![Gold plating work for Sri Lakshmi Narasimha Swamy Temple in Yadagirigutta](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/yadadri.jpg.webp?itok=wvmYVYw6)
ఈ నెల 20 లోపు పనులు పూర్తి
భక్తుల వసతులకు తలపెట్టిన పనులు మాత్రం అసంపూర్తిగానే
23న కుంభాభిషేకానికి ఏర్పాట్లు
నిధుల రాక నిలిచిన పనులు... కొత్త ప్రతిపాదనలు సీఎం పేషీలో పెండింగ్
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమానగోపురానికి చేపట్టిన స్వర్ణతాపడం పనులు పూర్తికావొచ్చాయి. ఈ నెల 23న కుంభాభిషేకం కార్యక్రమానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దాతలు ఇచ్చిన సొమ్ముతోపాటు దేవస్థానం నిధులు రూ.21 కోట్లతో సుమారు 60 కిలోలకు పైగా బంగారంతో స్వర్ణతాపడం పనులు చేపట్టారు. సీసీ కెమెరాల నిఘాలో పనులు రాత్రింబవళ్లు జరుగుతున్నాయి.
అయితే, భక్తుల మనోభావాలకు అనుగుణంగా క్షేత్ర ప్రాశస్థ్యం పెంచే చర్యలు తీసుకోవడంతోపాటు భక్తులకు మరిన్ని వసతులు కల్పించాల్సిన అవసరముంది. ఆలయ ఉద్ఘాటన జరిగిన రెండు సంవత్సరాలు కావొస్తున్నా నిధుల లేమితో వసతుల పనులు ఇంకా పూర్తికాలేదు. మార్చిలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పెండింగ్ పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. – సాక్షి, యాదాద్రి
సీఎం సమీక్షించినా
యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. దేవస్థానంలో పనులు పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయడం లేదు. ఇప్పటివరకు జరిగిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు రూ.70 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నవంబర్ 8న యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. అభివృద్ధి పనుల ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు.
ఆ మేరకు అధికారులు కొండ ప్రాశస్త్యం, భక్తుల వసతులకు పనుల ప్రతిపాదనలు పంపించారు. ప్రధానంగా కొండపైన రాత్రి నిద్ర చేయడానికి డార్మెటరీ హాల్, కల్యాణ మండపం, కళాభవన్, కల్యాణకట్ట, క్యూలైన్లలో మరిన్ని వసతుల కోసం పంపిన ప్రతిపాదనలకు సంబందించిన ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది.
ఇవీ చేపట్టిన పనులు
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్లో ప్రధానమైనవి కొండపైన కృష్ణ శిలలతో ఆలయ గోపురాలు, మాడవీధులు, చుట్టూ ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్తంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదాల వంటశాల, కొండపైన విష్ణుపుష్కరిణి, కొండకింద లక్ష్మి పుష్కరిణి, స్వామి తెప్పోత్సవం కోసం గండి చెరువు, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణస్వామి వ్రత మండపం, కొండపైన బస్‌బే, దీక్షాపరుల మండపం, గిరిప్రదర్శన రింగ్‌రోడ్డు, పెద్దగుట్టపైన టెంపుల్ సిటీ, గుట్ట చుట్టూ రింగ్‌రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, దేవస్థానం బస్టాండ్, ప్‌లైఓవర్ల నిర్మాణం చేపట్టారు.
ఈ పనులు పూర్తికాలేదు
» బాలాలయం స్థానంలో రంగ మండపం (కళాభవన్) నిర్మించాలని నిర్ణయించారు. కల్యాణోత్సవాలు, భక్తుల రాత్రి నిద్ర చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించొచ్చని భావించారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
» స్వచ్చంద సంస్థ వెగ్నేష్ రూ.11 కోట్లతో నిర్మించిన అన్నదాన సత్రం ఇంకా భక్తులకు అందుబాటులోకి రాలేదు. ఇది అందుబాటులోకి వస్తే రోజు సుమారు రెండు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించొచ్చు. ప్రస్తుతం దీక్షాపరుల మండపంలో భక్తులకు రోజు అన్నప్రసాదం అందిస్తున్నారు.
» దేవస్థానం బస్టాండ్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
» కొండ పైన దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు కొండ కింద 122 దుకాణాల కోసం మడిగెలు నిర్మిస్తున్నారు. ఇందులో పుష్కరిణి వద్ద కొందరికి దుకాణాలు కేటాయించారు. మిగతావి ఇంకా పూర్తి కాలేదు.
» గోదావరి జలాలతో నింపిన గండి చెరువులో తెప్పోత్సవం పనులు పూర్తి కాలేదు. గ్రీనరీ, బెంచీలు ఏర్పాటు వరకే నిలిచిపోయాయి.
» కొండపైకి చేపట్టిన ఘాట్‌రోడ్డు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఒకే రోడ్డు ఉండడంతో వాహనాలకు ఇబ్బందిగా మారింది.
» పెద్దగుట్టపైన వైటీడీఏ అభివృద్ధి చేసిన టెంపుల్ సిటీలో దాతల సాయంతో నిర్మించతలపెట్టిన వసతిగదుల నిర్మాణం ప్రారంభం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment