Assigned
-
ఖమ్మం మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరానికి చెందిన రామసహాయం బుచ్చిరెడ్డి, నిర్మల దంపతుల కుమార్తె రామసహాయం రాధిక అమెరికాలోని కొలంబస్లో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కాగా, రాధికను అమెరికాలో ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్మెంట్ ఫైనాన్స్ అడ్వయిజరీ బోర్డు సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారని ఆమె తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు.రాధికకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన రఘురాంరెడ్డితో 2006లో వివాహం జరగగా, ఆయనతోపాటు అమెరికా వెళ్లారు. అక్కడ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరి అంచెలంచలుగా కంపెనీలో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. 2009 నుంచి వివిధ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో రాధికకు ఈ అవకాశం వచ్చిందని బుచ్చిరెడ్డి తెలిపారు. 2026 వరకు అమె ఈ పదవిలో కొనసాగుతారని చెప్పారు. -
‘అసైన్డ్’ రిజిస్ట్రేషన్ల నిలిపివేత
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం పేదలకు అసైన్డ్ భూములపై కల్పించిన యాజమాన్య హక్కులను హరించేలా కూటమి సర్కారు చర్యలకు దిగింది. యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా గత ప్రభుత్వం 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై విచారణ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించింది. యాజమాన్య హక్కులు పొందిన తర్వాత రిజి్రస్టేషన్లు జరగని లేదా ఎలాంటి లావాదేవీలు జరగని భూముల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయాలంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరిగిన భూములపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పేర్కొంది.ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా శనివారం కలెక్టర్లు, రిజి్రస్టార్లు, సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులర్ జారీ చేశారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల వల్ల అనర్హులు లబ్ధి పొందారని, రిజిస్ట్రేషన్ల చట్టం 1908 సెక్షన్ 22ఏకి విరుద్ధంగా హక్కులిచ్చారని అందులో పేర్కొన్నారు. సామాజిక, పోరంబోకు భూములపై అక్రమంగా హక్కులిచ్చారని, అనంతరం వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులిచి్చన చోట్ల విచారణ నిర్వహించి దీనిద్వారా ఎక్కడైనా భూకబ్జాలు జరిగాయా? హక్కుల నిర్థారణలో వాస్తవికత ఉందో లేదో నిర్థారించేందుకు వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు.మూడు నెలలో వెరిఫికేషన్ పూర్తి కావాలని, ఇందుకోసం కలెక్టర్లు విచారణ సంస్థలను ఉపయోగించుకోవాలని సూచించారు. విచారణ సందర్భంగా ఏ కేసులోనైనా యాజమాన్య హక్కుల కల్పన అక్రమంగా జరిగినట్లు తేలితే వాటిని రద్దు చేసి ఆ భూమిని తిరిగి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చేలా రీ క్లాసిఫికేషన్ చేయాలని ఆదేశించారు. యాజమాన్య హక్కులిచి్చన భూములను ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే ఇకపై వాటికి రిజిస్ట్రేషన్లు చేయవద్దని సూచించారు. విచారణలో యాజమాన్య హక్కులు సక్రమంగానే ఇచి్చనట్లు తేలినా వాటిపై రిజిస్ట్రేషన్లకు అనుమతించవద్దని స్పష్టం చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి ఈ ఆదేశాలు వర్తించవని తెలిపారు. -
ప్రభుత్వ భూములూ మింగేశారు!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు అమరావతిలో సాగించిన భూదోపిడీలో తవ్వుతున్న కొద్దీ కొత్త అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయట పడుతున్నాయి. అసైన్డ్ భూములే కాకుండా ప్రభుత్వ భూములనూ వదల్లేదు. చంద్రబాబు, పి.నారాయణ, లోకేశ్ త్రయం బినామీల పేరిట కొల్లగొట్టిన భూముల జాబితా చాంతాడులా సాగుతోంది. అసైన్డ్ రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వారి భూములను రాజధాని కోసం టీడీపీ సర్కారు తీసుకుంటుందని బెదిరించి రూ.3,370 కోట్ల విలువైన 617 ఎకరాలను కొల్లగొట్టిన కుంభకోణాన్ని ‘సాక్షి’ ఇప్పటికే బట్టబయలు చేయడం తెలిసిందే. అయితే అసైన్డ్ రైతులే కాకుండా అమరావతిలోని ప్రభుత్వ భూములను సైతం తమ బినామీల పేరిట నమోదు చేసి చంద్రబాబు బృందం భూదోపిడీకి పాల్పడటం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట హస్తగతం చేసుకున్నారు. అనంతరం భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లను కాజేశారు. చంద్రబాబు, నారాయణ, లోకేశ్ అసైన్డ్ భూ దోపిడీలో ఆ అవినీతి పర్వం ఇదిగో ఇలా ఉంది.... రెండు కేటగిరీలుగా వర్గీకరించి.. రాజధాని పేరుతో అమరావతి పరిధిలో సర్వే చేయించిన చంద్రబాబు, నారాయణ దృష్టి ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూములపై పడింది. అసైన్డ్ భూములను 1 నుంచి 4 కేటగిరీల కింద విభజించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి తీసుకోగా ఎవరి ఆధీనంలోనూ లేని ప్రభుత్వ భూములను దక్కించుకునేందుకు మరో పన్నాగం పన్నారు. ఆ ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని రైతుల ఆధీనంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించారు. వాటిని అసైన్డ్ భూముల జాబితాలో 5, 6 కేటగిరీల కింద పేర్కొన్నారు. అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5 కింద, అన్యాక్రాంతమై అభ్యంతరాలున్న భూములను కేటగిరీ 6 కింద చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. కేటగిరీ 5 కింద భూములకు 500 చ.గజాల నివాస స్థలం, 100 చ.గజాల వాణిజ్య స్థలాన్ని ప్యాకేజీగా పేర్కొన్నారు. కేటగిరీ 6 కింద భూములకు 260 చ.గజాల నివాస స్థలాన్ని ప్యాకేజీగా ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఎకరా కంటే తక్కువ ఉన్న భూములకు కూడా కనీసం ఎకరా ప్యాకేజీ వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. 328 ఎకరాలు... రూ.760.25 కోట్ల ప్యాకేజీ అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. అమరావతి పరిధిలో కేటగిరీ 5 కింద 237.60 ఎకరాలను గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆధీనంలో ఉన్నట్టుగా చూపించారు. ఇక కేటగిరీ 6 కింద 90.52 ఎకరాలను చూపించారు. ఆ భూములు 227 మంది స్వాధీనంలో ఉన్నట్టుగా కనికట్టు చేశారు. వాస్తవానికి ఆ రెండు కేటగిరీల భూములు ఎవరి ఆధీనంలోనూ లేవు. కానీ ఆ భూములు 522 మంది తమ బినామీల ఆధీనంలో ఉన్నట్టుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీని కొల్లగొట్టారు. అమరావతిలో ప్యాకేజీ ప్రకటించే నాటికి నివాస స్థలం చ.గజం రూ.30 వేలు, వాణిజ్య స్థలం చ.గజం రూ.50 వేలు చొప్పున మార్కెట్ ధర పలికింది. అమరావతి నిర్మాణం పూర్తయితే మార్కెట్ ధర మరింత పెరుగుతుంది. అప్పటి ధరనే తీసుకుంటే కేటగిరీ 5 కింద ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల విలువైన నివాస స్థలం, రూ.50 లక్షలు విలువైన వాణిజ్య స్థలం వెరసి రూ.2 కోట్లు చొప్పున ప్యాకేజీ దక్కింది. ఆ ప్రకారం కేటగిరీ 5 కింద ఉన్న 295 మంది రూ.590 కోట్ల విలువైన స్థలాలను పొందారు. కేటగిరీ 6 కింద ఒక్కొక్కరికీ రూ.75 లక్షలు విలువైన నివాస స్థలం ఇచ్చారు. ఆ ప్రకారం 227 మందికి రూ.170.25 కోట్ల విలువైన స్థలాలు దక్కాయి. మొత్తం మీద కేటగిరీ 5, 6లలో రైతులుగా చూపించిన తమ బినామీలు 522 మంది ముసుగులో చంద్రబాబు, నారాయణ రూ.760.25 కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టినట్లు స్పష్టమైంది. ఆ గ్రామాల్లో ఒక్కరూ లేరు అమరావతి భూదోపిడీపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తులో అసైన్డ్ భూకుంభకోణం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న భూముల రికార్డులు, సీఆర్డీయే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన రైతుల జాబితాలను సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటగిరీ 5, 6లలో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరు కూడా అమరావతి గ్రామాల్లోనే లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించిన రైతులెవరూ లేరు. భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కాజేసేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. -
‘అసైన్డ్’ రైతులకు యాజమాన్య హక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేద రైతులకు వారి అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై వాటి యజమానులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఏపీ అసైన్డ్ భూముల(ప్రొబిషన్ ట్రాన్స్ఫర్) చట్టం–1977 సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే అవకాశాన్నిచ్చింది. సోమవారం శాసన సభ మూడో రోజు సమావేశాల్లో మంత్రులు ప్రవేశపెట్టిన 10 బిల్లులతో పాటు బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానానికీ సభ ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా ప్రైవేటు వర్సిటీలు కూడా అంతర్జాతీయంగా టాప్ 100 వర్సిటీలతో కలిసి సంయుక్త సర్టిఫికేష¯న్ తప్పనిసరిగా అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం–2016ను సవరించింది. ఇందులో కొత్తగా ఏర్పడే వర్సిటీల్లో 65:35 నిష్పత్తిలో ప్రభుత్వ కోటా (35శాతం సీట్లు) కింద పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని అధ్యాపక, మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి రాతపూర్వక పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (వర్సిటీల్లో నియామకాలకు అదనపు ఫంక్షన్లు) చట్టం–2023లో సవరణ చేసింది. నిరుపేదలకు భూ పంపిణీ రాష్ట్రంలో భూదాన్–గ్రామదాన్ బోర్డును ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసేలా చట్టాన్ని సవరించింది. భూదాన్ ఉద్యమకర్త వినోభా భావే, ఆయన నిర్దేశించిన వ్యక్తుల సమ్మతి ప్రకారమే భూదాన్ – గ్రామదాన్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వినోభా భావే మరణించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. ఆయన నిర్దేశించిన వ్యక్తులు ఎవరనేది స్పష్టత లేకపోవడంతో బోర్డు ఏర్పాటుకు అవాంతరాలేర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే బోర్డును ఏర్పాటు చేసి భూదాన్ – గ్రామదాన్లోని భూమిని నిరుపేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టేలా చట్టాన్ని సవరించింది. డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి జఫ్రీన్‌కు ఉద్యోగం రాష్ట్రానికి చెందిన డెఫ్ ఒలింపిక్ విజేత, అంతర్జాతీయ డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్‌కు వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్–1 స్థాయి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామకాలు క్రమద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపాన్ని హేతు బద్ధీకరించే చట్టం–1994ను సవరించింది. జఫ్రీన్ క్రీడారంగంలో దేశానికి అందించిన విశిష్ట సేవలను గౌరవిస్తూ ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది. -
అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, ఇతర అవసరాలకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ, పారిశ్రామికవాడల నిర్మాణం కోసం వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించి తీసుకుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.4–5 కోట్ల విలువ చేస్తుందన్నారు. బుద్వేల్‌లో 164 ఎకరాల అసైన్డ్ భూములు సేకరించిన ప్రభుత్వం ప్లాట్లు వేసి అమ్ముతోందని ఆరోపించారు. అసైన్డ్ భూములు అసైనీల వద్దే ఉండనీయాలని, ధరణిలో వారికి హక్కులు కల్పిం చాలని కోరారు. తెలంగాణ ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఇటీవల నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం లక్షల మంది ప్రజలు నిరీక్షిస్తున్నారని, ప్రతి గ్రామంలో భూములను సేకరించి ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని అన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులందరికీ పోడు పట్టాలు అందలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనిపై అధికార బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉద్యోగాలు లేక కష్టాల్లో యువత.. ఎమ్మెస్సీ, ఎంఏ, బీఈడీ వంటి ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు లభించక గ్రామాల్లో ఇస్త్రీ షాపులు, సోడా దుకాణాలు నడుపుకుంటూ తీవ్ర ఆవేదనలో ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొనగా, మళ్లీ బీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం కలగజేసుకుని.. ‘భట్టి గారూ..మీరు ఆరు మాసాల పాదయాత్ర మొత్తం చెప్పడానికి సమయం సరిపోదు’అని సూచన చేశారు. అనంతరం భట్టి ప్రసంగం కొనసాగిస్తూ.. వర్సిటీల్లో అధ్యాపకులను భర్తీ చేయాలని, ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు లేక బడులు మూతబడుతున్నాయని, తక్షణమే డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సరే.. కాల్వలు ఏవీ? రాష్ట్రంలో వివిధ కొత్త ప్రాజెక్టులను నిర్మించిన ప్రభుత్వం వాటి కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు సరఫరా కావడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరం కింద కాల్వలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కడెం వంటి పాత ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపునకు గురి అవుతున్న చెన్నూరు, భూపాలపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ప్రజలకు పునరావాసం కల్పిం చి, పరిహారం చెల్లించాలని కోరారు. గిరిజనబంధు, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి.. గిరిజనబంధుతో పాటు బీసీలకు సబ్‌ప్లాన్, మైనారిటీలకు సచార్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కి 15 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, పంట రుణమాఫీ సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయించాలని డిమాండ్ చేశారు. -
అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తాం
కోటబొమ్మాళి: రాష్ట్రంలోని 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అసైన్డ్ భూములు పేదలకు చెందేలా... జిరాయితీ భూముల మాదిరిగానే పేదలు అన్ని హక్కులు పొందేలా ఆర్డినెన్స్ తెస్తామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రేగులపాడులో రూ.80 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లను శుక్రవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ అనుకున్న పనిని ఎలాగైనా సాధించగలిగే ధీరుడు సీఎం వైఎస్ జగన్ అని, ఎలాంటి వాగ్దానాన్ని అయినా ఆయన అమలు చేయగలరని ప్రశంసించారు. అమరావతిలో ఒకేసారి 50వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరుచేసి సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు నివేశన స్థలాలు, ఇళ్లు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట... అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే చంద్రబాబు అండ్‌కో ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని పార్టీలు ఏకమైనా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనే మళ్లీ సీఎం అవుతారని ధర్మాన స్పష్టంచేశారు. సచివాలయ వ్యవస్థతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమూల మార్పులు తెచ్చామన్నారు. కరోనా సమయంలో వలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. -
‘అసైన్డ్’ వివరాలను రిజిస్ట్రార్లకు పంపాలి
♦ విస్తృత ధర్మాసనం తీర్పును అమలు చేయాల్సిందే ♦ ఆ తీర్పు ఆధారంగా పిటిషనర్ల డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకోండి ♦ గడువులోగా నిషేధిత భూముల జాబితా రూపొందించండి ♦ ఏపీ, తెలంగాణ అధికారులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితా తయారీకి సంబంధించి విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పనిసరిగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రెవెన్యూ, దేవాదాయ శాఖలు, వక్ఫ్ బోర్డు అధికారులను హైకోర్టు ఆదేశించింది. విస్తృత ధర్మాసనం నిర్దేశించిన గడువులోగా నిషేధిత భూముల జాబితాను తయారు చేసి, ఆయా సబ్ రిజిస్ట్రార్లకు పంపాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇతరులకు బదలాయించరాదన్న నిబంధనలతో కేటాయించిన అసైన్డ్ భూముల జాబితాను సైతం సబ్ రిజిస్ట్రార్లకు పంపాలని పేర్కొంది. 1954కు ముందే అసైన్డ్ భూములను పొంది ఉంటే వాటి వివరాలను, ఆ భూములకు 1977 అసైన్డ్ భూముల చట్టం వర్తించే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను రెవెన్యూ అధికారుల ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22ఎ కింద నిషేధిత భూముల జాబితాను తాజా వివరాలతో సవరించే(అప్డేట్) ముందు పిటిషనర్లు సమర్పించే వివరాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఒకవేళ 1954 కంటే ముందు అసైన్ చేసిన భూములను వేటినైనా నిషేధిత జాబితాలో చేర్చాలని నిర్ణయిస్తే, అందుకు సంబంధించి సెక్షన్ 22ఎ(1)(ఈ) కింద నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలుంటే వారు చట్టం ప్రకారం ముందుకెళ్లవచ్చని వెల్లడించింది. ఆ డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకోండి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా తమ ముందున్న పిటిషన్లు, అప్పీళ్లలో ఏవైనా డాక్యుమెంట్లను అధికారులు రిజిస్టర్ చేసి ఉంటే, అది విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా అధికారులు తీసుకునే తుది నిర్ణయానికి లోబడి ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ల విషయంలో విస్తృత ధర్మాసనం తీర్పునకు అనుగుణంగా ఆ రిజిస్ట్రేషన్లను ఖరారు చేయడమా? లేక రద్దు చేయడమా? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రేషన్ అధికారులకు స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియను విస్తృత ధర్మాసనం నిర్దేశించిన నాలుగు నెలల గడువు పూర్తయిన తరువాత నుంచి మూడు నెలల్లోగా పూర్తి చేయాలంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భూముల వర్గీకరణ, రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1,633 వ్యాజ్యాలను జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఎ విషయంలో ఇటీవల ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలు, తీర్పును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తూ తీర్పునిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. నిషేధిత భూముల జాబితాను రూపొందించేందుకు విస్తృత ధర్మాసనం నిర్ధేశించిన గడువు పూర్తయిన తరువాత ఈ వ్యాజ్యాల్లోని పిటిషనర్లు, తమ భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ల ముందు డాక్యుమెంట్లను సమర్పించవచ్చని తెలిపింది. సబ్ రిజిస్ట్రార్లు విస్తృత ధర్మాసనం తీర్పును పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. డాక్యుమెంట్లను సమర్పించేటప్పుడు వాటితోపాటు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాపీని కూడా జత చేయాలని పిటిషనర్లను ఆదేశించింది.