వ్యక్తుల స్వేచ్ఛతో ముడిపడి ఉన్న కేసుల్లో కోర్టులు క్రియాశీలకంగా ఉండాలి
వెంకటరామిరెడ్డి అరెస్టుపై కౌంటర్ వేయండి
పోలీసులకు హైకోర్టు ఆదేశం.. విచారణ 29కి వాయిదా
సాక్షి, అమరావతి: ఏదైనా కేసులో తనకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అందుకు గల కారణాలతో కూడిన రిమాండ్ ఆర్డర్‌ను తనకు అందజేయాలని నిందితుడు కోరితే, ఆ ఆర్డర్‌ను నిందితునికి సత్వరమే అందజేయాల్సి ఉంటుందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. పౌరుల హక్కులు ముడిపడి ఉన్న కేసుల్లో కింది కోర్టులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది.
సోషల్ మీడియా యాక్టివిస్ట్ పప్పుల వెంకటరామిరెడ్డి అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రిమాండ్ ఆర్డర్ కోసం వెంకటరామిరెడ్డి సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో తెలుసుకోవాలని ఆయన తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది.
రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వకపోతే అది చెల్లదు..
తన కుమారుడు పప్పుల వెంకటరామిరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు అతనికి విధించిన రిమాండ్ చెల్లదంటూ పప్పుల చెలమారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెలమారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రిమాండ్‌కు గల కారణాలను నిందితుడైన వెంకటరామిరెడ్డికి అందచేయలేదన్నారు.
రిమాండ్ ఆర్డర్‌ను నిందితునికి అందచేయడం తప్పనిసరని, అలా ఇవ్వని పక్షంలో ఆ రిమాండ్ చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి పలు తీర్పులున్నాయన్నారు. అంతకుముందు.. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, వెంకటరామిరెడ్డిని అరెస్టుచేసి కోర్టు ముందు హాజరుపరిచామన్నారు. అందువల్ల ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. నిందితుడు కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఎలాంటి విచారణ అవసరంలేదన్నారు.
అరెస్టుకు గల కారణాలను కూడా అతనికి తెలియజేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కింది కోర్టులు నిందితులకు వారి రిమాండ్ ఆర్డర్‌ను సత్వరమే అందజేయాలని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడు రిమాండ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేయలేదని తెలిపింది. ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాము మరోసారి పరిశీలన చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment