భూసార పరీక్షలు విదేశీ కుట్ర
అమలాపురం/ కాకినాడ రూరల్: ‘భూమి తల్లిలాంటిది. తల్లి పాలు ఇచ్చినట్టు పంట చేనుకు నేలతల్లి పోషకాలందిస్తోంది. అటువంటి తల్లిపాలను పరీక్ష చేయడం న్యాయమేనా? దేశీయ ఆర్థిక విధానాలను విచ్ఛన్నం చేసే కుట్రలో భాగంగానే విదేశీయులు ఆధునిక సాగుపై రుద్దినదే భూసార పరీక్ష’ అని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో జరుగుతున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతుల్లో ఐదో రోజు గురువారం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
‘భూసార పరీక్ష రైతులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. భూమి ఉపరితలంపై ఆరు అంగుళాల మట్టిని తీసుకుని పరీక్షిస్తారు. దీంతో భూమిలో ఏమున్నదనేది ఎలా నిర్ధారిస్తారని ఆయన యూనివర్శిటీ శాస్త్రవేత్తలను, వ్యవసాయశాఖాధికారులను ప్రశ్నించారు. ‘భూసార పరీక్ష చేసిన తరువాత ఇచ్చే నివేదికలో మొదటిలైన్‌లోనే మీ భూమిలో 7.8 పీహెచ్ ఉందని ఉంటుంది. ఇది చాలా విచిత్రం. ఏ రైతుకు అర్థం కాదు’ అని గుర్తు చేశారు.