రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం
ఇరు శాఖల ముఖ్య కార్యదర్శులకు రూ.50వేలు ఖర్చులు విధింపు
నాలుగు వారాల్లో బాధితులకు చెల్లించాలని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా రోడ్డు విస్తరణ కోసం భూమి తీసేసుకున్న అధికారులు, తీసుకున్న ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని బాధిత కుటుంబానికి వాగ్దానం చేసి ఆ తరువాత పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాన్ని అనవసరంగా కోర్టుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులకు, పురపాలక శాఖ డైరెక్టర్, అనంతపురం మునిసిపల్ కమిషనర్లకు రూ.50వేలను ఖర్చులు కింద జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు.
ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా... ప్రత్యామ్నాయ భూమి ఇవ్వని అధికారులు
అనంతపురం పట్టణంలోని సర్వే నంబర్ 1940/4లో టి.నిజాముద్దీన్‌కు చెందిన 0.02 సెంట్ల భూమిని 1996లో మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నారు. చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకున్న అధికారులు, తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని చెప్పారు. నిజాముద్దీన్ ప్రత్యామ్నాయ భూమి కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో చివరకు మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ éనిజాముద్దీన్‌కు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలంటూ 2001లో జీవో జారీ చేసింది. అయినప్పటికీ పలు కారణాలరీత్యా అధికారులు ఆ భూమిని నిజాముద్దీన్‌కు కేటాయించలేదు. ఈ లోపు ఆయన మరణించారు.
వారి హక్కులను హరించడమే..
ఆయన వారసులు న్యాయ పోరాటం ప్రారంభించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత పిటిషనర్లకు భూమి ఇవ్వకపోవడం వారి హక్కులను హరించడమేనని తేల్చి చెప్పారు. అంతేకాక అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూల జీవో జారీ చేసినా కూడా నిజాముద్దీన్ తన జీవిత కాలంలో ప్రత్యామ్నాయ భూమిని పొందలేకపోయారని తెలిపారు.
భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకోవడాన్ని దోపిడీగా అభివర్ణించిన న్యాయమూర్తి..అధికారుల తీరు కోర్టుని షాక్‌కు గురిచేసిందని తన తీర్పులో పేర్కొన్నారు. తీసుకున్న 0.02 సెంట్ల భూమికి 2013 భూ సేకరణ చట్టం కింద పిటిషనర్లకు గరిష్టంగా 8 వారాల్లోపు పరిహారం చెల్లించాలని, పిటిషనర్లకు రూ.50వేలను ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment