దేశంలో 2016–17లో సగటు కుటుంబ భూమి పరిమాణం 1.1 హెక్టార్లు
2021–22లో అది 0.7 హెక్టార్లకు తగ్గుదల
దేశంలోని 38 శాతం వ్యవసాయ కుటుంబాలకు 0.4 హెక్టార్లలోపే భూమి
అలాగే, 33 శాతం కుటుంబాలకు 0.41 నుంచి 1 హెక్టార్లే
నాబార్డ్ ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021–22 వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు భూమి పరిమాణం ఏటా తగ్గిపోతోంది. 2016–17లో ఇది 1.1 హెక్టార్లుండగా 2021–22లో అది 0.7కు పడిపోయింది. ఈ విషయాన్ని నాబార్డ్ ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021–22 వెల్లడించింది. వ్యవసాయ గృహాల సాగు సామర్థ్యం, ఉత్పత్తి భూమి పరిమాణం గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో దేశంలోను వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు భూమి పరిమాణాన్ని ఐదు తరగతులుగా వర్గీకరించినట్లు సర్వే వెల్లడించింది. ఇక దేశంలో 38 శాతం కుటుంబాలకు 0.4 హెక్టార్లలోపే భూమి ఉంది.
33 శాతం వ్యవసాయ కుటుంబాలకు 0.41 హెక్టార్ల నుంచి 1.0 హెక్టార్ వరకు ఉంది. 15 శాతం వ్యవసాయ కుటుంబాలకు 1.01 హెక్టార్ల నుంచి 2.0 హెక్టార్ల వరకు భూమి ఉంది. 8 శాతం కుటుంబాలకు 2.1 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉంది. ఆరు శాతం వ్యవసాయ కుటుంబాలకు 0.01 హెక్టార్లలోపే భూమి ఉంది. ఇలా దేశంలోని వ్యవసాయ కుటుంబాలు కలిగి ఉన్న సగటు భూమి పరిమాణం రాష్ట్రాల మధ్య విస్తృత వైవిధ్యాలు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోందని సర్వే పేర్కొంది.
ఎనిమిది రాష్ట్రాల్లో ఒక హెక్టారు కన్నా ఎక్కువ..
దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబానికి సగటు భూమి ఒక హెక్టార్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది. మహారాష్ట్ర, నాగాలాండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఒక హెక్టార్ కన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్నట్లు పేర్కొంది. మరో పది రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాలకు సగటు భూమి 0.4 హెక్టార్లలోపే ఉందని నివేదిక తెలిపింది. అసోం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో చిన్న భూ పరిమాణమే ఉందని సర్వే స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment