న్యూఢిల్లీ: భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాడు.
‘నేను నా క్రికెట్ వస్తువులను టీమిండియా మద్దతు బృందం ‘భారత్ ఆర్మీ’కి విరాళంగా ఇస్తాను. ఇందులో ప్రపంచకప్‌లో వాడిన బ్యాట్‌తో పాటు టెస్టు, వన్డే, టి20 జెర్సీలు, గ్లౌజులు, ప్యాడ్లు, హెల్మెట్లు ఉన్నాయి. వారు వీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. వేలంలో సమకూరిన సొమ్మును వెనుకబడిన చిన్నారులను ఆదరిస్తోన్న ‘అవేర్’ ఫౌండేషన్‌కు అందజేస్తారు. సోమవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. అందరూ ఇందులో పాల్గొని చిన్నారులకు సహాయపడండి’ అని రాహుల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment