సచిన్ టెండుల్కర్ (PC: BCCI)
పదిహేడేళ్ల వయసులో.. సరిగ్గా ఇదే రోజు ఓ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి శతకం నమోదు చేశాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. తన అసాధారణ ప్రతిభతో వాటన్నింటిని దాటుకుని.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచంలో ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. అతడే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.
టీమిండియా తరఫున 1989లో పాకిస్తాన్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సచిన్.. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, మొదటి 15 మ్యాచ్‌లలో ఒక్క శతకం కూడా సాధించలేకపోయిన ఈ ముంబై బ్యాటర్.. 1990లో ఇంగ్లండ్ గడ్డ మీద తన సెంచరీల ప్రయాణానికి నాంది పలికాడు.
మాంచెస్టర్‌లో సెంచరీల ప్రయాణానికి నాంది
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో సచిన్ శతకంతో మెరిశాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 189 బంతులు ఎదుర్కొని 119 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితం ఎలా ఉన్నా సచిన్ కెరీర్‌లో ఈ మ్యాచ్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
వందో సెంచరీ అక్కడే
నాడు ఇంగ్లండ్ మీద తొలి సెంచరీ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆసియా 2012 వన్డే కప్ సందర్భంగా బంగ్లాదేశ్ మీద మీర్పూర్ వేదికగా వందో శతకం బాదాడు. మొత్తంగా టీమిండియా తరఫున 200 టెస్టులు ఆడిన సచిన్ టెండుల్కర్.. 51 శతకాలు, 68 అర్ధ శతకాల సాయంతో 15921 పరుగులు సాధించాడు.
ఎవరికీ అందనంత ఎత్తులో
అదే విధంగా.. 463 వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చేసి 18426 పరుగులు స్కోరు చేశాడు. ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 ఆడిన సచిన్ ఖాతాలో 10 పరుగులు ఉన్నాయి. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 664 మ్యాచ్‌లు ఆడి 34,357 పరుగులు స్కోరు చేసి.. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. వంద శతకాలు ఖాతాలో ఉన్నా మొదటి సెంచరీ మాత్రం ఎల్లప్పుడూ ప్రత్యేకమే కదా!!
Comments
Please login to add a commentAdd a comment