చేనేత సాంస్కృతిక వారసత్వం గొప్పది | President Draupadi Murmu in Bhudanpochampally | Sakshi
Sakshi News home page

చేనేత సాంస్కృతిక వారసత్వం గొప్పది

Dec 21 2023 4:28 AM | Updated on Dec 21 2023 2:50 PM

President Draupadi Murmu in Bhudanpochampally - Sakshi

సాక్షి, యాదాద్రి: మన చేనేత సాంస్కృతిక వారసత్వం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి ముందుకు తీసుకుపోవడంలో చేనేత కళాకారుల సహకారం గొప్పదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. చేనేత రంగంలో గురు, శిష్య సంప్రదాయం ప్రకారం వృత్తి నైపుణ్యాలు తరతరాలుగా అందించడం మంచి సాంప్రదాయమని ప్రశంసించారు. ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త డిజైన్‌లు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో చేనేత పరిశ్రమకు ఫ్యాషన్‌ డిజైనర్లు సహకరించాలని కోరారు. ఇందులో శిక్షణ ఒక ముఖ్యమైన అంశమని ఆమె అన్నారు.

శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్‌పోచంపల్లిని సందర్శించారు. ఇక్కత్‌ వస్త్రాలు తయారు చేసే చేనేత కళాకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత దేశ వారసత్వంలో ఒక భాగమైన చేనేత వృత్తి గురించి తెలుసుకోవడానికి పోచంపల్లి గ్రామానికి వచ్చి పట్టు చీరలు ఎలా తయారు చేస్తారో చూడడం సంతోషం కలిగిస్తోందని రాష్ట్రపతి చెప్పారు. ఇక్కడి నుంచి తాను ఇంత గొప్ప చేనేత ఇక్కత్‌ వృత్తి నైపుణ్య జ్ఞానాన్ని తీసుకువెళుతున్నానని అన్నారు.

తమ ప్రాంతానికి చెందిన కొందరిని పోచంపల్లికి తీసుకువచ్చి చేనేత వృత్తిని పరిచయం చేయిస్తానని తెలిపారు. యూఎన్‌డబ్ల్యూటీవో (యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌) 2021లో పోచంపల్లి గ్రామాన్ని ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి చేనేత రంగంలో విశిష్టత కలిగిన అవార్డు గ్రహీతలు వచ్చారంటూ.. చేనేత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతున్న వారిని అభినందించారు.

చేనేత రంగం ద్వారా ప్రతిరోజు 35 లక్షల మంది జీవనోపాధి కల్పించుకుంటున్నారని, తెలంగాణాలో నేసిన వ్రస్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని చెప్పారు. పోచంపల్లితో పాటు రాష్ట్రంలోని వరంగల్, సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, పుట్టపాక వస్త్రాలకు జీఐ ట్యాగ్‌ వచ్చిందని రాష్ట్రపతి తెలిపారు.  

ప్రభుత్వం దృష్టికి సమస్యలు 
ముగ్గురు చేనేత కళాకారులు కొన్ని ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. అంతకుముందు ఆమె పోచంపల్లిలోని శ్రీరంజన్‌ సిల్క్‌ ఇండస్ట్రీ ప్రొడక్షన్‌ కంట్రోల్‌ యూనిట్‌ను సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన పెవిలియన్‌ థీమ్‌ను సందర్శించారు. ముడిపట్టు నుంచి పట్టును తీయడం, వ్రస్తాలను తయారు చేయడం లాంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు చరఖాలతో నూలు వడకడాన్ని వీక్షించారు. ప్రత్యేక స్టాళ్లను, ఆచార్య వినోభాబావే ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

రాష్ట్రపతికి చీరల బహూకరణ 
చేనేత అవార్డు గ్రహీతలు బోగ సరస్వతి, లోక శ్యామ్‌కుమార్, కూరపాటి వెంకటేశం.. చేనేత రంగంలో తమ వృత్తి నైపుణ్యాలను, ఇబ్బందులను రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా పొట్ట బత్తిని సుగుణ రాష్ట్రపతికి చీరను బహూకరించారు. బోగ సరస్వతి డబుల్‌ ఇక్కత్‌ వ్రస్తాన్ని అందజేశారు. వేదికపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క.. రాష్ట్రపతికి చీరలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచనా సాహు, రాష్ట్ర జౌళి శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమారెడ్డి, కలెక్టర్‌ హనుమంతు కె.జెండగే, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుదీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

స్పృహ తప్పి పడిపోయిన ఏసీపీ 
భూదాన్‌ పోచంపల్లి/భువనగిరి క్రైం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్‌పోచంపల్లి పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. హెలీపాడ్‌ వద్ద విధుల్లో ఉన్న ఉప్పల్‌ ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాసరావు కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన తన పక్కనే ఉన్న ఇంకో అధికారి మీద పడడంతో ఇద్దరూ కింద పడ్డారని భువనగిరి డీసీపీ రాజేష్‌ చంద్ర తెలిపారు. హెలీకాప్టర్‌ ల్యాండింగ్‌ సమయంలో ఈ ఘటన జరగడంతో వేరే విధంగా ప్రచారం జరిగిందని వివరణ ఇచ్చారు. హెలీకాప్టర్‌ ఫ్యాన్‌ గాలి ఉధృతికి కార్పెట్‌ పైకి లేవడంతో ఆయన గాయపడినట్టు తొలుత ప్రచారం జరిగింది. కాగా చేతికి గాయమైన ఏసీపీని వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

స్థానికంగా నూలు డిపో ఏర్పాటు చేయాలి 
పలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న చేనేత వృత్తికి అండగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15 శాతం నూలు సబ్సిడీని సకాలంలో పొందలేకపోతున్నాం. ఇందుకోసం భూదాన్‌ పోచంప ల్లిలో నూలు డిపో ఏర్పాటు చేయాలి. తద్వారా వే లాది మంది చేనేతలకు మేలు జరుగుతుంది. డబు ల్‌ ఇక్కత్, కాటన్, మస్రైస్‌ వస్త్రాల తయారీ కోసం వందలాది మగ్గాలు నడుస్తాయి. చేనేత కుటుంబాలకు మరింత ఉపా«ధి లభిస్తుంది. – బోగ సరస్వతి

సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి  
పోచంపల్లి కళాకారులకు రంగులు అద్దకం, డిజైన్ల తయారీ, నూతన ప్రక్రియల కోసం శిక్షణ ఇప్పించాలి. చేనేత యువతకు శిక్షణ ఇప్పించడానికి చేనేత సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి. మమ్మల్ని చేనేత కార్మికులుగా కాకుండా చేనేత కళాకారులుగా పిలవాలి. మా వృత్తికి విరమణ లేదు. మాకు అండగా ఉండాలి.  – లోక శ్యామ్‌కుమార్‌  

డూప్లికేట్‌ను నియంత్రించాలి 
టై అండ్‌ డై చీరలు, వ్రస్తాలను డూప్లికేట్‌ చేస్తున్నారు. మా వృత్తిని దెబ్బతీసే విధంగా మిల్లుల నుంచి టై అండ్‌ డై వస్త్రాలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో మేము ఉపాధి కోల్పోతున్నాం. ఇక్కత్‌ బ్రాండ్‌ను కాపాడాలి. చేనేత వృత్తిని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. వస్త్రాల అమ్మకంపై డిస్కౌంట్‌ ఇవ్వాలి. పోచంపల్లి బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచాలి.     – కూరపాటి వెంకటేశం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement