ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం | AP Land Titling Act is not being implemented: Dharmana Prasada Rao | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం

Published Thu, May 2 2024 11:45 PM | Last Updated on Thu, May 2 2024 11:45 PM

AP Land Titling Act is not being implemented: Dharmana Prasada Rao

ప్రస్తుతం ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ అమలు కాలేదు

రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితమని, ప్రస్తుతానికి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అమలు కాలేదని, దీనిపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అమలు కాలేదని, దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఒక అభిప్రాయానికొస్తే దీనిపై ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందన్నారు. ఈ స్టాంపింగ్‌ విధానం టీడీపీ హయాంలో 2016లోనే పైలెట్‌ ప్రాజెక్టుగా మొదలైందన్నారు. 

ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. కరణాలు, మునసబులతో నడుస్తున్న వ్యవస్థను 1984లో రద్దు చేశారని, 1985ృ86లో విలేజ్‌ అసిస్టెంట్‌లను రిక్రూట్‌ చేసుకోవడంతో రెవెన్యూ వ్యవస్థలోకి వచ్చారని తెలిపారు. 1988 89లో కొంతమంది విలేజ్‌ అసిస్టెంట్లను నియమించారని, కరణాలు, మునసబుల్లో కొందరు 1992లో మళ్లీ విధుల్లోకి చేరారని, ఈ రకంగా అనేక మార్పులు చేయడం వల్ల రెవెన్యూ వ్యవస్థలో రికార్డుల అప్డేషన్‌ సక్రమంగా జరగలేదన్నారు.

 తెలుగుదేశం ప్రభుత్వం 2002లో వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వీరందరినీ పంచాయతీరాజ్‌ వ్యవస్థలో కలిపేశారని తెలిపారు. ఆ సమయంలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ బాధ్యతలను అనుభవం లేని పంచాయతీ సెక్రటరీలకు కూడా అప్పజెప్పడంతో చాలా తప్పిదాలు జరిగాయన్నారు. 
 

ప్రస్తుతం ప్రెసెంపటివ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ సిస్టమ్‌ వల్ల సబ్‌డివిజన్‌ పనులు, వంశపారంపర్యంగా వచ్చే మార్పులు, లావాదేవీలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయాలంటే దరఖాస్తుదారు పలు కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్థితి ఉందన్నారు. రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ యాక్ట్‌ 1971 (ఆర్‌ఓఆర్‌) అమలుపరిచిన ఈ చట్టం పూర్తిగా విజయవంతం కాలేదదన్నారు. భూముల నిర్వహణ, మార్పులు, కొనుగోలు అమ్మకాలు, అలాగే భూ రికార్డుల నిర్వహణ, వివాదాల పరిష్కారానికి ఒక సంపూర్ణ చట్టం అంటూ లేదన్నారు. 

వీటన్నింటి కోసం అనేక చట్టాల మీద ఆధారపడాల్సి వస్తోందన్నారు. చట్టాల్లో కొన్ని కేంద్రప్రభుత్వం, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసినవి ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు సవరణలు గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా చేస్తోందని తెలిపారు. 

2003లో బయటపడిన తెల్గీ స్టాంప్‌ పేపర్స్‌ స్కామ్‌ భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేసిందని పేర్కొన్నారు. ఈ స్కామ్‌తో స్టాంప్‌ పేపర్ల నిర్వహణలో ఉన్న లోపాలు బట్టబయలయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఈృస్టాంపింగ్‌ ప్రక్రియను అందుబాటులోకి తేవాలని కూడా ప్రభుత్వాలు ఆలోచించడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలోనే 2016లో ఈృస్టాపింగ్‌ పైలెట్‌ ప్రాజెక్టు కింద మొదలు పెట్టారన్నారు. 

2007లో ప్రపంచ బ్యాంకు అధ్యయన ప్రకారం మన దేశంలో సివిల్‌ కోర్టులందు ఉన్న కేసుల్లో 66% సివిల్‌ కేసులు భూతగాదాలకు సంబంధించినవేన్నారు. దేశంలో భూములకు సంబంధించి రికార్డులు సరిగా నిర్వహించలేకపోవడం వల్ల, భూ యాజమాన్యానికి సంబంధించిన వివాదాలు అధికంగా ఉండడంతో భూమిపై ఆధారపడి జీవించేవారి జీవన విధానం సరిగ్గా జరగడం లేదని భారత ప్రభుత్వము/నీతి ఆయోగ్‌ గ్రహించి, దీనిపై అనేక సమావేశాలు నిర్వహించి నీతి ఆయోగ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రిసోర్సెస్‌ సంయుక్తంగా ఒక మోడల్‌ చట్టం, నిబంధనలతో తయారు చేసి డిసెంబర్‌ 2019 లో రాష్ట్రాలన్నింటికీ పంపించారన్నారు.

 దీని ఫలితంగా ఈ సమస్యలకు పరిష్కారంగా ఒక ప్రత్యేక చట్టం అవసరమైందన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ సంస్థలకు చెందిన భూములతో సహా, సమగ్ర సమాచార సేకరణ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు వివాదాలు లేని భూ యాజమాన్య హక్కులు నిర్ధారించుటకు ఈ చట్టం అవసరమైందన్నారు. భూయాజమాన్య హక్కులు ధ్రువీకరించే సమాచారం మొత్తం, ఆధునిక టెక్నాలజీ (బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ) సాయంతో ఇతరులు రికార్డులను తారుమారు చేసేందుకు అవకాశం లేని విధంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ చట్టం ద్వారా రైతులకు, భూ యజమానులకు, భూభాగాలకు సంబంధించి పూర్తి హక్కులు కల్పిస్తున్నట్లు తెలిపారు. భూ యాజమాన్య హక్కులకు సంబంధించి జరిగే మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు నమోదు చేయడమే కాకుండా హక్కుదారు భూ హక్కులను రక్షిస్తూ వివాదాలు లేని భూ పరిపాలన అందించడమే ఈ చట్టం ఉద్దేశమన్నారు. 

ఇదే సమయంలో భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో రెవెన్యూ రికార్డుల, భూహక్కుల పరిరక్షణ అంశంపై రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని భావించిందన్నారు. అన్ని స్తిరాస్థిలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, అపార్ట్‌మెంట్స్‌ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ సంస్థలకు చెందిన భూముల సహా సమగ్ర సమాచార సేకరణ, నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు, వివాదాలు లేని భూయాజమాన్య హక్కులు నిర్ధారించుట జరుగుతోందన్నారు. భూయాజమాన్య హక్కులు ధ్రువీకరించు సమాచారం మొత్తం, ఆధునిక టెక్నాలజీ (బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ) సాయంతో ఇతరులు రికార్డ్స్‌ తారుమారు చేసేందుకు అవకాశం లేని రీతిలో నిర్వహించబడుతుందన్నారు. 

∗ భూయాజమాన్య హక్కుల్లో జరిగే మార్పులు, చేర్పులు ఎప్పటికప్పుడు రికార్డ్స్‌ నందు నమోదవుతూ ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగు సమస్యను తొలగించేందుకు ఉపయోగపడుతుందన్నారు. భూయాజమాన్య హక్కులకు సంబందించిన మార్పులు చేర్పులన్నీ నిర్ధారిత కాలవ్యవధిలో నమోదు చేస్తుందని పేర్కొన్నారు.
హక్కుదారుల భూహక్కులను పరిరక్షిస్తూ, వివాదాలు లేని భూపరిపాలన చేసేందుకే ఉపయోగపడుతుందన్నారు.
 

ఈ చట్టం ద్వారా రైతులకు, భూయజమాన్యులకు, భూభాగానికి సంబందించి పూర్తి హక్కులు కల్పిస్తుందని పేర్కొన్నారు.
ఈ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్‌ తయారు చేయలేదని, ఈ చట్టం పరిధి (ఏరియాస్‌ కవర్డ్‌) ని నిర్ధారించలేదన్నారు. ఈ చట్టంలో డిజిగ్నేట్‌ చేసిన అధికారులను ఇంకా అపాయింట్‌ చేయలేదని, ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలను,సూచనలను తీసుకొని అవసరమైన మార్పులను, చేర్పులను చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రూల్స్‌ తయారు చేసి, కాంపిటెంట్‌ అథారిటీ అనుమతి పొందిన తర్వాత, ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు.
 

∗ న్యాయవాదుల సంఘాలు, వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేయగా ఆ పిటిషన్‌లన్నింటినీ విచారించి, ఈ చట్టాన్ని ప్రస్తుతం అమలుపరచడం లేదని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రస్తుతం పెండింగ్‌ లో ఉన్న కేసులను విచారిస్తూ, కొత్త కేసులను కూడా తీసుకోవాల్సిందిగా సివిల్‌ కోర్టులను ఆదేశించి ఉన్నారన్నారు. ఇంకా రీృసర్వే పూర్తి కాలేదని దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఏపి ప్రభుత్వం ఈ చట్టం అమలుపై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement