కోటబొమ్మాళి: రాష్ట్రంలోని 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అసైన్డ్ భూములు పేదలకు చెందేలా... జిరాయితీ భూముల మాదిరిగానే పేదలు అన్ని హక్కులు పొందేలా ఆర్డినెన్స్ తెస్తామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రేగులపాడులో రూ.80 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్‌లను శుక్రవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ అనుకున్న పనిని ఎలాగైనా సాధించగలిగే ధీరుడు సీఎం వైఎస్ జగన్ అని, ఎలాంటి వాగ్దానాన్ని అయినా ఆయన అమలు చేయగలరని ప్రశంసించారు.
అమరావతిలో ఒకేసారి 50వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరుచేసి సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు నివేశన స్థలాలు, ఇళ్లు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట... అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే చంద్రబాబు అండ్‌కో ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని పార్టీలు ఏకమైనా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనే మళ్లీ సీఎం అవుతారని ధర్మాన స్పష్టంచేశారు. సచివాలయ వ్యవస్థతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమూల మార్పులు తెచ్చామన్నారు. కరోనా సమయంలో వలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment