‘అసైన్డ్’ వివరాలను రిజిస్ట్రార్లకు పంపాలి | ''Assigned' details should be sent to Registrars | Sakshi
Sakshi News home page

‘అసైన్డ్’ వివరాలను రిజిస్ట్రార్లకు పంపాలి

Published Sun, Jan 31 2016 4:13 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

‘అసైన్డ్’ వివరాలను రిజిస్ట్రార్లకు పంపాలి - Sakshi

‘అసైన్డ్’ వివరాలను రిజిస్ట్రార్లకు పంపాలి

విస్తృత ధర్మాసనం తీర్పును అమలు చేయాల్సిందే
ఆ తీర్పు ఆధారంగా పిటిషనర్ల డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకోండి

గడువులోగా నిషేధిత భూముల జాబితా రూపొందించండి
ఏపీ, తెలంగాణ అధికారులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం

సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితా తయారీకి సంబంధించి విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పనిసరిగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రెవెన్యూ, దేవాదాయ శాఖలు, వక్ఫ్ బోర్డు అధికారులను హైకోర్టు ఆదేశించింది. విస్తృత ధర్మాసనం నిర్దేశించిన గడువులోగా నిషేధిత భూముల జాబితాను తయారు చేసి, ఆయా సబ్ రిజిస్ట్రార్లకు పంపాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇతరులకు బదలాయించరాదన్న నిబంధనలతో కేటాయించిన అసైన్డ్ భూముల జాబితాను సైతం సబ్ రిజిస్ట్రార్లకు పంపాలని పేర్కొంది. 1954కు ముందే అసైన్డ్ భూములను పొంది ఉంటే వాటి వివరాలను, ఆ భూములకు 1977 అసైన్డ్ భూముల చట్టం వర్తించే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను రెవెన్యూ అధికారుల ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది.

రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22ఎ కింద నిషేధిత భూముల జాబితాను తాజా వివరాలతో సవరించే(అప్‌డేట్) ముందు పిటిషనర్లు సమర్పించే వివరాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఒకవేళ 1954 కంటే ముందు అసైన్ చేసిన భూములను వేటినైనా నిషేధిత జాబితాలో చేర్చాలని నిర్ణయిస్తే, అందుకు సంబంధించి సెక్షన్ 22ఎ(1)(ఈ) కింద నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలుంటే వారు చట్టం ప్రకారం ముందుకెళ్లవచ్చని వెల్లడించింది.

ఆ డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకోండి
కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా తమ ముందున్న పిటిషన్లు, అప్పీళ్లలో ఏవైనా డాక్యుమెంట్లను అధికారులు రిజిస్టర్ చేసి ఉంటే, అది విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా అధికారులు తీసుకునే తుది నిర్ణయానికి లోబడి ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ల విషయంలో విస్తృత ధర్మాసనం తీర్పునకు అనుగుణంగా ఆ రిజిస్ట్రేషన్లను ఖరారు చేయడమా? లేక రద్దు చేయడమా? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రేషన్ అధికారులకు స్పష్టం చేసింది.

ఈ మొత్తం ప్రక్రియను విస్తృత ధర్మాసనం నిర్దేశించిన నాలుగు నెలల గడువు పూర్తయిన తరువాత నుంచి మూడు నెలల్లోగా పూర్తి చేయాలంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భూముల వర్గీకరణ, రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1,633 వ్యాజ్యాలను జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది.

రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఎ విషయంలో ఇటీవల ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలు, తీర్పును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తూ తీర్పునిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. నిషేధిత భూముల జాబితాను రూపొందించేందుకు విస్తృత ధర్మాసనం నిర్ధేశించిన గడువు పూర్తయిన తరువాత ఈ వ్యాజ్యాల్లోని పిటిషనర్లు, తమ భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ల ముందు డాక్యుమెంట్లను సమర్పించవచ్చని తెలిపింది.

సబ్ రిజిస్ట్రార్లు విస్తృత ధర్మాసనం తీర్పును పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. డాక్యుమెంట్లను సమర్పించేటప్పుడు వాటితోపాటు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాపీని కూడా జత చేయాలని పిటిషనర్లను ఆదేశించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement