న్యాయపోరాట యోధుడు.. రూ.5,003 కోసం.. 42 ఏళ్లుగా పోరాటం! | 81 Years Old Man Legal Battle Since 2009 For Just Rs 5003, Know More Details Inside | Sakshi
Sakshi News home page

న్యాయపోరాట యోధుడు.. రూ.5,003 కోసం.. 42 ఏళ్లుగా పోరాటం!

Published Sun, Sep 29 2024 3:52 AM | Last Updated on Sun, Sep 29 2024 5:02 PM

An old man Legal battle since 2009

చివరకు విజయం సాధించిన 81 ఏళ్ల వృద్ధుడు 

మంచంపై ఉండి కూడా పోరాటం  

1977లో రైతు నుంచి సేకరించిన భూమికి ఇప్పటికీ పరిహారం చెల్లించని ప్రభుత్వం

అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపించిన హైకోర్టు 

2013 చట్టం కింద మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం అందజేయాలని ఆదేశం 

ఈ లోపు ఆ రూ.5,003కు 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి : ప్రభుత్వం నుంచి పరిహారంగా తనకు దక్కాల్సిన రూ.5003 కోసం ఏకంగా 42 ఏళ్ల పాటు ప్రభుత్వంతో పోరాటం చేశాడు. ఈ పోరాటంలో 15 ఏళ్ల పాటు హైకోర్టులో న్యాయ పోరాటం చేశాడు. చివరకు జీవిత చరమాంకంలో తన పోరాటంలో విజయం సాధించాడు. 

81 ఏళ్ల వయస్సులో మంచంపై ఉండి కూడా ఆయన చేసిన న్యాయ పోరాటానికి ఫలితం దక్కింది. పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక సామాన్య రైతుకు చిన్న మొత్తం పరిహారంగా చెల్లించే విషయంలో జరిగిన ఈ అసాధారణ జాప్యాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది.

పరిహారం కోరడం పౌరుల రాజ్యాంగ హక్కు 
‘వెంకటనారాయణేమీ ధనికుడు కాదు. విద్యావంతుడూ కానందున తన హక్కుల కోసం పోరాటం చేసేందుకు సరైన న్యాయ సలహాలు పొందలేకపోయారు. నష్టపోయిన ఆస్తికి పరిహారం పొందకుండా వెంకటనారాయణ వంటి వారిని కోర్టులు అడ్డుకోలేవు. నాలుగు దశాబ్దాలకు పైగా పరిహారం చెల్లించకపోవడాన్ని ఏ రకంగానూ మేం మన్నించజాలం. చట్ట నిబంధనల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 

వెంకటనారాయణ వయస్సు ఇప్పుడు 81 ఏళ్లు. వయోభారం వల్ల మంచం మీద ఉన్నారు. అతనికి ఎంతో మద్దతు అవసరం. వెంకటనారాయణ హక్కుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ న్యాయస్థానం మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తోంది. తన జీవనాధారాన్ని తీసుకోవడం వల్ల వెంకటనారాయణ వంటి సామాన్య రైతు అనుభవించిన వేదనను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే నష్టాన్ని కేవలం డబ్బుతోనే పూడ్చలేం. అయినప్పటికీ చట్ట ప్రకారం మేం ఆ పని చేయదలుచుకున్నాం. 

భూమి కోల్పోయిన యజమానికి పరిహారం చెల్లించకుండా భూమిని తీసుకోవడానికి వీల్లేదు. నష్టపోయిన ఆస్తికి పరిహారం కోరడమన్నది పౌరుల రాజ్యాంగ హక్కు. ప్రస్తుత కేసు వంటి అసాధారణ కేసుల్లో న్యాయస్థానాలు అధికరణ 226 కింద తన అధికార పరిధిని ఉపయోగించడం తప్పనిసరి. వెంకటనారాయణ ఓ చిన్న రైతు. రాష్ట్ర ప్రభుత్వం అతనికున్న చిన్నపాటి భూమిని తీసేసుకోవడమే గాక.. 42 ఏళ్లుగా ఆ భూమికి పైసా కూడా పరిహారం చెల్లించలేదు.’ అంటూ ప్రభుత్వం తీరును ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. 

‘పాత భూ సేకరణ చట్టంలో ఉన్న లొసుగుల కారణంగానే కేంద్రం 2013లో కొత్త భూ సేకరణ చట్టాన్ని తెచ్చింది. తద్వారా వెంకటనారాయణ వంటి వారికి పునరావాసం కల్పించేందుకు అవకాశం కల్పించడం వీలవుతోంది. ప్రస్తుత కేసులో వెంకటనారాయణ పట్ల అధికారుల వ్యవహరించిన తీరు దురదృష్టకరం. అది విస్మయకర నిర్లక్ష్యం. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా పరిహారాన్ని నిర్ణయించి దానిని నాలుగు నెలల్లో ఆయనకు చెల్లించాలని అధికారులను ఆదేశిస్తున్నాం. 

ఈ లోపు 1982 ఫిబ్రవరి 16 నుంచి ఈ రోజు వరకు వెంకట నారాయణకు చెల్లించాల్సిన రూ.5003 పరిహారాన్ని 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి మూడు వారాల్లో చెల్లించాలని కూడా ఆదేశిస్తున్నాం. ఈ రూ.5003, వడ్డీ మొత్తాన్ని మార్కెట్‌ ధర ప్రకారం అంతిమంగా చెల్లించే పరిహారంలో సర్దుబాటు చేసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ఏం చేసినా కూడా దానిని కోర్టు ఆదేశాల ఉల్లంఘన కింద భావిస్తాం’ అంటూ న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ నూనేపల్లి హరినాథ్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది.  

2009 నుంచి న్యాయ పోరాటం
కృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడినాడకు చెందిన ఓలేటి వెంకటనారాయణకు ఆ గ్రామంలోని సర్వే నంబర్‌ 694/2ఏ2లో 0.87 సెంట్ల భూమి ఉంది. ఈ భూమితో పాటు మరికొందరికి చెందిన మొత్తం 44.43 ఎకరాల భూమిని 1977లో అధికారులు భూ సేకరణ చట్టం 1894 కింద సేకరించారు. 

1982లో అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. వెంకటనారాయణకు తప్ప మిగిలిన వారందరూ కూడా కోర్టుకెళ్లి ఎకరాకు రూ.5002.50 పరిహారంగా చెల్లించేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంకటనారాయణ మిగిలిన వారికి ఇచ్చినట్టుగా తనకూ పరిహారం ఇవ్వాలంటూ 1997లో అధికారులను కోరారు. ఆ అభ్యర్థనను అధికారులు పట్టించుకోలేదు. దీంతో వెంకటనారాయణ 2009లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే 2013లో కేంద్ర ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టాన్ని తెచ్చింది. వెంకటనారాయణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి 2023లో తీర్పునిస్తూ సేకరించిన భూమికి గాను ఆయనకు ఎకరాకు రూ.5003 చొప్పున 6 శాతం వార్షిక వడ్డీతో పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని చెప్పలేదు. 

ధర్మాసనం ఎదుట అప్పీల్‌
సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ వెంకటనారాయణ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఎదుట 2024లో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందర్‌రావు, జస్టిస్‌ నూనేపల్లి హరినాథ్‌ ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. వెంకటనారాయణ తరఫు న్యాయవాది ఏవీ శివయ్య వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు చట్ట ప్రకారం పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 

మిగిలిన వ్యక్తుల నుంచి సేకరించిన భూమికి పెంచిన మేర పరిహారం చెల్లించిన అధికారులు.. పిటిషనర్‌కు మాత్రం ఇప్పటి వరకూ చెల్లించకపోవడం దారుణమన్నారు. ఈ వాదనలతో ప్రభుత్వం విభేదించింది. వెంకటనారాయణ భూమిని 1982లోనే స్వాధీనం చేసుకున్నామని.. అందువల్ల ఆయనకు కొత్త భూ సేకరణ చట్టం వర్తించదంది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రెండు రోజుల కిందట తీర్పునిచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement