సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని.. గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని.. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజవర్గానికి కూడా నీరు అందించలేదని, సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందంటూ సీఎం దుయ్యబట్టారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్-200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సీఎం జగన్.. గురువారం ప్రారంభించారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ‘‘ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. బాబు ఇంకో పార్ట్‌నర్. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు.
‘‘విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే చంద్రబాబు, అనుంగు శిష్యులు ఏడుస్తున్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు’’ అంటూ సీఎం ధ్వజమెత్తారు.
‘‘ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం. ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశాను. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకువచ్చాం. ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాం. దాదాపు రూ.85కోట్లతో నిర్మాణాలు చేపట్టాం. సురక్షిత మంచి నీటి కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అత్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలు అందిస్తున్నాం. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం’’ అని సీఎం పేర్కొన్నాం.
కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నామని సీఎం అన్నారు.
పేదవాడిని ఎలా ఆదుకోవాలి, పేదవాడికి ఎలా తోడుగా ఉండాలి, పేదరికం నుంచి ఎలా లాగాలి, ఎలా బతుకులు మార్చాలని అనే తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది. తేడా ఇదీ అని గమనించాలి.
సీఎం జగన్ ఏమన్నారంటే..
- ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే లెక్కే లేదు.
- తన సొంత నియోజకవర్గం కుప్పానికి గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే లేదు.
- కుప్పానికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా మళ్లీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే.
- మరి సొంత నియోజకవర్గం, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్నే పట్టించుకోని ఈ వ్యక్తికి ఉత్తరాంధ్రపై ఏం ప్రేమ ఉంటుంది?
- ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది ఆలోచన చేయాలి.
- ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం గానీ, మమకారం గానీ చూపించని ఈ చంద్రబాబు.
- 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకొనే దానికి ఒక్క మంచిపనీ లేదు.
- తన హయాంలో ఈ మంచి స్కీమ్ చేశాను, ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకొనే దానికి ఒక్క స్కీమ్ కూడా లేని పరిస్థితి.
- తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడని, మాట కోసం ఎందాకైనా పోయాడని, నిలబెట్టుకున్నాడని కనీసం చెప్పుకొనేందుకు ఒక్క విషయం అయినా లేదు.
- ఇలాంటాయన ఎన్నికలు వచ్చే సరికే పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు.
- ఈ పెద్దమనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిగా యాక్టర్‌ను పెట్టుకొని డ్రామాలు ఆడతాడు.
- ఈ దత్తపుత్రుడు ఎవరంటే, ఎలాంటి వాడు అంటే.. మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు.
- అభ్యర్థులను నిలబెడుతూ, తెలంగాణలో అన్నమాటలు వింటే ఆశ్చర్యం అనిపించింది.
- తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నానంటాడు. తన దురదృష్టం అంటాడు.
- ఇలాంటి వ్యక్తి, ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. ఈ పెద్దమనిషి చంద్రబాబుకు ఇంకొక పార్టనర్.
- ఈ పెద్ద మనిషి ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెంలగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టార్, ఈ మ్యారేజీ స్టార్.
- ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయన పడిన ఓట్లు ఎన్నో తెలుసా?
- చివరికి ఇండిపెండెంట్గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాలేదు.
- ఈ పెద్దమనిషికి చంద్రబాబు ప్రయోజనవర్గం ఉంది తప్ప, ఆంధ్ర రాష్ట్రంపై ప్రేమే లేదు.
- సొంత నియోజకవర్గం లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య ఎన్నికల్లో కలిసి వచ్చారు.
- 2014-2019 మధ్య ఈ ఉద్దానం ప్రాంతానికి మంచి నీరు ఇవ్వడం ఎలా అని కనీసం ఆలోచన అయినా చేశారా అంటే అదీ లేదు.
- కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్, ఆస్పత్రి నిర్మించారా అంటే అది కూడా లేదు.
- వీళ్ల బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచీ లేదు.
- ప్రతి పక్షంలో ఉండి కూడా వాళ్లు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు.
- రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తాం అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి అడ్డుకుంటున్న దుర్మార్గం వీరిది.
- ఉత్తరాంధ్రలో ఒక బిల్డింగ్ కట్టినా వీళ్లు ఏడుస్తాడు. మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానన్నా ఏడుస్తారు.
- ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పోర్టు వస్తుందన్నా ఏడుస్తారు.
- ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామంటే ఏడుస్తారు.
- ఈ ఏడుపంతా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా తయారయ్యారు.
- ఓ చంద్రబాబు ఓ రామోజీరావు, దత్తపుత్రుడు, రాధాకృష్ణ, టీవీ5 వీళ్లంతా ఒక దొంగల ముఠాగా తయారై మనమీద పడి ఏడుస్తుంటారు.
- వీళ్లలో ఎవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్లంతా ఉండేది హైదరాబాద్‌లో..
- ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి?
- ఎక్కడ ఉండాలి? మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్లు నిర్ణయిస్తామని మనకు చెబుతారు.
- దానికి తగ్గట్టుగా ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్, చంద్రబాబు, దత్తపుత్రుడు.. ఇవే కథలు.. రోజూ ఈ డ్రామాలు.
- వీళ్లలో ఏ ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు. ఈ నాన్ లోకల్స్ చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలట.
- నేనుచెప్పిన విషయాలు ఆలోచన చేయాలి.
- అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు, వారు ఏనాడూ ఇవ్వని విధంగా ఇంటింటికీ పెన్షన్ ఇస్తుంటే కూడా ఏడుపు.
- వారి హయాంలో ఇచ్చిన వెయ్యి పించన్ మనం 2250తో ప్రారంభించి ఏకంగా 3 వేలు చేస్తుంటే ఏడుపు.
- వారి హయాంలో విచ్చలవిడి దోపిడీని అరికట్టి, జన్మభూమి కమిటీలు రద్దు చేసి ప్రతి గ్రామంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రతి పేద వాడికీ తోడుగా ఉండి నడిపిస్తుంటే ఏడుపు.
- వారు ఇవ్వని విధంగా, ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 2.10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు.
- వారి ఐదేళ్ల పాలనలో నష్టపోయిన రైతన్నకు మీ బిడ్డ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, ఆర్బీకే వ్యవస్థ, పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత బీమా, సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ.. ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ అందిస్తున్నందుకు వీరంతా ఏడుపు.
- అక్కచెల్లెమ్మల్ని, పొదుపు సంఘాల్ని నిలువునా ముంచేసిన ఈ బాబుకు, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న అమ్మ ఒడి.. ఇవన్నీ కూడా పార్టీలు కూడా చూడకుండా మీ బిడ్డకు గతంలో ఓటు వేశారా లేదా అన్నది చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేయాలని అడుగులు వేస్తుంటే ఏడుపు.
- ఐదేళ్లు వాళ్లు అధికారంలో ఉండి కూడా కనీసం పేద వాడికి ఒక సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు
- నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఉండాలి, లక్షాధికారులు కావాలని తపన పడుతూ 31 లక్షల ఇంటి పట్టాలు వారి చేతిలో పెడితే ఏడుపు.
- ఏకంగా 22 లక్షల ఇళ్లు మీ బిడ్డ కట్టిస్తుంటే ఏడుపు.
- పేద పిల్లల బతుకులు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలి, పేద పిల్లలు వెళ్తున్న గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు తీసుకొస్తే ఏడుపు.
- గోరుముద్ద, నాడు-నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ బడుల్లో పెడితే ఏడుపు.
- 6వ తరగతి, ఆ పై తరగతుల పిల్లలకు, ప్రతి క్లాస్ రూమ్ డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్‌పీ ప్యానల్స్ తెస్తే ఏడుపు.
- 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు.
- ఏకంగా 35 లక్షల ఎకరాలు హక్కులేని భూములకు, అసైన్డ్ భూముల మీద పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు.
- 2014-19 మధ్య వాళ్లు అధికారంలో ఉన్నారు. మేనిఫెస్టోలో 10 శాతం వాగ్గానాలు కూడా అమలు చేయని వీరు..
- మీ బిడ్డ ఎన్నికల మేనిఫెస్టోను తెచ్చి ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేస్తే ఏడుపు.
- దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబు. బటన్ ఎలా నొక్కాలో తెలియని ఈ చంద్రబాబు.
- మీ బిడ్డ హయాంలో ఏకంగా 2.40 లక్షల కోట్లు మీ బిడ్డ హయాంలో నేరుగా బటన్ నొక్కుతున్నాడు.
- ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నా ఏడుపే ఏడుపు.
- మరో 1.70 లక్షల కోట్లు నాన్ డీబీటీగా పేద వారి కోసం ఇస్తున్నా కూడా ఏడుపే ఏడుపు.
- ఈ ఏడుపులన్నింటినీ కూడా కేవలం మరో మూడు నెలలు భరించండి.
- ఈ క్యాన్సర్ గడ్డల్ని, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని తెలియజేస్తున్నా.
- ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, పేదల వ్యతిరేకులంతా, పెత్తందార్లంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా తీర్పు ఇవ్వాలని మిమ్మల్నందరినీ సవినయంగా కోరుతున్నా.
- రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి, మోసాలు ఎక్కువ అవుతాయి.
- ఎవరు మాట ఇచ్చారు. మాట మీద నిలబడింది ఎవరు అనేది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి
- మీ బిడ్డ ధైర్యంగా మీ ముందుకు వచ్చి చెప్ప గలుగుతున్నాడు.
- మీ ఇంటికి, మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీరే సైనికులుగా మీ బిడ్డకు నిలబడండి అని అడుగుతున్నాడు.
- ఇలా అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా?
- రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు చేస్తారు. మీ బిడ్డ ఇంత ఇచ్చాడు, ఇంతకన్నా నాలుగింతలు ఎక్కువ చెబితే గానీ నమ్మరు అని చెప్పి.. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని చెబుతారు.
- మాటలు చెప్పడం చాలా సులభం, మాటలు చెప్పి మోసం చేసేవాళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండని కోరుతున్నా.
- మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకు ఉంది. మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఆశీర్వదించండి.
- దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
Comments
Please login to add a commentAdd a comment