సాక్షి, హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, ఇతర అవసరాలకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ, పారిశ్రామికవాడల నిర్మాణం కోసం వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించి తీసుకుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు.
ఈ ప్రాంతంలో ఎకరా రూ.4–5 కోట్ల విలువ చేస్తుందన్నారు. బుద్వేల్‌లో 164 ఎకరాల అసైన్డ్ భూములు సేకరించిన ప్రభుత్వం ప్లాట్లు వేసి అమ్ముతోందని ఆరోపించారు. అసైన్డ్ భూములు అసైనీల వద్దే ఉండనీయాలని, ధరణిలో వారికి హక్కులు కల్పిం చాలని కోరారు. తెలంగాణ ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు.
పీపుల్స్ మార్చ్ పేరుతో ఇటీవల నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం లక్షల మంది ప్రజలు నిరీక్షిస్తున్నారని, ప్రతి గ్రామంలో భూములను సేకరించి ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని అన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులందరికీ పోడు పట్టాలు అందలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనిపై అధికార బీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఉద్యోగాలు లేక కష్టాల్లో యువత..
ఎమ్మెస్సీ, ఎంఏ, బీఈడీ వంటి ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు లభించక గ్రామాల్లో ఇస్త్రీ షాపులు, సోడా దుకాణాలు నడుపుకుంటూ తీవ్ర ఆవేదనలో ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొనగా, మళ్లీ బీఆర్‌ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం కలగజేసుకుని.. ‘భట్టి గారూ..మీరు ఆరు మాసాల పాదయాత్ర మొత్తం చెప్పడానికి సమయం సరిపోదు’అని సూచన చేశారు. అనంతరం భట్టి ప్రసంగం కొనసాగిస్తూ.. వర్సిటీల్లో అధ్యాపకులను భర్తీ చేయాలని, ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు లేక బడులు మూతబడుతున్నాయని, తక్షణమే డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు సరే.. కాల్వలు ఏవీ?
రాష్ట్రంలో వివిధ కొత్త ప్రాజెక్టులను నిర్మించిన ప్రభుత్వం వాటి కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు సరఫరా కావడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరం కింద కాల్వలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కడెం వంటి పాత ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపునకు గురి అవుతున్న చెన్నూరు, భూపాలపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ప్రజలకు పునరావాసం కల్పిం చి, పరిహారం చెల్లించాలని కోరారు.
గిరిజనబంధు, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి..
గిరిజనబంధుతో పాటు బీసీలకు సబ్‌ప్లాన్, మైనారిటీలకు సచార్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కి 15 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, పంట రుణమాఫీ సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment