సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ప్లాట్‌లో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నా.. భవన యజమానులు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. 75 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా అధికారుల నుంచి ధ్రువీకరణ, పని ప్రారంభ ఉత్తర్వును పొందాలని, దీనికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పింది. తమ ప్లాట్‌లలో నిర్మాణ పనులను ఆపివేయాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నేరేడ్‌మెట్ వినాయకనగర్‌కు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్లలో తండ్రీ కొడుకులు, ప్లాట్‌ను రెండు భాగాలుగా విభజించారు. టీఎస్ బీపాస్ చట్టం–2020 ప్రకారం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కటి 40 చదరపు గజాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు. మరొక పిటిషనర్ 54 చదరపు గజాలలో నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే వీరి నిర్మాణాలపై పొరుగు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణాలను ఆపివేయాలంటూ జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. అయితే టీఎస్ బీపాస్ చట్ట ప్రకారం నిర్మాణాలను ప్రారంభించామని.. జీహెచ్‌ఎంసీ ఇచి్చన నోటీసులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. జీహెచ్‌ఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే సరిపోదని, దాని పరిశీలన తర్వాతే నిర్మాణంపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని టీఎస్ బీపాస్ చట్టంలోని సెక్షన్ 7 చెబుతోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత అధికారులు నిర్ణయం తీసుకోవడానికి 21 రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాత ఎలాంటి కారణం చూపకుండా దరఖాస్తును ఆపితే పిటిషనర్లు ముందుకు వెళ్లవచ్చని తెలిపారు.
కానీ, పిటిషనర్లు జనవరి 9న రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో అదే నెల 18న జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. టీఎస్ బీపాస్ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జీహెచ్‌ఎంసీ వాదనలను సమర్థించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ ప్లాట్‌లలో నిర్మాణానికి ప్రారంభ అనుమతి సర్టీఫికెట్ అవసరమని స్పష్టం చేశారు. అయితే వీటికి రూ.1 మాత్రమే నామమాత్రపు రుసుము ఉంటుందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ పొందవలసిన అవసరం ఉండదని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment