్రపన్నినట్లుగా సీక్రెట్ సర్వీసెస్‌కు ముందుగానే సమాచారమందిందని, ఈ విషయాన్ని వారు ట్రంప్ టీమ్‌కు కూడా చెప్పారని కథనంలో తెలిపింది. అయితే ఇటీవల పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నానికి ఇరాన్ కుట్రకు సంబంధముందనడానికి ఆధారాల్లేవని పేర్కొంది. ఇరాన్ కుట్రపై ఇంటెలిజెన్స్ సమాచారం అందగానే ట్రంప్ సెక్యూరిటీని సీక్రెట్ సర్వీసెస్ భారీగా పెంచినట్లు తెలిపింది. మరోవైపు ఇటీవలి పెన్సిల్వేనియా కాల్పుల్లో దుండగుడు ట్రంప్‌కు అత్యంత దగ్గరగా రావడంలో సీక్రెట్ సర్వీసెస్ వైఫల్యం ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది నవంబర్ మొదటి వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. -
2020నాటి ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబద్ధికరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరంలో ప్లాట్ ఓనర్లు, లేఅవుట్లు చేసిన రియల్టర్ల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధికరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని రెవెన్యూ విభాగాల నుంచి ఆదాయ సమీకరణపై సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31లోగా మొత్తం రుసుము చెల్లించిన పక్షంలో సదరు ప్లాట్ల క్రమబద్ధికరణకు అవకాశం కల్పించనున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలున్న భూములు మినహా ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించనున్నారు. సుమారు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు దీనితో ప్రయోజనం చేకూరుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఆదాయ సమీకరణ దిశగా.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో అనుమతుల్లేని లేఅవుట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో కేసీఆర్ సర్కారు ఎల్ఆర్ఎస్ పథకాన్ని తెచ్చింది. ఆ ఏడాది అక్టోబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. ప్లాట్లకు సంబంధించి రూ.1000 చొప్పున, లేఅవుట్లకు రూ.10,000 చొప్పున దరఖాస్తు ఫీజు తీసుకుంది. ఈ పథకం కింద 100 గజాల్లోపు ప్లాటు రెగ్యులరైజేషన్ కోసం గజానికి రూ.200 చొప్పున చార్జీ చెల్లించాలి. 100 నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాలకు గజానికి రూ.400.. 300 గజాలకుపైన ఉంటే గజానికి రూ.600 చొప్పున చార్జీ చెల్లించాలని పేర్కొంది. అయితే.. లేఅవుట్ల క్రమబద్ధికరణ అంశంపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. పెండింగ్ దరఖాస్తుల సంగతి ఏమిటన్నది అయోమయంగా మారింది. తాజాగా ఆదాయ సమీకరణపై సీఎం సమీక్ష సందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సర్కారుకు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా విధి విధానాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఎల్ఆర్ఎస్ చార్జీల చెల్లింపు కోసం తక్కువ గడువు పెట్టడం ఏమిటన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారుకు రూ. 50 వేల కోట్ల ఆదాయం వచ్చే చాన్స్ 2020 నాటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం. వేలాది మంది రియల్టర్లు, లక్షల మంది కొనుగోలుదారులకు గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లకు అనుమతి లభిస్తుంది. అయితే మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధికరణ చార్జీల మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనను సడలించాలి. కేవలం నెల రోజుల్లో లక్షల రూపాయలు చెల్లించి ఎల్ఆర్ఎస్ చేయించుకునే స్తోమత ప్లాట్ల యజమానులు, రియల్టర్లకు ఉండదు. ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రస్తుతం సుమారు 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవ్వన్నీ క్లియర్ అయితే ప్రభుత్వానికి రూ. 50 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. – నారగోని ప్రవీణ్‌కుమార్, ప్రెసిడెంట్,తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ -
75 గజాల్లోపు ఉన్నా.. అనుమతి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ప్లాట్‌లో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నా.. భవన యజమానులు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. 75 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా అధికారుల నుంచి ధ్రువీకరణ, పని ప్రారంభ ఉత్తర్వును పొందాలని, దీనికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పింది. తమ ప్లాట్లలో నిర్మాణ పనులను ఆపివేయాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నేరేడ్మెట్ వినాయకనగర్‌కు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లలో తండ్రీ కొడుకులు, ప్లాట్‌ను రెండు భాగాలుగా విభజించారు. టీఎస్ బీపాస్ చట్టం–2020 ప్రకారం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కటి 40 చదరపు గజాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు. మరొక పిటిషనర్ 54 చదరపు గజాలలో నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే వీరి నిర్మాణాలపై పొరుగు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణాలను ఆపివేయాలంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అయితే టీఎస్ బీపాస్ చట్ట ప్రకారం నిర్మాణాలను ప్రారంభించామని.. జీహెచ్ఎంసీ ఇచి్చన నోటీసులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే సరిపోదని, దాని పరిశీలన తర్వాతే నిర్మాణంపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని టీఎస్ బీపాస్ చట్టంలోని సెక్షన్ 7 చెబుతోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత అధికారులు నిర్ణయం తీసుకోవడానికి 21 రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాత ఎలాంటి కారణం చూపకుండా దరఖాస్తును ఆపితే పిటిషనర్లు ముందుకు వెళ్లవచ్చని తెలిపారు. కానీ, పిటిషనర్లు జనవరి 9న రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో అదే నెల 18న జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. టీఎస్ బీపాస్ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జీహెచ్ఎంసీ వాదనలను సమర్థించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ ప్లాట్లలో నిర్మాణానికి ప్రారంభ అనుమతి సర్టీఫికెట్ అవసరమని స్పష్టం చేశారు. అయితే వీటికి రూ.1 మాత్రమే నామమాత్రపు రుసుము ఉంటుందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ పొందవలసిన అవసరం ఉండదని తేల్చిచెప్పారు. -
అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి?
ఈనెల 22న అయోధ్యలో నూతన రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. అదేరోజున రామాలయంలోని గర్భగుడిలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య.. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఆవిర్భవించనుంది. రామాలయం ప్రారంభోత్సవం నేపధ్యంలో ఈ ప్రాంతంలో భారీగా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడి భూముల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.. అయోధ్యలో భూములను కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ కంపెనీ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ ద్వారా అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ సెవెన్ స్టార్ మల్టీ పర్పస్ ఎన్క్లేవ్ ‘ది సరయూ’లో ఉంది. అమితాబ్ కొనుగోలు చేసిన ప్లాట్ సైజు 10 వేల చదరపు అడుగులు. ఇందుకోసం ఆయన రూ.14.5 కోట్లు వెచ్చించారు. అయోధ్యలో ప్లాట్ కొనుగోలుకు సంబంధించి అమితాబ్ ఒక ప్రకటన కూడా చేశారు. ‘అయోధ్య నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిన నగరం. అయోధ్యకున్న కాలాతీత ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంపద నాలో భావోద్వేగ సంబంధాన్ని సృష్టించాయి. సంప్రదాయం, ఆధునికత కలగలిసిన అయోధ్య ఆత్మలోకి నా హృదయపూర్వక ప్రయాణానికి ఇది నాంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఎదురు చూస్తున్నానని’ అమితాబ్ పేర్కొన్నారు. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా షేర్ చేసిన బ్రోచర్లోని వివరాల ప్రకారం అయోధ్య నగరంలో 1,250 చదరపు అడుగుల భూమి ధర రూ. 1.80 కోట్లు, 1,500 చదరపు అడుగుల స్థలం ధర రూ. 2.35 కోట్లు. 1,750 చదరపు అడుగుల స్థలం ధర రూ. 2.50 కోట్లుగా ఉంది. అమితాబ్ బచ్చన్ ప్లాట్‌ను కొనుగోలు చేసిన ప్రదేశానికి 10 నిమిషాల దూరంలో రామాలయం, 20 నిమిషాల దూరంలో అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. సరయూ నది రెండు నిముషాల ప్రయాణ దూరంలో ఉంది. ఇది కూడా చదవండి: నేటి నుంచి ‘ప్రాణప్రతిష్ఠ’ ముందస్తు ఆచారాలు ప్రారంభం! -
సాహితీ కన్స్ట్రక్షన్ కంపెనీ భారీ మోసం
మంగళగిరి: సినీ నటులతో బ్రోచర్లు ప్రారంభం.. కార్పొరేట్ తరహాలో ప్రకటనలు.. సినీ నటుల సమక్షంలోనే ప్లాట్ల కేటాయింపు.. ఇంధ్రభవనాలను తలపించేలా గ్రాఫిక్స్ తదితర ప్రచారా్రస్తాలతో హోరెత్తించిన ఓ సంస్థ కొనుగోలుదారులకు భారీ ఎత్తున శఠగోపం పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో 15 వందల మంది కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఈ సంస్థ.. గుంటూరు జిల్లా కాజా వద్ద కూడా వెంచర్ వేసి మోసం చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన వెలుగుజూచింది. వివరాల్లోకి వెళితే.. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బూదాటి లక్ష్మీ నారాయణ హైదరాబాద్‌లోనూ, మంగళగిరి మండలం కాజా వద్ద వెంచర్ వేశారు. పలువురు సినీ నటులతో ప్రచారం చేయడం, సినీ నటులు ప్లాట్లు కొన్నట్లుగా చెప్పడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు, హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కొనుగోలుదారులు ప్లాట్లు, విల్లాస్‌ను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ముప్పు తిప్పలు.. హైదరాబాద్‌కు చెందిన పి. శ్రీధర్ అనే వ్యక్తి తన కుమార్తెల కోసం రెండు విల్లాలు కొనుగోలు చేసేందుకు రూ.కోటీ 80 లక్షలు చెల్లించారు. త్వరలోనే విల్లాలు పూర్తి చేసి అప్పగిస్తామని డబ్బులు తీసుకునేటప్పుడు చెప్పిన లక్ష్మీనారాయణ కనీసం స్థలాలను కూడా కొనుగోలు దారుల పేరిట రిజిస్టర్ చేయలేదు. 2020జూన్‌లో బాధితులు లక్ష్మీనారాయణను కలిసి రిజి్రస్టేషన్ అన్నా చేయాలని.. లేనిపక్షంలో డబ్బులు తిరిగి చెల్లించాలని కోరగా.. రెండు ప్రామిసరీ నోట్లు, రూ.90 లక్షల చొప్పున రెండు యూనియన్ బ్యాంకు చెక్కులను ఇచ్చి 2022 అక్టోబర్‌లో బ్యాంకులో వేసుకోమని చెప్పారు. అయితే ఆ రెండు చెక్కులు బౌన్స్ కావడంతో బాధితులు లక్ష్మీనారాయణ కోసం హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇలానే పలువురిని మోసగించిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అప్పటికే లక్ష్మీనారాయణను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇస్తానంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. సాహితీ సంస్థకు చెందిన వెంచర్‌ను ఆయన బంధువు బుచ్చిబాబు హాలాయుధా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో నడుపుతున్నట్లు తెలుసుకున్న బాధితులు అతనిని సంప్రదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు తనకు సంబంధం లేదంటూ సమాధానం ఇవ్వడంతో బాధితులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఈ సంస్థ ప్రతినిధులు గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు తెలుగుదేశం నేతలకు వాటాలు ఇవ్వడంతో పాటు 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేశ్ ఎన్నికలకు సైతం భారీ మొత్తంలో చందాలిచ్చినట్లు తెలుస్తున్నది. -
పన్నూ హత్య ‘కుట్ర’ భగ్నం? భారత్ స్పందన ఇది
ఖలిస్థానీ వేర్పాటువాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న ఓ కథనం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ కుట్రను తాము భగ్నం చేశామని, పైగా ఈ విషయాన్ని భారత్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అమెరికా ప్రకటించడంతో మరింత దుమారం రేపింది. అమెరికా గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు చేసిన ప్రయత్నాలను.. తాము భగ్నం చేశామని అక్కడి అధికారులు వెల్లడించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అందులో సారాంశం.. ‘‘ఈ అంశాన్ని మేం తీవ్రంగా పరిగణించాం. అంతేకాదు.. భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి అధికారుల వద్ద దీనిని ప్రస్తావించాం. ఈ విషయం వినగానే భారత అధికారులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ వర్గాలు తదుపరి దర్యాప్తు చేస్తాయని మాకు అర్థమైంది. రాబోయే రోజుల్లో దీని గురించి మరింత సమాచారం బయటకు వస్తుంది. ఈ కుట్రకు బాధ్యులైన వారికి శిక్ష పడాలని మేం భావిస్తున్నాం’’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆండ్రీన్ వాట్సన్ పేరిట కథనం ప్రచురితమైంది. ఇదీ చదవండి: గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరో తెలుసా? మరోవైపు ఈ కథనంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగశాఖ.. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి మాట్లాడుతూ.. భారత్-అమెరికా భద్రతా సహకారంపై ఇరు దేశాల మధ్య ఇటీవల కొన్ని చర్చలు జరిగాయి. వీటిలో భాగంగా వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య బంధాలు, తదితర అంశాల గురించి అమెరికా అధికారులు కొంత సమాచారమిచ్చారు. ఆ సమాచార తీవ్రతను భారత్ గుర్తించింది. అది రెండు దేశాల భద్రతా ప్రయోజనాలకు ఆందోళనకరం. అమెరికా పంచుకున్న ఆ సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయి’’ అని అన్నారు. మరోవైపు పన్నూ హత్యకు జరిగిన కుట్రకు సంబంధించి అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందట. అయితే, ఈ కుట్ర గురించి అమెరికాకు ఎలా తెలిసింది? కుట్రను ఎలా భగ్నం చేశారన్న వివరాలను మాత్రం సదరు వర్గాలు బయటపెట్టలేదు. ఇదీ చదవండి: గురపత్వంత్కు భారత్ దెబ్బ.. అదుర్స్ -
సినిమా రిలీజ్.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్!
ఇటీవలే దయా వెబ్ సిరీస్‌లో ప్రేక్షకులను పలకరించిన నటి గాయత్రి గుప్తా. అంతకంటే ముందే యాంకర్‌గా, షార్ట్ ఫిలింస్ చేస్తూ కూడా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఐస్‌క్రీమ్ 2, ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోని, కొబ్బరిమట్ట లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. గతంలో టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. తాజాగా ప్లాట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ముద్దుగుమ్మ. భాను భవతారక దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో వికాస్, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలో పోషించారు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది గాయత్రి గుప్తా. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ టచ్‌లో ఉంటోంది. గతంలో ఓ బోల్డ్ వీడియో షేర్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా తన చిత్రం ప్లాట్ మూవీ రిలీజ్ సందర్భంగా మరో వీడియోను షేర్ చేసింది. అభిమానులతో లైవ్ తీసిన వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ రోజు ప్లాట్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్దామనుకున్నా..కానీ కుదరలేదు అంటూ ఏడుస్తూ కనిపించింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ప్లాట్ సినిమా చూడండి అంటూ అభిమానులను కోరింది. అయితే ఈ వీడియోలోనూ మరింత బోల్డ్‌గా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ గాయత్రికి ఏమైందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు. సినిమా రిలీజ్ రోజే ఇలాంటి వీడియో ఏంటీ మేడం అని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇది డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధి అని ఈ విషయం నాకు ఆరు నెలల క్రితం తెలిసింది. చాలామంది డాక్టర్లు నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారని తెలిపింది. అయితే సైకాలజీ థెరపీ వచ్చాక ఈ వ్యాధిపై మరింత క్లారిటీ వచ్చింది. సమయానికి పడుకోవడం, యోగా చేయడం.. ఇలా అన్నీ చేస్తున్నానని తెలిపింది. View this post on Instagram A post shared by Gayathri Gupta (@gayathrigupta) View this post on Instagram A post shared by Gayathri Gupta (@gayathrigupta) -
‘ప్లాట్’ సరికొత్త ప్రయోగాత్మక చిత్రం: వేణు ఊడుగుల
వికాస్ ముప్పాల, గాయత్రీ గుప్తా, సాజ్వి పసల, సంతోష్ నందివాడ, కిశోర్ ప్రధాన పాత్రధారులుగా భాను భవతారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్లాట్’. కార్తీక్ సేపురు, తరుణ్ విఘ్నేశ్వర్ సేరుపు, భాను భవ తారక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా హాజరై, ట్రైలర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. దర్శక–నిర్మాతలు ఈ తరహా సినిమాలను తీయాలంటే ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు. ‘‘నా కెరీర్‌కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు వికాస్ ముప్పల. ‘‘ఈ సినిమాను చూసి ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు’’ అన్నారు భాను భవతారక, తరుణ్ విఘ్నేశ్వర్. -
అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, ఇతర అవసరాలకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ, పారిశ్రామికవాడల నిర్మాణం కోసం వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించి తీసుకుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.4–5 కోట్ల విలువ చేస్తుందన్నారు. బుద్వేల్‌లో 164 ఎకరాల అసైన్డ్ భూములు సేకరించిన ప్రభుత్వం ప్లాట్లు వేసి అమ్ముతోందని ఆరోపించారు. అసైన్డ్ భూములు అసైనీల వద్దే ఉండనీయాలని, ధరణిలో వారికి హక్కులు కల్పిం చాలని కోరారు. తెలంగాణ ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఇటీవల నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం లక్షల మంది ప్రజలు నిరీక్షిస్తున్నారని, ప్రతి గ్రామంలో భూములను సేకరించి ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని అన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులందరికీ పోడు పట్టాలు అందలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనిపై అధికార బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉద్యోగాలు లేక కష్టాల్లో యువత.. ఎమ్మెస్సీ, ఎంఏ, బీఈడీ వంటి ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు లభించక గ్రామాల్లో ఇస్త్రీ షాపులు, సోడా దుకాణాలు నడుపుకుంటూ తీవ్ర ఆవేదనలో ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొనగా, మళ్లీ బీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం కలగజేసుకుని.. ‘భట్టి గారూ..మీరు ఆరు మాసాల పాదయాత్ర మొత్తం చెప్పడానికి సమయం సరిపోదు’అని సూచన చేశారు. అనంతరం భట్టి ప్రసంగం కొనసాగిస్తూ.. వర్సిటీల్లో అధ్యాపకులను భర్తీ చేయాలని, ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు లేక బడులు మూతబడుతున్నాయని, తక్షణమే డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సరే.. కాల్వలు ఏవీ? రాష్ట్రంలో వివిధ కొత్త ప్రాజెక్టులను నిర్మించిన ప్రభుత్వం వాటి కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు సరఫరా కావడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరం కింద కాల్వలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కడెం వంటి పాత ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపునకు గురి అవుతున్న చెన్నూరు, భూపాలపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ప్రజలకు పునరావాసం కల్పిం చి, పరిహారం చెల్లించాలని కోరారు. గిరిజనబంధు, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి.. గిరిజనబంధుతో పాటు బీసీలకు సబ్‌ప్లాన్, మైనారిటీలకు సచార్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కి 15 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, పంట రుణమాఫీ సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయించాలని డిమాండ్ చేశారు. -
Imran Khan: పదేళ్లు జైల్లో పెట్టేలా కుట్ర! అయినా తగ్గేదేలే! నాచివరి..!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాన్ లాహోర్‌లో తన నివాసంలో పీటీఐ నేతలతో సమామేశం నిర్వహించిన తదనంతరం పాక్ ఆర్మీ గురించి సంచలన వ్యాఖ్యలతో వరుస ట్వీట్లు చేశారు. పాక్‌లోని శక్తిమంతమైన సైనిక స్థాపన తనను పదేళ్ల పాటు జైల్లో ఉంచేందుకు ప్లాన్ చేస్తోందన్నారు. ప్రస్తుతం లండన్ ప్లాన్ ముగిసింది కాబట్టి ఆ దిశగా పావులు కదుపుతోందన్నారు. వారు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని శిక్షలు అమలు చేసే దుశ్చర్యకు పాల్పడుతున్నారు. తన భార్యని జైల్లో పెట్టి తనను అవమానపాలు చేసే యోచనలో కూడా ఉన్నట్లు తెలిపారు. దేశద్రోహం వంటి బలమైన చట్టాలను ఉపయోగించి పదేళ్ల వరకు జైల్లో మగ్గిపోయేలా చేసేందుకు పాక్ ఆర్మీ కుట్ర పన్నుతోందని ట్వీట్ చేశారు. అంతేగాదు ఆ సమయంలో ప్రజాస్పందన రాకుండా జాగ్రత్త పడేలా రెండు కీలకమైన పనులు కూడా చేస్తారని అన్నారు. అందులో.. ఒకటి ఉద్దేశపూర్వకంగా తన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు, సాధారణ పౌరుల గొంతును అణిచివేసేలా హింసాత్మక దాడి, రెండోది మీడియాను నియంత్రించడం అని చెప్పుకొచ్చారు. అలాగే అరెస్టు చేసే ముందే ఇంటర్నెట్ సేవలను నిలిపేసి, సోషల్ మీడియాను నిషేధించడం వంటివి చేస్తారు. ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యేలా పోలీసులు ఇళ్లలోకి చొరబడి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి దారుణాలకు పాల్పడతారంటూ ఆర్మీపై ఆరోపణలు చేశారు ఖాన్. అలాగే ఈ సందర్భంగా పాక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..తన చివరి రక్తపు బొట్టు వరకు హకీకీ ఆజాదీ కోసం పోరాడతానని, క్రూరమైన మోసాలకు బానిసలవ్వడం కంటే మరణమే ఉత్తమమని అన్నారు. అయినా మనం చేసే ఇల్లా హ ఇల్లాల్లాహ్ అని ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. మనం కేవలం అల్లాకు తప్ప మరెవరికి తలవంచం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరారు. ఇలాంటి అన్యాయపూరితమైన చట్టాలు దేశంలో ఎక్కువ కాలంపాటు మనుగడ సాగించలేవని చెప్పారు. కాగా ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాక్ ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయింది. ఈ ఘటనలో పీటీఐ కార్యకర్తలు, పౌరులు తోసహ సుమారు 40 మంది దాక పాక్ ఆర్మీ చేతిలో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: యువతి బంగీ జంప్! తాడు తెగడంతో..) -
చిట్ వద్దు, ఫైనాన్స్ వద్దు.. జాగా కొంటే.. అదే ముద్దు
సాక్షిప్రతినిధి, కాకినాడ: కోవిడ్ తదనంతర పరిణామాలతో ప్రజలు నగదు నిల్వలకు వెనుకంజ వేస్తున్నారు. నగదు నిల్వల కంటే చర, స్థిరాస్తులపై పెట్టుబడికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏదో ఆరోగ్యం, విద్య వంటి అత్యవసరాలకు తప్పించి నగదు తమ వద్ద ఉంచుకోవాలనే ఆలోచనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంపన్నుల నుంచి ఎగువ మధ్యతరగతి వర్గాల వరకు ఎవరిని కదిపినా ఇదే మాట చెబుతున్నారు. ఇంతవరకు కొంతమంది నాలుగు లక్షల రూపాయలు కూడబెడితే చాలు రూ.2 వడ్డీకి అప్పు ఇచ్చి నెలనెలా వచ్చే సొమ్ముతో కాలక్షేపం చేసేవారు. కోవిడ్ సమయంలో సంభవించిన మరణాలు, అనంతరం పెరుగుతున్న హఠాన్మరణాలతో వడ్డీ మాట దేవుడెరుగు.. కనీసం అసలు కూడా తిరిగి రావడం లేదని వారంతా గగ్గోలు పెడుతున్నారు. అభద్రతతో ఆందోళన దీనికితోడు మార్గదర్శి వంటి చిట్‌ఫండ్ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకులు, కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీలు ప్రజల నుంచి కోట్లు డిపాజిట్లు సేకరించి నిధులు తమ అవసరాలకు మళ్లిస్తున్నాయి. కొన్ని బోర్డు తిప్పేస్తున్నాయి. ఈ పరిణామాలతో డబ్బులు దాచుకున్న వారిలో కూడా అభద్రతాభావం వచ్చేసింది. ఈ పరిస్థితులను బేరీజు వేసుకుని నగదు నిల్వ పెంచుకోవడం కంటే భూములు, ఇళ్ల కొనుగోలు మేలు అని ఎక్కువ మంది భావిస్తున్నారు. స్థిరాస్తులు కూడబెట్టుకుంటే ఏ క్షణాన అవసరం వచ్చినా బ్యాంకుల్లో కుదవ పెట్టుకుని అప్పటికప్పుడు సొమ్ము తెచ్చుకోవచ్చుననే ఒక భరోసా ఇందుకు ప్రధాన కారణం. అప్పులు ఇచ్చి అసలు కోసం పోలీసు స్టేషన్లు, ప్రైవేటు సెటిల్మెంట్ల కోసం తిరగడం కంటే భూములు, ప్లాట్లు, ఇళ్లు కొనుక్కుని పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చునని భావిస్తున్నారు. రెండు మూడేళ్లకే రేట్ల పెరుగుదల నాలుగు డబ్బులు వెనకేసుకునేవారి ఆలోచనలు మారడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూములు, ప్లాట్లు క్రయ, విక్రయాలు పెరుగుతున్నాయి. ఏటా రిజిస్ట్రేషన్లు కూడా రెట్టింపవుతున్నాయి. బడా బాబులు భారీగా భూములు కొనుగోలు చేస్తుంటే, ఎగువ ..దిగువ మధ్య తరగతి వర్గాలు కుటుంబ పోషణ పోగా మిగుల్చుకున్న కొద్దిపాటి సొమ్ముతో 100, 150 గజాలు కొనుగోలు చేస్తున్నారు. గజం రూ.15వేలు పెట్టి కొనుగోలు చేసిన స్థలాల రేట్లు రెండు, మూడేళ్లకే పెరిగిపోతున్నాయి. దీంతో ఇది లాభార్జనగా ఉంటుందని మధ్యతరగతి వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. ఇలా కొనుగోలు చేసిన స్థలాలు భవిష్యత్తులో పిల్లల చదువులు, వివాహాలకు కలసి వస్తాయని వారు చెబుతున్నారు. సరళతరంగా బ్యాంకుల్లో వస్తున్న రుణాలు తీసుకుని మరీ స్థలాలు కొనుగోలు చేస్తున్న వారూ లేకపోలేదు. బడాబాబులు, కాంట్రాక్టర్లు, అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చిన వారు సైతం రికవరీ చేసి స్థలాలపై పెట్టుబడి పెడుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత.. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం సహా రామచంద్రపురం, మండపేట, తుని, సామర్లకోట వంటి పట్టణాల పరిసర ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్ల క్రయ, విక్రయాలు ఇటీవల రెట్టింపయ్యాయి. హాట్‌కేక్‌లుగా అమ్ముడు పోయే ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో స్థలాలు, భూములు, ఇళ్లు కొనుగోలుకు నాడు జిల్లా నలుమూలల నుంచి ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. పునర్విభజన తరువాత కాకినాడతో పాటు అమలాపురం, రాజమహేంద్రవరం జిల్లా కేంద్రాలయ్యాయి. ఇప్పుడు వాటిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల భూములు రియల్ ఎస్టేట్లుగా ఎక్కువ రూపాంతరం చెందుతున్నాయి. అపార్టుమెంట్ సంస్కృతి పెరగడంతో స్థలాల విలువ రెట్టింపు అయింది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్లు కోనసీమ కేంద్రం అమలాపురానికి ఆనుకుని ఎర్రవంతెన, కామనగరువు, ఈదరపల్లి, పేరూరు, భట్నవిల్లి, బండార్లంక, రాజమహేంద్రవరంలో గోదావరి గట్టు నుంచి తొర్రేడు, మధురపూడి విమానాశ్రయం రోడ్డు నుంచి గాడాల, లాలాచెరువు నుంచి దివాన్‌చెరువు, జాతీయ రహదారి నుంచి శ్రీరామపురం రోడ్డు, రాజవోలు, సంపత్‌నగర్ వరకు నివాసప్రాంతాలుగా విస్తరిస్తున్నాయి. కాకినాడకు ఆనుకుని మేడలైన్, చీడిగ, కొవ్వాడ, తూరంగి, పెనుగుదురు, సర్పవరం, గైగోలుపాడు, ఏపీఎస్పీ, అచ్చంపేట వాకలపూడి వరకు రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. జిల్లాల విభజన జరుగుతుందనే ముందుచూపుతో గడచిన రెండేళ్లుగా జిల్లా కేంద్రాలకు ఆనుకుని ఐదారు కిలోమీటర్ల వరకు భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయి. పట్టణానికి సమీపాన నాలుగైదు కిలోమీటర్ల వరకు ఖాళీగా ఉన్న పంట భూములు రియల్ ఎస్టేట్లుగా మారి నివాసప్రాంతాలు అవుతున్నాయి. గడచిన నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ల ఆదాయ గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రిజిస్ట్రేషన్, ఆదాయం వివరాలు సంవత్సరం దస్తావేజులు ఆదాయం 2018–19 1,48,213 541.74 కోట్లు 2019–20 1,91,191 592. 07 కోట్లు 2020–21 1,67,095 638.21 కోట్లు 2021–22 2,44,695 907.16 కోట్లు 2022–23 2,66,233 886.88 కోట్లు భవిష్యత్తుకు భరోసాగా భూములపై పెట్టుబడి భూములు, స్థలాలు, ఫ్లాట్లపై పెట్టుబడి పెట్టడమంటే అన్ని వర్గాల ప్రజలు భరోసాగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. ఆదాయం కూడా బాగా పెరుగుతూ వస్తోంది. కోవిడ్ తరువాత పరిణామాలతో ప్రజల ఆలోచనా విధానం మారింది. భూములపై పెట్టుబడి పెడితే భవిష్యత్తులో వాటి విలువ పెరుగుదలే తప్ప తరుగుదల ఉండదనే నమ్మకం ఏర్పడింది. దీంతో స్థిరాస్థులపైనే ఎక్కువగా డబ్బు పెడుతున్నారు. – ఎ.నాగలక్ష్మి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, కాకినాడ. కొనుగోలు భద్రతనిస్తోంది భూమి కొనుగోలు కుటుంబానికి భద్రతనిస్తుంది. గతంలో బ్యాంకులో భద్రపరుచుకోవడం, లేకపోతే వడ్డీలకు ఇవ్వడం చేసేవారు. కొన్ని సొసైటీలు రాత్రికి రాత్రే ఎత్తివేయడం, వడ్డీకి తీసుకునేవారు తిరిగి ఇచ్చే విషయంలో ఏర్పడే సమస్యలతో విసుగెత్తిపోయారు. దీంతో రోజురోజుకూ పెరుగుతున్న భూమి రేట్లను దృష్టిలో పెట్టుకుని భూములు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. – జాడ అప్పలరాజు, దస్తావేజు లేఖరి, కాకినాడ విలువ పెరుగుతుందనే కొన్నాను రెక్కల కష్టం మీద కుటుంబం నెట్టుకొస్తున్నాను. కూడబెట్టిన కొద్దిపాటి సొమ్మును భూమిపై పెట్టడం మంచిదనుకున్నాను. మున్ముందు ఆ భూమి విలువ పెరుగుతుందని 100 గజాల స్థలాన్ని కొన్నాను. ఎక్కడైనా బ్యాంకులో వేద్దామన్నా నమ్మకం కుదరడం లేదు. ఇవన్నీ ఆలోచించే పెట్టిన సొమ్ముకు భరోసాతోపాటు, ధరలు కూడా పెరుగుతాయని జాగా కొనుక్కున్నాను. – డి.రమేష్, ఇంద్రపాలెం, కాకినాడ -
కేసీఆర్ సర్కార్ భారీ ప్రణాళిక.. జాగా ఉంటే నిధులు.. లేదంటే స్థలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు ఇంటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సొంత జాగా ఉన్నవారితో పాటు లేని పేదలకు కూడా గృహ వసతి కల్పించే అంశంపై కసరత్తు ప్రారంభించింది. సొంత జాగా ఉంటే ఇళ్ల నిర్మాణానికి నిధులు, భూమి లేని వారికి నిర్ధారిత పరిమాణంలో స్థలాల కేటాయింపు దిశగా ఆలోచన చేస్తోంది. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశమై విధివిధానాలను ఖరారు చేయనున్నారు. సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించటం ద్వారా వారే ఇళ్లను నిర్మించుకునే పథకానికి గతేడాది బడ్జెట్లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే విధివిధానాలు ఖరారు చేయకపోవటంతో ఆ బడ్జెట్ కాలంలో నిధులు విడుదల చేయలేదు. తాజా బడ్జెట్లో 4 లక్షల ఇళ్లను మళ్లీ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేల ఒత్తిడి నేపథ్యంలో.. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకం రూపురేఖలు గొప్పగా ఉన్నప్పటికీ, ముందుకు సాగని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారు లక్షల్లో ఉండగా, ఈ ఇళ్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఒకరికి ఇస్తే వంద మంది గొడవకు దిగే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆశించిన ప్రయోజనం లభించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. పేదల ఇళ్ల విషయంలో వెంటనే దిద్దుబాటు అవసరమంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కేటీఆర్, హరీశ్‌లకు వివరించారు. దీంతో దీనిపై ప్రభుత్వం కస రత్తు ప్రారంభించింది. ఇందుకోసం అసైన్డ్ భూములను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. సొంత స్థలాలు లేని వారి కోసం.. సొంత స్థలాలు ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి బడ్జెట్లోనూ రూ.12 వేల కోట్ల నిధులు కేటాయించింది. తద్వారా నాలుగు లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. అయితే కేవలం సొంత జాగా ఉన్నవారికే ఇస్తే జాగా లేని వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో సొంత స్థలాలు లేనివారి వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది. అలా స్థలాలు ఇవ్వాల్సి వస్తే ఎంతమంది లబ్ధిదారులుంటారు? ఒక్కొక్కరికి 60 గజాల నుంచి 80 గజాల వరకు అందించాలంటే ఎంత భూమి అవసరమవుతుంది? సరిపడా ప్రభుత్వ భూమి ఉందా? లేని పక్షంలో ఎంతభూమిని సమీకరించాల్సి వస్తుంది? వినియోగంలో లేని అస్సైన్డ్ భూములను వాడుకునే వీలుందా?.. తదితర అంశాలపై వివరాలను వచ్చే సోమవారం నాటికి అందజేయాల్సిందిగా తాజాగా అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఈ వివరాలు అందిన తరువాత తుది నిర్ణయం తీసుకుని భారీ స్థాయిలో ఒకే దఫాలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
స్థలం కొనుగోలుకు రుణం.. ఇల్లు కట్టుకునే వారికి ప్లాట్ రుణాలు
ఆకర్షణీయమైన ధరకు ప్లాట్ (స్థలం) విక్రయానికి ఉందని తెలిసినప్పుడు.. అందుబాటులో డబ్బు ఉండకపోవచ్చు. అటువంటి అవకాశం మళ్లీ రాదనుకుంటే, కొనుగోలుకు అప్పు తీసుకోవడం ఒక్కటే మార్గం. తెలిసిన వారి దగ్గర బదులు తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకులను ఆశ్రయించాలా? లేక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) తలుపు తట్టాలా? అసలు స్థలం కొనుగోలుకు రుణం లభిస్తుందా? ఎన్నో సందేహాలు వస్తాయి. ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కడదామనుకునే వారు.. పెట్టుబడి కోణంలోనూ ప్లాట్‌ను కొనుగోలు చేసేవారూ ఉన్నారు. వీరి కల సాకారం కోసం అందుబాటులో ఉన్న మార్గాలేమిటో తెలియజేసే కథనమే ఇది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ప్లాట్ కొనుగోలుకు రుణాలను (ప్లాట్ లోన్స్) ఆఫర్ చేస్తున్నాయి. కానీ, ఆ ప్లాట్ ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తున్నదై ఉండాలి. పెట్టుబడి కోణంలో ప్లాట్ కోసం రుణం తీసుకోవాలంటే వేరే మార్గాలను వెతుక్కోవాల్సిందే. ఇంటి కొనుగోలు కోసమే ప్లాట్‌ను సమకూర్చుకునే వారికి రుణం సులభంగానే లభిస్తుంది. నివాస యోగ్యమైన ప్లాట్‌ను రుణంపై కొనుగోలు చేసుకుంటే.. ఆ తర్వాత రుణ ఒప్పందం మేరకు 1–3 ఏళ్లలోపు ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. వీటినే ప్లాట్ లోన్స్గా చెబుతారు. రుణం తీసుకుని నివాస యోగ్యమైన ప్లాట్‌పై ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత ఇల్లు కట్టలేదనుకోండి. కావాలని ఇల్లు కట్టకుండా వదిలేసే వారు ఉంటారు. పలు రకాల కారణాల వల్ల ఇల్లు కట్టడానికి వీలు పడని పరిస్థితులూ ఉండొచ్చు. నిజానికి ప్లాట్ లోన్ తక్కువ వడ్డీ రేటుపై లభిస్తుంది. ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తుండడమే ఇందుకు కారణం. రుణ ఒప్పందంలో పేర్కొన్న కాల వ్యవధిలోపు ఇంటిని నిర్మించి, పూర్తయినట్టు సర్టిఫికెట్ బ్యాంకుకు సమర్పించకపోతే.. అప్పుడు ఆ రుణం సాధారణ రుణంగా మారుతుంది. బ్యాంకులు అదనపు వడ్డీరేటును వసూలు చేస్తాయి. ఒప్పందం చేసుకున్న నాటి నుంచి రుణంపై 2–3 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటును అమలు చేసే స్వేచ్ఛ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఉంటుంది. దీనివల్ల అదనపు వడ్డీ భారం పడుతుందని అర్థం చేసుకోవాలి. ఒప్పందంలో పేర్కొన్న కాలవ్యవధి ముగిసిన తర్వాత కూడా రుణ గ్రహీత బ్యాంకులను సంప్రదించని పరిస్థితుల్లో.. బ్యాంకులే కస్టమర్లకు సందేశం పంపిస్తాయి. అప్పటికీ స్పందించకపోతే అప్పుడు సాధారణ రుణంగా వర్గీకరించి ఆ మేరకు చర్యలు తీసుకుంటాయి. అదనపు వడ్డీ భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉంటేనే ప్లాట్‌లో ఇంటిని నిర్మించకుండా ఉండొచ్చన్నది దృష్టిలో పెట్టుకోవాలి. ప్లాట్ లోన్ అర్హతలు 18–70 ఏళ్ల వారు ప్లాట్ లోన్‌కు అర్హులు. సిబిల్ స్కోరు కనీసం 650కు పైన ఉండాలి. గరిష్టంగా 15 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లించే విధంగా ప్లాట్ లోన్ మంజూరవుతుంది. రుణం ఇచ్చే ముందు.. ఆ ప్లాట్ కొనుగోలు ప్రదేశం, ఎందుకోసం కొనుగోలు చేస్తున్నారు, తిరిగి చెల్లించే సామర్థ్యం, గత రుణాల చెల్లింపుల చరిత్ర ఇలా ఎన్నో అంశాలను బ్యాంకులు చూస్తాయి. లోన్ టు వ్యాల్యూ లోన్ టు వ్యాల్యూ అన్నది ప్రాపర్టీ విలువలో లభించే రుణంగా అర్థం చేసుకోవాలి. ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో గరిష్టంగా 85–90 శాతం వరకు రుణాన్ని (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అదే ప్లాట్ కోసం అయితే ఎల్టీవీ 60–70 శాతం మధ్యే ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కొనుగోలుదారులు స్వయంగా సమకూర్చుకోవాలి. సేల్‌డీడ్‌లో పేర్కొన్న విలువను ప్లాట్ విలువగా బ్యాంకులు పరిగణిస్తాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని రుణం ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయి. రుణం తీసుకునే ముందు విచారిస్తే ఈ విషయంపై స్పష్టత లభిస్తుంది. పైగా కొన్ని బ్యాంకులు సేల్డీల్ వ్యాల్యూ లేదా మార్కెట్ వ్యాల్యూలో రుణాన్ని 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. సమాచార లోపం కొన్ని సందర్భాల్లో మధ్యవర్తులు తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వొచ్చు. ప్లాట్ రుణం తీసుకుని, అందులో ఇల్లు కట్టకపోయినా ఫర్వాలేదు? అన్న మాట వినిపిస్తే అది నిజం కాదని గుర్తించాలి. వారు తమ స్వప్రయోజనాల కోసమే అలా చెబుతున్నారని అర్థం చేసుకోవాలి. అంతకీ అనుమానం ఉంటే లోన్ డాక్యుమెంట్‌ను ఒక్కసారి సమగ్రంగా చదవాలి. ప్రతి ఒక్కరికీ ఆవాసం కల్పించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. అందులో భాగంగానే తక్కువ రేటుపై ప్లాట్ రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అలాకాకుండా రుణం తీసుకుని కొనే ప్లాట్.. భవిష్యత్తులో లాభం కోసం విక్రయించేది అయితే అందుకు తక్కువ వడ్డీ రేటుపై రుణాలను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదని తెలుసుకోవాలి. ఇంటిని నిర్మించేట్టయితే బ్యాంకులకు రుణం చెల్లింపులపై భరోసా లభించడం కూడా తక్కువ రేటుకు ఇవ్వడానికి ఒక కారణం. పైగా ఇంటి నిర్మాణం చేస్తే దానిపై ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది. లేదంటే అందులో నివాసం ఉంటే రుణ గ్రహీత ఇంటి అద్దె రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని రుణ ఈఎంఐల చెల్లింపునకు వెసులుబాటుగా బ్యాంకులు చూస్తాయి. ఒక్కటే రుణం? కొన్ని బ్యాంకులు ప్లాట్ కొనుగోలుకు, తర్వాత అందులో ఇంటి నిర్మాణానికీ రుణం ఇస్తున్నాయి. ఎస్బీఐ అయితే ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు చేసిన 2–3 ఏళ్ల తర్వాత గృహ రుణాన్ని జారీ చేస్తోంది. కానీ, ఈ రెండు రుణాలకు వేర్వేరు ఖాతాలు ఉంటాయి. వడ్డీ రేటులోనూ స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. కానీ, కొన్ని బ్యాంకులు ఒక్కటే రుణం ఇచ్చేందుకూ ముందుకు వస్తున్నాయి. ఒప్పందంలో ఇందుకు సంబంధించి వివరాలు ఉంటాయి. మంజూరు చేసే రుణంలో ప్లాట్‌కు ఎంత, ఇంటి నిర్మాణానికి ఎంతన్న వివరాలు కూడా ఉంటాయి. పన్ను ప్రయోజనాలు ప్లాట్ కొనుగోలుకు రుణం తీసుకుని చేసే చెల్లింపులపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు లే వు. పన్ను ప్రయోజనం కావాలనుకుంటే ఒక్కటే రుణంగా (ప్లాట్, ఇల్లు) తీసుకుని వెంటనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం ఒక్కటే మార్గం. అప్పుడు అసలు, వడ్డీ చెల్లింపులపై ఒక ఏడాదిలో రూ.3.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని గుర్తుంచుకోవాలి.. ► ప్లాట్‌లో ఇంటిని నిర్మించేట్టు అయితేనే రుణం తీసుకోవాలి. ► ప్లాట్, ఇంటి నిర్మాణానికి కలిపి ఒక్కటే రుణం మంజూరు చేస్తుంటే.. ముందు ప్లాట్ కోసం ఒక పర్యాయం, ఇంటి నిర్మాణ సమయంలో మిగిలిన భాగాన్ని బ్యాంకులు ఇస్తాయి. ఇంటి నిర్మాణానికి కూడా ముందుగానే రుణం తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువ అవుతుంది. ► ఒకవేళ రుణంపై ప్లాట్‌ను కొనుగోలు చేసిన ఏడాది లేదా రెండేళ్లకు ఇల్లు కట్టకుండానే విక్రయించారనుకోండి. అప్పుడు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో విచారించాలి. అటువంటప్పుడు వాటిని సాధారణ/పర్సనల్ లోన్‌గా పరిగణించి అదనపు వడ్డీ, చార్జీలు వసూలు చేయవచ్చు. ► ప్లాట్ లొకేషన్ కూడా కీలకం. మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొనుగోలు చేస్తున్న ప్లాట్ ఉండాలి. గ్రామాల్లో ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు కాదు. ► అలాగే, పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాట్‌కు, వ్యవసాయానికి వినియోగించే ప్లాట్‌కు కూడా రుణం మంజూరు కాదు. ► ఇంటి కోసం రుణాన్ని 30 ఏళ్ల కాలవ్యవధిపైనా తీసుకోవచ్చు. అదే ప్లాట్ రుణం 15–20 ఏళ్లకే పరిమితం అవుతుంది. ► ప్లాట్ రుణానికి గరిష్ట పరిమితి కూడా ఉంది. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్యాంకులు పరిమితులు విధిస్తున్నాయి. ► రుణాన్ని ముందుగా చెల్లిస్తే అదనపు చార్జీలు చెల్లించాలేమో విచారించుకోవాలి. ఈ చార్జీలపై అధికారులను అడిగి తెలుసుకోవాలి. ► కొనుగోలు చేస్తున్న ప్లాట్‌కు రుణం వస్తుందా? లేదా? ముందే స్పష్టం చేసుకోవాలి. పెట్టుబడి కోసం అయితే..? ఇంటి నిర్మాణానికి కాకుండా పెట్టుబడి కోణంలో ప్లాట్‌ను కొనుగోలు చేద్దామనుకుంటే.. అందుకు ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉంటుంది. అప్పటికే మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే.. లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (ఎల్ఏపీ)ని తీసుకోవచ్చు. నివాస, వాణిజ్య ప్రాపర్టీలను బ్యాంకులకు హామీగా ఉంచితే, రుణం లభిస్తుంది. ఇలా తీసుకునే రుణా న్ని ఏ అవసరం కోసమైనా వినియోగించుకునే స్వేచ్ఛ రుణగ్రహీతకు ఉంటుంది. 15 ఏళ్ల కాల వ్యవధిపై ఈ రుణం లభిస్తుంది. ప్రాపర్టీ ఏమీ లేని వారు.. బంగారం ఉంటే దాన్ని తనఖా ఉంచి రుణాలను తీసుకోవచ్చు. బ్యాం కులు బంగారం రుణాలను 7.2–7.8శాతానికే ఆఫర్ చేస్తున్నా యి. వీటి కాల వ్యవ« ది 1–3 ఏళ్లే ఉంటుంది. కాల వ్యవధి తర్వాత చెల్లించే వెసు లుబా టు లేకపోతే రెన్యువల్ చేసుకోవచ్చు. ఏ మార్గం లేకపోతే, ప్లాట్ చౌకగా వస్తుంటే చివరిగా వ్యక్తిగత రుణం కూడా ఒక ఆప్షన్ అవుతుంది. కాకపోతే 10–12శాతం వరకు వడ్డీ రేటు భరించాల్సి ఉంటుంది. -
పాత స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీలు, ప్రాంతం.. ఈ రెండింటికీ మధ్య దగ్గరి సంబంధం ఉంది. లొకేషన్ మీద ఆధారపడే రియల్ బూమ్ ఉంటుంది. ఇక, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్ ప్రాజెక్ట్లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా చాలా వరకు నిర్మాణ సంస్థలు రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తున్నాయి. పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నాయి. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు చేయాలంటే నివాస సముదాయాలకైతే వెయ్యి గజాల వరకు స్థలం అవసరం ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కిందే ఉంటాయి. డెవలపర్‌కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, హిమాయత్‌నగర్, బేగంపేట, అమీర్‌పేట్, బర్కత్‌పుర, తార్నాక, మారెడ్‌పల్లి, పద్మారావు నగర్ వంటి పాత రెసిడెన్షియల్ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 70 శాతం రీ–డెవలప్మెంట్ ప్రాజెక్టులే. ఎవరికేం లాభమంటే? స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్మెంట్ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలు త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం వస్తుంది. కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది. నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ.. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ల స్థలాల టైటిల్స్ క్లియర్‌గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, మోటార్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. బేసిక్ వసతులుంటాయ్.. స్థలం కొరత కారణంగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో బేసిక్ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్ వాటర్, వీడియో డోర్ ఫ్లోర్, టెర్రస్ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్ బ్యాకప్ వంటి వసతులుంటాయి. అపార్ట్మెంట్ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. పాత స్థలాల్లో కమర్షియల్ కూడా.. ప్రధాన నగరంలో నిర్మిస్తున్న రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్డుకు ఉండే పాత ఇళ్లు, చిన్న చిన్న హోటళ్లు, పాత థియేటర్లున్న ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. గతంలో రోడ్డు మీదుండే హోటళ్లు, పాత ఇళ్లు మెట్రో పిల్లర్ల కారణంగా కొంత ఇరుకుగా మారాయని దీంతో ఆయా స్థలాల యజమానులు రీ–డెవలప్మెంట్కు ముందుకొస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న రోడ్డు వెడల్పు, మున్సిపల్ నిబంధన ప్రకారం రీ–డెవలప్మెంట్ కమర్షియల్ నిర్మాణాలుంటాయి. రీ–డెవలప్మెంట్ ఎందుకంటే? సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్థిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్మెంట్ కోసం ముందుకొస్తారని ఓ డెవలపర్ తెలిపారు. ఇవే కాకుండా.. ♦ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్మెంట్కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. ♦ పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటికి ట్రెండ్స్‌కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. ♦ రీ–డెవలప్మెంట్కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్ నుంచి మార్కెట్ విలువ 10–15 శాతం వరకు నాన్ రీఫండబుల్ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. ♦ స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్‌ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది. ♦ స్థలం, అసెట్స్ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. -
అంత సమయం ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాద దాడిలో మృతిచెందిన ఐఎఫ్ఎస్ అధికారి వి.వెంకటేశ్వర్రావు కుటుంబానికి ఇంటిస్థలం అప్పగింతకు మూడు నెలల సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభు త్వం కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దాదాపు 12 ఏళ్లుగా బాధిత కుటుంబం స్థలం కోసం ఎదురు చూస్తోందని, అంత సమయం ఇవ్వలేమని, 3 వారాల్లో ఇంటి స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భరణి లేఔట్లో కేటాయించనున్న ప్లాట్ నంబర్ 54ను వారం రోజుల్లో వెంకటేశ్వర్రావు భార్య మాలతీరావుకు చూపించాలని, ఆ ప్లాట్ తీసుకునేందుకు ఆమె అంగీకరిస్తే మరో 2 వారాల్లో కేటాయించాలని, ఆగస్టు 23లోగా ప్లాట్ అప్పగింతకు సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొంటూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తన భర్త 2008లో తీవ్రవాదుల దాడిలో చనిపోయారని, ఇంటి స్థలం కేటాయిస్తూ 2014లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసినా ఇప్పటికీ స్థలం అప్పగించలేదంటూ మాలతీరావు రాసిన లేఖను ధర్మాసనం గతంలో సుమోటో పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. మాలతీరావు అంగీకరిస్తే భరణి లేఔట్‌లోనే గతంలో కేటాయించిన ప్లాట్ నంబర్ 58 బదులుగా 475 గజాల స్థలం ఉన్న ప్లాట్ నంబర్ 54 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి నివేదించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించడంతో...కనీసం 4 వారాల సమయం అయినా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఆగస్టు 23లోగా ప్లాట్ కేటాయింపు ప్రక్రియ పూర్తిచేసి మాలతీరావుకు అప్పగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
దేవుడి పేరుతో నాటకం.!
నిజామాబాద్, మోర్తాడ్(బాల్కొండ): తాను కోరిన ధరకు ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని విక్రయించలేదనే అక్కసుతో ఒక నాయకుడు ఆ ఇంటి స్థలం ముందు దేవుడు వెలిసాడనే నాటకాన్ని మొదలు పెట్టడంతో బాధితురాలు లబోదిబోమంటుంది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలతో వ్యాపారం చేసే భూ భకాసురుల ఆగడాలకు అంతులేకుండా పోతుందనేందుకు దేవునిపేరుతో జరుగుతున్న నాటకమే నిదర్శనం. మోర్తాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని భగత్‌సింగ్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్లాట్లను కేటాయించారు. కొంత మంది ఇండ్లు నిర్మించుకోగా మరికొందరు తమ ఆర్థిక పరిస్థితి బాగులేక పోవడంతో ఇంటి నిర్మాణాలను మధ్యలోనే నిలపివేశారు. అయితే ఈ కాలనీలో ఉండే కొందరు నాయకులు యథేచ్ఛగా ఇంటి స్థలాలను, నిర్మించిన ఇండ్లను కొనుగోలు చేసి విక్రయించడం చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఎక్కువ ధరకు విక్రయించి తమ జేబులు నింపుకుంటున్నారు. అయితే ఇటీవల లక్ష్మి అనే మహిళ తనకు కేటాయించిన స్థలంలో ఆమె పిల్లర్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసింది. అంతలోనే ఆమె దత్తత తీసుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసింది. అయితే ఈ సమయంలో ఓ నాయకుడు ఆమెను ఇందిరమ్మ ప్లాట్‌ను విక్రయించాలని వత్తిడి చేశాడు. దీనికి సదరు మహిళ అంగీకరించకపోవడంతో తనకు ప్లాట్ దక్కడం లేదని కక్ష పెంచుకున్నాడు. రాత్రికి రాత్రే బాధిత మహిళకు సంబంధిచిన ప్లాట్‌లో ఉన్న చెట్టుకింద బండరాయిని పాతించి దేవుడు వెలిసినట్లు తెల్లవారు పూజలు జరిపించారు. ఆలయం ఉన్నచోట ఇంటి నిర్మాణం చేయరాదనే భయాన్ని సృష్టించాడు. అయితే తనకు స్థలంను కేటాయించిన సమయంలో ఎలాంటి దేవుని విగ్రహం లేదని తాను ప్లాటును విక్రయించడానికి అంగీకరించకపోవడంతోనే తనపై కోపంతో నాటకం ఆడుతున్నారని ఆ మహిళ ఆరోపిస్తోంది. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు అండగా నిలువాల్సిన వారు ప్లాటుపై కన్నేసి దేవుని పేరుతో నాటకం ఆడటాన్ని ఆమె దుయ్యట్టారు. ఇప్పటికైనా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్ల స్థలాల విషయంలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. దేవుడు వెలిశాడని వేధిస్తున్నారు.. నాకు ఇందిర మ్మ ఇంటి స్థ లం కేటాయించినప్పుడు ఎ క్కడ కూడా దే వుని విగ్రహం లేదు. ఇంటి ప్లాట్‌ను విక్రయించడా నికి అంగీకరించకపోవడంతో కొంద రి ప్రోద్బలంతో కాలనీలోని ఒక నా యకుడు దేవుడు వెలిసినట్లు నాట కం ఆడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో బాధల్లో ఉన్న నాకు ఎవరు దిక్కు. అధికారులు స్పందించి దీనిపై విచా రణ జరిపించాలి. – లక్ష్మి,ఇందిరమ్మ లబ్ధిదారు, మోర్తాడ్ -
హెచ్ఎండీఏ ప్లాట్ల వేలానికి వేళాయె!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరా భివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ప్లాట్ల వేలానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అభివృద్ధి చేసిన లే ఔట్లలో 120 ప్లాట్లను ఈ–వేలం వేయనున్నారు. సంక్రాంతి తర్వాత ఈ–వేలం ద్వారా ప్లాట్లు వేలం వేయాలని కమిషనర్ టి.చిరంజీవులు నిర్ణయించారు. వీటి ద్వారా దాదాపు రూ.200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆయా లేఔట్లలో ఉన్న 160 స్థలాలను మార్కింగ్ చేసిన అధికారులు వాటిని జీపీఎస్ పద్ధతిన జియో ట్యాగింగ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జీపీఎస్ లొకేటర్ ద్వారా ప్లాట్ల ఆకృతులను తెలుసుకోవాలని భావిస్తున్నారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఈ పనులు రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు. రియల్ బూమ్ ఉన్నప్పుడు 24 లేఅవుట్లను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. వీటిలో ఆరు లేఔట్లలో అన్ని ప్లాట్లు అమ్ముడవగా, మిగిలిన 18 లే ఔట్లలో స్ట్రే బీట్లు, కర్వ్, ఓపెన్, గిఫ్ట్ ల్యాండ్ ప్లాట్లు ఉన్నాయి. వీటి విక్రయానికి ప్రభుత్వ అనుమతి వచ్చింది. మియాపూర్, చందానగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, మాదాపూర్, తెల్లపూర్, నల్లగండ్ల తదితర ప్రాంతాల్లోని ఈ లేఔట్లలో ఉన్న ప్లాట్లను గుర్తించి వేలం వేసేం దుకు అధికారుల కమిటీ కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రభుత్వ బేసిక్ విలువ కంటే 1.5 రేట్లు ఎక్కువగా కనీస ధరను పెట్టాలని ప్రతిపాదించారు. కొనుగోలుదారుడు డబ్బులు చెల్లించిన 30 రోజుల్లోపు హెచ్ఎండీఏ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కొనుగోలుదారుడు భరించాల్సి ఉంటుందని మెంబర్ ఎస్టేట్ అధికారులు తెలిపారు. ఎప్పుడైనా ఈ వేలం ప్రక్రియను రద్దుచేసే అధికారం హెచ్ఎండీఏ కమిషనర్‌కు ఉంటుంది. ఉప్పల్ భగాయత్‌తో కనకవర్షమే 18 లే ఔట్లలో ప్లాట్లు వేలం వేసిన తర్వాత ఉప్పల్ భగాయత్ ప్లాట్ల విక్రయాలపై హెచ్ఎండీఏ అధికారులు దృష్టి సారించనున్నారు. 2005లో ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్ కన్జర్వేషన్ అండ్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా ఉప్పల్ భగాయత్ రైతుల నుంచి 733 ఎకరాలను సేకరించింది. ఇందులో మెట్రో రైలు డిపో, జలమండలి మురుగు శుద్ధి నీటి కేంద్రం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత కేటాయించింది. మిగిలిన 413.32 ఎకరాల్లో 20,00,468 చదరపు గజాల్లో ఉప్పల్ భగాయత్ పేరు మీద లేఔట్‌ను అభివృద్ధి చేసింది. రాష్ట్ర విభజన, కోర్టు కేసులు, యూఎల్సీ వల్ల భూములు కోల్పోయిన రైతుల్లో 1,520 మందికి గత ఏడాది మార్చిలో లాటరీ రూపంలో ప్లాట్లు కేటాయించారు. మిగిలిన 1,25,963 చదరపు అడుగుల్లో ఉన్న ప్లాట్లను ఇప్పుడు విక్రయించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. గజానికి ధరను రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు నిర్ణయించారు. దాదాపు 350 నుంచి రూ.500 కోట్ల వరకు హెచ్ఎండీఏకు ఆదాయం రానుంది. -
షాద్‌నగర్‌లో 4 ఫాం ప్లాట్స్ ప్రాజెక్ట్‌లు
స్పేస్ విజన్ సీఎండీ టీవీ నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తు అవసరాల కోసం హైదరాబాద్‌లోఓ ప్లాట్ కొనాలనే కోరిక శ్రీనివాస్‌ది. కాకపోతే రోజూ సైట్‌కెళ్లి చూసుకునే ప్లాట్‌నే రాత్రికి రాత్రే కబ్జా చేసే నగరంలో కొనాలంటేనే కాసింత భయం. ఇలాంటి పరిస్థితి ఒక్క శ్రీనివాస్‌దే కాదు మనలో చాలా మందిదే. అయితే కొనుగోలుదారులకు ఇలాంటి చిక్కులేవీ లేకుండా ప్లాట్‌పై 24 గంటలు నిఘా వేయటమే కాకుండా మీ స్థలంలో చెట్లను పెంచి వాటి లాభాలనూ కొనుగోలుదారులకు అందిస్తోంది స్పేస్ విజన్ ఎడిలైఫ్. షాద్‌నగర్‌లోని పోలేపల్లి సెజ్ కేంద్రంగా 4 భారీ వెంచర్లను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ సీఎండీ టీవీ నర్సింహారెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ⇒ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పెట్టుబడి పెట్టేవారికి ఆయా ప్లాట్లలో మలబార్ చెట్లు, సేంద్రీయ పండ్ల మొక్కలని పెంచి ఎక్కువ మొత్తంలో లాభం ఆర్జించేలా చేయడమే మా ప్రాజెక్ట్‌ల ప్రధాన ఉద్దేశం. అందుకే అభివృద్ధికి ఆస్కారమున్న షాద్‌నగర్ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. ఇప్పటికే ఈ ప్రాంతం ఎయిర్ కార్గో, ప్రోక్టర్ అండ్ గ్యాంబెల్, నాట్కో వాటితో పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ⇒ పోలేపల్లి సెజ్‌కు దగ్గర్లో ఉద్దండపూర్‌లో 110 ఎకరాల్లో గ్రీన్ ఎకర్స్ ఫాం ల్యాండ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో ఎకరం, అర ఎకరం యూనిట్ వారిగా విక్రయిస్తాం. ధర ఎకరానికి రూ.14 లక్షలు. ప్రతి ఎకరంలో 300 మలబార్, ఐదు రకాల 25 సేంద్రీయ పండ్ల మొక్కలను పెంచుతాం. ⇒ మొక్కల పెంపకం, నిర్వహణ కోసం ఎవర్ గ్రీన్ అగ్రో ఫామ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆయా మొక్కలు 6–8 ఏళ్లకు వాణిజ్య పరంగా విలువకొస్తాయి. ఆ తర్వాత వీటిని విక్రయించి కొనుగోలుదారులకు అదనపు ఆదాయాన్ని అందిస్తాం. వీకెండ్స్‌లో ఫాంహౌస్‌లో కొనుగోలుదారులు కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేందుకు వీలుగా క్లబ్ హౌస్‌ను కూడా నిర్మిస్తున్నాం. 24 గంటల పాటు పటిష్టమైన భద్రత, చెట్ల పెంపకం పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో చేయటం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. ⇒ ఇదే తరహాలో ఈర్లపల్లిలోనూ 100 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో ఎకరం ధర రూ.16 లక్షలు. ఈనెలాఖరు నాటికి మరో రెండు ఫాం ల్యాండ్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నాం. ముదిరెడ్డిపల్లిలో 130 ఎకరాలు, పొట్లంపల్లిలో 250 ఎకరాల్లో రానున్నాయి. వీటిల్లో సామాన్యులు సైతం కొనుక్కునేందుకు వీలుగా పావు ఎకరంలో కూడా యూనిట్లను విక్రయిస్తాం. ఫామ్ ప్లాట్స్ ప్రాజెక్ట్‌లే కాకుండా విట్యాల రామేశ్వరం దేవాలయం ఆనుకుని 300 ఎకరాల్లో ఆంబియెన్స్ పేరిట భారీ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇది డీటీసీపీ అనుమతి పొందిన ప్రాజెక్ట్. 147– 1,000 గజాల్లో ప్లాట్లుంటాయి. గజం ధర రూ.2,599. ఇందులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, స్పా, మెడిటేషన్ సెంటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్ వంటి వసతులెన్నో కల్పిస్తున్నాం. వాయిదాల రూపంలో కూడా ప్లాట్లను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు కోరితే రూ.9 లక్షలకు 650 చ.అ.ల్లో ఇళ్లను కూడా నిర్మించి ఇస్తాం. త్వరలోనే ఓఆర్ఆర్ గండిమైసమ్మ ప్రాంతంలో 12 ఎకరాల్లో ఇండిపెండెంట్ హౌజ్, విల్లా ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించనున్నాం. -
యూరి ఉగ్రదాడి ప్లాన్ ఇదే..
న్యూఢిల్లీ: యూరి సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉపయోగించిన మ్యాప్ ఒకటి భారత అధికారులకు చిక్కింది. ఆఫ్గనిస్తాన్, ఉత్తర పాకిస్తాన్ లలో ఉపయోగించే పాష్తో భాషలో ఉన్న ఆ మ్యాప్‌ను అధికారులు విశ్లేషించారు. దాడికి సంబంధించి ఉగ్రవాదులు ముందుగా రూపొందించుకున్న ప్లాన్ ఆ మ్యాప్ ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు ముందుగా ఆయుధాలు లేని ట్రూప్‌లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపాలని ప్లాన్ చేశారు. ఆ తరువాత బ్రిగేడ్ అడ్మినిస్ట్రేటీవ్ బ్లాక్ సమీపంలో ఉన్న మెడికల్ యూనిట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరికి ఆత్మాహుతికి పాల్పడి వీలైనంత ప్రాణనష్టం కలిగించాలనేది ఉగ్రవాదుల టార్గెట్‌గా ఉందని మ్యాప్ ద్వారా వెల్లడైంది. జైషే మహ్హద్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న సిపా-ఎ-సహబ పాకిస్తాన్(ఎస్ఎస్పీ) ఈ దాడిలో కిలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. ప్లాన్ ప్రకారం ముందుగా అడ్మినిస్ట్రేటీవ్ బ్లాక్‌లో ఇంధన ట్యాంకుల నుంచి డీజిల్‌ను బ్యారెల్స్లోకి నింపుతున్న నిరాయుధ సైనికులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడి జరిపారు. ఇక్కడ 3 నిమిషాల వ్యవధిలో 17 గ్రెనేడ్లను ఉగ్రవాదులు విసిరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అక్కడ ఉన్న డీజిల్ డంప్, టెంట్లకు మంటలంటుకొని 13 మంది సైనికులు సజీవదహనం కాగా 32 మందికి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. ఊహించని విధంగా తీవ్రమైన మంటలు చెలరేగడంతో అప్పటికప్పుడు టార్గెట్‌ను మార్చుకున్న ఉగ్రవాదులు నేరుగా సైనికుల శిబిరాల వైపు కదిలారు. ఆ సమయంలో అక్కడ ఉన్న 19 ఏళ్ల డోంగ్రా యూనిట్ సైనికుడు.. ఓ తీవ్రవాదిని హతమార్చాడు. మిగిరిన ముగ్గురు ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంగా అతడి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం సైనిక శిబిరాల్లో సేఫ్ పొజిషన్ తీసుకున్న ముగ్గురు ఉగ్రవాదులను సైనికులు కాల్చిచంపారు. -
ముప్పు తప్పాలంటే ముందే చూడాలి!
ఫ్లాటు కొనేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలేంటి? వాణిజ్య సముదాయాల్లో స్థలం కొనేవారు, అద్దెకిచ్చేవారు చూడాల్సిన వివరాలేంటి? ఫ్లాట్ కొనేటప్పుడు మోసపోతున్నామని ముందే తెలుసుకోవటమెలా? స్థిరాస్తి కొనేముందు ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలించాల్సిందే. లేకపోతే కష్టార్జితమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. త్వరలోనే స్థిరాస్తి రేట్లు పెరుగుతాయనో.. ఇప్పుడు కొనకుంటే అసలిక కొనలేమనో.. ఆఫర్లు, రాయితీలిస్తున్నారనో.. స్థిరాస్తి కొనుగోలులో తొందరపడొద్దు. సాక్షి, హైదరాబాద్ :అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, వాణిజ్య భవనంలో స్థలం కానీ కొనేటప్పుడు అమ్మే వ్యక్తి అసలు పత్రాల్ని చూపించమనండి. ఏదో ఒక సాకు చెప్పి.. పత్రాలు ప్రస్తుతం లేవని చెబితే కచ్చితంగా అనుమానించాల్సిందే. ఫ్లాట్ అమ్మే వ్యక్తికి ఆ ఆస్తిపై క్లియర్ టైటిల్ లేకపోవడమో, ఆస్తి పత్రాల్ని ఎక్కడైనా తాకట్టు పెట్టడమో జరిగిందని దానర్థం. కాబట్టి అసలు పత్రాల్ని చూశాకే అంతిమ నిర్ణయానికి రావాలి. ♦ స్థిరాస్తిని ఎవరి వద్ద కొనుగోలు చేశారన్న విషయాన్ని నిర్ణయించే యాజమాన్య హక్కుకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్ల పత్రాలు జిరాక్స్ కాపీలను ఇవ్వాలని కోరండి. అనుభవమున్న న్యాయవాదికి ఆ పత్రాలను చూపించి సలహా తీసుకోవటం మంచిది. ♦ ఇంతకుమందే ఆ స్థిరాస్తిపై రుణాలు తీసుకొని ఉంటే, వాటిని తీర్చేయమనండి. ఆ తర్వాతే కొనుగోలు చేయండి. అమ్మే వ్యక్తికి యాజమాన్య హక్కుపై ఎలాంటి వివాదాలు లేవని తెలిశాకే ముందడుగు వేయాలి. ♦ స్థానిక సంస్థల నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టారా అనేది తెలుసుకోవాలి. కట్టిన ఇంటినే విక్రయిస్తుంటే ఎన్ని అంతస్తులకు అనుమతి పొందారో కనుక్కోండి. నిర్మాణ నిబంధనల్ని అతిక్రమించి కట్టాడా అన్న విషయాన్ని తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. ♦ అపార్ట్మెంట్ అయితే ఎత్తు, సెట్‌బ్యాక్, సైడ్ బ్యాక్ విషయాల్ని నిర్మాణ నిబంధనలను అనుగుణంగా వదిలేశారా లేదా చూడండి. ♦ స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు బదిలీ రుసుం, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించండి. అదేవిధంగా అమ్మకందారులు ఆస్తి పన్ను, విద్యుత్, నీటి చార్జీలు, సొసైటీ చార్జీలు, నిర్వహణ రుసుం చెల్లించారా లేదా నిర్ధారణ చేసుకోవాలి. ♦ అసలు క్రయ ఒప్పంద పత్రం (సేల్ అగ్రిమెంట్)లో ఫ్లాట్ మున్సిపల్ అప్రూవ్డ్ ప్లాన్, ఫ్లాట్ విస్తీర్ణం, ఉమ్మడి స్థలాల వివరాలు, ఫ్లాట్ మొత్తం ధర వంటి వివరాలన్నీ ఉండాలి. ♦ మీరు కొనబోయే ఫ్లాట్ సహకార సంఘం పరిధిలో ఉంటే అసలు వాటా పత్రాలను పరిశీలించండి. వాటి ద్వారానే ఆ స్థిరాస్తి అసలు యజమాని ఎవరో తెలిసిపోతుంది. ♦ స్థిరాస్తికి సంబంధించి అసలు పత్రాలను తీసుకోవటం మరవొద్దు. ♦ బిల్డర్ పేరు ప్రఖ్యాతలనూ పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో అతను చేపట్టిన నిర్మాణాల గురించి తెలుసుకోవాలి. ♦ స్థిరాస్తి మొత్తం విలువను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అసలు ధరతో పాటూ స్టాంపు రుసుం, రిజిస్ట్రేషన్ చార్జీలు, బదిలీ రుసుం, సొసైటీ చార్జీలు, సదుపాయాలకు చెల్లించే మొత్తం ఇలా అనేక అంశాలను ముందే తెలుసుకోవటం ఉత్తమం. ♦ సదుపాయాల విషయానికొస్తే కావాల్సినంత నీటి సరఫరా, విద్యుత్తు, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకోవటం ముఖ్యం. వాస్తు వంటి అంశాలపై మీకు నమ్మకం ఉంటే ఫ్లాట్/ప్లాట్ కొనుగోలుకు ముందే నిపుణులతో పరిశీలింపజేసి నిర్మాణం అందుకు అనుగుణంగా ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోండి. ♦ మొక్కలకు పోసే నీరు రూఫ్ డెక్ సమీపంలోకి రాకుండా నిర్మించే డ్రైనేజీని వాస్తుకు అనుగుణంగా నిర్మించుకోవాలి. ఈ డ్రైనేజీలో నీరు నిలిచినా, అది కిందికి ఇంకకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ కాంక్రీట్ లేయర్‌ను నిర్మించాలి. -
భూసార పరీక్షలు విదేశీ కుట్ర
అమలాపురం/ కాకినాడ రూరల్: ‘భూమి తల్లిలాంటిది. తల్లి పాలు ఇచ్చినట్టు పంట చేనుకు నేలతల్లి పోషకాలందిస్తోంది. అటువంటి తల్లిపాలను పరీక్ష చేయడం న్యాయమేనా? దేశీయ ఆర్థిక విధానాలను విచ్ఛన్నం చేసే కుట్రలో భాగంగానే విదేశీయులు ఆధునిక సాగుపై రుద్దినదే భూసార పరీక్ష’ అని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో జరుగుతున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతుల్లో ఐదో రోజు గురువారం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ‘భూసార పరీక్ష రైతులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. భూమి ఉపరితలంపై ఆరు అంగుళాల మట్టిని తీసుకుని పరీక్షిస్తారు. దీంతో భూమిలో ఏమున్నదనేది ఎలా నిర్ధారిస్తారని ఆయన యూనివర్శిటీ శాస్త్రవేత్తలను, వ్యవసాయశాఖాధికారులను ప్రశ్నించారు. ‘భూసార పరీక్ష చేసిన తరువాత ఇచ్చే నివేదికలో మొదటిలైన్‌లోనే మీ భూమిలో 7.8 పీహెచ్ ఉందని ఉంటుంది. ఇది చాలా విచిత్రం. ఏ రైతుకు అర్థం కాదు’ అని గుర్తు చేశారు. -
సింహం సింగిల్‌గా వస్తుంది
సమ్‌థింగ్ స్పెషల్ ప్లాట్లలో సాధారణంగా సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని ఉంటాయి. అంతే కానీ, సింగిల్ రూమ్‌లో బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ వగైరాలు ఉండే ఫ్లాట్లు ఎక్కడా కనిపించవు. కానీ లండన్‌లో అలాంటి ఫ్లాట్ ఒకటి ఉంది. దానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. దాన్ని కొనేందుకు లేదా అందులో అద్దెకు ఉండేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. లండన్‌లోని సౌత్‌వెస్ట్ ప్రాంతంలో ఓ బిల్డింగ్ పైన ఉంది ఆ సింగిల్ రూం ఫ్లాట్. దాన్ని అద్దెకు తీసుకోవాలనుకుంటున్నా, లేక ఏకంగా ఫ్లాట్‌నే కొనుగోలు చేయాలనుకుంటున్నా బ్యాగ్ నిండా డబ్బులతో సిద్ధమయిపోవాల్సిందే. ఆ సింగిల్ రూం ధరెంతో తెలుసా? కొనుగోలుకైతే 110వేల పౌండ్లు.. అంటే సుమారు కోటి తొమ్మిది లక్షలు. అద్దెకైతే నెలకు దాదాపు యాభైవేలు. మరీ అంత ఎక్కువ ధరా అనుకునేవారు ఓ సారి ఆ రూం విశేషాలు తెలుసుకుంటే అదేం ఎక్కువ కాదు అనిపిస్తుంది. ఆ సింగిల్ రూం ఫ్లాట్ మొత్తం కలిపి 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అందులోనే కిచెన్, బెడ్రూం, బాత్రూం ఉంటాయి. బాత్రూం బాక్స్లా ఉంటుంది కానీ అందులో టాయిలెట్, సింక్, షవర్ అన్నీ ఉన్నాయి. కిచెన్‌లోనూ సింక్ ఉంది. అలాగే స్పేస్ వృథా కాకుండా ఉండేందుకు ఫోల్డెడ్ టేబుల్ కూడా ఉంది. అసలు ఆ ఫ్లాట్‌కు అంత డిమాండ్ రావడానికి కారణం అది ఆస్పత్రికి, కాలేజీకి దగ్గరగా ఉండటమే. దానిని సోషల్ మీడియాలో సేల్కు పెట్టినప్పటి నుంచి దాని విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదంతా వింటుంటే సింహం సింగిల్‌గా వస్తుంది అనే సినిమా డైలాగ్ గుర్తుకు రావడంలో వింతేముంది?