సోమవారం యాదగిరిగుట్ట ప్రధానాలయ ముఖమండపంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖకు వేదాశీర్వచనం చేస్తున్న అర్చకులు
యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తొలిపూజలో సతీసమేతంగా పాల్గొన్న సీఎం.. స్వామివారికి పట్టువ్రస్తాల సమర్పణ
సీఎం హోదాలో తొలిసారి పర్యటన
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన.. సోమవారం నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో సతీమణి గీతారెడ్డితో కలసి తొలిపూజలో పాల్గొన్నా రు. తొలుత తూర్పు త్రితల రాజగోపురం వద్ద సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దీపజ్యోతి వద్ద సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం వెంట పూజల్లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, మందుల సామెలు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. 12 గంటలకు భద్రాచలం వెళ్లారు.
స్వర్ణ తాపడం పూర్తి చేయించండి
యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం రేవంత్‌ను ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు పూర్తి చేయించాలని ఆలయ ఈవో రామకృష్ణారావు కోరారు. కొంత బంగారంతో ధ్వజస్తంభం బంగారు తాపడం చేయించామని తెలిపారు.
నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమ వారం పంచరాత్ర ఆగమం ప్రకారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఉదయం నిత్యారాధనల అనంతరం శ్రీవిష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలను మొదలుపెట్టారు. స్వస్తి వచనం, రక్షాబంధన కార్యక్రమాలు, పారాయణలు నిర్వహించారు.
ప్రొటోకాల్ వివాదం
సీఎం పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. దేవస్థానం అధికారులు సీఎంకు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో డిప్యూటీ సీఎంకు.. మంత్రులకు వేసిన పీటల కంటే చిన్నపీట వేయడం వివాదాస్పదమైంది. సీఎం పక్కన ఆయన సతీమణి గీతారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ సమానమైన ఎత్తు పీటలపై కూర్చున్నారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖను ఆశీర్వచనం ఇస్తున్న అర్చకుల వెనుక కూర్చోబెట్టారు. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు స్పందిస్తూ, సీఎంతో పాటు మంత్రులందరికీ పీటలు వేశామని, ఇందులో ప్రొటోకాల్ వివాదమేమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment