కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న భూమిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
10 వేల ఎకరాలకుపైగా ఉన్నట్టు గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం
మార్కెట్ రేటు ప్రకారం ఆ భూములవిలువ రూ. 45 వేల కోట్లపైనే..
కేంద్ర సంస్థలకు ప్రభుత్వ ధర చెల్లించి తీసుకునే యోచనలో సర్కారు
దీనిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన రాష్ట్ర సర్కారు
హరియాణాలోనూ ఇదే తరహా డిమాండ్ ఉందంటున్న రెవెన్యూ వర్గాలు
కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర ఖజానాకు కాసుల పంటేననే ఆలోచన
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ)లకు గతంలో కేటాయించిన భూము ల్లో.. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్నవాటిని తిరిగి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరుతోంది. మొత్తంగా 10 వేల ఎకరాలకుపైగానే నిరుపయోగంగా ఉన్నాయని ఇప్పటికే గుర్తించింది. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ భూములను ప్రభుత్వ ధర తీసుకుని తమకు అప్పగించాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని రెవెన్యూ వర్గాల సమాచారం.
మిధాని, డీఆర్‌డీవో, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఏ ఎల్, ఈసీఐఎల్, డీఆర్‌డీఎల్ వంటి సంస్థల భూములు ఈ జాబితాలో ఉన్నట్టు తెలిసింది. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణా రాష్ట్రంలో కూడా ఇలాంటి డిమాండ్ ఉందని, దీంతో ఈ డిమాండ్ల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశముందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి.
దశాబ్దాల కింద కేటాయింపు..
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు కోసం దశాబ్దాల క్రితం పెద్ద సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ భూములను కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర అంగీకారంతోపాటు నిబంధనలకు అనుగుణంగా అప్పగించిన ఈ భూములను ఆయా సంస్థలు తమ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. అయితే ఆ సంస్థలు ఏ మేరకు భూములను వినియోగించుకుంటున్నాయన్న దానిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ఇటీవల వివరాలు సేకరించింది.
రాష్ట్రంలోని 11 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మొత్తం 8,900 ఎకరాలు కేటాయించగా.. అందులో 2,300 ఎకరాలు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయని, మిగతా భూములను నిరుపయోగంగా వదిలేశారని తేలింది. వీటితోపాటు ఇప్పటికే మూతపడిన సిమెంట్ కార్పొరేషన్, డ్రగ్స్ లిమిటెడ్, హెచ్‌ఎంటీల పరిధిలో మరో 3,300 ఎకరాల వరకు భూమి ఉందని రెవెన్యూ శాఖ గుర్తించింది.
రూ.45 వేల కోట్ల విలువతో..
హైదరాబాద్ నగరానికి శివార్లలో, ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ నిరుపయోగ భూముల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.45 వేల కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. ఈ భూములను ప్రభుత్వ ధరకు తిరిగి తీసుకోవడం ద్వారా... పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య అవసరాలకు, వేలం వేసి నిధుల సమీకరణ చేసుకోవడానికి ఉపయోగపడతాయని ప్రభుత్వానికి ఇచి్చన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
ఆ నివేదిక ప్రకారం... ప్రభుత్వ ధరతో ఆ భూములను తిరిగి తీసుకోవాలంటే రూ.8 వేల కోట్ల వరకు అవసరమని అంచనా వేసినట్టు సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించిందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలోనే కోరినా..
కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన నిరుపయోగ భూములను ఇవ్వాలని గత బీఆర్‌ఎస్ సర్కారు కూడా కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2022లో కేంద్రానికి లేఖ రాశారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర పీఎస్‌యూల భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్మవద్దని... రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరారు. కానీ కేంద్రం అప్పట్లో సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు ఎలా స్పందిస్తున్నదని తేలాల్సి ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment