
స్వర్ణ దివ్యవిమాన గోపురాన్ని ఆవిష్కరించనున్న సీఎం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy temple) ఆలయానికి ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) వెళ్లనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో భాస్కర్‌రావు శుక్రవారం వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన యాదగిరీశుడి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
బంగారు తాపడంతో తయారు చేసిన శ్రీనృసింహ అవతారాలు, కేశవ నారాయణమూర్తులు, గరుడమూర్తులు, తదితర దేవతామూర్తుల విగ్రహాలకు వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీమధుర కవి రామానుజ జీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఉదయం 11.54 గంటలకు మహా కుంభాభిషిక సంప్రోక్షణ పూజలు జరిపిస్తారని చెప్పారు.
అనంతరం రామానుజ జీయర్ స్వామిజీతో కలిసి ముఖ్యమంత్రి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి శ్రీస్వామి వారికి అంకితమిస్తారని వెల్లడించారు. సీఎం 23న ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరిగుట్టకు చేరుకుంటారని, అక్కడి నుంచి కొండపైన వీఐపీ గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లి, సంప్రదాయ దుస్తులతో యాగశాలలో నిర్వహించే మహా పూర్ణాహుతి వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. తర్వాత ఉత్తర ద్వారం నుంచి ఆలయ విమాన గోపురం వద్దకు వెళ్లనున్నట్లు అధికారులు వెల్లడించారు.