ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ కేంద్ర నిర్ణయం | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ కేంద్ర నిర్ణయం

Published Tue, Apr 30 2024 6:04 AM

Minister Dharmana Prasada Rao Fires on TDP

ఆ చట్టం రాష్ట్రంలో అమలు చేయబోమని ఎప్పుడో చెప్పాం 

టీడీపీవి అబద్ధపు ప్రచారాలు 

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం

శ్రీకాకుళం క్రైమ్‌: నూతన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. కొత్త ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉందని చెప్పారు. అయినా మన రాష్ట్రంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అమలు చేయబోమని ఎప్పుడో చెప్పామని ధర్మాన స్పష్టంచేశారు. కానీ, కొత్త ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అమలుచేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్న బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ నేతలు ఈ చట్టంపై వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం శ్రీకాకుళంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

 ‘1989 నుంచి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను దేశంలో అమలుచేయాలని ప్రయత్నాలు ప్రారంభించాయి. రకరకాల అ«ధ్యయనాల ద్వారా ఫైనల్‌గా బీజేపీ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్‌ వంటి ఉన్నతమైన సంస్థతో ఓ మోడల్‌ యాక్ట్‌ తయారుచేయించింది. అదే కొత్త ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌. దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మాత్రమే మన రాష్ట్రంలో అమలుచేస్తామని గతంలోనే స్పష్టంగా చెప్పాం. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని, ఇక్కడ అమలు చేయబోమని మరోసారి చెబుతున్నాను. 

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఐదేళ్లలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు అమలుచేశారు. వందేళ్ల తర్వాత చేపట్టిన భూ సమగ్ర సర్వే ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతోంది. దీనివల్ల భూ రికార్డులు అప్‌డేట్‌గా ఉంటాయి. కానీ టీడీపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక సర్వే రాళ్లపై వైఎస్సార్‌ బొమ్మ ఉందని విమర్శలు చేస్తున్నారు. వైఎస్సార్‌ బొమ్మ ఉంటే తప్పేంటని నేను ప్రశ్నిస్తున్నాను. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. 

రిజిస్ట్రేషన్‌ శాఖలో తీసుకువచ్చిన కార్ట్‌–2.0 అనే ప్రాజెక్టుపై విపక్షాలకు వత్తాసు పలికే మీడియా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది. వాస్తవానికి దీనివల్ల ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్, ఎక్కడి నుంచి ఎక్కడైనా రిజి్రస్టేషన్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది. గ్రామ సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్‌ కార్యాలయాలు వచ్చి మొత్తం కంప్యూటరీకరణ జరుగుతోంది. ఆటోమేటిక్‌గా మ్యుటేషన్‌ జరిగి ఈసీ జారీ చేయడం, స్టాక్‌ హోల్డింగ్‌ ఇంటిగ్రేషన్‌ వంటివి అందుబాటులోకి వస్తాయి. ఇంతకుముందు ఐదేళ్లు పరిపాలించిన టీడీపీ ప్రభుత్వం రాజధాని వెనకపడి రైతుల భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది.’ అని ధర్మాన తెలిపారు.

జగన్‌ ఎలాంటివారు అనేది ఐదేళ్ల పాలనే చెబుతుంది 
‘సీఎం వైఎస్‌ జగన్‌ భూములు తీసుకునేవారా.. భూములు పంచేవారా.. అన్నది ఈ ఐదేళ్ల పాలనే చెబుతుంది. 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది వైఎస్‌ జగన్‌ కాదా.. అలాంటి జగన్‌ మీకు భూములు తీసుకునేవారిలా కనిపిస్తున్నారా..? రూ.12,800 కోట్లు ఖర్చు పెట్టి భూములు కొని 31లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్‌ మీకు భూమిని లాక్కునేవారిలా కనిపిస్తున్నారా..? రెండు లక్షల ఎకరాల శివాయ్‌ జమాదార్‌ (పేదల సాగులో ఉండి హక్కులు లేని) భూములకు పట్టాలిచ్చింది సీఎం జగన్‌ అని గుర్తుంచుకోండి. ప్రజల భూములు తీసుకుని వ్యాపారాలు చేసుకునే భావజాలం టీడీపీది. రైతులకు వ్యతిరేకంగా మేం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. దీనిపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధంగా ఉన్నాను.’ అని ధర్మాన ప్రసాదరావు స్పష్టంచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement