సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు ఇంటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సొంత జాగా ఉన్నవారితో పాటు లేని పేదలకు కూడా గృహ వసతి కల్పించే అంశంపై కసరత్తు ప్రారంభించింది. సొంత జాగా ఉంటే ఇళ్ల నిర్మాణానికి నిధులు, భూమి లేని వారికి నిర్ధారిత పరిమాణంలో స్థలాల కేటాయింపు దిశగా ఆలోచన చేస్తోంది.
దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశమై విధివిధానాలను ఖరారు చేయనున్నారు. సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించటం ద్వారా వారే ఇళ్లను నిర్మించుకునే పథకానికి గతేడాది బడ్జెట్‌లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే విధివిధానాలు ఖరారు చేయకపోవటంతో ఆ బడ్జెట్ కాలంలో నిధులు విడుదల చేయలేదు. తాజా బడ్జెట్‌లో 4 లక్షల ఇళ్లను మళ్లీ ప్రతిపాదించారు.
ఎమ్మెల్యేల ఒత్తిడి నేపథ్యంలో..
దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకం రూపురేఖలు గొప్పగా ఉన్నప్పటికీ, ముందుకు సాగని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారు లక్షల్లో ఉండగా, ఈ ఇళ్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఒకరికి ఇస్తే వంద మంది గొడవకు దిగే పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆశించిన ప్రయోజనం లభించడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. పేదల ఇళ్ల విషయంలో వెంటనే దిద్దుబాటు అవసరమంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కేటీఆర్, హరీశ్‌లకు వివరించారు. దీంతో దీనిపై ప్రభుత్వం కస రత్తు ప్రారంభించింది. ఇందుకోసం అసైన్డ్ భూములను వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
సొంత స్థలాలు లేని వారి కోసం..
సొంత స్థలాలు ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి బడ్జెట్‌లోనూ రూ.12 వేల కోట్ల నిధులు కేటాయించింది. తద్వారా నాలుగు లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. అయితే కేవలం సొంత జాగా ఉన్నవారికే ఇస్తే జాగా లేని వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో సొంత స్థలాలు లేనివారి వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది.
అలా స్థలాలు ఇవ్వాల్సి వస్తే ఎంతమంది లబ్ధిదారులుంటారు? ఒక్కొక్కరికి 60 గజాల నుంచి 80 గజాల వరకు అందించాలంటే ఎంత భూమి అవసరమవుతుంది? సరిపడా ప్రభుత్వ భూమి ఉందా? లేని పక్షంలో ఎంతభూమిని సమీకరించాల్సి వస్తుంది? వినియోగంలో లేని అస్సైన్డ్ భూములను వాడుకునే వీలుందా?.. తదితర అంశాలపై వివరాలను వచ్చే సోమవారం నాటికి అందజేయాల్సిందిగా తాజాగా అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఈ వివరాలు అందిన తరువాత తుది నిర్ణయం తీసుకుని భారీ స్థాయిలో ఒకే దఫాలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment