వరి వేయకుంటే రూ.7 వేలు
చండీగఢ్ నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: హరియాణ రాష్ట్రంలో వరి పంట వేయకపోతే ఎకరాకు (ఇన్ని ఎకరాలు అనే పరిమితి లేకుండా) రూ.7 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేయడం ద్వారా 1.74 లక్షల ఎకరాల్లో వరికి బదులు ఇతర పంటలకు మళ్లించగలిగామని ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. వరితో పాటు నీరు అధికంగా అవసరమయ్యే ఇతర ధాన్యం పంటలు వేయకుండా ఏ పంట వేసినా లేదా పడావుగా (ఏమీ వేయకుండా) వదిలేసినా ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందన్నారు.
2020లో చేపట్టిన ‘మేరా పానీ మేరా విరాసత్’పథకంలో భాగంగా భావితరాలకు నీటిని అందించాలనే ఉద్దేశంతో దీనిని అమలు చేస్తున్నట్టు తెలియజేశారు. హరియాణలో గుడ్‌గవర్నెన్స్ అమలు చేస్తున్న విషయం వివరించేందుకు మీడియా ప్రతినిధులను అక్కడి ప్రభుత్వం ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
హరియాణ పాటు చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటికీ యమున నదే ఆధారం కావడంతో వరి పంటకు నీరు భారీగా అవసరమై భూగర్భనీటి మట్టాలు పడిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలకు వివిధ పథకాల కింద కల్పించే ఉచితాలను, ఇది ఫ్రీ, అది ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఇచ్చే హామీలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని, స్వాభిమాన వ్యక్తులెవరూ వీటిని కోరుకోరని చెప్పారు. 2014 నుంచి హరియాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మనోహర్‌లాల్‌తో సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు.
సాక్షి: ‘గుజరాత్ మోడల్’అంటూ కొందరు బీజేపీ నే తలు ప్రచారం చేశారు కదా ? తెలంగాణలో ‘హరి యాణ మోడల్’అమలు చేయమని చెబుతారా?
సీఎం: ఈ మోడల్ ఆ మోడల్ అనే ప్రచారం ఎక్కువగా మీడియా సృష్టే అని చెప్పాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అక్కడి అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రజలకు ఏమి చేస్తారో ఎన్నికల హామీ ఇవ్వడంతో పాటు ‘హరియాణ మోడల్’అమలు అంశానికి కూడా ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ఒక రాష్ట్రంలో మంచి పథకాలు, మెరుగైన విధానాలుంటే వాటిని మరోచోట అమలు చేయొచ్చని ప్రధాని మోదీ కూడా సూచించారు.
సాక్షి: మీ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు ఏవీ?
సీఎం: హరియాణ ఒక్క రా్రష్ఠంలోనే ‘మేరి ఫసల్ మేరీ బ్యోరా’(ఎమ్మెస్‌ఎంబీ)కింద రైతులు రిజిష్టర్ చేసుకుంటే ఎంఎస్పీ ధర చెల్లింపుతో పాటు ఇతర రూపాల్లో ప్రయోజనాలు అందిస్తున్నాం. దీనిని ఈ–ఖరీద్ పోర్టల్‌కు లింక్ చేసి ఎంఎస్పీ ధరను డైరెక్ట్‌గా రైతు అకౌంట్లో వేస్తున్నాం. ఇప్పటిదాకా రూ.45వేల కోట్లు వారికి బదలీచేశాం. ముఖ్యమంత్రి అంత్యోదయ పరివార్ ఉత్థాన్ యోజనలో భాగంగా పేదవర్గాలను గుర్తించి వారికి బీపీఎల్‌కార్డులు, రేషన్ అందజేయడంతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నాం.