సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు అమరావతిలో సాగించిన భూదోపిడీలో తవ్వుతున్న కొద్దీ కొత్త అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయట పడుతున్నాయి. అసైన్డ్ భూములే కాకుండా ప్రభుత్వ భూములనూ వదల్లేదు. చంద్రబాబు, పి.నారాయణ, లోకేశ్ త్రయం బినామీల పేరిట కొల్లగొట్టిన భూముల జాబితా చాంతాడులా సాగుతోంది.
అసైన్డ్ రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వారి భూములను రాజధాని కోసం టీడీపీ సర్కారు తీసుకుంటుందని బెదిరించి రూ.3,370 కోట్ల విలువైన 617 ఎకరాలను కొల్లగొట్టిన కుంభకోణాన్ని ‘సాక్షి’ ఇప్పటికే బట్టబయలు చేయడం తెలిసిందే. అయితే అసైన్డ్ రైతులే కాకుండా అమరావతిలోని ప్రభుత్వ భూములను సైతం తమ బినామీల పేరిట నమోదు చేసి చంద్రబాబు బృందం భూదోపిడీకి పాల్పడటం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట హస్తగతం చేసుకున్నారు. అనంతరం భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లను కాజేశారు. చంద్రబాబు, నారాయణ, లోకేశ్ అసైన్డ్ భూ దోపిడీలో ఆ అవినీతి పర్వం ఇదిగో ఇలా ఉంది....
రెండు కేటగిరీలుగా వర్గీకరించి..
రాజధాని పేరుతో అమరావతి పరిధిలో సర్వే చేయించిన చంద్రబాబు, నారాయణ దృష్టి ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూములపై పడింది. అసైన్డ్ భూములను 1 నుంచి 4 కేటగిరీల కింద విభజించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి తీసుకోగా ఎవరి ఆధీనంలోనూ లేని ప్రభుత్వ భూములను దక్కించుకునేందుకు మరో పన్నాగం పన్నారు. ఆ ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని రైతుల ఆధీనంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించారు. వాటిని అసైన్డ్ భూముల జాబితాలో 5, 6 కేటగిరీల కింద పేర్కొన్నారు.
అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5 కింద, అన్యాక్రాంతమై అభ్యంతరాలున్న భూములను కేటగిరీ 6 కింద చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. కేటగిరీ 5 కింద భూములకు 500 చ.గజాల నివాస స్థలం, 100 చ.గజాల వాణిజ్య స్థలాన్ని ప్యాకేజీగా పేర్కొన్నారు. కేటగిరీ 6 కింద భూములకు 260 చ.గజాల నివాస స్థలాన్ని ప్యాకేజీగా ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఎకరా కంటే తక్కువ ఉన్న భూములకు కూడా కనీసం ఎకరా ప్యాకేజీ వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు.
328 ఎకరాలు... రూ.760.25 కోట్ల ప్యాకేజీ
అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. అమరావతి పరిధిలో కేటగిరీ 5 కింద 237.60 ఎకరాలను గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆధీనంలో ఉన్నట్టుగా చూపించారు. ఇక కేటగిరీ 6 కింద 90.52 ఎకరాలను చూపించారు. ఆ భూములు 227 మంది స్వాధీనంలో ఉన్నట్టుగా కనికట్టు చేశారు. వాస్తవానికి ఆ రెండు కేటగిరీల భూములు ఎవరి ఆధీనంలోనూ లేవు. కానీ ఆ భూములు 522 మంది తమ బినామీల ఆధీనంలో ఉన్నట్టుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీని కొల్లగొట్టారు. అమరావతిలో ప్యాకేజీ ప్రకటించే నాటికి నివాస స్థలం చ.గజం రూ.30 వేలు, వాణిజ్య స్థలం చ.గజం రూ.50 వేలు చొప్పున మార్కెట్ ధర పలికింది. అమరావతి నిర్మాణం పూర్తయితే మార్కెట్ ధర మరింత పెరుగుతుంది.
- అప్పటి ధరనే తీసుకుంటే కేటగిరీ 5 కింద ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల విలువైన నివాస స్థలం, రూ.50 లక్షలు విలువైన వాణిజ్య స్థలం వెరసి రూ.2 కోట్లు చొప్పున ప్యాకేజీ దక్కింది. ఆ ప్రకారం కేటగిరీ 5 కింద ఉన్న 295 మంది రూ.590 కోట్ల విలువైన స్థలాలను పొందారు.
- కేటగిరీ 6 కింద ఒక్కొక్కరికీ రూ.75 లక్షలు విలువైన నివాస స్థలం ఇచ్చారు. ఆ ప్రకారం 227 మందికి రూ.170.25 కోట్ల విలువైన స్థలాలు దక్కాయి.
- మొత్తం మీద కేటగిరీ 5, 6లలో రైతులుగా చూపించిన తమ బినామీలు 522 మంది ముసుగులో చంద్రబాబు, నారాయణ రూ.760.25 కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టినట్లు స్పష్టమైంది.
ఆ గ్రామాల్లో ఒక్కరూ లేరు
అమరావతి భూదోపిడీపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తులో అసైన్డ్ భూకుంభకోణం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న భూముల రికార్డులు, సీఆర్‌డీయే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన రైతుల జాబితాలను సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటగిరీ 5, 6లలో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరు కూడా అమరావతి గ్రామాల్లోనే లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించిన రైతులెవరూ లేరు. భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కాజేసేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment