
రాహుల్, నాయర్ సెంచరీలు
ముంబై: రంజీట్రోఫీ ఫైనల్లో తొలి రోజు బౌలర్లు హవా చూపినా రెండో రోజు బ్యాట్స్‌మెన్ దుమ్ము దులిపారు. లోకేశ్ రాహుల్ (214 బంతుల్లో 131 బ్యాటింగ్; 13 ఫోర్లు; 1 సిక్స్), కరుణ్ నాయర్ (295 బంతుల్లో 130 బ్యాటింగ్; 19 ఫోర్లు) శతకాలతో అదరగొట్టడంతో తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 99 ఓవర్లలో ఐదు వికెట్లకు 323 పరుగులు చేసింది.
ప్రస్తుతం కర్ణాటక 189 పరుగుల ఆధిక్యంలో ఉంది. 45/4 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆట ప్రారంభించిన డి ఫెండింగ్ చాంప్ రోజంతా ఆడి కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయింది. అభిమన్యు మిథున్ (41 బంతుల్లో 39; 7 ఫోర్లు) త్వరగానే అవుటైనా తొలి రోజు గాయంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగిన రాహుల్ వచ్చి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. నాయర్‌తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 239 పరుగులు జోడించాడు.