MI Vs SRH: ఆల్‌టైమ్‌ రికార్డు సమం | MI Vs SRH: Most Individual Centuries Made In IPL 2024 Season, All Time Record Equalled | Sakshi
Sakshi News home page

MI Vs SRH: ఆల్‌టైమ్‌ రికార్డు సమం

Published Tue, May 7 2024 8:56 AM | Last Updated on Tue, May 7 2024 9:26 AM

MI VS SRH: Most Individual Centuries Made In IPL 2024 Season, All Time Record Equalled

2024 ఐపీఎల్‌ సీజన్‌ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్‌లో దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. 

నిన్న (మే 6) ముంబై-ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్‌ (51 బంతుల్లో 102 నాటౌట్‌; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్‌టైమ్‌ రికార్డు సమం అయ్యింది.

ఓ సీజన్‌లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్‌ సమం చేసింది. 2023 సీజన్‌లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్‌లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్‌ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.

ఐపీఎల్‌లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్‌ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్‌ ముక్కున వేలేసుకుంటున్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్‌ హెడ్‌ (48). కెప్టెన్‌ కమిన్స్‌ (35 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్‌రైజర్స్‌ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్‌ చావ్లా, హార్దిక్‌ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్‌ కంబోజ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్‌.. తిలక్‌ వర్మ (37 నాటౌట్‌) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్‌ రన్‌రేట్‌ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement