Lokesh Rahul
-
Ind Vs Eng: రోహిత్ జోరు.. రాహుల్ హుషారు
రెండో టెస్టుపై కూడా చినుకులే! ఆట వానతో ఆలస్యమై, ఆరంభమైంది. తర్వాత రోహిత్ శర్మ జోరు మొదలైంది. చూడచక్కని స్ట్రోక్స్‌తో అతని బౌండరీలు భారత స్కోరు బోర్డును పరుగెత్తించాయి. లోకేశ్ రాహుల్‌తో కలిసి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. అతను అవుటయ్యాక మరో ఓపెనర్ రాహుల్ పరుగుల బాధ్యత తీసుకున్నాడు. సెంచరీతో తొలిరోజు భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. రెండో రోజు మిగతా బ్యాట్స్‌మెన్ కూడా భాగమైతే భారీ స్కోరు ఖాయమవుతుంది. లండన్: చినుకులు పడ్డాయి... నెమ్మదించిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ వికెట్లను ఎంచక్కా పడగొట్టొచ్చు అనుకున్న ఇంగ్లండ్ ఎత్తుగడ పారలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రూట్ నిర్ణయం బెడిసికొట్టింది. భారత ఓపెనర్లు జోరు ప్రత్యర్థి ఆశల్ని, అవకాశాల్ని దెబ్బతీశాయి. పట్టుదలగా క్రీజ్‌లో నిలిచిన లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 127 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్), ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించగా...దూకుడైన ఆటతో రోహిత్ శర్మ (145 బంతుల్లో 83; 11 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరుకు పునాది వేశాడు వీళ్లిద్దరు ఇంగ్లండ్ బౌలర్లపై అవలీలగా పరుగులు చేయడంతో భారత్ మొదటి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు రహానే (1 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అండర్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత తుది జట్టులోకి శార్దుల్ స్థానంలో ఇషాంత్‌ను తీసుకోగా... అశ్విన్ మళ్లీ పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. కష్టంగా మొదలై... భారత ఓపెనర్లు ఆరంభంలో పరుగులు చేసేందుకు కష్టపడ్డారు. రోహిత్, రాహుల్ ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. అలా మొదటి పది ఓవర్లలో ఓపెనింగ్ జోడి 11 పరుగులే చేయగలిగింది. 13వ ఓవర్లో తొలిసారి బంతి బౌండరీ లైను దాటింది. 8 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 11 పరుగులే ఇచ్చాడు. అయితే భారత్ పుంజుకునేందుకు స్యామ్ కరన్ బౌలింగ్ దోహదం చేసింది. అనుభవజ్ఞుడైన అండర్సన్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన రోహిత్... స్యామ్‌ను చితగ్గొడుతూ ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టాడు. వర్షం అంతరాయం కల్పించడంతో 18.4 ఓవర్ల వద్ద ఆట ఆగింది. అప్పటికి భారత్ స్కోరు 46/0. వర్షం ఆగకపోవడంతో లంచ్ విరామం ప్రకటించారు. రోహిత్ ఫిఫ్టీ రెండో సెషన్లోనూ భారత్ హవానే కొనసాగింది. హిట్‌మ్యాన్ రోహిత్ ఆటలో వేగం పెంచాడు. ఆఫ్ స్టంప్‌పై పడిన బంతులను జాగ్రత్తగా ఆడిన ఈ ఓపెనర్... గతి తప్పిన బంతులకు తన స్ట్రోక్ ప్లే దెబ్బ రుచి చూపించాడు. రాహుల్ మాత్రం ఓపిగ్గా నిలబడ్డాడు. ఆచితూచి ఆడుతూ సహచరుడి వేగాన్ని ఆస్వాదించాడు. రోహిత్ 8 బౌండరీలతో అర్ధసెంచరీ (83 బంతుల్లో) అధిగమించాడు. అనంతరం మార్క్‌వుడ్ బౌలింగ్‌లో చెలరేగిన రోహిత్, హుక్‌షాట్‌తో సిక్సర్, పుల్, లాఫ్టెడ్ షాట్లతో బౌండరీలు రాబట్టాడు. జట్టు 100 పరుగుల్లో రోహిత్‌వే 75 పరుగులు కావడం విశేషం. మరోవైపు వంద బంతులాడినా ఒక్క ఫోర్ కొట్టని రాహుల్... ఎట్టకేలకు మొయిన్ అలీ ఓవర్లో సిక్సర్‌తో తొలిసారి బంతిని బౌండరీ దాటించాడు. అజేయంగా సాగిపోతున్న ఓపెనింగ్ జోడీని అండర్సన్ విడదీశాడు. సెంచరీ ఊపుమీదున్న రోహిత్‌ను బోల్తా కొట్టించడంతో 126 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్ సెంచరీ క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా (9) మళ్లీ విఫలమయ్యాడు. కెప్టెన్ కోహ్లి జత కలిశాక రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 157/2 స్కోరు వద్ద టీ విరామానికి వెళ్లారు. ఆఖరి సెషన్లో అండర్సన్ బౌలింగ్‌లోనూ బౌండరీలు కొట్టడం ద్వారా రాహుల్ స్కోరు పెంచే బాధ్యత తన భుజాన వేసుకున్నాడు. కోహ్లినేమో జాగ్రత్తపడ్డాడు. పది బంతులాడాకే ఖాతా తెరిచిన కోహ్లి తొలి బౌండరీ కోసం 48 బంతులు ఆడాల్సి వచ్చింది. ఈ జోడీ క్రీజులో కుదురుకోవడంతో భారత్ మరో వికెట్ కోల్పోకుండా 200 మార్క్‌ను దాటింది. తొలి టెస్టులో పూర్తి చేయలేకపోయిన సెంచరీని రాహుల్ ‘క్రికెట్ మక్కా’లో చేశాడు. అలీ, మార్క్‌వుడ్, రాబిన్సన్ల బౌలింగ్ల్లో యథే చ్ఛగా ఫోర్లు కొట్టాడు. వుడ్ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ దిశగా బాదిన బౌండరీతో 212 బంతుల్లో రాహుల్ శతకం పూర్తి చేసుకున్నాడు. 80 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. ఈ బంతి విరాట్ వికెట్ బలిగొంది. రాబిన్సన్ బౌలింగ్‌లో కోహ్లి (42; 3 ఫోర్లు) అవుటవడంతో 117 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83; రాహుల్ (నాటౌట్) 127; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 42; రహానే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (90 ఓవర్లలో 3 వికెట్లకు) 276. వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267. బౌలింగ్: అండర్సన్ 20–4–52–2, రాబిన్సన్ 23–7–47–1; స్యామ్ కరన్ 18–1–58–0 మార్క్‌వుడ్ 16–1–66–0, మొయిన్ అలీ 13–1–40–0. -
వేలానికి రాహుల్ ప్రపంచకప్ బ్యాట్
న్యూఢిల్లీ: భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ‘నేను నా క్రికెట్ వస్తువులను టీమిండియా మద్దతు బృందం ‘భారత్ ఆర్మీ’కి విరాళంగా ఇస్తాను. ఇందులో ప్రపంచకప్‌లో వాడిన బ్యాట్‌తో పాటు టెస్టు, వన్డే, టి20 జెర్సీలు, గ్లౌజులు, ప్యాడ్లు, హెల్మెట్లు ఉన్నాయి. వారు వీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. వేలంలో సమకూరిన సొమ్మును వెనుకబడిన చిన్నారులను ఆదరిస్తోన్న ‘అవేర్’ ఫౌండేషన్‌కు అందజేస్తారు. సోమవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. అందరూ ఇందులో పాల్గొని చిన్నారులకు సహాయపడండి’ అని రాహుల్ పేర్కొన్నాడు. -
చివరి వన్డే : రాహుల్ రికార్డుల మోత..!
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మూడో వన్డేలో వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ సెంచరీ (113 బంతుల్లో 112; ఫోర్లు 9, సిక్స్ 2)తో మెరిశాడు. ఈక్రమంలో 21 ఏళ్ల తర్వాత ఆసియా బయట వన్డేల్లో సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. 1999లో ఇంగ్లండ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రావిడ్ సెంచరీ సాధించాడు. దీంతోపాటు లోకేష్ రాహుల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐదు లేక ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించిన వికెట్ కీపర్‌గా ధోని పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. 2017లో కటక్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని 134 పరుగులు చేశాడు. ధావన్ తర్వాత రాహులే.. భారత్ తరపున తక్కువ ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు చేసిన రికార్డునూ రాహుల్ నమోదు చేశాడు.శిఖర్ ధావన్ 24 ఇన్నింగ్స్‌లలో ఆ ఘనత సాధించగా.. వరుసగా లోకేశ్ రాహుల్ 31, విరాట్ కోహ్లి 36, గౌతం గంభీర్ 44, వీరేంద్ర సెహ్వాగ్ 50 ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు సాధించారు. మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్ తాజా టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో సైతం 88 పరుగులతో రాణించాడు. రాహుల్‌పై వీవీఎస్ ప్రశంసలు.. అద్భుత ఫామ్‌తో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు వికెట్ కీపింగ్‌లోనూ రాణిస్తున్న లోకేష్ రాహుల్‌పై టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. తన క్లాస్ ఇన్నింగ్స్‌తో మరో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడారు. రాహుల్ గత 11 వన్డే ఇన్నింగ్స్‌లలో 6 హాఫ్ సెంచరీలు చేశాడని, న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో దానిని సెంచరీగా మలిచాడని ట్విటర్లో పేర్కొన్నారు. శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా, మనీష్ పాండే చక్కని సమన్వయంతో జట్టుకు మంచి స్కోరు అందించారని తెలిపారు. ఇక ఆఖరి వన్డేలో టీమిండియా భవితవ్యం బౌలర్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
చివరి వన్డే : న్యూజిలాండ్ టార్గెట్ 297
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్-భారత్ మధ్య చివరి మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థికి 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1), విరాట్ కోహ్లి (9) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ పృథ్వీ షా (42 బంతుల్లో 40; ఫోర్లు 3, సిక్స్‌లు 2) శ్రేయాస్ అయ్యర్ (63 బంతుల్లో 62; ఫోర్లు 4), మనీష్ పాండే (48 బంతుల్లో 42; ఫోర్లు 2) రాణించారు. (చదవండి : ఆఖరి వన్డే: రికార్డు సొంతం చేసుకున్న అయ్యర్) రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు.113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 112 పరుగులు చేశాడు. 300 పైచిలుకు పరుగులు చేస్తారనే అంచనాల నడుమ ఇన్నింగ్స్ 47 ఓవర్లో వరుస బంతుల్లో రాహుల్, మనీష్ ఔట్ కావడంతో టీమిండియా ఆ మార్కు చేరుకోలేకపోయింది. బెన్నెట్‌కు నాలుగు వికెట్లు, జేమీషన్, నీషమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. పృథ్వీ షా రనౌట్ అయ్యాడు. -
విలువైన భాగస్వామ్యం.. రాహుల్ సెంచరీ
మౌంట్ మాంగనీ: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆటగాడు లోకేష్ రాహుల్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో సెంచరీ సాధించాడు. 104 బంతులు ఎదుర్కొన్న రాహుల్ నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతనికిది నాలుగో సెంచరీ కావడం విశేషం. కోహ్లి ఔటైన అనంతర క్రీజులోకొచ్చిన రాహుల్ తొలుత శ్రేయాస్ అయ్యర్ (63 బంతుల్లో 62; ఫోర్లు 4) తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అనంతరం పాండేతో కలిసి 100 పరుగుల పార్టనర్‌షిప్‌ను నమోదు చేసి జట్టును ఆదుకున్నాడు. 45 ఓవర్లు పూర్తయ్యే సరికి జట్టు స్కోరు నాలుగు వికెట్లకు 254 పరుగులు కాగా.. రాహుల్ 102, మనీష్ పాండే 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
బ్యాటింగ్ చేయడం మర్చిపోతానా..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది గాయాలతో సతమతమైన భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభిస్తానని చెప్పాడు. తన శైలి శాశ్వతమని, బ్యాటింగ్ చేయడం మర్చిపోలేదన్నాడు. ఈ ఏడాదంతా గాయాలు ‘గబ్బర్’ను తెగ ఇబ్బంది పెట్టాయి. మొదట చేతి వేలు, తర్వాత మెడ, అటుపై కన్ను, ఇటీవల మోకాలి గాయాలతో ధావన్ ఆటకు దూరం కావాల్సి వచ్చింది. నవంబర్ 21న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 మ్యాచ్ తర్వాత మళ్లీ అతను బ్యాట్ పట్టలేదు. ఈ సమయంలో జట్టులోకి వచ్చిన లోకేశ్ రాహుల్ ఓపెనర్‌గా సూపర్ హిట్టయ్యాడు. ఇప్పుడు మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో ధావన్ స్వదేశంలో శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌లకు ఎంపికయ్యాడు. దీనిపై మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ముగిశాక మీడియాతో ధావన్ మాట్లాడుతూ ‘ఇది నాకు తాజా ఆరంభం. ఈ యేడు చేతి వేలి నుంచి మోకాలి గాయం దాకా చాలా ఇబ్బంది పడ్డాను. ఈ కష్టకాలంలో శుభవార్త ఏంటంటే కొత్త సంవత్సరం రావడం. రాహుల్ బాగా ఆడటం నన్ను సంతోషపరిచింది. అంది వచి్చన అవకాశాల్ని చక్కగా సది్వనియోగం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు నేను సత్తా చాటాలి’ అని అన్నాడు. గాయాలు తప్పవు గాయాలనేవి మన నియంత్రణలో ఉండవని... అయితే ఎదురుదెబ్బలెన్ని ఎదురైనా ఎప్పుడు ప్రభావితం కాలేదని, ఇది తన అదృష్టమని చెప్పుకొచ్చాడు. ‘ఆటగాళ్లకు గాయాలు సహజం. వీటిని అంగీకరించాల్సిందే. అంతేతప్ప ఎక్కువగా ఆలోచించను. బాగా ఆడుతున్నపుడే ఇలా గాయాలతో ఆగిపోవడం కష్టమనిపించలేదు. ఎందుకంటే నేనేమీ బ్యాటింగ్ చేయడం మర్చిపోలేదు. నా శైలి నాకుంది. పరుగులు చేసే సత్తా నాలో ఉంది’ అని గబ్బర్‌గా పిలుచుకునే శిఖర్ అన్నాడు. శ్రీలంకతో జరగనున్న టి20లకు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ఆ సిరీస్ తనకు చాలా కీలకమైందని చెప్పాడు. ‘నాకిది ముఖ్యమైన సీజన్. లంకతో పొట్టి మ్యాచ్‌ల్లో బాగా రాణించాలి. అయితే ఆ్రస్టేలియాతో వన్డేలకు రాహుల్‌తో పాటు నేను రోహిత్ కూడా అందుబాటులో ఉంటాం. కాబట్టి టీమ్ మేనేజ్మెంట్కు తుది జట్టు ఎంపిక సవాలే కానుంది. వాళ్ల పని వాళ్లు చేస్తారు. భారీ స్కోర్లతో నా పని నేను చేసుకుపోవాలి’ అని అన్నాడు. టెస్టులూ ఆడగలను గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు ఆడాక ధావన్ మళ్లీ సంప్రదాయ క్రికెట్ ఆడలేకపోయాడు. రోహిత్‌తో పాటు మయాంక్ అగర్వాల్ వచి్చరాగానే రాణించడంతో ధావన్‌కు చోటులేకుండా పోయింది. యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా సెలక్షన్‌కు అందుబాటులో ఉండటం ధావన్ ఎంపికకు సంకటంగా మారింది. అయితే బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై గత నెలలో జరిగిన టి20ల్లో శిఖర్ ఆడాడు. టెస్టు జట్టుకు దూరమైనంత మాత్రాన తన పని అయిపోలేదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు సాధించే సత్తా తనలో ఉందన్నాడు. ‘స్టార్’ననే భావన లేనేలేదు రంజీల ద్వారా మళ్లీ ఆటకు సిద్ధమవడం ఆనందంగా ఉందని ఈ ఢిల్లీ ఓపెనర్ చెప్పాడు. ‘రంజీల నుంచే నేనీ స్థాయికి చేరుకున్నా. ఇప్పుడు అంతర్జాతీయ స్టార్‌ననే అహం లేదు. ఎవరితోనైనా కలిసిపోతాను. నా అనుభవాన్ని కుర్రాళ్లకు పంచేందుకు ఎపుడైనా సిద్ధమే. టెస్టు జట్టులోకి రావడం కష్టమే! అయినా... నా లక్ష్యం మాత్రం మూడు ఫార్మాట్లు ఆడటం. దీనికోసం నేను ఎంతైనా శ్రమిస్తాను. ఆటగాళ్ల కెరీర్లో గాయాలు... ఆ తర్వాత కోలుకోవడం, తిరిగి ఫిట్నెస్ టెస్టు పాసయ్యాక పునరాగమనం ఎప్పుడైన సవాళ్లతో కూడుకున్నదే. నా కుటుంబం ఇక ఇండియాలోనే.. మొత్తానికి తన భార్య, పిల్లలు భారత్‌లోనే స్థిరపడేందుకు వస్తున్నారని ధావన్ ఎంతో సంతోషంగా చెప్పాడు. ‘ఆ్రస్టేలియాలో ఉండే నా భార్య ఆయేషా, కుమారుడు జొరావర్ ఇప్పుడు పూర్తిగా స్వదేశానికొస్తున్నారు. దీంతో నా వెంట నా కుటుంబం ఎప్పుడూ ఉంటుంది’ అని ధావన్ అన్నాడు. విమర్శలకు అతిగా స్పందించనని, వాళ్ల అభిప్రాయం వారిదని తన ఆట ఏంటో తనకు తెలుసు కాబట్టి వారిని పెద్దగా పట్టించుకోనని చెప్పాడు. నేటినుంచి రంజీ ట్రోఫీలో... హైదరాబాద్‌తో బుధవారం నుంచి మొదలయ్యే రంజీ మ్యాచ్‌లో అతను ఢిల్లీ సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఫిట్నెస్ నిరూపించుకునేందుకు తన సొంత జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. నేటి నుంచి నాలుగు రోజుల మ్యాచ్ ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరుగుతుంది. అతనితో పాటు ఢిల్లీ జట్టులో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఆడతాడు. -
రాహుల్‌కు కష్టకాలం!
ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లను వారి సొంతగడ్డపైనే చిత్తు చేసి టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఉన్న భారత జట్టుకు స్వదేశంలో సిరీస్ అంటే నల్లేరు మీద నడకే కావచ్చు. టీమిండియా సభ్యులు పరుగుల వరద పారించేందుకు, వికెట్ల పండగ చేసుకునేందుకు రాబోయే హోం సిరీస్‌లు అవకాశమిస్తున్నాయి. వీరిలో రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌లో సుస్థిర స్థానం కోసం పోరాడుతుండగా... రాహుల్ స్థానంపై కత్తి వేలాడుతోంది. దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్ కూడా తొలి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనున్నారు. మరి సెలక్టర్ల ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ఆసక్తికరం. న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత నిజానికి భారత జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే కొన్ని వ్యక్తిగత ప్రదర్శనల పట్ల టీమ్ మేనేజ్మెంట్ అసంతృప్తిగా ఉంది. పైగా సొంతగడ్డపై అయితే కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చే ప్రయోగం చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక కీలకంగా మారింది. భువనేశ్వర్ ఫిట్‌గా లేకపోవడం వల్ల అతని పేరును పరిశీలించడం లేదు. వరుస వైఫల్యాలు... రెండున్నరేళ్ల క్రితం లోకేశ్ రాహుల్ సొంతగడ్డపై చక్కటి ఫామ్‌తో అదరగొట్టాడు. వరుసగా 7 టెస్టుల్లో 9 అర్ధసెంచరీలు సాధించాడు. అయితే ఆ తర్వాత అతని ఆట ఒక్కసారిగా గతి తప్పింది. తర్వాతి 16 టెస్టుల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒకే ఒకటి (ఓవల్‌లో 149) కాగా... అదీ ఇంగ్లండ్‌తో సిరీస్ కోల్పోయిన తర్వాత చివరి టెస్టులో వచ్చింది. ఓపెనర్‌గా ఆ్రస్టేలియాలో మూడు టెస్టుల్లో, తాజాగా విండీస్‌పై కూడా రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఓపెనర్ స్థాయి ఇన్నింగ్స్ అతడి నుంచి రావడం లేదు. టీమ్ మేనేజ్మెంట్ ఎంతో నమ్మకం పెట్టుకొని ఇచ్చిన వరుస అవకాశాలను అతను వృథా చేసుకున్నాడు. జట్టు విజయాల హోరులో వ్యక్తిగత వైఫల్యాలు మరుగునపడినా, ఇక హెచ్చరికకు సమయం అయిందని సెలక్టర్లు భావిస్తున్నట్లున్నారు. ఈ నేపథ్యంలో మరో అవకాశంకంటే కూడా రాహుల్‌పై వేటు వేసే చాన్స్ ఎక్కువగా ఉంది.3, 4, 5, 6 ఓకే... భారత బ్యాటింగ్‌కు సంబంధించి నాలుగు స్థానాల విషయంలో ఎలాంటి సమస్య లేదు. పుజారా, కోహ్లి, రహానే, విహారిలు వరుసగా బరిలోకి దిగుతారు. ఇటీవల ఆట తర్వాత విహారి స్థానం పదిలంగా మారింది. వికెట్ కీపర్లుగా పంత్, సాహా కొనసాగుతారు. అదే బౌలింగ్... బౌలింగ్ విభాగంలో కూడా మార్పులకు అవకాశం లేదు. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీలతో కూడా పేస్ విభాగం పటిష్టంగా ఉంది. ఈ ముగ్గురిలో ఎవరికైనా విశ్రాంతినివ్వాలనుకుంటే ప్రత్యా మ్నాయంగా ఉమేశ్ యాదవ్ అందుబాటులో ఉన్నాడు. అశ్విన్, కుల్దీప్, జడేజా రూపంలో ముగ్గురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో బ్యాటింగ్ కారణంగా జడేజాకు మాత్రమే విండీస్‌లో ఆడే అవకాశం లభించింది. అయితే మన పిచ్‌లపై అశ్విన్ కచి్చతంగా ఆడతాడు కాబట్టి మార్పులు అనవసరం. హార్దిక్‌ను తీసుకుంటారా? ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రం సెలక్టర్లు స్పష్టతనివ్వడం లేదు. వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి పేరుతో విండీస్‌కు ఎంపిక చేయలేదు. అతని అవసరం కూడా ఇప్పుడు టెస్టు టీమ్ కూర్పులో అంతగా కనిపించడం లేదు. భారత్‌లో జరిగే టెస్టుల్లో అశి్వన్, జడేజాలాంటివారు ఉన్నప్పుడు పాండ్యా బౌలింగ్నుంచి కూడా పెద్దగా ఆశించేదేమీ ఉండదు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేస్తారా అనేది సందేహమే. ఈ టెస్టులకంటే పరిమిత ఓవర్లపైనే మరింత దృష్టి పెట్టమని సెలక్టర్లు సూచించినట్లు వినిపిస్తోంది. రోహిత్ నిలుస్తాడా! తాజా సమీకరణాల్లో రోహిత్ శర్మతో ఓపెనింగ్ ప్రయోగం చేయాలని టీమ్ భావిస్తోంది. రోహిత్ ఓపెనింగ్ గురించి నేరుగా ఎమ్మెస్కే ప్రసాదే మాట్లాడటం దీనికి నిదర్శనం. గంగూలీ సహా అనేక మంది మాజీలు దీనికి మద్దతు పలుకుతున్నారు. అయితే టెస్టుల్లో ఎన్నడూ రెగ్యులర్ ఆటగాడు కాని రోహిత్ రికార్డు చెప్పుకోదగిన విధంగా లేదు. ఆరేళ్ల కెరీర్లో అతను ఆడింది 27 టెస్టులే. మొదటి రెండు మ్యాచ్‌లలో సెంచరీ అనంతరం తన 22వ టెస్టులో రోహిత్ మూడో శతకం సాధించాడు. తాజాగా వెస్టిండీస్‌తో సిరీస్‌లో కూడా మ్యాచ్ ఆడే అవకాశమే రాలేదు. వన్డేల్లో, టి20ల్లో మిడిలార్డర్లో సుస్థిర స్థానం తర్వాతే అతనితో ఓపెనింగ్ చేయించారు. కానీ టెస్టుల్లో రోహిత్ ఏనాడూ గుర్తుంచుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. అయితే స్వదేశంలో సిరీస్ కాబట్టి పిచ్‌లు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బంది కాకపోవచ్చనేది కూడా సెలక్టర్ల ఆలోచన. మరో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ నిలకడగానే ఆడుతున్నాడు కాబట్టి రోహిత్‌తో ఒక ప్రయత్నం చేయవచ్చు. రోహిత్ కూడా తన స్థానం నిలబెట్టుకోవడం ఖాయం. కొత్తవారు ఎవరు? తుది జట్టులో స్థానం సంగతి చెప్పలేకపోయినా అనుభవం కోసం ఒకరిద్దరు కొత్త ఆటగాళ్లని ఎంపిక చేయవచ్చని సమాచారం. ఇందులో ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, బెంగాల్‌కు చెందిన అభిమన్యు ఈశ్వరన్ పేర్లపై చర్చ జరగనుంది. భారత్ తరఫున 2 వన్డేలు ఆడిన గిల్ ‘ఎ’ జట్టు తరఫున విశేషంగా రాణిస్తున్నాడు. ఇటీవల దులీప్ ట్రోఫీ ఫైనల్లో 153 పరుగులతో అదరగొట్టిన ఈశ్వరన్ 52 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో దాదాపు 50 సగటుతో 4 వేలకు పైగా పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా కూడా అనేక సార్లు ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ పేరు చర్చకు వస్తున్నా... ప్రస్తుతానికి అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి. -
భారత్ 264/5
కింగ్స్టన్ (జమైకా): వెస్టిండీస్‌తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. ఇక్కడ సబీనా పార్క్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సారథి విరాట్ కోహ్లి(163 బంతుల్లో 76; 10 ఫోర్లు), ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (127 బంతుల్లో 55; 7 ఫోర్లు)లు అర్థసెంచరీలతో రాణించారు. అయితే అర్ద సెంచరీలను భారీ స్కోర్లుగా మలచడంలో విపలమయ్యారు. ఇక మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్(13), పుజారా(6), తొలి మ్యాచ్‌లో సెంచరీ హీరో అజింక్య రహానే(24)లు పూర్తిగా నిరుత్సాహపరిచారు. ప్రస్తుతం హనుమ విహారీ(42 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్(27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విండీస్ కెప్టెన్ హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి. గత మ్యాచ్‌లాగే టాస్ గెలిచిన వెస్టిండీస్ మళ్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఎలాంటి మార్పులు చేయకుండా తొలి టెస్టులో నెగ్గిన జట్టునే కొనసాగించింది. దాంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కలేదు. పరిమిత ఓవర్ల జట్టులో లేని అశ్విన్...రెండు టెస్టుల కోసమే విండీస్‌కు వచ్చాడు. ఇప్పుడు అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్వదేశం తిరిగి రానున్నాడు. ఆకట్టుకున్న కార్న్‌వాల్... వెస్టిండీస్ ఇద్దరు కొత్త ఆటగాళ్లకు మ్యాచ్‌లో అవకాశం కల్పించింది. గాయపడిన వికెట్ కీపర్ షై హోప్ స్థానంలో జహ్మర్ హామిల్టన్ జట్టులోకి రాగా... తన ఆకారంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ రకీమ్ కార్న్‌వాల్‌కు అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఆరున్నర అడుగులు, 140 కిలోల బరువున్న కార్న్‌వాల్ తొలి మ్యాచ్‌లోనే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు. హోల్డర్ తన తొలి ఓవర్లోనే రాహుల్‌ను ఔట్ చేసి విండీస్‌కు బ్రేక్ అందించాడు. మొదటి స్లిప్‌లో కార్న్‌వాల్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో భారత ఓపెనర్ ఆట ముగిసింది. ఆ తర్వాత కార్న్‌వాల్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని స్పిన్‌ను సరిగా అంచనా వేయలేకపోయిన పుజారా బ్యాక్వర్డ్ పాయింట్లో క్యాచ్ ఇవ్వడంతో భారీకాయుడికి తొలి వికెట్ దక్కింది. ఈ దశలో మయాంక్, కోహ్లి కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అయితే హోల్డర్ వేసిన మరో చక్కటి బంతిని మయాంక్ స్లిప్‌లో ఉన్న కార్న్‌వాల్ చేతుల్లోకి పంపి పెవిలియన్ చేరాడు. తొలి మ్యాచ్‌లో రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వైస్ కెప్టెన్ రహానే ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కీమర్ రోచ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం అర్ధసెంచరీతో ఊపుమీదున్న కోహ్లిని ఓ చక్కటి బంతితో హోల్డర్ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 202 పరుగులకే భారత్ ప్రధాన ఐదు వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో తెలుగు కుర్రాడు హనుమ విహారీ జట్టు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. వీరిద్దరూ రాణింపుపైనే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ ఆధారపడి ఉంది. వివియన్ రిచర్డ్స్కు అస్వస్థత క్రికెట్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ శుక్రవారం అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. కింగ్‌స్టన్‌లో రెండో టెస్టుకు ముందు వ్యాఖ్యాతగా ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బ తింది. వెంటనే స్ట్రెచర్‌పై ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్రమైన వేడి వాతావరణం కారణంగా డీహైడ్రేషన్‌కు గురైనట్లు సమాచారం. చికిత్స అనంతరం రిచర్డ్స్ కోలుకొని తిరిగి కామెంటరీ చేసేందుకు సిద్ధమయ్యారు. -
పంజాబ్ ఆఖరి గెలుపు
మొహాలి: ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోయిన తర్వాత పంజాబ్ ఆట గెలుపుతో ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (55 బంతుల్లో 96; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకానికి 4 పరుగులతో దూరమయ్యాడు. స్యామ్ కరన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. మెరుపులు మెరిపించిన లోకేశ్ రాహుల్ (36 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. హర్భజన్ సింగ్‌కు 3 వికెట్లు దక్కాయి. డు ప్లెసిస్ జోరు చెన్నై ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్లలో వాట్సన్ (7) విఫలమయ్యాడు. కానీ డు ప్లెసిస్ వేగం, నిలకడ కలగలిపిన ఇన్నింగ్స్ ఆడాడు. వీలు చిక్కితే బౌండరీ లేదంటే ఒకట్రెండు పరుగులతో జట్టును నడిపించాడు. ఇతనికి జతయిన రైనా దూకుడు కనబరచడంతో చెన్నై స్కోరు పరుగెత్తింది. 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. వీళ్లిద్దరు ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమివ్వకుండా ఆడారు. ఈ క్రమంలో డు ప్లెసిస్ 37 బంతుల్లో, రైనా 34 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. 15వ ఓవర్ నుంచి ఈ జోడీ వేగం పెంచింది. మురుగన్ అశ్విన్ 15వ ఓవర్లో రైనా ఒక ఫోర్ కొడితే డుప్లెసిస్ 4, 6 బాదాడు. టై 16వ ఓవర్లో డుప్లెసిస్ 2 ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. జట్టు స్కోరు 150 పరుగుల వద్ద కరన్ ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. రైనా (38 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను ఔట్ చేయడంతో 120 పరుగులు రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. 19వ ఓవర్లో సిక్స్‌తో సెంచరీకి చేరువైన డు ప్లెసిస్‌ను కరనే ఔట్ చేశాడు. ధోని (10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. పంజాబ్ 57/0...రాహుల్ 52 పంజాబ్ లక్ష్యఛేదనను రాహుల్ సిక్స్‌తో, క్రిస్ గేల్ (28 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫోర్‌తో ఆరంభించారు. ముఖ్యంగా రాహుల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రెండో ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టాడు. అతడు తొలి 8 బంతుల్లో చేసిన 18 పరుగులు సిక్స్‌ల రూపంలోనే వచ్చాయి. హర్భజన్ సింగ్ వేసిన నాలుగో ఓవర్లో ఐదు సార్లు బంతి బౌండరీ లైనును దాటింది. రాహుల్ వరుసగా 4, 4, 4, 6, 0, 6లతో ఏకంగా 24 పరుగులు సాధించాడు. అంతే 3.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరగా... 19 బంతుల్లోనే రాహుల్ అర్ధశతకం పూర్తయింది. ఇమ్రాన్ తాహిర్ ఏడో ఓవర్‌ను గేల్ ఆడుకున్నాడు. 4, 6, 6తో 17 పరుగులు చేశాడు. అడ్డుఅదుపులేని బౌండరీలతో జట్టు స్కోరు 9 ఓవర్లలోనే వందకు చేరింది. ఇక మిగిలింది 11 ఓవర్లలో 71 పరుగులే. అయితే 11వ ఓవర్ వేసిన హర్భజన్ వీళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో 108 స్కోరు వద్ద 2 వికెట్లను కోల్పోయింది. భజ్జీ మరుసటి ఓవర్లో మయాంక్ అగర్వాల్ (7) ఆటను ముగించాడు. కానీ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపుల బాధ్యతను తీసుకోవడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోయింది. 164 పరుగుల వద్ద అతను ఔటైనా... మిగతా లాంఛనాన్ని మన్దీప్ సింగ్ (11 నాటౌట్), స్యామ్ కరన్ (6 నాటౌట్) పూర్తి చేశారు. -
ముంబైని గెలిపించిన పొలార్డ్
భారీ స్కోర్ల మ్యాచ్‌లో బ్యాట్లు శివాలెత్తాయి. బౌలర్లు విలవిల్లాడారు. ప్రేక్షకులేమో పరుగుల విలయానికి కళ్లప్పగించారు. మొదట గేల్ చితగ్గొడితే, రాహుల్ శతక్కొట్టాడు. పంజాబ్‌కు భారీస్కోరు అందించారు. తర్వాత ముంబైని కెప్టెన్ పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో విజయం దిశగా నడిపించాడు. చివర్లో ఉత్కంఠ రేకెత్తినా... ముంబై లక్ష్యాన్ని పూర్తిచేసింది. ముంబై: ప్రత్యర్థి జట్టులో ఇద్దరి మెరుపులపై ఒకే ఒక్కడి (పొలార్డ్) విధ్వంసం పైచేయి సాధించింది. ఐపీఎల్లో బుధవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 3 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (64 బంతుల్లో 100; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా... క్రిస్ గేల్ (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసి గెలిచింది. పొలార్డ్ (31 బంతుల్లో 83; 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) రాణించాడు. షమీకి 3 వికెట్లు దక్కాయి. గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో సిద్ధేశ్ లాడ్ తుది జట్టులోకి రాగా, పంజాబ్ కూడా ఒక మార్పు చేసింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో కరుణ్ నాయర్‌కు అవకాశమిచ్చింది. నాయర్‌కు ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. గేల్ సుడిగాలి ఫిఫ్టీ పంజాబ్ ఆట నెమ్మదిగా మొదలైంది. ఓపెనర్లు గేల్, రాహుల్ బ్యాట్ ఝళిపించేందుకు 4 ఓవర్ల సమయం పట్టింది. బెహ్రెన్‌డార్ఫ్ తొలి ఓవర్లో ఒకటే పరుగొచ్చింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో 3, బెహ్రెన్‌డార్ఫ్ మరుసటి ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. గత మ్యాచ్‌లో అల్లాడించిన అల్జారి జోసెఫ్ బౌలింగ్‌కు దిగాడు. 4 బంతులు బాగానే వేసినా ఐదో బంతిని రాహుల్ సిక్సర్‌గా మలచడంతో అత్యధికంగా 9 పరుగులు రాగా... నాలుగు ఓవర్లలో పంజాబ్ మొత్తం 20 పరుగులు చేసింది. ఇక ఐదో ఓవరైతే గేల్ శివతాండవంతో నాలుగుసార్లు బంతి బౌండరీని దాటింది. బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో మొదట రాహుల్ ఓ పరుగుతీశాడు. తర్వాత గేల్ 6, 6, 0, 4, 6తో ఏకంగా 23 పరుగులొచ్చాయి. జట్టు స్కోరు ఆరుబంతుల వ్యవధిలోనే 43/0కు చేరుకుంది. అల్జారి బౌలింగ్‌నూ రాహుల్ తేలిగ్గా ఎదుర్కొన్నాడు. 6, 4తో జోరుపెంచాడు. ఓపెనింగ్ ఊపుమీదున్న ఈ దశలో లెగ్‌స్పిన్నర్ రాహుల్ చహర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో 8వ ఓవర్లో 6 పరుగులే వచ్చాయి. కానీ మరుసటి ఓవర్లో సుడి‘గేల్’ 6, 4, 4 తాకిడితో పరుగుల హోరు పెరిగింది. తొలి సగం (10) ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోని కింగ్స్ 93 పరుగులు చేసింది. 11వ ఓవర్లో భారీ సిక్సర్‌తో గేల్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తయ్యింది. జట్టు స్కోరు వందకు చేరింది. కాసేపటికే రాహుల్ కూడా 41 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. బౌండరీలకు తెగబడుతున్న గేల్ విధ్వంసానికి బెహ్రెన్‌డార్ఫ్ చెక్ పెట్టడంతో 116 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్ తొలి శతకం గేల్ నిష్క్రమణ తర్వాత పంజాబ్ స్కోరు వేగం తగ్గింది. స్వల్ప వ్యవధిలో మిల్లర్ (7), కరుణ్ నాయర్ (5)లను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. 14 నుంచి 17వరకు నాలుగు ఓవర్లలో పంజాబ్ కేవలం 26 పరుగులే చేసింది. మళ్లీ 18వ ఓవర్ నుంచి పంజాబ్ మెరుపులు మొదలయ్యాయి. బుమ్రా వేసిన ఈ ఓవర్లో కరన్ రెండు వరుస ఫోర్లు కొట్టి ఔట్కాగా... రాహుల్ మరో ఔండరీ బాదాడు. 16 పరుగులు లభించడంతో జట్టు స్కోరు 150 దాటింది. ఇక మిగిలింది రెండే ఓవర్లు. రాహుల్ 69 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సెంచరీ ఆశలైతే లేవు. కానీ హార్దిక్ పాండ్యా 19వ ఓవర్లో రాహుల్ ఒక్కసారిగా చెలరేగాడు. 6, 4, 6, 6, సింగిల్‌తో 23 పరుగులు పిండుకున్నాడు. 92 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. ఈ ఓవర్లో మొత్తం 25 పరుగులు లభించాయి. ఆఖరి ఓవర్ తొలి బంతికే రాహుల్ సిక్సర్ బాదాడు. బుమ్రా రెండు బంతుల్ని డాట్‌గా వేశాడు. తర్వాత బంతికి 2 పరుగులు తీసి 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ముంబై తడబాటు తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు మెరుపు అరంభాన్నిచ్చే ప్రయత్నం చేశాడు సిద్ధేశ్ లాడ్. డికాక్‌తో కలిసి పరుగులవేటకు దిగిన అతను తొలి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో 10 పరుగులు చేశాడు. తర్వాత ఓవర్ వేసిన షమీ కేవలం మూడే పరుగులిచ్చాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను షమీ మరింత కట్టుదిట్టంగా వేశాడు. పరుగు మాత్రమే ఇచ్చి సిద్ధేశ్ (15) ఆట ముగించాడు. దీంతో సూర్యకుమార్ జతయ్యాడు. ఇద్దరు పవర్ ప్లేలో మరో వికెట్ పడకుండా సరిగ్గా జట్టు స్కోరును 50 పరుగులకు చేర్చారు. భారీ లక్ష్యం ముందుండగా... మెరుపుల్లేకుండా సాగుతున్న ముంబై ఇన్నింగ్స్‌ను వరుస ఓవర్లలో కరన్, అశ్విన్ దెబ్బతీశారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సూర్యకుమార్ (15 బంతుల్లో 21; 4 ఫోర్లు)ను కరన్ ఔట్ చేయగా, మరుసటి ఓవర్లో డికాక్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు)ను అశ్విన్ బోల్తాకొట్టించాడు. పొలార్డ్ విధ్వంసం ముంబై తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 65 పరుగులు చేసింది. మిగతా సగం ఓవర్లలో ఇంకా 133 పరుగులు చేయాలి. అంటే ఓవర్‌కు 13 పరుగులకు మించి చేయాల్సిందే. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ పొలార్డ్ బ్యాట్‌కు పనిచెప్పాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కరన్ బౌలింగ్‌లో 6, 4, 6తో 18 పరుగులు చేశాడు. ఆఖరి బంతికి పొలార్డ్ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి బౌలర్‌కు సమీపంలో ఉన్నా... లేని పరుగుకు ప్రయత్నించి ఇషాన్ కిషన్ (7) రనౌటయ్యాడు. కెప్టెన్‌కు హార్దిక్ పాండ్యా జతయ్యాడు. ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. ఈ జోడి 3 ఓవర్లలో 41 పరుగులు చేసింది. 15 ఓవర్లలో జట్టు స్కోరు 135/5. ఇక ఆఖరి 30 బంతుల్లో ముంబై విజయానికి 63 పరుగులు కావాలి. ఈ దశలో 16వ ఓవర్ల్లో పాండ్యా బ్రదర్స్‌ను షమీ పెవిలియన్ చేర్చాడు. షమీ తొలి బంతికి హార్దిక్ (19; 2 ఫోర్లు), నాలుగో బంతికి కృనాల్ (1) వెనుతిరిగారు. ఇక ముంబై ఆశలు పొలార్డ్‌పైనే పెట్టుకుంది. అల్జారి జోసెఫ్ (15 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి భారీ సిక్సర్లతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 22 బంతుల్లోనే (1 ఫోర్, 7 సిక్స్‌లు) అర్ధసెంచరీని పూర్తి చేసుకున్న పొలార్డ్... కరన్ వేసిన 19వ ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. 12 బంతుల్లో 32 పరుగులు చేయాల్సి వుండగా... ఈ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లతో 17 పరుగులు సాధించాడు. ఇక ఆఖరి 6 బంతులకు 15 పరుగులు కావాలి. అంకిత్ రాజ్‌పుత్ బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతి నోబాల్ కాగా పొలార్డ్ సిక్సర్‌గా మలిచాడు. మరుసటి బంతి బౌండరీకి వెళ్లింది. దీంతో ఐదు బంతులకు 4 పరుగులు చేస్తే సరిపోతుంది. ఈ దశలో పొలార్డ్ ఔట్ కాగా... ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సివుండగా అల్జారి మిడాన్‌లో షాట్ కొట్టి చకచకా 2 పరుగులు పూర్తి చేయడంతో ముంబై గెలిచింది. రోహిత్ శర్మకు గాయం పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు రోజు మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మ కుడి కాలి కండరాలు పట్టేశాయి. అతను కోలుకున్నా... ముందు జాగ్రత్తగా ముంబై ఇండియన్స్ అతడికి విశ్రాంతినిస్తూ పంజాబ్‌తో మ్యాచ్‌లో పక్కన పెట్టింది. ఐపీఎల్లో రోహిత్ మ్యాచ్‌కు దూరం కావడం ఇది రెండోసారి మాత్రమే. 2011నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ వరుసగా 133 మ్యాచ్‌ల తర్వాత మొదటిసారి బరిలోకి దిగలేదు. అంతకు ముందు దక్కన్ చార్జర్స్ తరఫున ఆడిన మూడేళ్లలో అతను ఒక మ్యాచ్ ఆడలేదు. రోహిత్ స్థానంలో ఈ మ్యాచ్ లో సిద్ధేశ్ లాడ్‌కు అవకాశం దక్కింది. సిద్ధేశ్ తండ్రి దినేశ్ లాడ్...రోహిత్‌కు చిన్ననాటి కోచ్ కావడం విశేషం. 2015 ఐపీఎల్‌లోనే సిద్ధేశ్‌ను తీసుకున్న ముంబై ఇండియన్స్ నాలుగేళ్ల పాటు జట్టుతో ఉంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. అతనికి ఐపీఎల్లో ఇదే మొదటి మ్యాచ్. -
భారీ స్కోరు దిశగా భారత్ ‘ఎ’
మైసూర్: టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో... ఇంగ్లండ్ లయన్స్‌తో బుధవారం మొదలైన రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 84.5 ఓవర్లలో మూడు వికెట్లకు 282 పరుగులు చేసింది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ (222 బంతుల్లో 117; 13 ఫోర్లు, సిక్స్) సెంచరీ సాధించగా... లోకేశ్ రాహుల్ (166 బంతుల్లో 81; 11 ఫోర్లు) ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 179 పరుగులు జోడించడం విశేషం. రాహుల్ ఔటయ్యాక ప్రియాంక్ పాంచల్ (88 బంతుల్లో 50; 7 ఫోర్లు)తో కలిసి ఈశ్వరన్ రెండో వికెట్‌కు 73 పరుగులు జత చేశాడు. ఇన్నింగ్స్ 85వ ఓవర్లో ప్రియాంక్ ఔటయ్యాక తొలి రోజు ఆటను ముగించారు. కరుణ్ నాయర్ (33 బంతుల్లో 14 బ్యాటింగ్; ఫోర్, సిక్స్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లలో టామ్ బెయిలీ, జాన్ చాపెల్, డొమినిక్ బెస్ ఒక్కో వికెట్ తీశారు. -
భారత్ ‘ఎ’ 219/1
వాయనాడ్ (కేరళ): ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ దీటైన జవాబు ఇచ్చింది. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 219 పరుగులు సాధించింది. లోకేశ్ రాహుల్ (88 బ్యాటింగ్; 11 ఫోర్లు), ప్రియాంక్ పాంచల్ (89 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో వికెట్‌కు అజేయంగా 171 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 303/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ లయన్స్ 340 పరుగుల వద్ద ఆలౌటైంది. నవదీప్ సైనికి ఐదు వికెట్లు లభించాయి. -
రాహుల్, పాండ్యాలకు భారీ షాక్
సిడ్నీ: టీవీ టాక్ ‘షో’లో మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్‌లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు తీసుకుంది. వారిద్దరిపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఎంత కాలం లేదా ఎన్ని మ్యాచ్‌లు అనే విషయం ప్రకటించకపోయినా ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ పర్యటనకు కూడా వీరిద్దరు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. పాండ్యా, రాహుల్‌లపై విచారణ కొనసాగుతుండగానే సస్పెండ్ చేయడం విశేషం. వీరిద్దరికి బోర్డు తాజాగా మళ్లీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇద్దరిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. సీఓఏ ఈ–మెయిల్ ద్వారా ఈ సమాచారం అందించింది. ‘అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శించినందుకు బీసీసీఐ నియమావళిలోని నిబంధన–41 కింద విచారణ జరుగుతోందనే విషయం మీకు తెలుసు. ప్రస్తుతం ఆ విచారణ పెండింగ్‌లో ఉంది. 41 (6) నిబంధనను అనుసరించి మీపై తక్షణం నిషేధం విధిస్తున్నాం. దీని ప్రకారం విచారణ ముగిసి తుది తీర్పు వచ్చే వరకు బీసీసీఐ లేదా ఐసీసీ లేదా రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సంబంధించిన గుర్తింపు పొందిన ఏదైనా మ్యాచ్‌లో పాల్గొనడం లేదా కార్యక్రమాలకు హాజరు కావడం కూడా మీరు చేయరాదు’ అని బోర్డు స్పష్టం చేసింది. సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరితో చర్చించిన తర్వాత నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి రానున్న పాండ్యా, రాహుల్ స్థానాల్లో ఇద్దరు కొత్త ఆటగాళ్లను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాండ్యా, రాహుల్ అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడటంతో తీవ్ర వివాదం చెలరేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. బీసీసీఐ షోకాజ్ నోటీసుకు స్పందిస్తూ వారిద్దరు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే దీనితో సరిపెట్టకుండా కనీసం రెండు వన్డేల నిషేధం విధించాలని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ సూచించడంతో శిక్ష తీవ్రత పెరిగింది. నేడు జరిగే తొలి వన్డే కోసం వీరిద్దరి పేర్లను పరిశీలించరాదని టీమ్ మేనేజ్మెంట్కు బోర్డు నుంచి ముందే సమాచారం అందడంతో వారిని పక్కన పెట్టారు. మరోవైపు తమ ‘షో’ కొందరి మనోభావాలను గాయపరిచినట్లు గుర్తిస్తూ దీనిని తొలగిస్తున్నట్లు హాట్‌స్టార్ ప్రకటించింది. వాళ్లు తప్పు చేశారు అనుచిత వ్యాఖ్యల విషయంలో భారత జట్టు నుంచి మా ఇద్దరు ఆటగాళ్లకు ఎలాంటి మద్దతు లభించదు. ఈ విషయాన్ని పాండ్యా, రాహుల్‌కు కూడా చెప్పేశాం. అవి వ్యక్తిగత వ్యాఖ్యలే అయినా వాటిని మేం అంగీకరించడం లేదు. ఆ ఇద్దరు ఆటగాళ్లకు కూడా తాము ఎంత పెద్ద తప్పు చేశామో అర్థమైంది. వారిపై దీని ప్రభావం పడింది. ఇలా జరగడం దురదృష్టకరం. కానీ కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. ఇకపై ఏం జరుగబోతోందో చూడటమే మనం చేయగలం. ఇలాంటి సమయంలో జట్టు కూర్పు గురించి మాత్రం మళ్లీ ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఈ అంశాలు మా జట్టు స్ఫూర్తిని దెబ్బ తీయలేవు. ఇంతకు ముందే చెప్పినట్లు అవి పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయాలు. మేం వాటిని ఖండిస్తున్నాం. – కోహ్లి, భారత కెప్టెన్ -
టీవీ ‘షో’లో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు
సిడ్నీ/న్యూఢిల్లీ: టెలివిజన్ ‘షో’లో మహిళల్ని కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్‌లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆ నోటీసుల్లో బోర్డు పేర్కొంది. ప్రముఖ షో అయిన ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో వ్యాఖ్యాత కరణ్ జోహార్‌తో కలిసి ఈ ఇద్దరు క్రికెటర్లు పాల్గొన్నారు. ఇది ఇటీవలే ప్రసారమైంది. అందులో 25 ఏళ్ల ఆల్‌రౌండర్ పాండ్యా మాట్లా డుతూ ‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదోటైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే ‘ఆజ్ మై కర్ కే ఆయా’ (నేను ఈ రోజు ...ఆ పని చేసొచ్చా) అని తల్లిదండ్రులతో చెప్పేస్తా’ అని వ్యాఖ్యానించాడు. 18 ఏళ్ల వయసప్పుడే తన ప్యాంట్ జేబులో కండోమ్ లభించడాన్ని వాళ్ల అమ్మ తండ్రి దృష్టికి తీసుకెళ్లిందని, మొదట మందలించినా... తర్వాత ‘పర్లేదు...రక్షణ కవచం వాడావు’ అని తండ్రి తనతో అన్నట్లు షోలో రాహుల్ చెప్పుకొచ్చాడు. కాంట్రాక్టు క్రికెటర్లయి ఉండి ఇలా అశ్లీల రీతిలో విచ్చలవిడితనంతో వ్యాఖ్యానించిన సదరు క్రికెటర్లకు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ నోటీసులు పంపారు. ఈ నోటీసులు రాగానే పాండ్యా ట్విట్టర్ వేదికగా మహిళలను క్షమాపణలు కోరాడు. ‘ఆ ఊపులో చెప్పేశాను. ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలి’ అని అన్నాడు. అయితే మరో క్రికెటర్ రాహుల్ మాత్రం ఇంకా స్పందించలేదు. -
రాహుల్ ఫెయిల్.. మయాంక్ దూకుడు
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (9) వైఫల్యాన్ని కొనసాగించాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును వంద పరుగులు దాటించారు. ఈ క్రమంలో మయాంక్ అర్ధసెంచరీ సాధించాడు. 96 బంతుల్లో 6 ఫోర్లతో అర్ధ శతకం పూర్తిచేశాడు. అతడికి సీనియర్ బ్యాట్స్‌మన్ పుజారా చక్కటి సహకారం అందించాడు. అర్ధ సెంచరీ చేసిన తర్వాత మయాంక్ దూకుడు పెంచాడు. లయన్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. చివరికి అతడి బౌలింగ్‌లోనే మయాంక్(77; 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అవుటయ్యాడు. 161/2 స్కోరుతో టీమిండియా ఆట కొనసాగిస్తోంది. చతేశ్వర్ పుజారా (49), విరాట్ కోహ్లి(19) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్, రవీంద్రన్ అశ్విన్‌లకు తుది జట్టులో స్థానం దక్కలేదు. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. (గెలిస్తే గొప్ప ఘనతవుతుంది!) -
‘ధోనిని ఔట్ చేసింది రాహులే’
దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం అఫ్గానిస్తాన్- టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ టై గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే విజయం టీమిండియాదే అనుకున్న తరుణంలో అనూహ్యంగా ఓటమి అంచులదాకా వెళ్లి స్కోర్ సమంచేసి ‘టై’ తో సంతృప్తి పడింది. అయితే మ్యాచ్ టై కావడానికి, ధోని ఔట్ కావడానికి ఓపెనర్ కేఎల్ రాహులే కారణమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు కదా, మరి ఫ్యాన్స్ ఎందుకు విమర్శిస్తున్నారనుకుంటున్నారా.. రివ్యూను వృథా చేయడమే రాహుల్ చేసిన పొరపాటు. అఫ్గాన్ సంచలన బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి రాహుల్ ఎల్బీగా ఔటయ్యాడు. అయితే దీనిపై అనుమానంగానే రివ్యూకి వెళ్లాడు. కానీ క్లియర్‌గా రాహుల్ ఔటైనట్లు థర్డ్ అంపైర్ ప్రకటించడంతో భారత్ ఉన్న ఒక్క రివ్యూ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అహ్మదీ బౌలింగ్‌లో అంపైర్ తప్పిద నిర్ణయానికి బలయ్యాడు. అయితే అంపైర్ నిర్ణయంపట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికి రివ్యూ లేకపోవడంతో ధోని మైదానాన్ని వీడాల్సివచ్చింది. అయితే రివ్యూ మిగిలివుంటే ధోని అవుటయ్యేవాడు కాదని, మ్యాచ్ టై గా ముగిసేది కాదని అభిమానుల వాదన. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లోనూ రివ్యూ సరిగ్గా ఉపయోగించకుండా వృథా చేశాడని నెటిజన్లు గుర్తుచేశారు. రాహుల్ డీఆర్ఎస్ ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాడని, దీనిపై అతడికి ధోనితో ప్రత్యేక క్లాస్‌లు చెప్పించాలని కామెంట్ చేస్తున్నారు. ఎంఎస్ ధోని 200వ వన్డేకు నాయకత్వం వహిస్తున్న మ్యాచ్ గెలవకుండా అడ్డుకుంది రాహులే అని మరికొంతమంది ఘాటుగా విమర్శిస్తున్నారు. ఒక్క రివ్యూ తప్పిదంతో ఇద్దరు ఔటయ్యారంటూ చురకలు అంటిస్తున్నారు. చదవండి: ఊరించి... ఉత్కం‘టై’ -
కుల్దీప్ కూల్చేయగా.. రాహుల్ శతక్కొట్టగా
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. మూడు టీ20ల భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత కుల్దీప్(5/24) బౌలింగ్ ముందు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తేలిపోగా.. అనంతరం లోకేశ్ రాహుల్(101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) పరుగుల ప్రవాహం కొనసాగించాడు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. ఏడు పరుగుల స్కోర్ బోర్డు వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్(4) విల్లే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి స్కోర్ బోర్డు పరిగెత్తించారు. ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై రాహుల్ ఎదురుదాడికి దిగగా, రోహిత్ శర్మ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలోనే 27 బంతుల్లోనే రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 123 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడిని రషీద్ విడదీశాడు. రోహిత్ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) వెనుదిరగటంతో కెప్టెన్ కోహ్లితో కలిసి లక్ష్యాన్ని రాహుల్ పూర్తి చేశాడు. రాహుల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో మరో పది బంతులు మిగిలుండగానే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే, రషీద్ తలో వికెట్ సాధించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం జాసన్ రాయ్ (30; 20 బంతుల్లో 5ఫోర్లు) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మరో వైపు ఐపీఎల్ హీరో జోస్ బట్లర్(69; 46 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఆకాశమే హద్దుగా బౌలర్లపై దాడి చేశాడు. దీంతో పది ఓవర్లలకే స్కోర్ 77 పరుగులు దాటింది. కుల్డీప్ కూల్చేశాడు.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చేలరేగుతుండంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న సమయంలో బంతి అందుకున్న కుల్డీప్ మాయ చేశాడు. హేల్స్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న కుల్దీప్.. 14 ఓవర్లో మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్‌తో పాటు ధోని మాస్టర్ కీపింగ్‌తో ఏకంగా ఈ ఓవర్లో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో మోర్గాన్(8), బెయిర్ స్టో(0), రూట్(0) వెనుదిరగడంతో ఇంగ్లండ్ కష్టాల్లోపడింది. మరో వైపు వికెట్లు పడుతున్నా బట్లర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివర్లో డేవిడ్ విల్లీ (29; 15 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌కు పనిచెప్పడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ ఐదు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ రెండు, హార్దిక్ ఒక్క వికెట్ సాధించారు. -
కీపర్లే కింగ్మేకర్లు
-
కీపర్లే కింగ్మేకర్లు
సాక్షి, స్సోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11లో ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్ క్వాలిఫై కాగా మిగతా మూడు స్థానాల కోసం మిగిలిన జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అన్ని జట్లలోని కీపర్లు బ్యాట్ ఝుళిపించడం విశేషం. ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీపర్ వృద్ధిమాన్ సాహా మినహా మిగతా కీపర్లు తమ తమ జట్టు విజయాల్లో కింగ్మేకర్లుగా ప్రధాన భూమికను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని, ఢిల్లీ డేర్‌డెవిల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, కింగ్స్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ముంబై ఇండియన్స్ యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషాన్‌లు పరుగుల వరద పారిస్తున్నారు. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు వారు సాధించిన పరుగులు రిషభ్ పంత్ 578 పరుగులు లోకేశ్ రాహుల్ 537 పరుగులు జోస్ బట్లర్ 415 పరుగులు మహేంద్ర సింగ్ ధోని 393 పరుగులు దినేశ్ కార్తీక్ 371 పరుగులు ఇషాన్ కిషాన్ 238 పరుగులు -
తెలుసు.. అందుకే ముందుకొచ్చా: అశ్విన్
జైపూర్: ఇంతపెద్ద టోర్నీలో ఒకటో రెండో మ్యాచ్‌లు ఓడిపోవడం పెద్ద విషయం కాదంటున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్ 2018లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్(70 బంతుల్లో 95 నాటౌట్) ఒంటరి పోరాటం వృధాఅయిపోయింది. కాగా, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేసి తాను 3వ స్థానంలో బరిలోకి దిగడాన్ని కెప్టెన్ అశ్విన్ సమర్థించుకున్నాడు. పవర్ చూపెడదామనుకున్నా: ‘‘మేము పర్ఫెక్ట్ టీమ్ కాదన్న సంగతి మాకు తెలుసు. ప్రయోగాలు చేయకతప్పడంలేదు. వికెట్ టఫ్‌గా ఉంది. పోనుపోను బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కాబట్టి పవర్ ప్లేలో ప్రత్యర్థిని అటాక్ చేద్దామనుకున్నాం. అందుకే నేను 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాను. వాస్తవానికి మేం బౌలింగ్, ఫీల్డింగ్ సరిగా చెయ్యలేదు. కీలకమైన క్యాచ్‌లు పట్టిఉంటే రాజస్తాన్ స్కోరు ఓ 20 పరుగులు తగ్గిఉండేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. అఫ్కోర్స్, ఈ ఓటమి ఈ రోజుకు మాత్రమే పరిమితం. మున్ముందు కూడా ప్రయోగాలు చేస్తాం..’’ అని అశ్విన్ వివరించాడు. ట్రోలింగ్: కాగా, అశ్విన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ‘పిచ్ హిట్టర్ కాకపోయినా ఫస్ట్‌డౌన్‌లో ఎందుకొచ్చావ్?’ తరహా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూడోస్థానంలో వచ్చి రెండు బంతులు ఆడిన అశ్విన్.. గౌతం బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అటు ఐపీఎల్లో అశ్విన్ బ్యాటింగ్ గణాకాంలూ ఏమంత గొప్పగాలేవు. ఇప్పటివరకు 121 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 100.34 స్ట్రైక్ రేట్‌తో కేవలం 288 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా 206 టీ20ల్లో 542 రన్స్ మాత్రమే సాధించాడు. 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న కింగ్స్ పంజాబ్.. తన తర్వాతి మ్యాచ్ మే 12న కోల్‌కతాతో ఆడనుంది. -
ఓహో లోకేశ్ రాహుల్
కింగ్స్ ఎలెవన్ మొదట స్పిన్‌తో కట్టేసింది. తర్వాత బ్యాటింగ్‌లో చితగ్గొట్టింది. దాని పంజా(బ్) ధాటికి రాజస్తాన్ రాయల్స్ నిలువలేకపోయింది. ముజీబ్ తన స్పిన్ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగా... తర్వాత బ్యాటింగ్‌లో ఓపెనర్ లోకేశ్ రాహుల్ కడదాకా నిలిచి గెలిపించాడు. జట్టును ప్లే–ఆఫ్‌కు చేరువ చేశాడు. ఇండోర్: పంజాబ్ ఆల్‌రౌండ్ షోకు రాజస్తాన్ రాయల్స్ చేతులెత్తేసింది. మొదట ముజీబుర్ రెహమాన్ (3/27) ముచ్చెమటలు పట్టించగా, లోకేశ్ రాహుల్ (54 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత ప్రదర్శనతో గెలిపించాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో రాయల్స్‌పై నెగ్గింది. తొలుత రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. బట్లర్ (39 బంతుల్లో 51; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ముజీబ్ 3, ఆండ్రూ టై 2 వికెట్లు తీశారు. తర్వాత పంజాబ్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసి గెలిచింది. కరుణ్ నాయర్ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఈ సీజన్లో రాజస్తాన్కిది ఆరో ఓటమి కాగా, పంజాబ్ ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బట్లరే బాగా ఆడాడు... రాజస్తాన్ ఇన్నింగ్స్ ఏ దశలోనూ భారీ స్కోరు చేస్తుందనిపించేలా సాగలేదు. ఆ జట్టులో బట్లర్ ఒక్కడే నిలిచాడు. మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా అడేసిపోయారంతే. సంజు శామ్సన్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ గోపాల్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఓ చెయ్యేశారు. టాస్ నెగ్గిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను బట్లర్, షార్ట్ ప్రారంభించారు. కానీ ఆట మొదలైన మూడో బంతికే షార్ట్ (2), కాసేపటికి కెప్టెన్ రహానే (5) నిష్క్రమించారు. తర్వాత శామ్సన్ అండతో బట్లర్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. దీంతో పది ఓవర్ల దాకా మరో వికెట్ కోల్పోకుండా 81 పరుగులు చేసింది. కానీ ఆ మరుసటి ఓవర్లోనే శామ్సన్ ఔట్ కావడంతో రాయల్స్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. మరోవైపు బట్లర్ (37 బంతుల్లో, 7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముజీబ్ మ్యాజిక్ అయితే ముజీబ్ సూపర్ స్పెల్‌తో రాజస్తాన్ ఇన్నింగ్స్ కకావికలమైంది. 13వ ఓవర్లో స్టోక్స్ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు)ను ఔట్ చేసిన ముజీబ్... 15వ ఓవర్ తొలి బంతికి బట్లర్‌ను, రెండో బంతికి ఆర్చర్ (0)ను పెవిలియన్ చేర్చాడు. వీరంతా 6 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో శ్రేయస్ గోపాల్ కాసేపు పోరాడంతో 150 దాటింది. అశ్విన్, రాజ్‌పుత్, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు. పడుతూ... లేస్తూ... లక్ష్యం సునాయాసమే కానీ... పంజాబ్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. ఓపెనర్ గేల్ (8)తో పాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మయాంక్ (2) విఫలమయ్యాడు. దీంతో మరో ఓపెనర్ కె.ఎల్.రాహుల్ బాధ్యతగా ఆడాడు. కరుణ్ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మూడో వికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జతయ్యాక నాయర్‌ను అనురీత్, అక్షర్ పటేల్ (4)ను గౌతమ్ పెవిలియన్ చేర్చారు. 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా... స్టోయినిస్ (16 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో రాహుల్ (44 బంతుల్లో; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రన్‌రేట్ పెరిగిపోతున్న దశలో రాహుల్ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. చివరి 24 బంతుల్లో 43 కొట్టాల్సిన సమయంలో ఆర్చర్ వేసిన ఓవర్లో సిక్స్, ఫోర్ సహా 16 పరుగులు వచ్చాయి. తర్వాత రాహుల్... ఉనాద్కట్ బౌలింగ్‌లో 15 పరుగులు చేశాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 12గా మారింది. రాహుల్ సిక్స్, ఫోర్ బాది 8 బంతులు మిగిలి ఉండగానే గెలుపు తీరం చేర్చాడు. రాయల్స్ బౌలర్లలో గౌతమ్, ఆర్చర్, స్టోక్స్ తలా ఓ వికెట్ తీశారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (సి) రాహుల్ (బి) ముజీబ్ 51; షార్ట్ (సి) టై (బి) అశ్విన్ 2; రహానే (సి) గేల్ (బి) పటేల్ 5; శామ్సన్ (సి) నాయర్ (బి) టై 28; స్టోక్స్ (సి) తివారి (బి) ముజీబ్ 12; త్రిపాఠి (సి) అశ్విన్ (బి) టై 11; ఆర్చర్ (బి) ముజీబ్ 0; గౌతమ్ (సి) స్టొయినిస్ (బి) రాజ్‌పుత్ 5; గోపాల్ రనౌట్ 24; ఉనాద్కట్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–3, 2–35, 3–84, 4–100, 5–106, 6–106, 7–114, 8–129, 9–152. బౌలింగ్: అశ్విన్ 4–0–30–1, రాజ్‌పుత్ 3–0–37–1, ముజీబ్ 4–0–27–3, అక్షర్ పటేల్ 4–0–21–1, టై 4–0–24–2, స్టొయినిస్ 1–0–6–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ నాటౌట్ 84; గేల్ (సి) శామ్సన్ (బి) ఆర్చర్ 8; అగర్వాల్ (సి) త్రిపాఠి (బి) స్టోక్స్ 2; నాయర్ (బి) అనురీత్ సింగ్ 31; అక్షర్(సి) షార్ట్ (బి) గౌతమ్ 4; స్టొయినిస్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–23, 2–29, 3–79, 4–87. బౌలింగ్: గౌతమ్ 3–0–18–1, ఆర్చర్ 3.4–0–43–1, స్టోక్స్ 3–0–22–1, ఉనాద్కట్ 4–0–26–0, గోపాల్ 3–0–26–0, అనురీత్ సింగ్ 2–0–20–1. -
టీ 20లో టీమిండియా భారీ విజయం..సిరీస్ సొంతం
-
ఐపీఎల్–10కు అశ్విన్, రాహుల్ దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, లోకేశ్ రాహుల్, మురళీ విజయ్ గాయాల కారణంగా ఈ నెల 5న మొదలయ్యే ఐపీఎల్–10 సీజన్ నుంచి వైదొలిగారు. అశ్విన్ పుణే రైజింగ్ సూపర్ జెయింట్ తరఫున, రాహుల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున, విజయ్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరఫున ఆడాల్సి ఉంది. భుజం గాయం నుంచి ఇంకా కోలుకోని విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)... గత తొమ్మిది నెలలుగా విరామం లేకుండా జాతీయ జట్టుకు ఆడుతున్న రవీంద్ర జడేజా (గుజరాత్ లయన్స్), ఉమేశ్ యాదవ్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) ఆరంభంలోని కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశముంది. ‘నేను ఐపీఎల్లో ఆడటంలేదు. అధికారిక సమాచారాన్ని నా జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వెల్లడిస్తుంది’ అని రాహుల్ తెలిపాడు. భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి రాహుల్ లండన్ వెళ్లనున్నట్లు సమాచారం. -
సమష్టి మంత్రం...విజయ సూత్రం
♦ అన్ని విభాగాల్లో అదరగొట్టిన భారత్ ♦ విదేశీ పిచ్‌లపై కూడా రాణించాలి ధర్మశాల టెస్టులో విజయానికి కావాల్సిన రెండు పరుగులను పూర్తి చేసిన అనంతరం లోకేశ్ రాహుల్ విజయ గర్వంతో గాల్లోకి ఎగిరి ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ సింహనాదం చేశాడు. ఈ సిరీస్ ఎలాంటి స్థితిలో ముగిసిందో అర్ధం చేసుకోవడానికి ఇది చాలేమో? 2005 యాషెస్ సిరీస్ అనంతరం అంత ఉద్విగ్నంగా జరిగిన సిరీస్ ఇదే అని విశ్లేషకులు చెబుతున్న మాట. వివాదాలు.. కవ్వింపు చర్యలు.. ఫిర్యాదులు.. ఆసీస్ మీడియా ఎదురుదాడి.. టీమిండియా కెప్టెన్ ఘాటైన సమాధానాలు.. అంతకుమించి అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుంచుకునే రీతిలో ఇరు జట్ల ఆటగాళ్ల వీరోచిత ప్రదర్శన.. వెరసి భారత, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను రెండు కొదమ సింహాల సమరంగా వర్ణించవచ్చు. సాక్షి క్రీడా విభాగం : గతేడాది సెప్టెంబర్ 22న భారత జట్టు స్వదేశంలో తమ టెస్టు సీజన్‌కు తెర లేపింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు కోహ్లి సేన న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లతో ఆడింది. అన్నింటిని క్లీన్‌స్వీప్ చేసి ఆస్ట్రేలియాకు గట్టి సవాల్ విసిరింది. దీనికి తగ్గట్టుగానే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు అంతా భారత్‌నే ఫేవరెట్‌గా చెప్పుకున్నారు. క్లీన్‌స్వీప్ ఖాయం.. అది 4–0తోనా లేక 3–0తోనా తేలాల్సి ఉంది అని లెక్కలేశారు. కానీ సిరీస్ ప్రారంభమయ్యాక భారత్ విజయం అంత సులువు కాదని తేలిపోయింది. పుణేలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ స్పిన్ దెబ్బకు భారత్ అనూహ్యంగా కుదేలైపోయింది. స్పిన్నర్ ఒకీఫ్ ఏకంగా 12 వికెట్లతో రెచ్చిపోవడంతో భారత్ అత్యంత అవమానకర రీతిలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో 105, 107 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 333 పరుగులతో దారుణ ఓటమి. సర్వత్రా ఎదురైన విమర్శలను తట్టుకున్న కోహ్లి బృందం ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా జట్టు కోలుకున్న తీరు ప్రశంసనీయం. సమష్టి మంత్రాన్ని జపిస్తూ ఏకంగా సిరీస్‌నే దక్కించుకుంది. మొత్తం 25 వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా ఏకంగా ప్రపంచ టెస్టు క్రికెట్లో నంబర్‌వన్ బౌలర్‌గా మారాడు. ఉమేశ్ యాదవ్ 17 వికెట్లతో భారత పిచ్‌లపై పేసర్ కూడా ఎక్కువ వికెట్లు తీయగలడని చాటి చెప్పాడు. ఈ సిరీస్‌లో భారత్ ఆందోళన పడిన విషయం ఒక్క కోహ్లి ఫామ్ గురించే. విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా బ్యాటింగ్‌లో అదరగొట్టారు. కరుణ్ నాయర్ మాత్రం తనకు లభించిన అవకాశాన్ని సొమ్ము చేసుకోలేకపోయాడు. బెంగళూరులో భళా.. నాలుగు టెస్టుల సిరీస్‌లో బెంగళూరు మ్యాచ్ భారత్‌కు కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఈ రెండో టెస్టులో భారత్ పోరాడిన తీరు అపూర్వం. స్పిన్నర్ నాథన్ లయన్ ఎనిమిది వికెట్లతో దాడి చేయడంతో తొలి రోజే భారత్ 189 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా 92 పరుగులతో అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 188 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన ఆసీస్ కచ్చితంగా 2–0తో సిరీస్‌లో పైచేయి సాధిస్తుందనే అనుకున్నారు. అయితే ఆ జట్టును భారత్ అద్భుత రీతిలో అడ్డుకుని 112 పరుగులకు కుప్పకూల్చగలిగింది. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో.. అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరేసి వికెట్లతో చెలరేగి సిరీస్ సమం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వివాదాలూ ఇక్కడి నుంచే.. సిరీస్‌లో అసలైన వేడి కూడా ఈ టెస్టు నుంచే ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో తన అవుట్‌పై స్టీవ్ స్మిత్ రివ్యూ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఆసీస్ జట్టు మోసంతో ఆడుతోందని భారత జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. అయితే ఇరు జట్ల మధ్య ఈ వివాదం సమసిపోయినా అటు ఆసీస్ మీడియా మాత్రం కోహ్లిపై దుమ్మెత్తి పోసింది. కోహ్లిని ఏకంగా ట్రంప్‌తో పోలుస్తూ రోజుకో కథనాలు వండివార్చింది. దీనికి అతను కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇక రాంచీలో పుజారా డబుల్ సెంచరీ, సాహా సెంచరీతో విజయం ముంగిట నిలిచినా హ్యాండ్స్కోంబ్, షాన్ మార్‡్ష ఓపిగ్గా క్రీజులో నిలిచి మ్యాచ్ ‘డ్రా’గా ముగించారు. కోహ్లి లేకున్నా... చివరి టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లి గాయంతో బరిలోకి దిగకున్నా అజింక్యా రహానే జట్టును నడిపించిన తీరు ప్రశంసలందుకుంది. స్వయంగా కోహ్లి సైతం అతడి కెప్టెన్సీని పెవిలియన్‌లో కూర్చుని ఆస్వాదించినట్టు చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్టు బౌలర్లను మారుస్తూ ఆసీస్‌ను దెబ్బతీయగలిగాడు. తనలోని భావోద్వేగాలను బయటపెట్టకుండా మరో ‘మిస్టర్ కూల్’గా జట్టును విజయం వైపు నడిపించగలిగాడు. జడేజా ఆల్‌రౌండ్ షోతో పాటు లోకేశ్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఉమేశ్ యాదవ్ షార్ట్ పిచ్ బంతులతోనూ భయపెట్టగలనని నిరూపించాడు. ఇక కోహ్లి స్థానంలో బరిలోకి దిగిన ‘చైనామన్ స్పిన్నర్’ కుల్దీప్ యాదవ్ సంచలన అరంగేట్ర ప్రదర్శన చేశాడు. నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పరాజయానికి బాటలు వేశాడు. ఇక విదేశాల్లోనూ వణికించాలి! స్వదేశంలో జరిగిన 13 టెస్టుల్లో 10 మ్యాచ్‌లు గెలవడంతో పాటు నాలుగు సిరీస్‌లనూ దక్కించుకున్న భారత్... ఇక విదేశీ పిచ్‌లపై అదరగొట్టాల్సి ఉంది. అప్పుడే ఈ విజయాలకు సార్థకత లభించినట్టు అవుతుంది. నిజానికి సొంతగడ్డపై మనకు లభించే అనుకూల పరిస్థితులను సొమ్ము చేసుకుని గెలవడం బాగానే కనిపిస్తుంది. కానీ విదేశాలకు వెళ్లి అక్కడ సిరీస్‌లు నెగ్గితే లభించే గౌరవమే వేరు. అందునా టెస్టు క్రికెట్లో నంబర్‌వన్‌గా ఉన్న జట్టుపై ఈ ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇప్పటికీ ఆసీస్, దక్షిణాఫ్రికాలో భారత్ టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. మున్ముందు ఇదే జోరుతో టీమిండియా ఆ లోటు తీరుస్తుందని ఆశిద్దాం. -
మరో 'రాహూల్'గా మారే ప్రయత్నంలో...
∙ రాటుదేలుతున్న లోకేశ్ రాహుల్ ∙ రెండో టెస్టు విజయంలో ప్రధాన పాత్ర ∙ కీలక ఆటగాడిగా ఎదుగుతున్న వైనం ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు లోకేశ్ రాహుల్ ట్విట్టర్లో ఏదో సరదా పోస్టు పెట్టాడు. దానిపై ఒక అభిమాని ‘ఇదంతా సరే, పరుగులు ఎలా చేయాలో దానిపై దృష్టి పెట్టు’ అని కామెంట్ చేశాడు. సాధారణంగా ఇలాంటి వాటిపై స్పందించి రచ్చ చేసుకోవడం ఆటగాళ్లకు ఇష్టం ఉండదు. కానీ అంతకుముందు మ్యాచ్‌లో పోరాడి అర్ధ సెంచరీ చేసిన రాహుల్‌కు ఈ వ్యాఖ్య ఆగ్రహం తెప్పించినట్లుంది. వెంటనే ‘నువ్వు వచ్చి మాకు నేర్పించు. పరుగులు ఎలా చేయాలో నీకు బాగా తెలుసేమో’ అని ఘాటుగా బదులిచ్చాడు. ఆ తర్వాత జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సొంత మైదానంలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్ధ సెంచరీ చేసి జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లో అర్ధ సెంచరీ సాధించిన మూడు ఇన్నింగ్స్‌లు కూడా చూస్తే అతను చేసిన పరుగులే కాదు, సందర్భం, ఆడిన షాట్లు కూడా వాటి విలువను పెంచుతాయి. ఈ విషయంలో పేరులోనే కాదు తన మార్గదర్శి కూడా అయిన దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను అతనుగుర్తుకు తెచ్చాడు. మున్ముందు కూడా భారత టెస్టు జట్టులో విజయాల్లో ఓపెనర్‌గా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్న రాహుల్, అందు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సాక్షి క్రీడా విభాగం :దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో లోకేశ్ రాహుల్ తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పటికే రాహుల్ ద్రవిడ్ తరహా టెక్నిక్‌తో దేశవాళీలో అద్భుత ప్రదర్శనతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అతనిపై అందరి దృష్టీ ఉంది. కానీ అనూహ్యంగా రెండు ఇన్నింగ్స్‌లలోనూ చెత్త షాట్లు ఆడి తన వికెట్‌ను పారేసుకున్నాడు. బంగారు అవకాశాన్ని అతను వృథా చేసుకున్నాడని అంతా విమర్శించారు. ఈ మ్యాచ్ తర్వాత రాహుల్ చిన్ననాటి కోచ్ శామ్యూల్ జైరాజ్‌కు తన మిత్రుడి నుంచి ‘నీ శిష్యుడిని వెళ్లి ఐపీఎల్ ఆడుకోమని చెప్పు’ అని వ్యంగ్యంగా ఒక మెసేజ్ వచ్చింది. అయితే చిన్నప్పటి నుంచి రాహుల్ గురించి తెలిసిన కోచ్, తన శిష్యుడిపై నమ్మకముంచాడు. అడిలైడ్‌లో జరిగిన తర్వాతి టెస్టులోనే ఈ మంగళూరు అబ్బాయి సెంచరీ సాధించి తన అసలు సత్తాను ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ తర్వాత మూడు ఫార్మాట్లలో కూడా నిలకడగా రాణిస్తూ వచ్చిన లోకేశ్, ఇప్పుడు ఓపెనర్‌గా భారత టెస్టు జట్టుకు గొప్ప ఆరంభాలు ఇవ్వడంలో బిజీ అయిపోయాడు. టెక్నిక్ పరంగా, కష్టాల్లో ఉన్నప్పుడు నైతికంగా కూడా రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన మద్దతు అతని ఎదుగుదలలో కీలకంగా మారితే... విమర్శలు వచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ అండగా నిలిచి అవకాశాలిచ్చిన మరో కర్ణాటక దిగ్గజం, భారత కోచ్ అనిల్ కుంబ్లే పోషించిన పాత్ర కూడా చాలా ఉంది. అతివృష్టి... అనావృష్టి... రెండో టెస్టులోనే సెంచరీ సాధించినా రాహుల్ కెరీర్ అంత తొందరగా ఊపందుకోలేదు. ఒక మ్యాచ్‌లో భారీ స్కోరు సాధిస్తే మరో మ్యాచ్‌లో కనీసం 20 పరుగులు కూడా చేయకుండా ఘోరంగా విఫలమవుతూ రావడమే అందుకు కారణం. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు రాహుల్ టెస్టుల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. ఇవన్నీ కలిపి 575 పరుగులు అయితే... మిగిలిన 17 ఇన్నింగ్స్‌లు కలిపి అతను చేసింది 232 పరుగులే! అంటే నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ‘నేను 20 దాటితే చాలు సెంచరీ చేస్తాను అనేవారు. అది ప్రోత్సాహమో, వ్యంగ్యమో కూడా చెప్పలేను. కానీ ఓపెనర్‌గా మరింత బాగా ఆడాల్సిందని మాత్రం అర్థమైంది. ఓపెనర్ భారీ స్కోరు చేయడం జట్టుకు కీలకం’ అని రాహుల్ అంగీకరించాడు. కోచ్ కుంబ్లే శిక్షణలో తనలో లోపాలు సరిదిద్దుకొని భారీ స్కోరుపై దృష్టి పెట్టాడు. వరుసగా ఏడు ఇన్నింగ్స్‌లలో విఫలమైన తర్వాత ఇంగ్లండ్‌పై చేసిన 199 పరుగుల ఇన్నింగ్స్ రాహుల్‌లోని అసలైన టెస్టు క్రికెటర్‌ను బయట పెట్టింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో శుభారంభాలు లభించినా మూడు సార్లు సెంచరీ చేయలేకపోవడం తన వైఫల్యమే అని చెప్పిన రాహుల్, ఆ సమస్యను అధిగమించాలని పట్టుదలగా ఉన్నాడు. ఆల్ ఫార్మాట్ స్పెషలిస్ట్... టెస్టు ఓపెనర్ అంటే ఏ వీరేంద్ర సెహ్వాగ్ లాంటివాడో తప్ప దూకుడుగా ఆడటం మనకు సాధారణంగా కనిపించదు. సాంప్రదాయ ఆటలో చూడచక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చే ఓపెనర్లు మిగిలిన రెండు ఫార్మాట్లలో కూడా రాణిస్తున్నవారు అరుదు. సమకాలీన క్రికెట్లో లోకేశ్ రాహుల్‌ను ఆ జాబితాలో చేర్చవచ్చు. టెక్నిక్ తెలిసినవాడు ఎక్కడైనా చెలరేగిపోగలడనే దానికి రాహుల్ ఉదాహరణ. టెస్టు బ్యాట్స్‌మన్ ముద్ర నుంచి బయటకు వస్తూ 2016 ఐపీఎల్లో విరాట్ కోహ్లి సారథ్యంలో రాహుల్ తనను తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు. అక్కడ కొనసాగించిన జోరును అంతర్జాతీయ స్థాయిలోనూ చూపించాడు. వెస్టిండీస్‌పై నాలుగో స్థానంలో ఆడుతూ కూడా 51 బంతుల్లోనే 110 పరుగులు బాదిన తీరు అతని ప్రత్యేకతను చూపించింది. ఈ సిరీస్‌లో అతను వేగంగా పరుగులు చేయడం, కొన్ని సాహసోపేత షాట్లు ఆడటం పూర్తిగా టి20 ప్రభావంతో వచ్చినవే! ఆడిన తొలి వన్డేలోనే సెంచరీ సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కూడా రాహుల్ ఖాతాలో ఒక అరుదైన ఘనత చేరింది. ‘అన్ని రకాల పిచ్‌లు, పరిస్థితులపై ఆడగల సామర్థ్యం తనకు ఉందని రాహుల్ ఇప్పటికే నిరూపించాడు. మానసికంగా దృఢంగా ఉండటం కూడా అతని మరో బలం. కొన్ని రకాల షాట్లలో మరింత మెరుగు పడితే అతనికి తిరుగుండదు’ అని భారత మాజీ ఆటగాడు రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. కెరీర్ తొలి టెస్టులో మిడిలార్డర్లో విఫలమయ్యాక రెండో టెస్టులో అతడిని ఓపెనర్‌గా పంపి ఫలితం రాబట్టింది అప్పటి టీమ్ డైరెక్టర్ శాస్త్రినే. అప్పుడప్పుడు గాయాలు ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు మరో మాటకు తావు లేకుండా రాహుల్ భారత టెస్టు జట్టుకు ప్రధాన ఓపెనర్ అనడంలో సందేహం లేదు. అతని తాజా ప్రదర్శన ఆసీస్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌లలో కూడా కొనసాగితే సిరీస్ విజయమే కాదు, ఆ తర్వాత కూడా రాహు ల్ కెరీర్ మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయం. స్టయిల్ రాజా! ‘పదే పదే లుక్ మారుస్తూ ఉంటావు. నీ ఫొటోలు వాడుకోవడం చాలా కష్టంగా ఉంది రాహుల్. మరో కొత్త ఫొటో కావాలి’ అంటూ ఇటీవలే ఒక జర్నలిస్ట్ రాహుల్ ముందు వాపోయాడు. దానికి సిద్ధమైన అతను, మరోసారి జుట్టును సెట్ చేసుకోవడం కష్టమంటూ క్యాప్ తీయడానికి మాత్రం ఒప్పుకోలేదు! మైదానంలో ఆటను పక్కన పెడితే భారత క్రికెటర్లలో ‘అనుభవించు రాజా...’ తరహా స్టయిల్లో రాహుల్ ముందుంటాడు. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లి కూడా అతనికంటే తక్కువే. చిత్ర విచిత్రమైన హెయిర్ స్టయిల్, ఒళ్లంతా టాటూస్, పైన షర్ట్ లేకుండా పోజులు... ఇలా ఈతరం కుర్రాళ్లతో అతను పోటీ పడుతుంటాడు. ఇక్కడ మాత్రం అతనికి రాహుల్ ద్రవిడ్‌తో అసలు పోలికే లేదు. ఈ అత్యుత్సాహం గత ఏడాది వివాదాన్ని కూడా రేపింది. చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని దిగిన ఫొటోపై బీసీసీఐ హెచ్చరించాల్సి వచ్చింది కూడా. రాహుల్‌కు ఎలిగ్జిర్ నహర్ అనే గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది. తన పెంపుడు కుక్క ‘సింబా’ .. అంటే అమిత ప్రేమ. ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ డీన్ అయిన రాహుల్ తండ్రి అతడిని ఆటతో పాటు చదువుపై కూడా దృష్టి పెట్టేలా చేశారు. ఫలితంగా స్కూల్, ప్లస్ టూలో కూడా 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించాడు. అయితే అదే సాగితే మహా అయితే మరో ఇంజినీర్ అయ్యేవాడినేమో కానీ భారత్ తరఫున ఆడలేకపోయేవాడిని కదా అంటాడు రాహుల్.