ఆ విజయానికి అయిదు శతాబ్దాలు.. | Ithakota Subbarao's Comments On The Golden Age Of Sri Krishna Devaraya Period | Sakshi
Sakshi News home page

ఆ విజయానికి అయిదు శతాబ్దాలు..

Published Mon, Jun 10 2024 1:23 PM | Last Updated on Mon, Jun 10 2024 1:23 PM

Ithakota Subbarao's Comments On The Golden Age Of Sri Krishna Devaraya Period

దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం. అప్పట్లో కళింగరాజ్యం అత్యంత బలమైనది. దీన్ని గజపతులు పాలిస్తూ ఉండేవారు. వారి రాజ్యం ఒరిస్సా నుంచి ప్రస్తుత నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకూ విస్తరించి ఉండేది. ఉదయగిరి విజయనగర రాజ్య సరిహద్దుల్లో ఉండి రాజ్య ముఖద్వారంగా ఉండేది. ప్రతాపరుద్ర గజపతి కళింగాధిపతి. అతడు రాహుత్త రాయలను ఉదయగిరి కోట రక్షకునిగా నియమించాడు.

ఉదయగిరిపై కొండవీటి రెడ్డిరాజులు, మహమ్మదీయ రాజులూ ఒక కన్నేసి ఉంచారు. కానీ బలమైన గజపతులతో తలపడలేక అదను కోసం ఎదురు చూశారు. ఇదే సమయంలో విజయనగర పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని ఎలాగైనా జయించాలని క్రీ. శ. 1513లో బయలుదేరాడు. గుత్తి, గండికోట మీదుగా తన సేనతో ఉదయగిరి రాజ్యంలో ప్రవేశించాడు. ఉదయగిరిలో ఘోర యుద్ధం జరిగింది. దుర్గ రక్షకుడు రాహుత్త రాయలకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయలను ఎదుర్కొన్నాడు.

రాయలు తన చతురంగ బలగాలను ఎంతో చాకచక్యంగా నడిపినా దుర్గం వశం కాకపోవడంతో అసహనంతో ఊగిపోయాడు. చివరికి ఒక రోజు సైనికులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ... దుర్గాధిపతి తలను రేపటి కల్లా కాలితో తంతానని శపథం చేశాడు. యుద్ధాన్ని ఉద్ధృతపర్చి సైనికులను ఉత్సాహపరిచాడు. తాను స్వయంగా యుద్ధరంగంలో దూకి సైనికులను కోట గోడల మీదికి ఎగబాకించాడు. దీనితో గజపతి సైనికులు హహాకారాలు చేస్తూ  శరణు వేడారు. అలా అతి కష్టం మీద దుర్గాన్ని రాయలు చేజిక్కించుకొన్నాడు. శరణు కోరిన అందరినీ రక్షించాడు.

దుర్గాధిపతి రాహుత్త రాయలు తన స్వర్ణ కిరీటాన్ని బంగారు పళ్లెరంలో పెట్టి శ్రీకృష్ణదేవరాయలకు సమర్పించాడు. అన్నట్లుగానే రాయలు దాన్ని కాలితో తన్ని తన పంతం నెగ్గించుకున్నాడు. రాహుత్త రాయలను బంధించాడు. 1514 జూన్‌ 9న సాధించిన ఈ విజయాన్ని రాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పుకున్నాడు. చారిత్రక దృష్టి గల నంది తిమ్మన తన ‘పారిజాతాపహరణం’లోనూ, అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’లోనూ ఉదయగిరి ముట్టడిని అభివర్ణించారు. పాశ్చాత్య చరిత్రకారులు కృష్ణరాయల ఉదయగిరి ముట్టడి 18 నెలలు సాగిందని పేర్కొన్నారు. ఉదయగిరి విజయంతో రాయలు పూర్వ విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించినట్లయింది.

ఉదయగిరి విజయం శ్రీ వెంకటేశ్వస్వామి దయ వల్లనే లభించిందని నమ్మిన రాయలు ఇక్కడి నుండి నేరుగా తిరుమలకు బయలుదేరాడు. క్రీ.శ. 1514 జూలై 6న స్వామి వారిని దర్శించుకున్నాడు. 30 వేల వరహాలతో స్వామి వారికి కనకాభిషేకం చేయించాడు. విలువైన ఆభరణాలు సమర్పించాడు. తాళ్ళపాక గ్రామాన్ని రాయలు స్వామి వారి పేరిట ధర్మంగా ఇచ్చాడు. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఉదయగిరి దుర్గాన్ని సాధించటం అత్యంత ప్రతిష్ఠాత్మక విజయంగా భావిస్తారు. – ఈతకోట సుబ్బారావు, 94405 29785 (శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి 510 ఏళ్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement