వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలని కొందరు కుట్ర పన్నిన విషయం అమెరికా సీక్రెట్ సర్వీసెస్‌కు ముందే తెలుసా..? సీక్రెట్ సర్వీసెస్ ఈ విషయాన్ని ట్రంప్ టీమ్‌కు చెప్పిందా..? ట్రంప్ టీమ్‌కు కూడా ఈ విషయం ముందే తెలుసా..? అంటే అవుననే అంటోంది ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ. ఈ మేరకు ఒక కథనం కూడా ప్రచురించింది.
ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ దేశం కుట్రపన్నినట్లుగా సీక్రెట్ సర్వీసెస్‌కు ముందుగానే సమాచారమందిందని, ఈ విషయాన్ని వారు ట్రంప్ టీమ్‌కు కూడా చెప్పారని కథనంలో తెలిపింది. అయితే ఇటీవల పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నానికి ఇరాన్ కుట్రకు సంబంధముందనడానికి ఆధారాల్లేవని పేర్కొంది.
ఇరాన్ కుట్రపై ఇంటెలిజెన్స్ సమాచారం అందగానే ట్రంప్ సెక్యూరిటీని సీక్రెట్ సర్వీసెస్ భారీగా పెంచినట్లు తెలిపింది. మరోవైపు ఇటీవలి పెన్సిల్వేనియా కాల్పుల్లో దుండగుడు ట్రంప్‌కు అత్యంత దగ్గరగా రావడంలో సీక్రెట్ సర్వీసెస్ వైఫల్యం ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
కాగా, ఈ ఏడాది నవంబర్ మొదటి వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment